హైదరాబాద్

రైల్వే భూముల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: మహానగరంలో నిలువ నీడలేని పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్థలాల కొరతను అధిగమించేందుకు సర్కారు కసరత్తు ముమ్మరమైంది. ఇప్పటికే నగరంలోని నాంపల్లి, సికిందరాబాద్ తదితర ప్రాంతాల్లో రైల్వే శాఖకు చెందిన ఖాళీగా ఉన్న స్థలాను ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయించాలని సర్కారు ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో ఈ భూములను డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటాయించాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఓ లేఖ రాసినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు ఇటీవలే దిల్లీలోని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయటంతో ఈ ప్రక్రియ ఊపందుకుందని చెప్పవచ్చు. ఈ మేరకు జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డిని అధికారికంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్వే శాఖకు చెందిన భూములను నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ భూముల కేటాయింపు విషయంలో త్వరితగతిన తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పటికే సికిందరాబాద్ రైల్వే స్టేషన్, చిలుకలగూడ, ఎలిఫెంటా బ్రిడ్జి సమీపంలోని చింతబావి, క్యాథలిక్ సెమెట్రీ, అడ్డగుట్ట స్లమ్ దక్షిణం వైపున్న స్థలం, మెట్టుగూడ సెయింట్ ఆంథోనీ చర్చి సమీపంలోని ఖాళీ స్థలాలను కేటాయించాల్సిందిగా ప్రతిపాదనలు సమర్పించటం జరిగిందని కమిషనర్ వివరించారు. ఈ భూముల కేటాయింపునకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే జిఎంను ఆయన కోరారు. అయితే రైల్వే భూముల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించే అంశంపై న్యూ దిల్లీలోని రైల్వే బోర్డు తగు నిర్ణయం తీసుకోవల్సి ఉందని, ఈ విషయంలో రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు కూడా సమర్పించినట్లు వినోద్‌కుమార్ కమిషనర్‌కు వెల్లడించారు.
పన్ను బకాయిలు చెల్లించాలి
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే శాఖకు చెందిన భవనాలు, కార్యాలయాలు, భూములకు సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను చెల్లించాలని కూడా జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి జిఎంకు విజ్ఞప్తి చేశారు. ఆస్తిపన్నును సేవా పన్ను రూపంలో కనీసం రూ. 2 కోట్ల వరకు బకాయిలున్నట్లు ఇవవరించారు. ఈ విషయంలో రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటామని జిఎం వినోద్‌కుమార్ కమిషనర్‌కు వివరించారు.

మెట్రోతో మినీ బస్సుల అనుసంధానం
హైదరాబాద్, మార్చి 21: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు కాలనీవాసుల డిమాండ్‌కు అనుగుణంగా మినీ బస్సులను ప్రవేశపెట్టి మెట్రోబస్సులతో అనుసంధానం చేస్తామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసి రోజుకు 828 రూట్లలో 3519 బస్సులతో 42650 ట్రిప్పులతో 33 లక్షల మందిని వారివారి గమ్యస్థానాలకు చేరుతున్నారన్నారు. పాత నగరంలో బస్సుల రూట్ నెంబర్లు ఇక మీదట తెలుగు, ఇంగ్లీష్‌తోపాటు ఉర్దూ భాషల్లో రాయిస్తామన్నారు. మంగళవారం ట్రాఫిక్ డిసిపి, నగర పోలీస్ కమిషనర్, ఆర్టీసి చైర్మన్‌తో సమావేశమయ్యారు. బస్టాండ్లలో సమయ సూచికలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పాతబస్తీలోని ఎంఐఎం ఎమ్మెల్యేల కోరిక మేరకు బండ్లగూడెంలోని రవాణాశాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఎంఐఎం దివంగత నేత సుల్తాన్ సలావుద్దీన్ పేరుపెడతామని, త్వరలో క్యాబినెట్ ఆమోదం పొందుతుందని మంత్రి వివరించారు. గ్రేటర్ పరిధిలో మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 390 ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని, వీటి సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. సికిందరాబాద్, పాతబస్తీలో రోడ్డు వెడల్పు చేసి బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, మొత్తం 450 ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అవసరమని గుర్తించినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు.