రంగారెడ్డి

నీటి గుంతలో పడి మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, డిసెంబర్ 26: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో నిర్మాణాల కోసం తవ్వితీసిన సెల్లార్ గుంతల పట్ల రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అవి మృత్యుకుహరాలుగా మారి పసిపిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఆరునెలల క్రితం పిజెఆర్‌నగర్‌లో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహాల సమీపంలోని క్వారీ గుంతలో పడి ముగ్గురు పిల్లలు మృత్యువాత పడగా, గురువారం హౌసింగ్‌బోర్డుకు సంబంధించిన స్థలంలో నిర్మాణం కోసం తవ్వి వదలివేసిన సెల్లార్ గుంతలో పడి ఏడు సంవత్సరాల బాలుడు మరణించిన సంఘటన మరవకముందే ఇదే తరహాలో శనివారం హైదర్‌నగర్ డివిజన్ నిజాంపేట చౌరస్తా సమీపంలో ఏడు యేళ్ల బాలిక నీటి గోతిలో పడి మృతిచెందింది. యాజమాన్యాలు, సంబంధిత అధికారుల సెల్లార్ల కోసం తవ్విన గోతుల చుట్టూ సరైన చర్యలు తీసుకోని కారణంగా అభం శుభం తెలియని పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రమాదకరంగా ఉన్న ఇటువంటి స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా యాజమాన్యాలు, అధికారులు పట్టించుకోని మూలంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదర్‌నగర్ డివిజన్ నిజాంపేట చౌరస్తా మోర్ సూపర్ మార్కెట్ పక్కనగల ఓ రాజకీయ నాయకుడికి చెందిన స్థలంలో భారీ నిర్మాణాల కోసం పెద్దఎత్తున తవ్విన సెల్లార్ గోతులు కొన్ని కారణాలతో నిర్మాణ పనులు నిలిపివేశారు. కాగా వర్షాలకు వదిలేసిన గోతులలో నీరు నిలిచిపోయి ప్రమాదకరంగా మారాయి. వాటి సమీపంలో కూలి పనిచేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఏడుకొండలు, లక్ష్మి దంపతులు గుడిసెల్లో నివాసముంటున్నారు. వారి కుమార్తె నందిని(8) శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బహిర్భూమికని ముగ్గురు పిల్లలతో కలిసి నీటి గుంతల సమీపంలోకి వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు నందిని దానిలో పడి మరణించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు సంబంధిత అధికారులు మృతదేహాన్ని వెలికితీయడంలో పూర్తిగా విఫలమయ్యారు. పేదోడి ప్రాణానికి ఓ న్యాయం ఉన్నవాడి ప్రాణానికి ఓ న్యాయమా అంటూ తమ కుమార్తెను వెలికి తీసేవారు లేరా అని కన్నీరుమున్నీరయ్యారు.
ఎట్టకేలకు 8.30 గంటల ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని రెస్క్యూ టీం, ఫైర్, తదితర సిబ్బంది సహాయంతో వెలికి తీశారు. విషయం తెలుసుకొని స్పందించిన కాంగ్రెస్ నాయకుడు రవికుమార్‌యాదవ్, ఉజ్వల భారత్ సేవా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది సిందం శ్రీకాంత్ సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.

గ్రేటర్ ప్రజలను మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వం

సికింద్రాబాద్, డిసెంబర్ 26: తెరాస ప్రభుత్వం ఆచరణకు వీలుకాని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని తెదేపా సీనియర్ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నైషధం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకమాట ఎన్నికల తర్వాత ప్రజల నడ్డివిరిచే కార్యక్రమాన్ని పెట్టుకుని.. తెరాస నమ్మకం ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. మెట్రోఅలైన్‌మెంట్‌ను సుల్తాన్‌బజార్‌లో, అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపానికి ఇబ్బందులు కలిగే విధంగా ఉండకుండా చూస్తామని ప్రకటించిన తెరాస తాజాగా మాటమార్చి సుల్తాన్‌బజార్ ప్రజలను అమరవీరుల త్యాగాలను కించపరిచే విధంగా వ్యవహిరించడం దారుణమని ఆరోపించారు. సెక్రటేరియట్‌ను తరలిస్తామని, ట్యాంక్‌బండ్ ప్రాంతంలో నూటయాభై ఫోర్ల నిర్మాణం, స్కైవేలు ఏర్పాటు చేస్తామని రోజుకో ప్రకటన చేస్తూ వాగ్దానాలతో నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తెరాస ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఎంతమాత్రం ముందుకు సాగలేదని తెలిపారు. పాలనను ప్రక్కనపెట్టి కేవలం ప్రక్క పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని మాత్రం కెసిఆర్ శరవేగంగా ముందుకు తీసుకుపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవారిని ప్రక్కనపెట్టి అనైతికంగా టిడిపిలో గెలిచి వచ్చిన వారిని పదవులను కట్టబెడుతున్న కెసిఆర్ సర్కార్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయాయని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని నైషధం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో ఏ మాత్రం పట్టులేని తెరాస మైండ్‌గేమ్ ఆడుతుందని అన్నారు. డిసెంబర్‌లో తాము చేయించిన సర్వేల ప్రకారం గ్రేటర్‌లో టిడిపికి 67 సీట్లు, ఎంఐఎంకు 37, బిజెపికి 18, తెరాసకు 15, కాంగ్రెస్‌కు 11, ఇతరులకు మూడు సీట్లు వస్తాయని వెల్లడైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయం గ్రేటర్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తీర్పుతో ఎవరి బలమెంతో తేలిపోతుందని నైషధం పేర్కొన్నారు.