రంగారెడ్డి

జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్స్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్,మే27: పేలుడు పదార్థాలు ఉపయోగించి రాళ్లు పగులగొడుతున్న వారిపై శంషాబాద్ ఎస్‌వోటి పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 2 వేల జిలెటిక్స్ స్టిక్స్, 2 వేల డిటొనేటర్స్, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే లక్ష్మిగూడ ఎదురుగడ్డ సమీపంలో ఓ గుట్టపై వెంచర్‌ను చేస్తున్నారు. బండరాళ్లను పగులగొట్టడానికి జడ్చర్లవాసులు చంద్రశేఖర్, సంతోష్, బొలెరో వాహనం డ్రైవర్ శ్రీనివాస్‌కు అప్పగించారు. పేలుడు పదార్థాలను ఉపయోగించి బండరాళ్లను పగులగొడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌వోటి పోలీసులు శనివారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి, ఒక బొలెరో వాహనాలను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈదురుగాలులు .. విరిగిపడ్డ చెట్లు
కొడంగల్,మే 27: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండగా, నాలుగు గంటల తర్వాత మేఘాలు కమ్ముకోవడంతో పాటు చల్లటి గాలి వీచింది.

నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా కూలుస్తారు?

కీసర, మే 27: నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ దమ్మాయిగూడ మాజీ ఉర్పంచ్ ఎం. నాగరంజని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబరు 450లో ఉన్న తన స్వంత భూమిలో 250 గజాలలో శ్రీ వెంకటేశ్వర జ్యూట్ బ్యాగ్ ఇండస్ట్రీస్ కోసం షెడ్ నిర్మాణం చేసుకోవటం జరిగిందన్నారు. దీనికి సంబంధించి, భూమి కన్వర్షన్, బ్యాంకులోన్ మంజూరు చేయించుకోవటం జరిగిందన్నారు. అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని, కూల్చివేతలు ఆపాల్సిందిగా పంచాయతీ అధికారులను కోరటం జరిగిందని, అయినా నిర్మాణాలను కూల్చి వేశారని అన్నారు. ఇంకా ఏమైనా అనుమతులు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ స్థాపించటం జరిగిందని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకే జ్యూట్ బ్యాగుల ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దమ్మాయిగూడ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన దళిత సర్పంచ్‌నైన తనపై కొందరు రాజకీయ దురుద్దేశంతో కావాలనే వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కంపెనీ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

సుభాష్‌నగర్ నాలా పునరుద్ధరణకు మోక్షం

ఖరూ. 9.12 కోట్లు మంజూరు
జీడిమెట్ల, మే 27: ఎన్నో ఏళ్లుగా పునరుద్ధరణకు నోచుకోని సుభాష్‌నగర్ నాలాకు మోక్షం వచ్చింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ చొరవతో రూ. 9.12 కోట్లు నాలా పునరుద్ధరణ కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల అశ్రద్ధతో ఏళ్ల తరబడి సుభాష్‌నగర్ నాలా పొంగి చుట్టుపక్కల కాలనీలు, బస్తీలు ముంపునకు గురై స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే వారని తెలిపారు. గత వర్షాకాలంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా మంత్రి కెటిఆర్ నాలాను సందర్శించి నిధులను మంజూరు చేశారని అన్నారు. నాలా పునరుద్ధరణ పనులు టెండర్ స్థాయిలో ఉన్నాయని, త్వరలోనే ఐదు బిట్‌లుగా విభజించి పనులను పూర్తి చేయిస్తానని చెప్పారు. గంపలబస్తీ నుండి ఇంటి నంబరు 7-69 వరకురూ.198 లక్షలతో మొదటి బిట్‌గా పనులను చేపడతామని, రెండవ బిట్‌గా కెమికల్ నాలా నుండి ప్లాట్ నంబరు 13413 వరకు రూ.175 లక్షలు, కెమికల్ నాలా నుండి ప్లాట్ నంబరు 13413 వరకు మూడవ బిట్‌గా రూ.160 లక్షలతో, కెమికల్ నాలా ఇంటి నంబరు 7-857/ఎ/2 నుండి తారా ఫంక్షన్ హాల్ వరకు నాల్గవ బిట్ కింద రూ.180 లక్షలతో, తారా ఫంక్షన్ హాల్ నుండి ఐదవ బిట్‌గా రూ.199 లక్షలతో పనులను చేపడతామని అన్నారు. నాలా పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాలా పునరుద్ధరణ పనులను చేపడతామని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ప్రజల తరఫున పని చేస్తోందని అన్నారు. ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకువస్తే వాటిని తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, నాలా పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తయ్యేలా చూస్తానని అన్నారు.

