రంగారెడ్డి

రోడ్డు నిర్మాణ పనులు.. ఇంకెన్నాళ్లూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జూలై 18: సాధారణంగా వర్షాకాలంలో రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది సరైన రోడ్డు సౌకర్యం లేకుండా.. బురదమయంగా మారిన రహదారుల్లో ప్రయాణికులు, ప్రజలు ఎదుర్కొనే అవస్థలు వర్ణనాతీతం. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించిన రహదారి నిర్మాణ పనులు, ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. వర్షాలతో రహదారి మొత్తం బురదతో చిత్తడిచిత్తడిగా మారింది. ఫలితంగా రహదారి మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లేడుచౌదరిగూడ మండలం ఎదిర గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి ఇది. వర్షాలతో రోడ్డు మొత్తం బురదమయంగా మారి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సు సేవలు సైతం నిలిచిపోయాయి. గ్రామం నుంచి చదువుల కోసం ఇతర ప్రాంతాలకు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి నుండి కొందుర్గు మండలంలోని ఎంకిర్యాల, జిల్లేడుచౌదరిగూడ మండలంలోని ఎదిర మీదుగా ముష్టిపల్లి వరకు రోడ్డును వేసేందుకు సుమారు రూ.6కోట్ల 55లక్షలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఎంకిర్యాల నుంచి ముష్టిపల్లి వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. నెలరోజుల క్రితం కల్వర్టుల నిర్మాణాలు పూర్తి చేసిన కాంట్రాక్టరు కొంతమేర కంకర వేసి వదిలిపెట్టారు. ఈ మధ్య కురిసిన చిన్నపాటి వర్షానికి కాస్లాబాద్ నుంచి రావిర్యాల శివారు, ఎదిర గ్రామం వరకు ఉన్న రహదారి మట్టితో పూర్తిగా బురదమయంగా మారింది. ఆ రహదారి వెంట వెళ్లే వాహనదారులు హడలెత్తిపోతున్నారు.
ఆటోలు, భారీ వాహనాలు సైతం బురదలో కూరుకుపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు రహదారి పనులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సదరు రహదారి నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు తెలుపుతున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి వచ్చే రహదారి పూర్తిగా బురదమయంగా మారడంతో ఆర్టీసీ బస్సు సేవలు సైతం నిలిచిపోయాయని పేర్కొంటున్నారు. గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సును రెండు నెలల క్రితం నిలిపివేశారని చెబుతున్నారు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేటు వాహనాల్లో విద్యా సంస్థలకు వెళ్దామన్నా.. రోడ్డు పరిస్థితిని చూసి కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనదారులు సైతం సదరు రహదారిలో ప్రయాణం చేయాలంటేనే జంకుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఏమిచేయలేక బురదమయంగా మారిన రహదారి వెంబడి కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నామని విద్యార్థులు వివరించారు.