రంగారెడ్డి

క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 21: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. ముంబై ఇండియన్స్‌తో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో జరిగిన ఫైట్ సందర్భంగా ముందుగా ఊహించినట్లుగానే క్రీడాభిమానులు భారీగా తరలి వచ్చారు. ఫైనల్ మ్యాచ్‌ను తిలకించడానికి టిక్కెట్లు, పాసులు దొరకక అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగినా స్వయంగా మ్యాచ్‌ను చూడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం బ్లాక్‌లోనైనా టిక్కెట్లు దొరుకుతాయన్న గంపెడు ఆశతో స్టేడియంకు చేరుకుంటే బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయించే యువకులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గతంలో కంటే ఎక్కువగా 88 సిసి కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో స్టేడియంను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా బ్లాక్‌లో టిక్కెట్లు విక్రయించేవారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మ్యాచ్ సందర్భంగా బ్లాక్‌లో విక్రయిస్తున్న సుమారు 20 మంది యువకులను పట్టుకుని వారి నుంచి సుమారు రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

కాలకూట విషం
యూరియా-పామాయిల్‌తో కృత్రిమ పాల తయారీ
కల్తీ వ్యాపారానికి అడ్డుకట్ట
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇబ్రహీంపట్నం, మే 21: అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడుతూ ఎంతో మంది అక్రమార్కులు తమ బుద్ధికి పనిచెప్తూ కల్తీలకు తెరతీస్తున్నారు. నిత్యావసరాల్లో ఒక్కటైన పాలను సైతం వదలకుండా కల్తీ చేస్తూ అక్రమ సంపాదనకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చిన ఘటనలో యూరియా, పామాయిల్‌తో పాలను కల్తీ చేస్తున్న ముఠాను ఎస్‌ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు తెరలేపుతున్న అక్రమ వ్యాపారాలు రోజుకొక్కటిగా బయటపడుతున్నారు. యూరియా-పామాయిల్ సహాయంతో పాలను కల్తీ చేస్తూ అక్రమంగా సంపాధిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇలాంటి దందాలెన్నో శివారు గ్రామాలకు పాకాయి. నిత్యావసరాల్లో ఒక్కటైన పాల వినియోగం గురించి మనకు తెలియంది కాదు. చిన్నారులు ఉదయం, సాయంత్రం వేళల్లో తాగే పాలు, పెద్దలు తాగే టీ, స్వీట్ల తయారీలో
వినియోగించే పాలను సైతం కల్తీ చేస్తూ అడ్డదారిలో సంపాదించేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు. యూరియా-పామాయిల్‌తో నాలుగు లీటర్లను 60 లీటర్ల పాలుగా తయారు చేసే విధంగా తమకు తెలిసిన విద్యను వినియోగంలో పెడుతున్నారు. పాలను కాలకూట విషంగా మారుస్తూ అక్రమంగా ధనాన్ని ఆర్జిస్తున్నారు. ప్రముఖ డైరీ ఫాంలకు సైతం ఇవే పాలను విక్రయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బడా కంపెనీలకు యూరియా-పామాయిల్‌లతో పాలను తయారు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు. నిన్నమొన్నటి వరకు నగరానికే పరిమితమైన ఇలాంటి కల్తీ వ్యాపారాలు నేడు గ్రామాలకు పాకుతున్నాయి. యూరియా-పామాయిల్‌తో తయారు చేస్తున్న పాలు అచ్చం పశువులు ఇచ్చిన పాలలానే ఉంటాయి. యూరియా-పామాయిల్ మిశ్రమంలో కొన్ని పాలను వేస్తే అవి అచ్చం పాలలాగే మారుతాయి. ఎక్కువ మొత్తం గేదె పాలలో కలిపితే అసలు పాలతో పోల్చేందుకు సైతం వీలులేకుండా ఉంటుంది. దీనిని ఆసరా చేసుకున్న అక్రమార్కులు పాలను కల్తీ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. యూరియా మానవ శరీరంపై ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతుంది. జరం కల్తీ పాలను సేవించి అనారోగ్యం పాలవుతున్నారు.
