రంగారెడ్డి

నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 22: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. అత్తాపూర్ రాంబాగ్‌లోని చిన్న అనంతగిరి శివాలయంలో 42వ మహాశివరాత్రి మహోత్సవాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం నుంచి శనివారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కీసర, ఫిబ్రవరి 22: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం విఘ్నేశ్వర పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ టి. వెంకటేశ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామంటపంలో విఘ్నేశ్వర పూజ అనంతరం పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశము, అఖండజ్యోతి ప్రతిష్టాపన, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠాపన, భేరిపూజ, ధ్వజారోహణము, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్దప్రసాద వినియోగము, శ్రీరామలింగేశ్వర స్వామివారు గుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేయుట తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ఇఓ వెంకటెశ్, వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లిఖార్జున అవధాని పండితులు పాల్గొన్నారు.
జాతర ఏర్పాట్లపై
కలెక్టర్ అసంతృప్తి
కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనా ఏర్పాట్లలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నేడు జిల్లా క్రీడలు ప్రారంభమైనందున మంచినీరు, భోజన వసతులు దగ్గరుండి చూసుకోవాలని అధికారులను కోరారు.
మొబైల్ మరుగుదొడ్లు, శానిటేషన్ సిబ్బంది ఇరవైనాలుగు గంటలు అందుబాటులో ఉంచాలని అన్నారు. పెద్దమ్మ చెరువు, నూర్‌మహ్మద్ చెరువు, తామరకొలను దగ్గర పోలీసులు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. క్రీడలు ఆడే స్ధలంలో విద్యార్థులు సేద తీరేందుకు షామియానాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జాతరలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వాటిపై ఆర్‌డిఓ సంతకం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పలని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ సురేందర్‌రావు, డిపిఓ సురేశ్‌మోహన్, డిఎంహెచ్‌ఓ భానుప్రకాష్, ఆర్‌డిఓలు హన్మంత్‌రెడ్డి, మధుసూదన్, కీసరగుట్ట ఆలయ చైర్మన్ టి.వెంకటేశ్ శర్మ, జిల్లా క్రీడల అధికారి ఉపేందర్‌రెడ్డి, డిఆర్‌డిఓ కౌటిల్య పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమాన్ని
ప్రారంభించిన కలెక్టర్
కీసరగుట్ట మహాశివరాత్రి జాతర బ్రహ్మాత్సవాల్లో ప్రతి ఏటా భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వంశీరాజ్ సంక్షేమ సంఘం అన్నదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ఎంవి రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్ల అన్నదానం గొప్పదన్నారు. భక్తులకు ప్రతి ఏడాది ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్న వంశీరాజ్ మల్లేశ్‌ను అభినందించారు. భక్తుల అభిమానాన్ని మరింతగా పొంది మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని మల్లేశ్‌కు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గణేశ్, మల్లేశ్, శంకర్ పాల్గొన్నారు.

సర్వేతోనే భూముల సమస్యకు పరిష్కారం
వికారాబాద్, ఫిబ్రవరి 22: రీ సర్వేతోనే భూముల సమస్యలు పరిష్కారమవుతాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, ల్యాండెస్సా సంయుక్త ఆధ్వర్యంలో తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో భూపరిపాలన-ప్రజల భాగస్వామ్యం అంశంపై నిర్వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ప్రభుత్వం భూపరిపాలనపై ప్రత్యేక దృష్టి సారించిందని దీనిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చట్టాల్లో కొన్నిమార్పులు తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. పేద, వెనుకబడి ప్రజలకు భూ సమస్యల పరిష్కారానికి లీగల్‌సెల్ ఏర్పాటు ఎంతైనా అవసరమని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అధికారులు భూసమస్యల పరిష్కారంపై ఒక అంచనాతో పనిచేయాలని సూచించారు. కౌలుదారులకు ఎల్‌ఇసి కార్డుల ఇవ్వడం ద్వారా పట్టాదారుల్లో అపోహలు తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. జిల్లాలో అటవీభూములను గుర్తించాలని, సాంకేతిక ఇబ్బందులపై రెవిన్యూ యంత్రాంగానికి శిక్షణను సైతం ఇవ్వాలని చెప్పారు. నల్సర్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టాల్లో మార్పుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెప్పారు. రెవిన్యూ శాఖను ఎంపిక చేసుకుని చట్టాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ల్యాండెస్సా ల్యాండ్ లా పాలసీ నేషనల్ డైరక్టర్ ఎం.సునీల్‌కుమార్ మాట్లాడుతూ భూమికి సంబంధించిన చట్టాల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. న్యాయవాది ప్రొఫెసర్ ప్రియ అయ్యంగార్ మాట్లాడుతూ భూసమస్య వ్యక్తిగతమైనదే కాకుండా సమాజ, దేశానికి సంబందించినది దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. సదస్సులో సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా పాల్గొన్నారు.

