రంగారెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘సదర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 21: సదర్ ఉత్సవాలు సోదరభావాన్ని పెంపొందిస్తాయని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశే్వశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దీపావళి పర్వదినం అనంతరం యాదవ సోదరులు చేపట్టే సదర్ ఒక ఉత్సవంగా ఆయన అభివర్ణించారు. శుక్రవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో అఖిల భారత యాదవ మహాసభ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు దున్నపోతులను ఆడిస్తుంటే ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎంపి విశే్వశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఏటా దీపావళి అనంతరం యాదవ సోదరులు సదర్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు నిర్వహించే సదర్ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. దున్నపోతులను ముస్తాబు చేసి, ముక్కుకు తాడు వేసి యాదవ సోదరులు దున్నపోతులతో వేయించే విన్యాసాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయన్నారు. తెలంగాణ సంస్కృతి భావిపౌరులకు తెలిసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అంతరించిపోయే సంస్కృతిని కాపాడుకొని మన ఆచార, వ్యవహారాలను కొనసాగించేలా కృషి చేయాలన్నారు. దీనికితోడు మన సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం నడుం బిగించిందన్నారు. గత పాలకులు తెలంగాణ సంస్కృతిని మరుగున పడేసినప్పటికీ, నేడు టి ఆర్ ఎస్ ప్రభుత్వం మాత్రం పాలనతో పాటు తెలంగాణ సంస్కృతి, వ్యవహారిక భాషకు ప్రాధాన్యత కల్పించడం శుభపరిణామని తెలిపారు. యాదవ సోదరులు నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల్లో ప్రజలంతా ఏకమై ఉత్సవాన్ని తిలకించడం ప్రజల ఐక్యతకు గుర్తుగా నిలుస్తుందన్నారు. ఐకమత్యతతోనే అనుకున్నది సాధించుకోగల్గుతామని ఆయన ప్రజలకు సూచించారు. యాదవ సోదరుల అభ్యున్నతికి టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అందుకే యాదవులకు సబ్సిడీ కింద పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. వాటిని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. యాదవ సోదరుల ఐకమత్యానికి సదర్ ఉత్సవాలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. దీపావళి అనంతరం సదర్ ఉత్సవాల ద్వారా ప్రజలందరికీ యాదవులు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం ఆనందించదగ్గ విషయమని వివరించారు. దున్నపోతులను అలంకరించి వాటితో వేయించే విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల ఆటపాటలు ఎంతో ఉత్సాహపరిచాయన్నారు. రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్‌లో యాదవ మహసభ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశే్వశ్వర్‌రెడ్డి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలను తిలకించారు.
ఉప్పల్: మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యాదవ సంఘం అధ్యక్షుడు, ఆంజనేయ స్వామి ఆలయం చైర్మన్ పాశం బుచ్చియాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపిపి శ్రీనివాస్, జడ్పీటిసి సంజీవరెడ్డి, మోటె ఐలయ్య, దేవేందర్, రాజు, ఎర్రం సత్యం, అయోధ్య యాదవ్, జి.సత్యనారాయణ, పాశం సత్యం, మధు, బాబు పాల్గొని యాదవులతో కలిసి నృత్యాలు స్టెప్పులు వేసి అందర్ని ఆకట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సదర్‌లో పాల్గొన్న దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. అనంతరం వచ్చిన అతిథులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అందరిలో ఐక్యతను పెంచేందుకు సదర్ ఉత్సవాలు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు.
వనస్థలిపురం: ఎల్బీనగర్ నియోజక వర్గంలో దీపావళి పండగా పర్వదినం సందర్భంగా యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.నాగోలు యాదవ సంఘం ఆధ్వర్యంలో నాగోలు గ్రామంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి.అఖిల భారత యాదవ సంఘం నగర ఉపాధ్యక్షుడు చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళాకు యాదవ సంఘం ప్రతినిధుల పెద్ద ఎత్తున దున్నపోతులను సుందరంగా అలంకరించి బ్యాండ్,డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపులను నిర్వహించారు. ఈమేళాకు దున్న పోతులను తీసుకొచ్చిన 40 మంది యాదవులకు బహుమతులను అందజేశారు.నిర్వాహకులు చింతల సురేందర్ యాదవ్ మాట్లాడుతూ గత 23 ఏళ్లనుండి చింతల కృష్ణ యాదవ్ జాపకార్థంతో నాగోలులో యాదవ సోదరులు కులమతాలకు అతీతంగా సదర్ మేళాను కన్నుల పండుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్, ఎల్బీనగర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం.రామ్మోహన్ గౌడ్. ఆర్యవైశ్వ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.