కల్తీ పాల తయారీ ముఠాగుట్టు రట్టు
యూరియా, పామాయిల్‌తో పాలను కల్తీ చేస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటి పోలీసులు రట్టు చేశారు. గత 17వ తేదీన స్థానికంగా యూరియా-పామాయిల్ వినియోగంతో కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన అకస్మిక దాడుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మల్లేశ్‌యాదవ్ స్థానికంగా బంటి, బబ్లూ డెయిరీ ఫాంలను నిర్వహిస్తున్నాడు. తనకు ఉన్న పశువులు రోజూ 40 లీటర్ల పాలిస్తాయి. కానీ అడ్డదారిలో సంపాదించేందుకు అలవాటు పడ్డ మల్లేష్ యూరియా, పామాయిల్ సాయంతో 40 లీటర్ల పాలను 600 లీటర్లుగా మార్చి వాటిని మదర్, ముకుంద డెయిరీలకేకాక నగరంలోని స్వీట్‌షాపులకు, హోటళ్ళకు, టీ స్టాళ్ళకు సరఫరా చేస్తూ పట్టుపడ్డారు. తక్కువ ధరలకు వచ్చే వాటిని కొనుగోలు చేస్తూ కల్తీ వ్యాపారాల అతితెలివికి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వౌలాలిలో అగ్నిప్రమాదం
నేరేడ్‌మెట్, మే 21: వౌలాలి పారిశ్రామిక వాడలోని స్టీల్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని స్వల్పంగా దగ్ధమైన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వౌలాలి పారిశ్రామిక వాడలోని భారతీస్టీల్ ఇండస్ట్రీస్‌ని మహారాష్టక్రు చెందిన సమీర్‌గుప్త ఇటీవల కొనుగోలు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం ఇండస్ట్రీని క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని కంపెనీలో మంటలు వ్యాపించాయి. వెంటనే సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గోధుమకుంటలో స్వల్ప ఉద్రిక్తత
చర్చి వివాదం * ఫర్నిచర్ ధ్వంసం
కీసర, మే 21: గోధుమకుంట గ్రామంలో చర్చి నిర్మించరాదని ఆదివారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గత కొన్ని నెలలుగా ఇంటి నిర్మాణాల కోసం అని సర్పంచ్ అనిల్ దగ్గర చర్చి నిర్వాహకులు అనుమతులు తీసుకున్నారు. నిర్మాణం పూర్తి అవుతున్న సమయంలో గ్రామస్తులు పలువురు ఉన్నతాధికారులకు నిర్మాణాలు నిలిపివేయాలని ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ చర్యలు తీసుకోక పోవటంతో ఆదివారం గ్రామస్తులు అక్కడికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆందోళన కాస్తా స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్రిక్తతలో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఈ మేరకు చర్చి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ సురేందర్ దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పల్‌లో స్తంభించిన ట్రాఫిక్

కిలోమీటర్ల మేర
నిలిచిన వాహనాలు

ఉప్పల్, మే 21: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా క్రీడాభిమానులతో ప్రధాన రహదార్లు కిటకిటలాడాయి. ఫైనల్ మ్యాచ్‌ను స్వయంగా తిలకించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు తమ వాహనాలను ప్రధాన రహదార్లపై పార్కింగ్ చేసి స్టేడియంలోకి వెళ్లారు.
మ్యాచ్ కోసం టిక్కెట్లు దొరకక నిరాశతో వెనుదిరిగిన అభిమానులు రహదార్లపై ఇటు అటు తిరుగుతుండటంతో వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది.
హబ్సిగూడ, ఘట్‌కేసర్, ఎల్‌బినగర్, రామంతాపూర్ రూట్లలో ప్రధాన రహదార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనాదారులు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు క్రికెట్ క్రీడాభిమానులు, మరొకవైపు యాదాద్రి యాత్రికులు, పెళ్లిళ్లు, శుభ కార్యాలయాలకు వెళ్లి వచ్చిన ప్రజలతో ప్రధాన రహదార్లు కిక్కిరిసిపోయాయి.
కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనాదారులు ట్రాఫిక్ సుడిగుండంలో నుంచి బయట పడేందుకు పడ్డ బాధలు వర్ణణాతీతం. ట్రాఫిక్ నుంచి క్లియర్ చేయడానికి ప్రత్యేక పోలీసుల బలగాలను ఏర్పాటుచేసినా ప్రయోజనం లేకపోయిందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
గుడ్లు తేలేస్త్తున్న కోళ్ల పరిశ్రమ

ఎండ వేడిమికి కోళ్ల మృత్యువాత
పౌల్ట్రీ రైతులు విలవిల

షాద్‌నగర్, మే 21: భానుడు భగభగమంటుండటంతో పౌల్ట్రీ రైతులు విలవిలలాడుతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏమి చేయాలో తెలియక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పౌల్ట్రీల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. భూగర్భ జలాలు ఎండిపోవడం కోళ్లకు తాగునీరు లభించకపోవడం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోజుకు సగటున 500కోళ్ల వరకు మృత్యువాత పడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఎండల నుండి కోళ్లను రక్షించేందుకు పౌల్ట్రీ రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని అంటున్నారు.
గుడ్ల దిగుబడి తగ్గిపోవడం..కోళ్లు మృత్యువాత పడటం వంటి పరిస్థితుల్లో తాము నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు పేర్కొంటున్నారు. పౌల్ట్రీ ఫాంల వద్ద ఉన్న బోరుమోటర్లు ఎండిపోవడంతో గత నెల ఫిబ్రవరి నుండి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి కోళ్లకు నీళ్లు పోస్తున్నామని వివరించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో 45డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కోళ్లు వేడిమిని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల వ్యాధులతో చనిపోగా మిగిలిన కోళ్లు వేసవి తాపాన్ని తట్టుకోలేక చనిపోతున్నాయి. మృత్యువాత పడుతున్న కోళ్లకు తగిన నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తగ్గిన కోడిగుడ్ల ఉత్పత్తి
వివిధ రకాల వ్యాధులతో కోళ్లు మృత్యువాత పడటం, మరోవైపు ఎండల వేడిమిని తట్టుకొలేక చనిపోవడం, మరో వైపు వేసవి తాపానికి కోళ్లు దాణా తినలేక నీరసంగా ఉండటం వంటి పరిస్థితుల నేపధ్యంలో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు పేర్కొంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం నుండి ప్రతిరోజు 90శాతం గుడ్లు ఉత్పత్తి అయ్యేవి కానీ ఎండల వేడిమి కారణంగా 70శాతానికి పడిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉండే మున్ముందు గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని పౌల్ట్రి రైతులు అంటున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక తాము కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంటున్నారు. పౌల్ట్రీ పరిశ్రమకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని చటాన్‌పల్లి శివారులోని బివిరావునగర్, బూర్గుల, చిల్కమర్రి, రాయికల్, మొగిలిగిద్ద, గంట్లవెల్లి, కొత్తూరు, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, నందిగామ మండలాల్లో లేయర్ పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. పరిసర గ్రామాల నుంచి కూలీలు వచ్చి దాణా వేయడం, నీరు పోయడం, గుడ్లను ఏరడం చేసేవారు. గత కొన్ని రోజుల నుండి కూలీలు సక్రమంగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కూలీలు లభించకపోవడంతో బిహార్, ఒరిస్సా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి కూలీలను తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. దీంతో అధిక భారం అవుతుందని, పెట్టిన పెట్టుబడులు సైతం సక్రమంగా రావడం లేదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రేడర్ల మాయాజాలం
పౌల్ట్రీ రైతులపై ట్రేడర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. షాద్‌నగర్ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న గుడ్లను హైదరాబాద్ కేంద్రంగా ట్రేడర్లు ముంబై ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. వేసవి తాపానికి ఉక్కిరి బిక్కిరవుతున్న పౌల్ట్రీ రైతులపై ట్రేడర్లు మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒక గుడ్డుకు నెక్ నిర్ణయించిన రూ.3.40పైసలు ఉండగా ట్రేడర్లు మాత్రం రూ.2.80పైసలకు కొనుగోలు చేసేందుకు అడుగుతున్నారని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ట్రేడర్ల పొంతనలేని ధరలతో పౌల్ట్రీ ఫాంలోనే గుడ్ల నిల్వలు పెరుగుతున్నాయని రైతులు అంటున్నారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

మంజూరు సరే
నిధులేవీ?
