రంగారెడ్డి

బడంగ్‌పేట్ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జనవరి 9: ముఖ్యమంత్రి సహాకారంతో బడంగ్‌పేట్ నగర పంచాయతీకి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అంచలు అంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం బడంగ్‌పేట్ నగర పంచాయతీ అన్నపూర్ణ కాలనీ రోడ్డు నెంబర్ 1లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఏరియల్ రోడ్డు నిర్మాణం కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి దాదాపు రూ.276 కోట్లు మంజూర్ చేయించినట్లు పేర్కొన్నారు. బడంగ్‌పేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, ప్రజల కనీస వౌళిక వసతుల కల్పన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. బడంగ్‌పేట్ నగర పంచాయతీ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.21 కోట్లు నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లు చైర్మన్ సామ నర్సింహ్మగౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సాహాయ సహాకారంతో మరిన్ని నిధులు మంజూర్ చేయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్నపూర్ణ కాలనీ రోడ్డు 1లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు రూ.10 లక్షలు కేటాయించినట్లు స్థానిక కౌన్సిలర్ బీమిడి స్వప్న జంగారెడ్డి తెలిపారు. అన్నపూర్ణ కాలనీలోని వివిధ రోడ్ల నిర్మాణాల కోసం ఇప్పటి వరకు దాదాపురూ.35 లక్షలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేయించి కాలనీలో నెల కొన్న సమస్యలను పరిష్కారిస్తామని అన్నారు. కాలనీలో నెల కొన్న లోహోల్టెజీ విద్యుత్తు సమస్య పరిష్కారం కోసం నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనున్నట్లు స్వప్న జంగారెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో కమిషనర్ ఎన్.వసంత, కౌన్సిలర్లు రాలగుడెం శ్రీనివాస్‌రెడ్డి, గౌర శారద సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు సామ ప్రభాకర్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, మల్లారెడ్డి, బాబుల్‌రెడ్డి పాల్గొన్నారు.

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
వికారాబాద్, జనవరి 9: విద్యార్థులు మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్, మూఢ నమ్మకాల నిర్మూలన ఉద్యమకారుడు బైరి నరేష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్‌హాలులో అంబేద్కర్ విద్యార్థి సంఘం, పే బ్యాక్ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక చైతన్య సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విజ్ఞానంతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కేవలం విద్య, విజ్ఞానంతోనే ప్రపంచాన్ని జయించారని పేర్కొన్నారు. విద్యార్థులు సైంటిస్టుల గురించి తెలుసుకోవాలని తెలిపారు. టివి, సినిమా, క్రికెట్, సెల్‌ఫోన్‌ల మాయలో పడవద్దని స్పష్టం చేశారు. మానవతా విలువలతో క్రమశిక్షణగా జీవించి ఉన్నతంగా ఎదగాలని ఉదహరణలతో వివరించారు. మూఢనమ్మకాలపై సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వికారాబాద్ జిల్లా బృందం, ఉస్మానియా బృందం మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చింది. బాబాలు, స్వామీజీలు, మాంత్రీకుల పేర ఎలా మోసం చేస్తారో చక్కగా వివరించారు. నోట్లో మంటలు, నీళ్లు పెట్రోల్, ఉరితాడుమాయం, పచ్చగడ్డి మండటం, దెయ్యాలు, భూతాలు ఉండబోవని, మూఢనమ్మకాలు నమ్మి పోసపోరాదని అన్నారు.
కార్యక్రమంలో ఎఎస్‌ఎ ప్రతినిధి బేగరి అంజయ్య, పేబ్యాక్ సొసైటి రమేష్, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఓయు అధ్యక్షుడు బండారి రాజు, సంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాస్తిక్ బక్కప్ప, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొట్ట నగేష్, ఎస్‌ఎస్‌ఎఫ్ నాయకులు బైరి అచ్యుత్, ఉడుత రాకేష్, ఎస్‌ఎస్‌డి నాయకులు రవీందర్‌బోధ్, కృష్ణ, పెద్ది అంజయ్య, సుకుమార్, రవి, బాబు, అనంతరాములు, శ్రీనివాస్, రామకృష్ణ, రత్నం, రమేష్, యాదయ్య, పాల్గొన్నారు.

రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు దుర్మరణం
మేడ్చల్, జనవరి 9: మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో సోమవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా మరొ ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన దొడ్లకృష్ణ(28), తమ్మల్ల శ్రీకాంత్(20) సోమవారం రాత్రి గుండ్లపోచంపల్లి - అయోధ్య చౌరస్తా మధ్యలో గోల్డెన్ లీఫ్ వెంచర్ సమీపంలో ద్విచక్ర వాహనాలపై ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నారు. ప్రమాదంలో ఇద్దరు యువకుల తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొ ఇద్దరు దూలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, జిపిపల్లికి చెందిన కావలి హరికృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి మృతదేహలను పోస్టుమార్టం కోరకు నగరంలోని గాంధి ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల బంధువుల రోదనలను అపడం ఎవరితరం కాలేదు. దొడ్లకృష్ణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ చక్రాల కింద నలిగి ఒకరి మృతి
రాజేంద్రనగర్, జనవరి 9: ప్రమాదవశాత్తు ఇసుక లారీ.. నిద్రిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే బిహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ హర్షద్(30), పనె్నండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం రాజేంద్రనగర్ చింతల్‌మెట్ బస్తీకి వలసవచ్చాడు. చింతల్‌మెట్‌లో శారీ డిజైన్‌షాపులో పని చేస్తున్నాడు. ఆదివారం నైట్ డ్యూటీకి వెళ్లాడు. తెల్లవారుఝామున 4గంటల ప్రాంతంలో చింతల్‌మెట్ చౌరస్తాకు నడుచుకుంటూ వెళ్లి హోటల్‌లో ఛాయ్ తాగాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో నిర్మాణం సాగుతున్న ఓ భవనం వద్ద ఇసుక ఉంది. అందులో కొద్ది సేపు సేద తీర్చుకుందామని పడుకున్నాడు. అదే సమయంలో ఇసుక లారీ ఇసుక లోడ్‌ను తీసుకొని వచ్చింది. ఇసుకను డంప్ చేయడానికి వెనుక నుంచి లారీ ఇసుక కుప్పపైకి ఎక్కింది. దీంతో అక్కడే నిద్రిస్తున్న హర్షద్ వెనుక చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇసుక లోడ్‌ను ఖాళీ చేసి లారీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఉదయం బిల్డింగ్ వాచ్‌మెన్ హర్షద్ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను బజారులో నిలబెట్టారు

కెసిఆర్ నియంతలా
వ్యవహరిస్తున్నారు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ ఆగ్రహం
ఉప్పల్, జనవరి 9: పెద్దనోట్లను రద్దుచేసి ప్రజల్ని బజారులో నిలబెట్టి వారి మృతికి కారణమైన బిజెపి ప్రభుత్వానికి వారికి మద్దతు తెలిపిన కెసిఆర్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉప్పల్ చిల్కానగర్ చౌరస్తాలో సిపిఐ డివిజన్ కన్వీనర్ సింగిరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన హక్కులు మన ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన కెసిఆర్ వాటిని అమలు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దలకు రాయితీలు ఇస్తూ పేదలకు పన్నులు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేదని ఆయన విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాయఅన్నారు. నోట్ల రద్దుతో నడిబజారులో క్యూలో నిల్చొని తీవ్ర ఇబ్బందులతో మృతిచెందిన 166 మంది కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిఎస్ బోస్, మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేష్, కార్యవర్గ సభ్యుడు దామోదర్‌రెడ్డి సిపిఐ నాయకులు మసూద్, కృపాకర్, అంజయ్య, శ్రీనివాస్, జానకి, శోభ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 150 మంది సిపిఐలో చేరారు. వీరికి పార్టీ కండువాలతో సత్కరించి ఆహ్వానించారు.