రంగారెడ్డి

‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 (కరోనా) వైరస్ నియంత్రించే క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు మండలంలోని డబిల్‌పూర్, పూడూరు, గౌడవెళ్లి తదితర గ్రామాల్లో వందకు వంద శాతం విజయవంతమైంది. నిజమైన కర్ఫ్యూకు కూడా ఇంతటి స్పందన లభించదేమో అంటే అతిశయోక్తి కాదేమో. వారంతపు సెలవు అయినప్పటికీ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఇళ్లకే పరిమితమయ్యారు. వయో బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం విశేషం. నిత్యావసర వస్తువుల దుకాణాలతో పాటు పాలు, పెరుగు, కూరగాయల దుకాణాలు సైతం తెరుచుకోలేదు.
మేడ్చల్: మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాల్టీలలోని అన్ని వార్డులతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కాలనీలు, బస్తీలు సాయంత్రం 5 గంటలకు కరతళా ధ్వనులతో మారు మోగాయి. వైద్యుల సేవలకు నీరాజనం అంటూ ప్రజలు లక్షల సంఖ్యలో ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ తమ సంఘీభావాన్ని చాటిచెప్పారు. పూడూరులో సర్పంచ్ ఈటబోయిన బాబు యాదవ్ గుడిలో గంటలు కొట్టి వైద్యులకు సంఘీభావం తెలుపగా, ప్లేటను చెంచాలతో బాదతూ, మరికొందరు టపాయకాలు కాల్చి వైద్యులకు తమ సంఘీభావాన్ని తెలియజేయడం విశేషం.
శేరిలింగంపల్లి: జనతా కర్ఫ్యూకు జనం జేజేలు పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల పిలుపు స్పందించిన ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించారు. ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. శేరిలింగంపల్లి ప్రాంతంలో ప్రధానమైన ముంబయి జాతీయ రహదారితో పాటు అన్ని రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం 5గంటలకు ఇళ్లల్లో, అపార్టుమెంట్ల బాల్కనీలలో నిలబడి అన్ని వర్గాల ప్రజలు చప్పట్లు కొట్టి కరోనా నివారణకు సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపుతో శేరిలింగంపల్లిలోని ప్రజా ప్రతినిధులు జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. ప్రతిరోజూ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడిగా కనిపించే ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు ఆదివారం మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే గడిపారు. చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ మేక రమేష్, ఇతర కార్పొరేటర్లు, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ళల్లోనే స్వీయ కర్ఫ్యూ పాటించారు. సాయంత్రం 5గంటలకు చప్పట్లు కొట్టి కోవిడ్-19 నివారణకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్ నేతృత్వంలో ముంబయి జాతీయ రహదారిపై చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.
మెహిదీపట్నం: లంగర్‌హౌస్, మెహిదీపట్నం, గోల్కొండ, నానల్‌నగర్, కార్వాన్, జియాగూడ, పూరాణాపూల్, మంగళహాట్, దూల్‌పూట్, గోషామహెల్, మల్లేపల్లి, నాంపల్లి, మాసాబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాలల్లో జనం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. కరోనాను కట్టడి చేసేందుకే జనతా కర్ఫ్యూను పాటించినట్లు పలువురు జనాలు పేర్కొన్నారు.
గోల్కొండ శ్రీజగదాంభిక మహంకాళీ అమ్మవారి దేవాలయం మాజీ చైర్మన్ కోయిల్‌కర్ గోవింద్‌రాజ్ కుటుంబ సభ్యులు అదివారం సాయంత్రం ఐదుగంటలకు చప్పట్లతో సంఘీభావం తెలియజేశారు. ఆసీఫ్‌నగర్, టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేశారు.