సబ్ ఫీచర్

ప్రవహించే నది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది ప్రవహించే నది. ఆ నీటి రంగు ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు. సామాజిక పరిణామాలు కూడా తరగతి గది స్వరూపాన్ని మార్చుతూ ఉంటాయి. ఒకనాడు రెండు పూటలా అన్నం దొరికిన పిల్లలు ఆ బెంచీల మీద కూర్చుంటే ఈనాడు- మధ్యాహ్న భోజనం కోసం ఎదురుచూసే పిల్లలు కూర్చున్నారు. ఒకనాడు చదువుకునేందుకు తగిన వసతి ఉండే పిల్లలుంటే ఈనాడు- కుటుంబం అంతా ఒకే గదిలో గడిపేవారి పిల్లలు కనిపిస్తారు. ఒకనాడు అందరూ మగపిల్లలే ఉండే తరగతి గది నేడు సగం కన్నా ఎక్కువమంది ఆడపిల్లలతో నిండిపోయింది. ఈనాడు తరగతి గది సమస్యలు వేఱుగా ఉన్నాయి. ఉపాధ్యాయులు మాత్రం ఆనాడు, ఈనాడు మధ్యతరగతి వారే. ఈనాటి ఉపాధ్యాయునికి ఉండవలసిన సహృదయత, సానుభూతి, మానవతా లక్షణం వంటివి వేఱుగా ఉండాలి. పిల్లల మనసుల్లో దాగిన విషయాలను ఉపాధ్యాయుడు చూడవలసి ఉంది.
గతంలో నోట్‌బుక్స్, పరీక్ష పేపర్లు మాత్రమే చూసే అలవాటు ఉంది. ఈనాడు పిల్లల పేదరికం వెనుక ఉన్న విషయాలను చూడగలగాలి. ఆనాటి కళ్లతో ఈనాడు చూస్తే తరగతి గదిలోని లోటుపాట్లు టీచర్‌కు కనపడవు. ఆనాడు ఎవరైనా హోంవర్క్ చేయకుంటే టీచర్లు కసురుకునేవారు. ఇప్పుడు హోంవర్క్ అనేది నోట్‌బుక్‌లో కనిపించదు. పిల్లల మెదళ్లలో, వారి కళ్లలో దాన్ని చూడాలి. తమ తల్లిదండ్రుల స్థితిగతులు, ఆర్థిక అంశాలు, కుటుంబాన్ని వెంటాడే సమస్యలన్నీ పిల్లల మెదళ్లలో ఉంటాయి. కానీ, వాటిని తరగతి గదిలో ఎవరికీ చెప్పరు. తరగతి గదిలో టీచర్ ఏదైనా ప్రశ్న వేస్తే- విద్యార్థి తన సమస్యల గురించి ఏమిటో ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే తరగతి గదిని విభిన్న కోణాల్లో, వేరే కళ్లతో చూడాలి. ‘అకడమిక్ కళ్ల’తో కాదు, ‘సామాజిక కళ్ల’తో చూడాలి.
ఆడపిల్లల పరిస్థితి అయితే మరో పార్శ్వం కనిపిస్తుంది. మనం చివాట్లు పెడితే ఆనాడు పిల్లలు ఇంటి వద్ద బాగా చదువుకుని తరగతికి వచ్చేవారు. ఇపుడు ఆ పనిచేస్తే పిల్లలు కనపడకుండాపోతారు. ‘చివాట్లు పెట్టే ఈ బడి నాకెందుక’ని వెళ్లిపోతారు. ‘నన్ను చూడలేని కళ్లు.. ఆ పాఠాలు నాకెందుక’ విద్యార్థి తనలోతాను మధనపడతాడు. ఇపుడు తరగతి గది రంగు మారింది, స్వభావం మారింది. ఉపాధ్యాయుడు మారకపోతే- ఆయన మాటలు, చెప్పే పాఠం నోటిలోనే ఉండిపోవలసి వస్తుంది. పాఠం కన్నా, పుస్తకం కన్నా పిల్లల జీవితాలను ఉపాధ్యాయుడు చదవటం నేర్చుకోవాలి. ఇదే మన ముందున్న సవాల్. ఈ ప్రశ్నలకు సమాధానాలను బిఎడ్ కళాశాలల్లోని పుస్తకాలు ఇవ్వలేవు. సంబంధిత విద్యాశాఖాధికారులకు సైతం అర్థం కాని పిల్లల సమస్యలివి. కాబట్టి పుస్తకం కంటే ఉపాధ్యాయునికి సమాజాన్ని చదివే అలవాటు ఉండాలి. పిల్లల సమస్యలను పరిష్కరించగలిగితే మనం చెప్పే పాఠం వారి చెవికెక్కుతుంది.
ఈనాడు తరగతి గదికి ప్రమాణాలే గీటురాయిగా మారిపోయాయి. మారవలసింది పిల్లలు కాదు.. ఉపాధ్యాయులు మారాలి. ఉపాధ్యాయుడు తాను మారిన స్థితి నుంచి పిల్లలను చూడాలి. పిల్లల మనస్తత్వాలను చదవడం వల్ల ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పతకాలేవీ రావు. కానీ, మానవత్వం మాత్రమే వారికి లభిస్తుంది. తరగతి గది ‘కల్చర్’పై ఉపాధ్యాయునికి అవగాహన ఉంటేనే పిల్లలకు ఆ ‘కల్చర్’ అలవడుతుంది. తరగతి గదిలో సాంస్కృతిక మార్పుకు ఉపాధ్యాయుడు దోహదపడాలి. ఉపాధ్యాయుడు తరగతి గదికి ‘సాంస్కృతిక రాయబారి’ కావాలి. సరికొత్త ప్రమాణాలతో తరగతి గదిని ఉపాధ్యాయులు చూడాలి. ప్రవహించే కొత్త తరం ఆలోచనలను ఉపాధ్యాయుడు తన కోణం నుంచి చూడాలి. ప్రవహించే నీరు కొందరికి మురికిగానే కనిపిస్తుంది. అది పవిత్ర జలంగా మారాలి. అప్పుడే తరగతి గది ప్రక్షాళన అవుతుంది.

- చుక్కా రామయ్య