రంగారెడ్డి

ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 20:రద్దయిన పాత నోట్లను తీసుకువెళుతున్న మహిళను తనిఖీల పేరుతో బెదరించి, రూ. 8 లక్షల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. వీరితోపాటు సహకరించిన మరో వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు పూర్వాపరాలు ఆసక్తిరేపుతున్నాయి. కొండాపూర్‌లో నివాసముంటున్న ఓ మహిళ వద్ద పాత నోట్లు ఉండడంతో రవి అనే మధ్యవర్తిని నోట్లు మార్చాలని అడిగింది. తెలిసినవారి సహాయంతో నోట్లు మారుస్తానని, 6వతేదీన పాతనోట్లతో అమీర్‌పేట రావాలని ఆ మహిళను రవి కోరాడు. అలాగే వచ్చిన ఆ మహిళ చాలాచేపు నిరీక్షించిన తరువాత ఆ నగదు మార్చే వ్యక్తులు మాదాపూర్‌లో ఉన్నారంటూ జూబ్లీహిల్స్ మీదుగా మాదాపూర్‌కి తీసుకొచ్చాడు. మాదాపూర్ పిఎస్‌లో పనిచేసిన ధన్‌సింగ్‌కు విషయం చెప్పాడు. ప్రస్తుతం మేడ్చల్ పిఎస్‌లో పని చేస్తున్న ధన్‌సింగ్ పాతపరిచయం ఉన్న మాదాపూర్ పిఎస్ క్రైం విభాగంలో పనిచేస్తున్న విక్రమ్‌రెడ్డి, పవన్‌కు విషయం చెప్పి తనిఖీ పేరుతో మహిళను బెదరించి డబ్బులు గుంజాలని సూచించాడు. అయ్యప్ప సోసైటీ కాలనీ వద్ద ఆమె వాహనాన్ని ఆపి పోలీసు స్టేషన్‌కు వెళ్తే కేసులుంటాయని బెదిరించారు. ఆ సమయంలో మహిళ వద్ద భారీగా నగదు ఉండగా, అందులోని రూ.8 లక్షలు తీసుకున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పద్దని హెచ్చరించారు. అనంతరం జరిగిన విషయాన్ని బంధువుకి బాధితురాలు చెప్పడంతో సదరు బంధువు పోలీసు అధికారికి వివరించాడు. పోలీసులు సదరు మహిళను పిలిచి పాతనోట్లు కలిగి ఉండడం నేరం కాదని, ఫిర్యాదిస్తే పోలీసులపై చర్య తీసుకుంటామని చెప్పడంతో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు పోలీసులతోపాటు మధ్యవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా ఎవరైనా పోలీసులమని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని మాదాపూర్ ఏసిపి రమణ కుమార్ తెలిపారు.

బంక్ సిబ్బందే సూత్రధారులు
మేడ్చల్, జనవరి 20: రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించిన మేడ్చల్ శివారు ప్రాంతంలోని భారత్ పెట్రోల్ బంకులో గతనెల డిసెంబర్‌లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించి బంకు సిబ్బందే దొంగలని తేల్చారు. వాస్తవానికి ఆ రోజు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే దోపిడీ చేసినా బంక్ సిబ్బంది రూ.23 లక్షలు దోపిడీ చేసినట్టు పోలీసులకు చెప్పారు. శుక్రవారం మేడ్చల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్ జోన్ డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ డివిజన్ ఏసిపి అందె శ్రీనివాస్‌రావు, మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ సినీఫక్కీలో జరిగిన దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మేడ్చల్ జాతీయ రహదారి అత్వెల్లి పరిధిలోని భారత్ పెట్రోల్ బంకులో గతనెల 12న అర్ధరాత్రి దాటాక దోపిడీ దొంగలు ముసుగులు ధరించి కత్తులతో దాడిచేసి బంకులో పని చేసే సిబ్బందిని తీవ్రంగా గాయపర్చి తుపాకీతో బెదిరించి రూ. 