మినీ ట్యాంక్‌బండ్‌గా నల్లచెరువు

చెరువులో స్వచ్ఛమైన
నీరు మాత్రమే
డ్రైనేజీ మురికినీరు
మూసీలోకి మళ్లింపు
చెరువు చుట్టూ
వాకింగ్ ట్రాక్ అభివృద్ధి
రెండు రోజుల్లో
ఆక్రమణల తొలగింపు
త్వరలో పనులు ప్రారంభానికి రంగం సిద్ధం

ఉప్పల్, మే 27: ఉప్పల్ అంటే నల్లచెరువు ల్యాండ్ మార్క్ అని చెప్పవచ్చు. దుర్గంధం, దుర్వాసన వెదజల్లుతూ దోమలకు పుట్టినిల్లు విరాజిల్లా ఈ చెరువు రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. పట్టణంలోని నల్లచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమైంది. వరంగల్ జాతీయ రహదారిలో ఉన్న చెరువులో స్వచ్ఛమైన వర్షం నీరు తప్ప ఎగువ ప్రాంతం నుంచి వచ్చే డ్రైనేజీ మురికినీరు కలువకుండా ప్రత్యేక పైపులైన్ల ద్వారా నేరుగా మూసీలోకి కలిపేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే చెరువు ఎఫ్‌టిఎల్ హద్దులను గుర్తించారు. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని అందిస్తూ చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
చెరువును అభివృద్ధి చేస్తే జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్, బోడుప్పల్, పీర్జాదిగూడ పురపాలక సంఘాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే చెరువు పక్కన ఉన్న స్థల పట్టాదారులు చెరువు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ పెట్టిన కేసులను కోర్టు నుంచి ఉపసంహరించుకునేలా ప్రజాప్రతినిధులు వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధిలో భాగంగా ఎఫ్‌టిఎల్‌లోని ఆక్రమణలను త్వరితగతిన తొలగించేలా సత్వర చర్యలు తీసుకునేలా సంబంధిత పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అభివృద్ధిలో భాగంగా వచ్చే మురికినీటిని ఇతర పైపులైన్ల ద్వారా మళ్లించి చెరువులో ఉన్న మురికి నీటిని బయటకు పంపించి, గుర్రపు డెక్కను తొలగించి డ్రై చేయాలని అధికారులు భావిస్తున్నారు. చెరువు అభివృద్థి పనులను త్వరలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నివారణ కోసం చెరువు కట్టపై రంగు రంగుల మొక్కలతో పూలవనం, పార్కులను తీర్చిదిద్దేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చెరువు కట్టపై పచ్చని గడ్డితో రంగు రంగుల మొక్కలను పెంచి ప్రత్యేక ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే.

చైతన్యపురి కార్పొరేటర్ హల్‌చల్!
రూ. పది లక్షల డిమాండ్ * కార్పొరేటర్ జిన్నారంపై కేసు * విరుచుకుపడిన విపక్షాలు