కీసరగుట్ట క్రీడోత్సవాలు ప్రారంభం
కీసర, ఫిబ్రవరి 22: కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ క్రీడోత్సవాలను అధికారులు విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఎంవి రెడ్డి క్రీడా పతాక జెండాను ఎగురవేసి బ్రహ్మోత్సవాల క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన విధ్యార్దుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 2500 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. 254 బృందాలు వచ్చాయని అన్నారు. ఎనిమిది డిపోల నుండి 274 ఆర్టీసి బస్సులు కీసరగుట్ట జాతరకు నడుపుతున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తుల మన్ననలు పొందాలని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు మంచినీరు. ఆహారం సరియైన సమయానికి అందచేయాలని కలెక్టర్ ఆధికారులను ఆదేశించారు.
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. కీసర ప్రభుత్వ పాఠశాల, నాగారం సెరినిటి, అరుంధతి విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు కళ్లకు కట్టినట్లుగా స్టాల్స్ ఏర్పాటు చేసిన వివిధ శాఖల అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, డిపిఓ సురేశ్‌మోహన్, ఎంపిడిఓ వినయ్‌కుమార్, తహశీల్ధార్ ఉపేందర్‌రెడ్డి, జిల్లా క్రీడల అధికారి ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్ గణేశ్ పాల్గొన్నారు.

యుజిడి పనుల స్వాధీనంపై మండిపడ్డ కౌన్సిలర్లు
వికారాబాద్, ఫిబ్రవరి 22: శాటిలైట్ టౌన్‌షిప్ పథకంలో భాగంగా చేపట్టిన భూగర్భ డ్రైనేజీని వికారాబాద్ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడం పట్ల మున్సిపల్ కౌన్సిలర్లు మండిపడ్డారు. బుధవారం కౌన్సిల్ హాలులో చైర్మన్ వి.సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మున్సిపల్ సాధారణ సమావేశంలో పనులు పూర్తి కాకుండానే స్వాధీనమెలా చేసుకుంటారని ప్రశ్నించారు. 30 శాతం పనులు చేపట్టాల్సి ఉండగా కౌన్సిల్ తీర్మానం లేకుండా స్వాధీనం చేసుకోవడంపై ధ్వజమెత్తారు. సమావేశంలో ప్రారంభంలో అజెండాలో భూగర్భడ్రైనేజీ మరమ్మతులకు రెండున్నర లక్షలు జనరల్ ఫండ్ నుండి కేటాయింపు అంశం రాగానే కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా అంశాన్ని అజెండా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే పురపాలక సంఘం ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున కౌన్సిలర్లు పన్నుల విషయంలో అభ్యంతరం చెప్పడం సరికాదని సూచించారు. స్క్రాప్ అమ్మేందుకు టెండర్లు పిలిచామని వాటిని అమ్మేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు. వికారాబాద్ పురపాలక సంఘానికి పూర్తి స్థాయి కమిషనర్ ఎందుకు రావడం లేదని టిఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ విజయేందర్‌గౌడ్ ప్రశ్నించారు. కొత్తగడి కౌన్సిలర్ రాజమల్లు సోలార్ ప్లాంటు ద్వారా మున్సిపల్‌కు రావాల్సిన ఆదాయాన్ని ఎందుకు రాబట్టడంలేదని ప్రశ్నించగా చైర్మన్ టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి కమిషనర్ సంతోష్‌కుమార్, వైస్‌చైర్మన్ సురేష్, కౌన్సిలర్లు, డిఇఇ సత్యనారాయణ పాల్గొన్నారు.

అష్టదిగ్బంధంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం
చున్నీతో యువతి
ఆత్మహత్యా యత్నం
కాచిగూడ, ఫిబ్రవరి 22: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీకి అనుమతి ఇవ్వనందున పోలీసులు సుందర్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా మోహరించారు. బుధవారం ఉదయం నుంచే బాగ్‌లింగంపల్లి ప్రాంతాన్ని పోలీసుల అధినంలోకి తీసుకున్నారు. అటువైపు వెళ్లే వారిని కూడా వెళ్లాకుండా పోలీసులు అడ్డుకోవాడంతో కొంతమంది పోలీసులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. నిరుద్యోగ ర్యాలీని విజయవంతం చేయాడానికి ప్రయత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, విద్యార్థీ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళలను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో అమె చున్నీతో ఉరి వేసుకుంనేందుకు ప్రయత్నించింది. పోలీసుల
వాహనాల పన్ను చెల్లించకుంటే భారీగా జరిమానా
వికారాబాద్, ఫిబ్రవరి 22: వాహన యజమానులు వాహనానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పన్నును వెంటనే చెల్లించపోతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి దుర్గాదాస్ హెచ్చరించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వాహనదారులు స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తే 50 శాతం జరిమానాతో తీసుకుంటామని, అధికారుల తనిఖీ సమయంలో బయటపడితే 200 శాతం జరిమానా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. మార్చిలో వాహనాల తనిఖీకి ప్రత్యేక బృందం వికారాబాద్ జిల్లాకు రానుందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత పూడూర్ మండలం చీలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాల వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడిన సంఘటనా స్థలాన్ని డిటివో దుర్గాదాస్ బుధవారం ఉదయం పరిశీలించారు.
రాక్‌టౌన్ కాలనీలో చోరీ
వనస్థలిపురం, ఫిబ్రవరి 22: గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండి ఆభరాణాలు చోరీ చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రాక్‌టౌన్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాగిరెడ్డి దంపతులు మంగళవారం ఇంటికి తాళం వేసి సూర్యాపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న ఐదు తులాల బంగారు అభరణాలు, 70 తులాల వెండి ఆభరణాలు అపహరించి పారిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన ఇంటి యజమానులు ఇంట్లోకి వెళుతుండగా ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. వెంటనే బీరువాలో చూడగా అందులో ఉన్న నగలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
భెల్‌లో సెక్టార్ ఆసుపత్రి ప్రారంభం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 22: బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని సెక్టార్ ఆసుపత్రి, నూతనంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్‌ను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.బాలకృష్ణన్ ప్రారంభించారు. బుధవారం కీర్తిమహల్ నుంచి ఎంఐజి వెళ్ళే రోడ్డులో ఉన్న సెక్టార్ ఆసుపత్రిని ఎంఐజి కాలనీ నివాసుల సౌకర్యం కోసం ఆరు లక్షల వ్యయంతో పునరుద్ధరించినట్టు ఇడి తెలిపారు. హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ జి.ఉదయ్‌కుమార్, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు జి.ఎల్లయ్య, అధికారులతో కలిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణన్ వీటిని ప్రారంభించారు.
బిగుస్తున్న ఉచ్చు

