రంగారెడ్డి

విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 23: మేడ్చల్ జిల్లాలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) సురేశ్‌మోహన్ హెచ్చరించారు. గురువారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో మేడ్చల్ - శామీర్‌పేట్ మండలాలలకు గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదులు వస్తున్నా కార్యదర్శులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గ్రామాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా కార్యదర్శులదే బాధ్యత అని తేల్చిచెప్పారు. ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని రికార్డులను, ఆదాయ వ్యయాలను ఎప్పటికపుడు అప్‌డేట్ చేయాలని చెప్పారు. రెండు మండలాల్లో పన్నుల ముదింపు 20, 30 సంవత్సరాల కింద ఉన్న విధంగానే పన్నులు వసూలు చేస్తున్నారని ప్రధానంగా శామీర్‌పేట్ మండలంలో ఈ విధానం ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే పన్ను ముదింపును మార్చి నూతన విధానంతో తాఖీదులు జారీ చేసి పన్నులు వసూలు చేసి గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని అవసరమైతే కంచె, ప్రహారీగోడ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశాలకు వచ్చేటపుడు పూర్తి సమాచారంతో రావాలని అసంపూర్తి రికార్డులతో రావద్దని ఆదేశించారు. గ్రామ బడ్జెట్‌ను ఏలా రూపొందిస్తారని.. నిబంధనలు ఏమిటనీ డీపీఓ కార్యదర్శులను ప్రశ్నించారు. ఏ ఒక్క కార్యదర్శి కూడా సమాచారం తెలుపకపోవడంతో డీపీఓ నివ్వెరపోయారు. సమావేశంలో మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల ఈఓపీఆర్డీలు రమేశ్, మల్లికార్జున పాల్గొన్నారు.

దేవాలయాలు..
ప్రశాంతతకు నిలయాలు

* దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఘట్‌కేసర్, నవంబర్ 23: మానవుని మానసిక ప్రశాంతతకు దేవాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శివారెడ్డిగూడ గ్రామంలోని శ్రీదండ్లగడ్డ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీసద్గురు సాయినాథ స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మధుసూదనానంద సరస్వతీస్వామి, శ్రీ గాయత్రీ పీఠం శ్రీ గాయత్రీ తత్వానందరుషి చేతుల మీదుగా యంత్ర, విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కలిగిన ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో రాణించబడుతారన్నారు. మానసిక ప్రశాంతత కావాలంటే దైవభక్తి ఉండాలన్నారు. ఘట్‌కేసర్ మండల ప్రజలు నిత్యం పూజలు జరుపుకొనేందుకు సాయిబాబా ఆలయాన్ని నిర్మించటం గర్హనీయమన్నారు. ఆర్థిక భారం అయినప్పటికీ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన కమిటీ సభ్యులు కొంతం రాంరెడ్డి, అంజిరెడ్డి, నర్సింహా రెడ్డి అభినందనీయులన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమధుసూదనానంద సరస్వతీ స్వామి, శ్రీగాయత్రీ తత్వానందరుషి చేతుల మీదుగా మంటపపూజ, మూలమంత్ర జపానుష్ఠానం, కల్యాణ సహవనము, గర్త సంస్కారము, పీఠపూజ, యంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, నేత్రోన్మీలనము, దృగ్భలి, పూర్ణాహుతి, శ్రీ సాయిబాబా అలంకారం, మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ, మహదాదీర్వచనం, పండిత సన్మానం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొంతం రాంరెడ్డి, అంజిరెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి, మేకల నర్సింగ్‌రావు, బి.హరిప్రసాద్‌రావు, జంపాల రమేశ్, స్టీవెన్, మండల వ్యాప్త మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.