దిల్‌సుఖ్‌నగర్, మే 27: ఇటీవల ఎల్‌బినగర్ నియోజకవర్గం ముఖ్యనాయకుడు అధ్యక్షతన బిల్డర్లతో నియోజకవర్గ పరిధిలో కొందరు కార్పొరేటర్లు సమావేశమై ఆయా డివిజన్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలకు తమకు కమీషన్లు ముట్టజెప్పాలని బిల్డర్‌లను డిమాండ్ చేసిన సంఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నియోజకవర్గ ప్రజలు మరువక ముందే చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి ఆ డివిజన్ పరిదిలోని హనుమాన్‌నగర్‌లో నిర్మిస్తున్న ఓ భవనం వద్దకు వెళ్లి తమకు పదిలక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు భవన యజమాని తమకు జి.హెచ్.ఎం.సి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని వివరించారు. నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. నీకు ఎన్ని అనుమతులు ఉన్నా నా అనుమతి నీకులేదు అంటూ పరుష పదజాలంతో బెదిరించారు. సదురు వ్యక్తి జంకక పోవడంతో శుక్రవారం సాయంత్రం సమయంలో తన అనుచరులతో స్వయంగా నిర్మాణ దశలో ఉన్న భవనం వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కూలీలను కూడా తిట్టారు. కార్పొరేటర్ స్థాయిని మరిచి రౌడీలా ప్రవర్తిస్తూ కూలీలపై రాళ్లు రువ్వడం కలకలం కలిగించింది.
అవినీతిని ప్రొత్సహిస్తున్న తెరాస
తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతిని ప్రొత్సహిస్తోందని టిడిపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి అవినీతి, అక్రమ వసూళ్ల తీరుపై శనివారం స్థానిక టి.డి.పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. సామ రంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఎక్కడ కంకర, ఇసుక వేసిన తన అనుచరులతో గద్దల్లా వాలి పోతున్నారని తెలిపారు. డివిజన్ ప్రజలచేత ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి ఆ డివిజన్ ప్రజలకు రక్షణను కల్పించాల్సిపోయి వారిని భయభ్రాంతులకు గురిచేయడం హ్యేయమైన చర్య అని అన్నారు.
అపహాస్యం పాలుచేస్తున్నాడు
- మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ప్రజా ప్రతినిధులు దౌర్జన్యాలకు పాల్పడటం వల్ల ప్రజాస్వామ్యం అపహాస్య పాలవుతుందని ఎల్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కార్పొరేటర్ దౌర్జన్య తీరును తెలుసుకున్న ఆయన శనివారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏదైన భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే సంబంధిత శాఖా చర్యలు తీసుకొంటుందన్నారు. అక్కడ కార్పొరేటర్‌కు ఏమిపని అని ప్రశ్నించారు.
కార్పొరేటర్ సస్పెన్షన్‌కు బిజెపి డిమాండ్
అవినీతి రహిత పాలనను అందిస్తామని నొక్కి చెప్పే కెసిఆర్.. మాటలకు ఆ పార్టీ కార్పొరేటర్లు చేస్తున్న అవినీతికి ఎక్కడన్నా పొంతన ఉందా? బి.జె.పి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రంగనర్సింహ్మగుప్త అని ప్రశ్నించారు. పార్టీపరంగా అతనిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవచేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీలా మారీ కూలీలపై రాళ్లు రువ్వడం సిగ్గు చేటన్నారు.
కార్పొరేటర్‌పై కేసు
కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది పోలీసుల వివరాల ప్రకారం.. విక్రాంత్ వృత్తిరీత్యా గడ్డిఅన్నారంలో పాఠశాలను నిర్వహిస్తున్నాడు. హనుమాన్‌నగర్‌లోని తన ప్లాట్‌లో సొంతింటిని నిర్మించుకుంటున్నాడు. అందుకు కార్పొరేటర్ తనకు చేతివాటం కావాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా శుక్రవారం తన అనుచరులతో కలిసి సైట్‌కు వెళ్లి కూలీలను దూషించారు. తనకు ఎందుకు కమీషన్ ఇవ్వరు? అంటూ కూలీలతో పాటు సగటు యజమానిపై కూడా రాళ్లు రువ్వాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

