రంగారెడ్డి

చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 12: బెంగుళూరు, మహారాష్టల్ల్రో దోపిడీ, దొంగతనాలకు పాల్పడి సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో సంచరిస్తున్నట్లు అనవాళ్లు కనపడటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ వార్త దావానంలా వ్యాపించటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసు స్టేషన్ పరిధి అన్నోజిగూడ సమీపంలోని మోదీ ఎమరాల్డ్ పార్కు కాలనీలో చెడ్డీగ్యాంగ్‌కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ లభ్యం కావటంతో పోలీసులు అప్రమత్తమై చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు ఆయుధాలను ధరించి తిరుగుతున్నట్లు సీసీటీవీ పుటేజీల ద్వారా తెలుస్తోంది. అన్ని కాలనీలు, గ్రామాలు, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేయటంతో పాటు అనుమానితులను విచారిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో కనపడినవారి వివరాలను పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ కోరారు. పక్క రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు తాజాగా హైదరాబాద్ చేరుకుని దోపీడీలకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు చెడ్డీలు, బనియన్లు, ముఖానికి ముసుగులు ధరించి ఉంటారన్నారు. పగలు కుర్తా, లుంగీలు ధరించి కూలీలు, బిచ్చగాళ్లలాగా నటిస్తూ కాలనీల్లో సంచరిస్తుంటారని, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు దోపిడీ చేస్తారని చెప్పారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ గస్తీ పోలీసులకు గ్యాంగ్ సమాచారం ఇవ్వాలని లేదా కంట్రోల్ రూమ్ 100 నెంబర్‌కు డయల్ చేయాలని కోరారు.
చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులను పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చెడ్డీగ్యాంగ్ కలకలంతో పోలీసులు, సీసీఎస్ పోలీసులు ఘట్‌కేసర్ మండలంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.