బిసి కార్పొరేషన్‌లో నిధుల లేమి
ధారూర్, మే 21: నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించి ఉపాధి కల్పిస్తోంది. అయతే, గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు బిసి కార్పొరేషన్ అధికారులు ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులను ఎంపిక చేసిన అధికారులు వారు దరఖాస్తు చేసుకున్న పథకానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. ప్రొసీడింగ్‌లు ఇచ్చిన వారిలో కొంతమందికి రుణాలు మంజూరు చేయడమే కాకుండా వారికి నిధులు సమకూర్చారు. వారు వివిధ పథకాలను స్థాపించి ఉపాధి పొందుతున్నారు. చాలా వరకు దరఖాస్తు చేసుకుని ప్రొసీడింగ్‌లు తీసుకున్న వారు రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రుణం మంజూరు అయినట్లు ప్రొసీడింగ్ అందుకున్న నిరుద్యోగులు సంతోషంతో తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ నేటి వరకు వారికి నిధులు రాక అప్పులతో సతమతమవుతున్నారు. బిసి కార్పొరేషన్ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా నిధులు ప్రభుత్వం నుండి రాలేదు. నిధులు అందగానే రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందిన వారికి నిధులు వెంటనే సమకూర్చడంతో వారంతా ఉపాధి పొందుతున్నారు. బిసి కార్పొరేషన్ ధ్వారా రుణాలు అందక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బిసి కార్పొరేషన్ ధ్వారా మంజూరైన రుణాలకు నిధులు వెంటనే మంజూరు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఇప్పటికే రుణాలు మంజూరు అయిన వారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తున్నందున జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమం తప్పదు

వెటర్నరీ విద్యార్థుల హెచ్చరిక
రాజేంద్రనగర్, మే 21: వెటర్నరీ విభాగంలో కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీ చేపట్టడాన్ని నిరసిస్తూ పివి నర్సింహరావు పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఆదివారం 28వ రోజుకు చేరింది. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మండుటెండలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు మనకే అని చెప్పిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క మాటని సరిగా నిలబెట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. సీమాంధ్రుల పాలనలోనే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక ఉన్న ఉద్యోగులే రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విధించిన గడువు మే 25లోగా దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పురుషోత్తంనాయక్, అభిలాష్, శశాంక్, అనిల్, రాజిరెడ్డి, సతీష్, మహేష్, సాయిప్రసాద్, రవికిషోర్, వౌనిక తదితరులు ఉన్నారు.

జగద్గిరిగుట్టలో పరేషానీ
*అడ్డదిడ్డంగా ఆటోల నిలిపివేత * వైన్‌షాపుల ముందు వాహనాల పార్కింగ్
* పోలీస్‌స్టేషన్ ఉన్నా తప్పని కష్టాలు * ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు
జీడిమెట్ల, మే 21: ట్రాఫిక్ సమస్యకు నిలయంగా జగద్గిరిగుట్ట ప్రాంతం మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జగద్గిరిగుట్టలో పోలీస్‌స్టేషన్ ఉన్నా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తొలగడం లేదు. జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల నుండి కూకట్‌పల్లి వైపు వెళ్లాలంటేనే షాపూర్‌నగర్ హెచ్‌ఎంటి పైపులైన్ రోడ్డు మీదుగా జగద్గిరిగుట్ట నుండి వాహనదారులు వెళ్తారు.