దారి దోపిడీ ముఠా అరెస్ట్

రాజేంద్రనగర్, మే 27: చిన్ననాటి స్నేహితులు ఓ ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. రాజేంద్రనగర్ ఏసిపి గంగారెడ్డి కథనం ప్రకారం బండ్లగూడ అలీనగర్‌కు చెందిన మహ్మద్ హఫీజుద్దీన్ (24), టోలీచౌకీ మినీ గుల్షన్‌కాలనీకి చెందిన షేక్ అబ్బాస్ అలీ (25), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ నయాబ్‌ఖాన్(24), బండ్లగూడ అలీనగర్‌కు చెందిన అబూబకర్‌బిన్ ఇబ్రహీం(26)లు చిన్న నాటి స్నేహితులు. మహ్మద్ హఫీజుద్దీన్, షేక్ అబ్బాస్ పిడి యాక్ట్ కింద 2014 సంవత్సరంలో జైలుకు వెళ్లివచ్చారు. మహ్మద్ నయాబ్‌ఖాన్ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నాడు. అబూబకర్‌బిన్ ఇబ్రహీంపై దుండిగల్ పోలీసుస్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. వీరు రంజాన్ మాసం రావడంతో నలుగురు స్నేహితులు కలుసుకున్నారు. దారి దోపిడీలు పాల్పడుదామని పథకం వేసుకున్నారు. ఈ నెల 24న మారుతీ కారు (టి ఎస్ 12 యూఏ 9679)లో రాజేంద్రనగర్ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై మకాం వేశారు. ఉదయం సమయంలో మహారాష్ట్ర నుంచి డిసి ఎం( ఎంహెచ్ 22 ఎన్ 8207) లో ఎద్దులను గచ్చిబౌలీ వైపు తీసుకెళ్తున్నారు. డిసిఎంను గమనించిన ముఠా సభ్యులు డిసి ఎం వెంబడించి రాజేంద్రనగర్ ఔటర్ వద్ద నిలిపారు. డిసిఎం డ్రైవర్‌ను చంపుతామని బెదిరించి వారి వద్ద ఉన్న రూ.36 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లను లాక్కున్నారు. అక్కడి నుంచి పారిపోయారు. లారీ డ్రైవర్, క్లీనర్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మారుతీ కారు, రూ.20 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగయ్య, క్రైం డి ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు.

మళ్లీ కమలందే హవా
* రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి ధీమా
రాజేంద్రనగర్, మే 27: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి అన్నారు. పండిట్ దీన్‌దయాళ్ శతాబ్ది కార్య విస్తర యోజన ఒక్క రోజు సెమినార్‌ను రంగారెడ్డి జిల్లా భాజపా ఆధ్వర్యంలో మైలార్‌దేవ్‌పల్లిలోని మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చేసుకొని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు సైనికులుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి బూత్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని నిధులు వస్తున్నాయనే విషయం ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి మూడున్నరేళ్లు అవుతున్నా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన ఆరోపించారు. టిఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. అనంతరం నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి జూన్ 12 వరకు మండల, డివిజన్ పదాధికారులు పక్క నియోజకవర్గాల్లో 15 రోజులు బూత్ స్థాయి సమావేశాలు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయిలో కేంద్ర పథకాలను కార్యకర్తలు ప్రజలకు తెలియజెప్పాలన్నారు. రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పండిత్ దీన్‌దయాళ్ కార్యవిస్తార్ యోజన శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 2019 ఎన్నికల్లో అమిత్‌షా నాయకత్వంలో తెలంగాణలో భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖర్, జిల్లా మాజీ అధ్యక్షులు టి.అంజన్‌కుమార్‌గౌడ్, పోరెడ్డి నర్సింహ్మారెడ్డి, డాక్టర్ ప్రేమ్‌రాజ్, శ్రీవర్ధన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బి.పాపయ్యగౌడ్, బొసుపల్లి ప్రతాప్, సిహెచ్ స్వామిగౌడ్, భాస్కర్‌రెడ్డి, రాధాధీరజ్‌రెడ్డి, నర్రి విజయలక్ష్మి, జే.సునితారెడ్డి, వై.శ్రీ్ధర్, జి.లచ్చిరెడ్డి, కొప్పు భాష, నారగూడెం మల్లారెడ్డి, గుమ్మడి రాంచంద్రారెడ్డి, కొత్త అశోక్‌గౌడ్, హరిప్రసాద్, అశోక్, విజయ్, అడికె జనార్దన్, నవారు మురళీధర్‌రెడ్డి, అడికె రాజు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

కెసిఆర్ పాలనకు
త్వరలో చరమగీతం

* విద్యార్థినులపై పోలీసులు దాడి అమానుషం
* రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల ఆగ్రహం

