రంగారెడ్డి

తారానగర్‌లో వైఎస్ షర్మిల ఓదార్పు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జనవరి 5: ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ షర్మిళ మంగళవారం తారానగర్‌లోని దిగంబరరావు ఇంటికి వచ్చారు. గుండెపోటుతో మృతిచెందిన ఆయన తరఫున కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్యా, కుమారుడు, కూతురిని ఓదార్చారు. రూ.50వేల చెక్కులను అందించారు. అనంతరం చందానగర్ సెంటర్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. యాత్రలో వైకాపా తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ విఎల్‌ఎన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, కార్యదర్శి జి.్ధనలక్ష్మీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, నీరాల మహేశ్వర్‌రెడ్డి, భవాని చౌదరి, రవీందర్ పాల్గొన్నారు.

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

పరిగి, జనవరి 5: పరిగి మార్కెట్‌లో రైతులను నిలువుదోపిడీ చేస్తున్న వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, సిపిఐ నాయకులు పీర్‌మమ్మద్ చేవెళ్ళ ఆర్డీఓ చంద్రమోహన్‌ను కోరారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశంలో ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, పరిగి మార్కెట్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం వందకు రెండు రూపాయలు కమీషన్ తీసుకోవాలి, అందుకు భిన్నంగా రైతుల నుంచి వందకు నాలుగు నుంచి అయిదు రూపాయల వరకు తీసుకుంటున్నారని ఆరోపించారు. మార్కెట్‌లో రైతులు అమ్ముతున్న కందులు, వరి, మక్కలు, జొన్నలులకు ఒరిజనల్ రశీదులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెల్లపేపర్లపై పట్టీ రాసిస్తున్నారని వ్యాపారస్తులు చట్టానికి వ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. వర్షాలు సరిగ లేక సగం పంటలే చేతికి వచ్చాయని ఆ వచ్చిన పంటలకు వ్యాపారులు రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు.

ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్న టిఆర్‌ఎస్

రాజేంద్రనగర్, జనవరి 5: గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైన టీ ఆర్ ఎస్ పార్టీ గద్దెనెక్కేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని జిల్లా తెదేపా అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ టీ ఆర్ ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శకాలనీ, అరాంఘర్, బస్తీలలో నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 19 మాసాల్లో టీ ఆర్ ఎస్‌కు ప్రజలు గుర్తుకు రాలేదని, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలను బాగు చేస్తామంటూ సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీ ఆర్ కాలు, తల కిందికు మీదకు చేసినా ఎన్నికల్లో తాను అనుకున్నది సాధ్యం కాదని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారన్నారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప టీ ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెదేపా, కాంగ్రెస్ హయాంలో మంజూరై ఆగిపోయిన పనులకు హడావిడి చేస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారని, టీ ఆర్ ఎస్ గొప్పతనం ఏమి లేదని ఆయన దుమ్మెత్తి పోశారు. మాయల మరాఠీతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను ఆలోచించకుండా చేస్తూ మోసగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఆవిర్భవించిన తరువాత రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు కూడా రాలేవని, తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే అని కక్ష కట్టి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాజీ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, ఎస్.వెంకటేష్ కురుమ, కృష్ణగౌడ్, వినోద్‌గౌడ్, బుచ్చిరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పథకం సిఎం కెసిఆర్ కల

మేడ్చల్, జనవరి 5: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం (వాటర్‌గ్రిడ్) ముఖ్యమంత్రి కెసిఆర్ కల అని అది విజయవంతం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పేర్కొన్నారు. మంగళవారం ఆమె మిషన్ భగీరథ పథకంలో భాగంగా మేడ్చల్ మండలంలోని ఘణపూర్ గ్రామ పరిధిలోని క్షేత్రగిరి గుట్టపై నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఇక్కడి నుండి నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు కూడా గోదావరి జలాలు సరఫరా కానుండటంతో ఆమె పనుల తీరుతెన్నులను పరిశీలించడానికి రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రతి ఒక ఇంటికి మంచినీరు ఇవ్వాలనే సంకల్పం త్వరలోనే నెరవేరబోతుందని చెప్పారు. పథకం విజయవంతం కావడానికి ఆయన చేస్తున్న కృషి మరువ లేనిదన్నారు. ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా ఫ్లోరొసిస్ బాధిత జిల్లా అయిన నల్గొండకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. మే మొదటి వారంకల్లా మేడ్చల్, గజ్వేల్, నియోజకవర్గాలతో పాటు నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలోని 568 గ్రామాలకు కూడా గోదావరి జలాలను సరఫరా చేయనున్నట్లు ఆమె వివరించారు. అందుకోసం స్టార్టింగ్ పాయింట్ నుండి తమ జిల్లాలోని ఆత్మకూరు ఎం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని తెలిపారు. నీటి సరఫరాకు ఏర్పాటుచేసే పైపులైన్ ఏర్పాట్లలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పైపులైన్ ఏర్పాటు మార్గంలో గృహలు, లేక మరే ఇతర అడ్డంకులు ఏర్పడితే ప్రజలంతా సహకరించే విధంగా వారిని నచ్చజెప్పి పనులకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. దారి పొడవునా పైపులైన్ పనులను పరిశీలిస్తూ తన పర్యటన ఉంటుందని వివరించారు. గోదావరి జలాల సరఫరా కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని నీటి అవశ్యకతను గుర్తించి అధికారులు, కాంట్రాక్టర్లకు అండగా నిలవాలని ఆమె కోరారు. రాబోయే మూడు సంవత్సరాలలో రాష్టమ్రంతటా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి చూపిస్తామన్నారు. బృహత్తరమైన ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు పులమకుండా అందరు సంపూర్ణంగా సహకరించి మిషన్ భగీరథ పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, బ్రేక్ ప్రెజర్ ట్యాంక్, పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యేతోపాటు బొమ్మాలరామారం ఎంపిపి తిరుపతిరెడ్డి, జడ్పీటిసి జయమ్మ కృష్ణ, నాయకులు సల్లా రాజు, వెంకటేశ్, మిషన్ భగీరథ పథకం ఎఇ సుష్మ పాల్గొన్నారు.