జగద్గిరిగుట్ట అవుట్‌పోస్ట్ నుండి ఇందిరమ్మ విగ్రహం, ఆల్విన్ కాలనీ, కెఎల్ బార్ చౌరస్తా వరకు ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారుతోంది. జగద్గిరిగుట్ట అవుట్ పోస్ట్ నుండి ఆల్విన్ కాలనీ కెఎల్ బార్ చౌరస్తా వరకు ఆటోస్టాండ్‌లు, వైన్‌షాపులు, బార్‌లు అధికంగా ఉన్నాయి. ఇష్టానుసారంగా వాహనాలను రోడ్లపైనే పార్క్ చేయడం వలన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతుంది. ముఖ్యంగా ఆటోవాలాలు ఇష్టానుసారంగా జగద్గిరిగుట్ట ఇందిరమ్మ విగ్రహం సమీపంలో రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకునే వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడిన అక్కడి నుండి ఆటోను మాత్రం తీయరు. ఇలా ట్రాఫిక్ సమస్య మరింతగా ఎక్కువవుతోంది. పైపులైన్ రోడ్డులో మూడు వైన్‌షాపులు, రెండు బార్‌లు ఉండడం వలన వాహనాలను రోడ్ల పైనే పార్క్ చేయడంతో సమస్య జటిలవౌతోంది.
వైన్‌షాపుల ముందు రోడ్డుపై వాహనాలను పార్క్‌చేయవద్దని ఎవరైనా చెబితే వారిపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఆల్విన్ కాలనీ హరిని ప్రియ బార్ పక్కనే గల హనుమాన్ టెంపుల్ వద్ద ఆటోలను రోడ్డుపైనే నిలబెట్టి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ సమస్య ఉంటుందని, జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ ఉన్నప్పటికీ కనీసం ఓ కానిస్టేబుల్‌ను ఏర్పాటుచేసి ట్రాఫిక్ సమస్యను తీర్చాలన్న ఆలోచన ఎవరికీ లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
నూతనంగా పోలీస్‌స్టేషన్ ఏర్పాటుచేసిన అనంతరం కొన్ని రోజుల పాటు వాహనాలను రోడ్లపై పార్క్ చేయకుండా కట్టడి చేసినా ఆ తరువాత యథావిధిగా మారింది.
ఇప్పటికైనా పోలీసు శాఖ జగద్గిరిగుట్టలో సిబ్బందిని నియమించి ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటోలను, వాహనాలను రోడ్లపై పార్క్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

రైతు రుణమాఫీకి ఆంక్షల గ్రహణం?
తాండూరు, మే 21: రైతుల రుణమాఫీకి అర్హత కల్గి ఉన్నా పంట రుణాలు మాఫీ కాని రైతులు గగ్గోలు పడుతున్నారు. తాండూరు వ్యవసాయ సబ్ డివిజన్‌లోని బషీరాబాద్, తాండూరు, పెద్దెముల్ మండలాలకు చెందిన దాదాపు 2.500ల పైచిలుకు రైతులకు ప్రభుత్వం అమలుచేసిన పంట రుణాలు మాఫీ పథకం అమలు కాలేదు. దాంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగానికి, కలెక్టర్‌కు పంట రుణాలు మాఫీకాని రైతన్నలు పలుమార్లు మొర పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మూడు విడతలుగా పంట రుణాలు మాఫీ చేసినా ఆ జాబితాలలో తమ పేర్లు నమోదుకాక పోవడం పట్ల ఆయా మండలాలకు చెందిన రైతులు అయోమయం పాలవుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ, మండల పరిషత్ అధికారుల సమన్వయ లోపం మూలంగా తమకు పంట రుణాలు మాఫీ కాలేదని, అందుకు బ్యాంకర్లు సైతం ముఖ్యకారణం అంటూ రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. డివిజన్‌లో 90శాతం మంది రైతులకు పంట రుణమాఫీ వర్తించినట్లు పలువురు రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న రుణమాఫీ అమలు అంశంలో తమకు అన్యాయం ఎలా జరుగుతుందంటూ, మూడు విడతల రుణమాఫీకి నోచుకొని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. తమ భూముల వివరాలు, తాము ఏటా పండించే పంటల వివరాలు అధికారులకు సమగ్రంగా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అందజేశామనీ.. రుణమాఫీ వర్తించని బషీరాబాద్, తాండూరు, పెద్దెముల్ మండలాలకు చెందిన రైతులు తెలుపుతున్నారు. తమ భూముల వివరాల్లో తప్పులు ఉంటే పరిశీలించి అధికారులు తమ భూముల సమగ్ర వివరాలు సేకరించి తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. కాగా, తాండూరు వ్యవసాయ డివిజన్ పరిధిలోని 2500ల వరకు రుణమాఫీ వర్తించని రైతులకు రుణమాఫీ ద్వారా సుమారు రూ. 15 కోట్లు అందాల్సి ఉందని అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా, తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోనే 1538 మంది రైతులకు పంట రుణమాఫీ అమలు కావాల్సి ఉంది. మిగతా మండలాలకు చెందిన రైతులు వేరే బ్యాంకుల ద్వార రుణమాఫీ పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తాండూరు ప్రజావాణి కార్యక్రమంతోపాటు, కలెక్టర్ డి.దివ్యను కలిసి పలుమార్లు తమ పంట రుణాల మాఫీ వాయిదాపడిన విషయాన్ని ఏకరువు పెట్టారు.
కాగా ఈనెల 8న పంట రుణమాఫీ అందని రైతులు పలువురు రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిలుపు మేరకు హైద్రాబాద్‌లో మంత్రి నివాసానికి వెళ్లి కలిశారు. మంత్రి తాండూరు వ్యవసాయ డివిజన్‌లో దాదాపు 2500ల మంది వరకు రైతులకు పంట రుణమాఫీ ఎందుకు వర్తించ లేదు అన్న విషయాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు కారణం ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, బ్యాంకర్లు సైతం పంట రుణమాఫీ అంశంలో రైతులకు సహకరించకపోవడం మూలంగానే పైన పేర్కొన్న రైతాంగానికి పంటల రుణ మాఫీ వర్తించ లేదన్నది స్పష్టం అయినట్లు సమాచారం. కాగా, వెంటనే మంత్రి మహేందర్‌రెడ్డి ఈనెల 8న తనను కలిసిన రైతు ప్రతినిధులను నేరుగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వద్దకు తీసుకు వెళ్లి రైతుల రుణమాఫీ అంశాన్ని ఈటలకు వివరించారు. దాంతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సానుకూలంగా స్పందించి పంట రుణాలు మాఫీ కాని, అర్హులయిన రైతులందరికీ రాబోయే రెండు నెలల్లో పంట రుణాలు మొత్తం మాఫీ చేయిస్తామంటూ హామీ ఇచ్చారు. దాంతో మంత్రుల హామీతో ఈప్రాంతం రైతాంగం ఊపిరి పీల్చుకున్నారు. కాగా మంత్రులు తమ హామీని నిలబెట్టుకొని పంటరుణాలు వీలయినంత తోందరగా మాఫీ చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా మూడు విడతలతోపాటు, మే మొదటివారంలో నాల్గవ విడత పంట రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వ యంత్రాంగం, సిఎం కేసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటల పేర్కొన్న విషయం అందరికీ విదితమే. కాగా ఇంతవరకు రైతుల పంట రుణాల మాఫీకి సంబంధించిన రుణవిముక్తి పత్రాలు బ్యాంకులకు చేరక పోవటం పట్ల పంట రుణాలు మాఫీ అయిన రైతాంగం తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా మళ్లీ ఖరీఫ్ పంటల సాగు సమయం ఆసన్నం అవుతుంది, ఇంతవరకు పంట రుణాల మాఫీపై గ్రహణం వీడటం లేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలలో ఖరీఫ్ పంటల సాగుకు మళ్ళీ పంట రుణాలు సకాలంలో అందుతాయా? లేదా? అన్న ప్రశ్నలు రైతుల నుండి వ్యక్తం అవుతున్నాయి.