రంగారెడ్డి

మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 23: మహాశివరాత్రిని పురస్క రించుకుని కీసరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చూస్తున్నారు. కాగా, కీసర గుట్ట బ్రహ్మోత్సవాల్లో రెండవరోజు గురువారం మాఘబహుళ ద్వాదశినాడు వేద పండితులు యాగశాలలో రుద్రస్వాహాకార హోమం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి వారికి బిల్వార్చన, ప్రదోశకాలపూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్దప్రసాదవినియోగం తదితర కార్యక్రమాలు వేదపాఠశాల అవధానులు గణపతిశర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్ముగూడ, యాప్రాల్, వంపుగూడ తదితర ప్రాంతాలనుండి తమిళులు ఆటోలలో కీసర గ్రామానికి గురువారం ఉదయం చేరుకున్నారు. కీసరలోని పోచమ్మ ఆలయం వద్ద మేకలు, కోళ్లను అమ్మవారికి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. పోచమ్మ అంగడి అనంతరం సాయంత్రం తమిళులు కీసరగుట్టపైకి వెళ్లారు. శ్రీస్వామివారు కీసర గ్రామం నుండి కీసరగుట్ట పైకి నంది వాహనసేవలో భక్తజన సందోహంతో తీసుకు వెళ్లారు.
స్వామి వారి సేవలో రాచకొండ
కమిషనర్ మహేశ్‌భగవత్
కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి సేవలో రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ఆలయ పండితులు ఎదురువెళ్ళి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా మంటపంలో స్వామివారి శేష వస్తాన్ని కప్పి ఆశీర్వచనాలు అందజేసారు. ప్రసాదాన్ని అందజేసారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కలెక్టర్ ఎంవి రెడ్డి, అడిషనల్ సిపి శశిధర్‌రెడ్డి, ఆలయచైర్మన్ టి. వెంకటేశ్‌శర్మ, ఇఓ వెంకటేశ్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ముస్తాబైన శైవ క్షేత్రాలు
తాండూరు: తాండూరు డివిజన్‌లోని పట్టణ, డివిజన్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ శివాలయాలు, శైవక్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినం వేడుకలకు ముస్తాబైయ్యాయి. ప్రతి ఇంటా శుక్రవారం మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివభక్తులు, మహిళలు భక్తినియమాలతో తమ ఇంటా ఆ పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించటానికి, మహాశివరాత్రి ఉప వాసాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాండూరు పట్టణంలోని పాత తాండూరు కోటేశ్వర దేవాలయం, పట్టణంలోని నగరేశ్వరాలయం, గోల్లచెరువుకట్ట శివాలయం, అంతప్పకుంటలో ఉన్న శివలింగేశ్వరాలయం, పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీ్భవిగి భధ్రేశ్వర దేవస్థానాలతో పాటు, తాండూరు పట్టణ శివారులో ఉన్న అంతారం భూకైలాస్ దేవస్థానం ఆలయాలలో మహాశివరాత్రి వేడుకలకు భారీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. డివిజన్‌లోని తాండూరు మండలం జిన్‌గుర్తిగ్రామ సమీపంలో ఉన్న శ్రీరామలింగేశ్వర ఆలయం, అల్లాపూర్ శివాలయం, పెద్దెముల్ మండలంలో ఉన్న ప్రసిద్ధ అంబురామన్న శివాలింగేశ్వరాలయం, యాలాల మండలం కాగ్నా నది తీరాన ఉన్న అతి పురాతన సంగమేశ్వరాలయం, బషిరాబాద్ మండలం ఏకాంబరీ దేవస్థానం శివరామలింగేశ్వర దేవాలయం, జివన్గీగ్రామ కాగ్నా నది ఒడ్డున ఉన్న శివరామ లింగేశ్వరాలయం వంటి తదితర ప్రముఖ శైవ క్షేత్రాలు మహాశివ రాత్రి పర్వదినం వేడుకలకు ముస్తాబయ్యాయి.
మల్కాజిగిరిలో
నేరేడ్‌మెట్: మహాశివరాత్రి సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని మల్కాజిగిరి, నేరేడ్‌మెట్, వినాయకనగర్, ప్రశాంత్‌నగర్, శాంతినగర్, డిఫెన్స్‌కాలనీ, మూడుగుళ్ల వద్ద గల శివాలయాలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాలకు రంగులు వేసి, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివరాత్రి శివునికి ఇష్టమైన రోజని శివరాత్రి రోజు భక్తులు ఉపవాస దీక్ష చేసి శివుని ఏదైనా కోరుకుంటే తప్పక నేరవేరుతుందన్నారు. పండుగ సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తుల కోసం బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేసి సాయంకాలం దీక్ష విరమణ చేస్తారని, ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు.
శివాలయాల ముస్తాబు
ఉప్పల్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాలలోని శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చిల్కానగర్‌లోని శివాలయం, హేమానగర్ ఈదయ్యనగర్‌లోని కాశీవిశే్వశ్వర శివలింగం ఆలయం, ఆదర్శనగర్‌లోని శివ సాయి మందిరం, పాతబస్తీలోని శ్రీ శివశంకర మహమ్మాయి ఆలయం, స్వరూప్‌నగర్‌లోని శ్రీ కనిగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలోని శివాలయం, పారిశ్రామికవాడలోని శివాలయం, రామంతాపూర్ పాతబస్తీలోని మల్లిఖార్జున స్వామి ఆలయం, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, బోడుప్పల్, పీర్జాదిగూడలోని శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయం, శంకర్‌నగర్‌లోని శివాలయం, మేడిపల్లిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, పర్వతాపూర్ శ్రీరమణపురంలోని శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సకలసౌకర్యాలతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, ఇతర సదుపాయాలను కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణం
ఉప్పల్ పారిశ్రామిక వాడలోని శ్రీ దుర్గా మల్లిఖార్జున స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్లు జి.జ్యోత్స్న సరస్వతి, స్వప్న, హైకోర్టు ఏజిపి మల్లేష్, ఇఓ భాగ్యలక్ష్మి, బిజెపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మహా శివరాత్రి సందర్భంగా కీసరలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గురువారం రాత్రి నుంచి బస్సులను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలోప్రత్యేక పూజలు
వనస్థలిపురం: నాగోలు డివిజన్ పరిధిలోని జైపూరి కాలనీలో ఉన్న ప్రాచీన కాలంనాటి శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న శివ భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్పటిక శివలింగేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉదయం తొమ్మిది గంటలకు విఘ్నేశ్వరుడి పూజ, గోపూజ, కలశస్థాపన, విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన, స్వామి వారికి అభిషేకం, సాయంత్రం శైనాగ్ని పతిష్ఠ, హోమ కార్యక్రమం, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ములుగు హనుమంత్ రావు, సహాయ కార్యదర్శి ముదిగొండ చంద్రశేఖర్, కోశాధికారి కొంపల్లి శంకర్ రావు, నాగేశ్వర్‌రావు తెలిపారు. మహాశివరాత్రి రోజున శుక్రవారం నాడు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తుల సౌకర్యార్ధం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్టు వారు వివరించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం, అర్చనలు, సాయంత్రం ఐదుగంటలకు రుద్ర హోమం, పూర్ణాహుతి, రాత్రి 7గంటలకు శ్రీవిశాలాక్షి, విశే్వశ్వర స్వామివారలకు కల్యాణ మహోత్సవం, 10గంటల నుండి 12 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకదశవార విశేష గోక్షీరాభిషేకం, నీరాజనం, మంత్ర పుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా జరిగే ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలకు చెందిన శివభక్తులతో పాటు ప్రతిఒక్కరూ అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. 25న ఉదయం 10 గంటలకు కన్నుల పండువగా జరిగే రథోత్సవ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ హాజరుకావాలని కోరారు.
శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో
మహేశ్వరం: మహేశ్వరంలో ప్రఖ్యాతిగాంచిన శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ద్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ కుమార్, సర్పంచ్ ఎస్.ఆనందం తెలిపారు.
మర్పల్లిలో..
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మర్పల్లి మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో శివాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ సంగమేశ్వర ఆలయం, పీతాంబేశ్వర ఆలయం, ఇతర ఆలయాలకు విద్యుత్ దీపాలతో అలంకరించారు.
మేడ్చల్‌లో
మేడ్చల్: మహాదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నేటి (శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా శివాలయాలు ముస్తాబయ్యాయి. పట్టణ శివారులోని గుట్టలపై వెలిసిన ప్రజల కొంగు బంగారం శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయాన్ని నిర్వాహకులు అన్ని విధాలుగా ముస్తాబు చేయడంతో పాటు భారీగా తరలివచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాట్లను సవ్యంగా చేపట్టినట్లు ఆలయ వంశపారంపర్య ధర్తకర్త దాత్రిక కాశీనాథ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా గాంధీ విగ్రహాం సమీపంలోని అతిపురాతన శివాలయం కూడా మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యింది. అత్వెల్లిలోని చంద్రవౌళేశ్వరస్వామి వారి ఆలయం, రావల్‌కోల్ రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు ఆయా గ్రామాలలోని ఆలయాలు మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబయ్యాయి.

అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు

షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 23: అరెస్టులతో ఉద్యమాలను ఎవరూ అడ్డుకోలేరని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం షాద్‌నగర్ ముఖ్యకూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వెళ్లగా సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, జెఏసి, జిఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 22న హైదారాబాద్‌లో నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకొని ఎక్కడికక్కడే నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 23న ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వెళితే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అరెస్టులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా..అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని అన్నారు. ఛలో హైదారాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకొని టిజెఏసి నాయకులను అరెస్టులు చేయడం, లాఠీచార్జీలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలుచేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుంటే టిఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు ఎన్.రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు డి.సుమన్, పి.శివ, ఐద్వా నాయకురాలు లక్ష్మీరాజు పాల్గొన్నారు.
ర్యాలీపై నిర్బంధం.. హక్కుల ఉల్లంఘనే
నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం నిర్బంధించడం హక్కుల ఉల్లంఘనే అని పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి తిరుమలయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ఈనెల 22న తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం అప్రజాస్వామికమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రజాఉద్యమాలను నిర్బంధం ద్వారా అణచివేయాలని చూస్తుండటం విడ్డూరంగా ఉందని అన్నారు.
వేలాది మంది యువకులను అరెస్టు చేయడం, ప్రొఫెసర్ కోదండరామ్‌ను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రజలు, మేధావులు ఏకమై రాజ్యాంగం కల్పించిన హక్కులను నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పౌరహక్కుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.