ప్రజల దాహార్తి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం

కుషాయిగూడ, జనవరి 5: ఉప్పల్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్‌లలో మంచినీటి పైపులైన్‌ల పనులను ప్రారంభించారు. కాప్రా డివిజన్ సీతారాంనగర్‌లో 5.6లక్షలు శ్రీనివాస్‌నగర్‌లో 6.75 లక్షలు, న్యూ శ్రీనివాస్‌నగర్‌లో 19 లక్షలు, పద్మావతి కాలనీలో 15.57 లక్షలు, సోనియాగాంధీనగర్‌లో 22.66 లక్షలు బిఎన్‌రెడ్డి కాలనీలో 1.65 లక్షల రూ.ల వ్యయంతో మంచినీటి పైపులైన్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. చర్లపల్లి డివిజన్‌లోని భరత్‌నగర్‌లో 30లక్షలు, నవోదయనగర్‌లో 3 లక్షలు, మల్లాపూర్ డివిజన్ మంగాపురం కాలనీలో 8 లక్షల రూ.ల వ్యయంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గం శివారు మున్సిపాలిటిలకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం నిధులతో మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శివారు సర్కిల్ అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు తయారుచేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీచేశారు. కాప్రాలోని నాలుగు డివిజన్‌లను అభివృద్ధి చేసి ఆదర్శ సర్కిల్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు మోహన్‌రెడ్డి, మాధవి, ఇందిరా, పవిత్ర, రజనికాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వాణిజ్య పన్ను శాఖలో కారు షికారు
చార్మినార్, జనవరి 5: ప్రభుత్వా ఆదాయ వనరుల్లో ఒకటైన వాణిజ్యపన్ను శాఖ ఇక కారు షికారు చేయనుంది. ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా కొనుగోలుచేసిన ఇన్నోవా కార్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ వసూళ్ల లక్ష్యం సుమారు రూ. 36 కోట్ల మేరకు ఉండగా, డిసెంబర్ నాటికి రూ. 23వేల 400 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఇది సుమారు 16.5శాతం ఎక్కువని వివరించారు. గతానికి భిన్నంగా అధికారులు నిబద్దతతో కృషి చేసి లక్ష్యాన్ని సాధించారన్నారు. అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ చెక్‌పోస్టు విభాగంలో, క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపేందుకు వీలుగా ఈ ఇన్నోవా వాహనాలను సమకూర్చటం జరిగిందన్నారు. టిఎస్‌ఐపాస్ ప్రవేశపెట్టాక వ్యాపారాలు చాలా వస్తున్నాయని వివరించారు. రెవెన్యొ వసూలు చేసే విషయంలో ఎవర్ని ఇబ్బందికి గురిచేయమని, వ్యాపారస్తులు సకాలంలో వారి వ్యాపారాన్ని బట్టి ట్యాక్సులు చెల్లించాలని మంత్రి కోరారు. వాణిజ్యపన్ను శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ పక్క రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల అభివృద్ధిలో వంద శాతం ముందుందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనీల్‌కుమార్ మాట్లాడుతూ వాహనాల వినియోగంతో అధికారులు క్షేత్ర స్థాయిలో విరివిగా పర్యటించి శాఖ సామర్ద్యాన్ని మరింత పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కమిషనర్ అమృతలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంటు కమిషనర్లు పాల్గొన్నారు.

ముందస్తు ప్రణాళికతో నీటి ఎద్దడి నివారణ

హయత్‌నగర్, జనవరి 5: ముందస్తు ప్రణాళికతో రాష్ట్రంలో నీటి ఎద్దడిని నివారించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అన్ని కాలనీలకు మంచినీటిని అందించేందుకు 325కోట్లతో చేపట్టిన రిజర్వాయర్ పనులకు వనస్థలిపురంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. బస్తీలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు డబుల్‌బెడ్‌రూమ్ నిర్మాణం చేపట్టిందని చెప్పారు. గుడిసెల్లో నివాసం ఉండే వారితో పాటు అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కూడా ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంటింటికీ మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్‌రెడ్డినగర్ పరిసర ప్రాంతాలలో అసైన్డ్ భూములలో తెలియక ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యులరైజేషన్ చేసేందుకు సిఎం కేసిఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.