22లక్షల 91436 రూపాయలను దోపిడీ చేశారని బంకుకు చెందిన నల్లరాజు అనే సూపర్‌వైజర్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోపిడీ సమయంలో దొంగలు సిసి కెమెరాలతో పాటు డివిఆర్ బాక్స్‌ను సైతం ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లినట్టు చెప్పారు. దోపిడీ దొంగలు వెళ్తువెళ్తూ హిందీ, లంబాడీ భాషలో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతర్రాష్ట దొంగల ముఠా పని అయివుంటుందని పోలీసులు ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. దొంగతనం తర్వాత ఏ దారి నుంచి వెళ్లారనే విషయంపై బంకు సిబ్బందిని ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు. వివిధ కోణాల్లో దర్యాప్తు సాగించి బంకు సిబ్బందిదే దోపిడీలో ప్రధాన పాత్ర అని నిర్ధారణకు వచ్చి పరిశోధించి కేసు మిస్టరీని ఛేదించించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మట్ట సత్యనారాయణ(35) తొమ్మిది సంవత్సరాలుగా ఇదే బంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘువోత్తమ్‌పల్లి గ్రామానికి చెందిన నల్లరాజు(28) పది సంవత్సరాలుగా, కడదూర్ సంజీవరెడ్డి(28) ఆరు సంవత్సరాలుగా బంకులో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. వీరంతా బంకులో పెట్రోల్, డీజిల్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను తమ అవసరాల నిమిత్తం పలు సందర్భాల్లో వాడుకున్నారు. దీనిని కప్పి పుచ్చడానికి దోపిడీ నాటకానికి తెరలేపారు. మేనేజర్ సత్యనారాయణ తమ్ముడు సుబ్బరాజు, బావమరిది శ్రావణ్ ఇదే బంకులో పనిచేస్తున్నారు. ఆయా సందర్భాల్లో బంకుకు చెందిన డబ్బులను సొంత అవసరాలకు వాడేసుకున్నారు. అరువుపై కొంతమంది వినియోగదారులకు డీజిల్ సరఫరా చేయగా డబ్బులు చెల్లించకపోవడంతో మొత్తం కలిసి దాదాపు రూ.18లక్షలు భారం పడింది. కంపెనీ సేల్స్ అధికారి ప్రతి నెలకొకసారి నిర్వహించే ఆడిట్‌లో తెలిసినవారి నుంచి డబ్బు అప్పుగా తీసుకువచ్చి సర్దుబాటు చేసేవారు. చెన్నై నుంచి మూడు నెలలకొకసారి నిర్వహించే ఆడిట్‌లో కూడా ఇదే విధంగా సర్దుబాటు చేశారు. ఆడిట్ ముగిసిన తర్వాత అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులను తిరిగి తమకు డబ్బిచ్చిన వారికి చెల్లించేవారు. పెద్దనోట్ల రద్దుతో వీరి ఆటలు సాగడం గగనంగా మారింది. బంకు సూపర్‌వైజర్ సంజీవరెడ్డి, నల్లరాజు వాడుకున్న రెండు లక్షల రూపాయలు చెల్లించి ఉద్యోగాలను మానివేస్తామని మేనేజర్ సత్యనారాయణకు తెలిపారు. కొత్తవారు ఉద్యోగంలో చేరితే బండారం బయట పడుతుందని ముగ్గురూ కలిసి దీర్ఘంగా ఆలోచించి దోపిడీ కథనాన్ని రచించారు. మేనేజర్ సంజీవరెడ్డికి మేడ్చల్ మండలం మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ మల్లిగారి సంతోష్ కుమార్ అలియాస్ చిన్నా(27)తో పరిచయం ఏర్పడింది. చిన్నాను పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన గోపని భాస్కర్(34), సూర్యనగర్ కాలనీకి చెందిన గుర్రం వెంకటేశ్ (39) అప్పు అడిగారు. తమ బంకులో దొంగతనం చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని సంజీవరెడ్డి చెప్పడంతో ముగ్గురూ దొంగతనం చేయడానికి అంగీకరించారు. చిన్నా, భాస్కర్, వెంకటేశ్ దోపిడీ చేయడానికి నిర్ణయించుకుని డిసెంబర్ నెల మొదటి వారంలో సికిందరాబాద్ వెళ్లి చేతి గ్లౌజులు, మాస్క్‌లు, బొమ్మ తుపాకీ కొనుగోలు చేశారు. నగరంలోని కమిషనర్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేసిన మండలంలోని రావల్‌కోల్ తండాకు చెందిన కరంతోడ్ శంకర్(23) బెదిరించిన కేసులో అరెస్టు అయ్యాడు. శామీర్‌పేట్ మండలం ఆలియాబాద్‌కు చెందిన మహేశ్‌కు వెంకటేశ్, భాస్కర్‌కు పరిచయం ఉంది. అనుకున్న ప్రకారం భాస్కర్, వెంకటేశ్, మహేశ్ దొంగతనానికి రాకపోవడంతో డిసెంబర్ 11న రాత్రి శంకర్‌కు చిన్న ఫోన్ చేసి మేడ్చల్‌కు పిలిపించాడు. ఇద్దరూ కలిసి చిన్నాకు చెందిన ఇండికా కారులో నల్లరాజు ఇంటికి వెళ్లి అక్కడి నుండి రాత్రి 12 గంటలకు ముగ్గురూ కలిసి బయల్దేరి పెట్రోల్ బంకుకు అవతల కొద్ది దూరంలో కారును పార్క్ చేసి రాత్రి 2గంటల వరకు వేచియున్నారు. బంకు నుంచి పోలీసు పెట్రోలింగ్ వాహనం వెళ్లిపోగానే శ్రావణ్‌కు చెందిన ఫోన్ నుంచి సంజీవరెడ్డి, చిన్నాకు ఫోన్ వెళ్లింది. (కేసు మిస్టరీని ఛేదించడంలో ఈ కాల్ కీలకంగా మారిందని చెప్పవచ్చు) శ్రావణ్ ఒక్కడే బంకు ఆవరణలో ఉన్నాడు. మిగతా వారంతా లోపల ఉన్నారు. శంకర్, నల్లరాజు, చిన్నా మాస్క్‌లు, గ్లౌజులు ధరించి బంకు వెనుక ఫెన్సింగ్ దూకి వచ్చి సిసి కెమోరాను కర్రతో పగులగొట్టి బంకు కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు ధన్‌రాజ్ కేకలు వేసేందుకు ప్రయత్నించగా ఇనుపరాడ్‌తో శంకర్ కొట్టి లోపలికి తీసుకువెళ్లాడు. మిగతా సిబ్బంది నిద్రలోంచి లేవగా వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌లను లాక్కుని పగులగొట్టారు. పథకం ప్రకారం చిన్నా తన వద్ద ఉన్న కత్తిని చూపించి అరిస్తే చంపేస్తానని బెదిరించగా సంజీవరెడ్డి కలుగజేసుకుని తాళంచెవి ఇచ్చేయాలని సూచించాడు. నల్లరాజు తాళంచెవి తీసుకువచ్చి లాకర్‌ను తెరిచాడు. లాకర్ ఉన్న రూ.4 లక్షలు ఓ బ్యాగులో పెట్టుకొని సిసి టివికి సంబంధించిన డివిఆర్ బాక్స్‌ను పగులగొట్టి డివిఆర్‌ను నల్లరాజు తీసుకున్నాడు. గదిలోని కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన జంక్షన్ బాక్స్‌ను పగులగొట్టారు. అనుమానం రాకుండా బయటవున్న శ్రావణ్‌ను సంజీవరెడ్డితో లోనికి పిలిపించి కొట్టి అందరినీ లోపలవేసి బయట నుండి గడియపెట్టి పారిపోయి నల్లరాజు ఇంటికి చేరుకున్నారు. గంట తర్వాత శంకర్ తనకు డ్యూటీ ఉందని చెప్పి వెళ్లిపోయాడు. పెట్రోల్ బంకులో దొంగతనం జరిగిందని నల్లరాజుకు ఫోన్‌రాగా ఏమీ ఎరుగనట్టు బంకుకు చేరుకుని మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు రాసి ఇచ్చాడు. మరుసటిరోజు తెల్లవారుజామున నల్లరాజు తన దగ్గర ఉన్న సిసిటివి డివిఆర్ బాక్స్‌ను తీసుకువెళ్లి రేకులబావి చౌరస్తా వద్ద ఓ బావిలో పడవేసాడు. డబ్బులున్న బ్యాగును చిన్నా తీసుకుని వెళ్లిపోయి రెండు రోజుల తర్వాత అందులో నుండి లక్షా 10వేలు శంకర్‌కు ఇచ్చాడు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న భాస్కర్, వెంకటేశ్, మహేశ్ విషయాన్ని పోలీసులకు చెబుతామని బంకు మేనేజర్ సంజీవరెడ్డిని బెదిరించి లక్షా 40వేలు బలవంతంగా వసూలు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సిబ్బంది హస్తముందని నిర్ధారించుకుని గురువారం పట్టణంలోని చిన్నా బైక్ మెకానిక్ దుకాణంలో నిందితులు కలుసుకున్న సమయంలో దాడి చేసి అరెస్టు చేశారు. రూ.260000 నగదు, ఇండికా కారు, ఏడు సెల్‌ఫోన్లు, కత్తి, రెండు ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నారు. బావిలో పడేసిన సిసిటివి డివిఆర్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్లిగారి సంతోష్ అలియాస్ చిన్నా, కరంతోడ్ శంకర్, నల్లరాజు, కడదూర్ సంజీవరెడ్డి, గోపనీ భాస్కర్, గుర్రం వెంకటేశ్, మట్ట సత్యనారాయణను అరెస్టుచేసి రిమాండ్ తరలించి పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు శ్రావణ్, మహేశ్, సుబ్బరాజు కోసం గాలిస్తున్నారు. మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, డిఐ శంకర్‌యాదవ్, నేర విభాగం ఎస్‌ఐ గ్యార పవన్‌కుమార్, సిబ్బంది కృషిని డిసిపి సాయిశేఖర్ అభినందించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోయిన మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి గతంలో సైబర్‌క్రైం విభాగంలో విధులు నిర్వహించడంతో కేసును ఛేదించడంలో సఫలీకృతం అయ్యారు.