దోపిడీ కథ అడ్డం తిరిగింది
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 22: కోడలిపై ఉన్న కోపం.. బిడ్డలపై ఉన్న మమకారంతో ఓ తల్లి కొత్త ఎత్తుగడ వేసింది. కోడలు నగలు కాజేసి బిడ్డలకు ఇవ్వాలనుకున్నదో ఏమో కానీ తానే దొంగ అవతారం ఎత్తింది. పసిగట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అసలు బండారం బయటపడింది. వివరాలలోకి వెళితే.. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్‌లో వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారన్న సంఘటన కథ అడ్డం తిరిగింది. ఇంటి యజమానురాలే చోరీ నాటకం ఆడిందని తెలిసిన చందానగర్ పోలీసులు ఖంగుతిన్నారు. శంకర్‌నగర్‌లోని భెల్ రిటైర్డ్ ఉద్యోగి దశరథ్, ద్రౌపతికి ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. అందరికీ పెళ్లిళ్లు కావడంతో బిడ్డలందరూ మెట్టింటికి వెళ్లి పోగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన కుమారుడు నాగరాజు, కోడలు స్వేత ఇంట్లో ఉంటున్నారు. కాగా మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు కత్తితో బెదిరించి బీరువాలో ఉన్న కోడలి నగలు ఎత్తుకెళ్లారని ఇంటికి వచ్చిన భర్తతో చెప్పింది. దొంగతనం జరిగిందని సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు, డిఎస్‌ఐ టంగుటూరి శ్రీనివాస్, క్రైం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు.
క్లూస్ టీం నిపుణులు ఎప్పటిలాగే బీరువాపై ఉన్న వేలి ముద్రలు, కుటుంబ సభ్యుల వేలి ముద్రలు సేకరించారు. బాధిత మహిళ మెడలో పుస్తెలతాడు అలాగే ఉండడం, బాధ కనిపించకపోవడం, ఆమె హావభావాలు పరిశీలించిన పోలీసులకు అనుమానం కలగడంతో చాకచక్యంగా వ్యవహరించి మెల్లగా అసలు విషయం రాబట్టారు. బీరువా తెరిచి కొన్ని చీరెలు కింద పడేసి అంతా చిందరవందరగా చేసి నగలు తీసి దాచానని వృద్ధురాలు చెప్పింది.
కోడలు సరిగా తిండి పెట్టదని, అత్తా అని పిలవదని, అందుకే కోపంతో ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు తెల్లమొహం వేశారు. కోడలి నగలు కొట్టేసి బిడ్డలకు పెట్టాలనే ఉద్దేశంతోటే ఇలా చేసి ఉంటుందని స్థానిక మహిళలు గుసగుసలు పెట్టుకోవడం వినిపించింది. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు సదరు వ్యక్తులపై చట్టరీత్యా కేసులు పెడతారు. కానీ వృద్ధురాలు అని భావించి పోలీసులు ఏమీ అనకుండా వదిలేసినట్టు తెలిసింది.

పనిచేస్తున్న ఇంటికే కన్నం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసిన ఇద్దరు పని మనుషులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నారాయణగూడ వైఎంసిఎ వద్ద ఉన్న అరుణ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే రాఘవరావు ఇంట్లో సుజాత, పుణ్యవతి ఐదేళ్లుగా పని చేస్తున్నారు. పలు దఫాలుగా రూ.25లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును దొంగలించారు. పది రోజుల క్రితం రాఘవరావు ఆభరణాల పెట్టెను తీసి చూస్తే కొన్ని విలువైన బంగారు నగలు కనిపించలేదు. పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పనిమనుషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి వద్ద నుంచి 25తులాల బంగారు అభరణాలు, రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఖైదీలకు ఉపాధి
* జైళ్లశాఖ డిజి వికె సింగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గిందని, కొత్త సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వికె సింగ్ తెలిపారు. ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు జైళ్ల శాఖ పలు సంస్కరణలు చేపట్టిందని, విడుదలైన ఖైదీలకు అర్హతలను బట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని, ఖైదీలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. 2014లో తెలంగాణ జైళ్లలో 99,000 మంది ఖైదీలు ఉండగా, 2015లో 79,409 మంది ఖైదీలున్నారని, 2016లో 62,608 మందికి ఖైదీలు తగ్గారన్నారు. దేశంలోనే తెలంగాణ జైళ్లశాఖకు గుర్తింపు ఉందని, జైళ్ల శాఖ చేపడుతోన్న పలు పథకాలతో ఖైదీల్లో మార్పు వస్తుందన్నారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలు తిరిగి ఎలాంటి నేరం చేయకుండా ఉండే విధంగా వారికి స్వయం ఉపాధి శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. విడుదలైన ఖైదీలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా కోరితే ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని జైళ్లశాఖ డిజిపి వికె సింగ్ తెలిపారు.