రంగారెడ్డి

అనుమతి లేకుండా స్కూల్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 24: హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లోని వీవీనగర్‌లో విద్యాశాఖ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలను వ్యతిరేకిస్తూ కాలనీ ప్రజలు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. మా పిల్లలు మాకు ముద్దు.. సందుల్లో స్కూల్ వద్దంటూ నినాదాలతో సోమవారం స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడ్డుకుని గో బ్యాక్ అంటూ బలవంతంగా బయటకు పంపించి రోడ్డును బ్లాక్ చేసి రోడ్డుపై బైఠాయింపు జరిపి ఆందోళన చేపట్టారు. వీవీనగర్ కాలనీ ప్రజలకు మద్ధతుగా ఇతర కాలనీల ప్రజలు పాల్గొని స్కూల్ ఏర్పాటును వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితులలో ఇళ్ల మధ్య స్కూల్‌ను ఏర్పాటు చేస్తే సహించమని హెచ్చరించారు. తార్నాకలో ఉన్న నారాయణ ఒలంపియడ్ స్కూల్‌ను హబ్సిగూడ వీవీనగర్‌లోకి మార్చేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో విద్యాశాఖ అనుమతి లేకుండానే ఓ భవనంలో స్కూల్‌ను ఏర్పాటు చేసి అడ్మిషన్లు ప్రారంభించారు. మున్ముందు తార్నాక నుంచి హబ్సిగూడలోకి స్కూల్‌ను షిప్ట్ చేసే ఆలోచనలో యాజమాన్యం ఉంది. ఇక్కడికి మార్చే ఆలోచన ఉంటే సంబధిత స్థానిక అధికారుల అనుమతి ఉండాల్సిందే. అంతకు ముందు రాచకొండ ట్రాఫిక్ పోలీసు శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నారు. ఈ ప్రాంతం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోకి వస్తోంది. హద్దులు దాటిన అనుమతులతో రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ అధికారుల మధ్య సమన్వయం కొరవడిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి స్కూల్‌ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి స్పందన లభించకపోవడంతో సోమవారం ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. వీరికి మద్ధతుగా కాంగ్రెస్ నేతలు పసుల ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. స్కూల్‌కు వెళ్లకుండా విద్యార్థులను అడ్డుకోవడంతో యాజమాన్యం నుంచి టీచర్లు, పిల్లల తండ్రులు ఫీజులు చెల్లించి చదివించుకుంటున్నామని, అడ్డుకోవద్దని వారించడంతో స్థానికులు తల్లిదండ్రుల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్ట్రీట్ నెంబర్ 8లో వచ్చిపోయే వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని చెప్పినా విన్పించకపోవడంతో అదే సమయంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, శాంతిభద్రతల ఏసీపీ సుధాకర్, ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు స్కొల్ యాజమాన్యం నుంచి డీన్ పరమేశ్వర్, ఏఓ వెంకటేశ్, స్థానికులైన నోముల శాంతి కుమార్, నంద కిషోర్, ప్రేమ్‌నాధ్, రంజిత్ రెడ్డి, భద్రారెడ్డి, గంగాధర్, యాదవ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సంజయ్ జైన్, ఇండేర్ సింగ్, గణేష్ నాయక్, లక్ష్మి, ప్రతాప్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలతో చర్చలు జరిపారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యకు కారణం కావద్దని, ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. రాచకొండ అనుమతితో హైదరాబాద్ పరిధిలో ఎలా స్కూల్ నడుపుతారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. విద్యాసంస్థను నడపాలనుకుంటే న్యాయబద్ధంగా అన్ని శాఖల అధికారుల అనుమతి, ప్రజల మద్దతు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.