రంగారెడ్డి

మరో ఎంఐఎం కౌన్సిలర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 21: తాండూరు పట్టణంలో మజ్లిస్ వర్గాల ఆందోళనల ధాటికి మరో రెబల్ కౌన్సిలర్ మహ్మద్ ఆబేద్ తన పదవికి మంగళవారం సాయంత్రం తన రాజీనామా చేశారు. ఆబేద్ తమ మజ్లిస్ పార్టీ తాండూరు ఇన్‌చార్జి అబ్దూల్ హాదీ షహారీ పేరున రాసిన రాజీనామా పత్రాన్ని తనకు సమర్పించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్.సంతోష్ కుమార్ వెల్లడించారు. కౌన్సిలర్ ఆబేద్ తమకు సమర్పించిన రాజీనామా పత్రంలో తప్పు దొర్లినందున అతడి రాజీనామా పత్రం చెల్లదని కమిషనర్ వివరించారు. పార్టీ సదర్‌కు ఇవ్వాల్సిన రాజీనామా లేఖ ప్రతిని పొరపాటున తనకు ఇచ్చినట్లు భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈనెల 4న చైర్‌పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీత సంపత్‌కు ఆరుగురు మజ్లిస్ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. కాగా తాండూరు పట్టణంలో వారం రోజులుగా మజ్లిస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. రెబల్ కౌన్సిలర్లుగా ముద్రపడిన ఆరుగురు కౌన్సిలర్ పదవులకు రాజీనామా సమర్పించేంత వరకు వదిలేది లేదని పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మంకు పట్టుపట్టారు. సోమవారం పట్టణంలోని రాథోడ్ భీంసింగ్‌ను రాజీనామా చేయించారు. మంగళవారం కౌన్సిలర్ మహ్మద్ ఆబేద్ రాజీనామా చేయడంతో స్థానిక మజ్లిస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మిగతా నలుగురు ఎంఐఎం రెబల్ కౌన్సిలర్లు సైతం రాజీనామా చేసేంత వరకు విశ్రమించేది లేదని మజ్లిస్ శ్రేణులు చెబుతున్నారు. పట్టణంతోపాటు, పాత తాండూరులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మజ్లిస్ వర్గాల కదలికలపై పోలీసులు నిఘా వేశారు. తాండూరు డిఎస్పీ రామచంద్రుడు పర్యవేక్షణలో పట్టణ సిఐ ఎం.వెంకటరామయ్య బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఆరు నెలలయినా గ్యాస్ కనెక్షన్ పొందనివారికి నోటీసు: డిసిఎస్‌వో
వికారాబాద్, మార్చి 21: ఆరు నెలలకు పైబడి దీపం గ్యాస్ కనెక్షన్ పొందని లబ్ధిదారులకు చివరిసారిగా నోటీసు జారీ చేయాలని వికారాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి సి.పద్మజ సూచించారు. మంగళవారం ఎల్‌పిజి గ్యాస్ డీలర్లతో దీపం పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. నోటీసులు ఇచ్చినా తగిన సమయంలో కనెక్షన్ పొందని ఎడల కనెక్షన్‌ను రద్దు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత ఎంపిడివో ద్వారా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీలర్లు తమ వద్ద ఉన్న 50 శాతం ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్‌లను జారీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కొంతమంది లబ్ధిదారులు చాలా కాలమైనప్పటికీ తమ కనెక్షన్లు పొందేందుకు ముందుకు రావడం లేదని డీలర్లు తెలిపారు. గృహోపకరణ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లలో అనధికారికంగా వినియోగిస్తున్నారని, దీంతో కమర్షిల్ సిలిండర్ల వాడకంలో పెరుగుదల లేదని పేర్కొన్నారు. వ్యాపారం నిమిత్తం గృహోపకరణ సిలిండర్లు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పద్మజ హెచ్చరించారు.
లబ్ధిదారులు 25లోపు కిరోసిన్ పొందాలి
ఆహారభద్రత కార్డు లబ్ధిదారులందరు ఈనెల 25వ తేదీలోపు కిరోసిన్ పొందాలని, తీసుకోని ఎడల తేదీ పొడగించమని జిల్లా పౌరసరఫరాల అధికారి సి.పద్మజ సూచించారు.

భూసేకరణ చట్టం 2013
ప్రకారం నష్టపరిహారం: సిపిఐ
కొందుర్గు, మార్చి 21: భూసేకరణ చట్ట - 2013 ప్రకారం ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కొందుర్గు మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి బాబుకు వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువతో కూడిన డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. రేషన్ దుకాణాల్లో అన్ని నిత్యవసర సరుకులు లభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తొందని, దీన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బి.నర్సింలు, బాలకిష్టయ్య, యాదయ్య, దుర్గయ్య, పెంటయ్య, రాములు, సువర్ణ, నర్సమ్మ పాల్గొన్నారు.