రాజేంద్రనగర్, మే 27: కెసిఆర్ పాలనకు చరమ గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లోని పివి నర్సింహ్మారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేస్తున్న నిరసన 34 వ రోజుకు చేరింది. విద్యార్థులకు సంఘీభావంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శారదా మద్దతు తెలిపింది. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా చేస్తున్న ఆందోళనను అడ్డుకొని దాడి చేయడం అమానుషమని ఆరోపించారు. విద్యార్థులని చూడకుండా కానిస్టేబుళ్లు ఇష్టానుసారంగా ప్రవర్తించి అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు. విద్యార్థినిలను అరెస్ట్ చేయడానికి మహిళా కానిస్టేబుళ్లను పెట్టకపోవడం దారుణమన్నారు. 34 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం స్పందించకపోవడం హేయమైన చర్య అన్నారు. గ్రామీణ పశుసంపద కేంద్రాలను పశువైద్యశాలలుగా అప్‌గ్రేడ్ చేసి, టిఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కాంట్రాక్టు నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేయడంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణకు రానున్న రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటానికి మద్దతు తెలుపుతామన్నారు. 84 లక్షల గొర్రెలను పంపిణీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అంతకు ముందే పశువైద్య డాక్టర్లను నియమించాకే పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి శ్రీనివాస్ యాదవ్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పశువైద్య విద్యార్థి సంఘం అధ్యక్షులు కే.శ్రీ్ధర్, అభిలాష్, శశాంక్, కరుణాకర్, అనిల్, రాజిరెడ్డి, సుభాష్, మహేష్, సాయి, ప్రసాద్, వసంత్, లావణ్య, వౌనిక, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యాక్షులు సదాలక్ష్మి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఏ-బ్లాక్ అధ్యక్షుడు సానెం శ్రీనివాస్‌గౌడ్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు దారమోని రమేష్ ముదిరాజ్, ధనుంజయ్, ఏఐసిసి జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్, జబ్బర్‌షా, అరుణ్ ముదిరాజ్ ఉన్నారు.

ఓఆర్‌ఆర్‌లో స్పీడ్ గన్‌లు

జీడిమెట్ల, మే 27: వాహనదారుల అతి వేగానికి అడ్డుకట్టవేసేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ గన్‌లను ఏర్పాటు చేసి ఆటకట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. దుందిగల్ అవుటర్ రింగ్ రోడ్డు పై నూతనంగా అమర్చిన స్పీడ్ గన్‌ను బాలానగర్ ట్రాఫిక్ ఎసిపి శ్యాంసుందర్‌రెడ్డి, జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ అశోక్‌కుమార్ టెక్నిషియన్‌లతో కలిసి పరిశీలించారు. ఓఆర్‌ఆర్ పై 100కు పైగా స్పీడ్ వెళ్లే వాహనదారులను ఈ స్పీడ్ గన్‌లో బంధించి ఫెనాల్టీలను విధించనున్నారు. వాహనదారుల అతివేగాన్ని అదుపు చేసేందుకే ఈ స్పీడ్ గన్‌లని ఎసిపి తెలిపారు.

ప్రతి పల్లె ‘స్వచ్ఛ’ గ్రామం కావాలి

రోడ్డు పక్కనే చెత్తవేయటంపై కలెక్టర్ ఆగ్రహం * భగీరథ గుత్తేదారుపై చర్యలు తీసుకోండి

కీసర, మే 27: జిల్లాలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి పేర్కొన్నారు. శనివారం కీసర మండలంలోని తిమ్మాయిపల్లి, యాద్‌గార్‌పల్లి గ్రామాల్లో స్వచ్ఛ్భారత్ క్రింద నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని మెజారిటీ గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవటం జరిగిందని, మిగిలిన గ్రామాల్లోనూ వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. మేడ్చల్ జిల్లాను స్వచ్ఛ జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా తిమ్మాయిపల్లిలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను ఇంటింటికీ వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. 324 గృహాలకు గాను, కేవలం తొమ్మిది ఇళ్లలోనే మరుగుదొడ్లు లేవని, వాటిని పూర్తిచేసి త్వరలోనే స్వచ్ఛ గ్రామంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సర్పంచ్ రాజలింగంను కోరారు. ఉపాధిహామీ పథకం కింద ఇంకుడు గుంతలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో డంపింగ్‌యార్డు ఉన్నా, రోడ్డుకు ఇరువైపులా చెత్తవేయటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. డంపింగ్‌యార్డుకు రెండు ఎకరాల స్థలం కేటాయించటం జరిగిందని, చెత్తను అక్కడ వేయనట్లయితే తిరిగి స్దలాన్ని స్వాధీనం చేసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం యాద్‌గార్‌పల్లిలో నిర్మిస్తున్న మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామంలో మిషన్ భగీరథ కింద తీసిన గుంతలు పూడ్చివేయక పోవటంపై సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని భగీరథ ఇఇ సురేందర్‌ను ఆదేశించారు.