రంగారెడ్డి

సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 30: పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో శుక్రవారం నిర్వహించనున్న బడ్జెట్ సమావేశంలో ప్రతి అంశాన్ని కౌన్సిలర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని డిసిసి అధికార ప్రతినిధి జె.రత్నారెడ్డి సూచించారు. గురువారం విలేఖరులతో మాట్లాడుతూ పురపాలక సంఘం ఖర్చు, ఆదాయాలెంతో చూడాలని తెలిపారు. పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేసిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు. పురపాలక సంఘానికి విపరీతమైన ఆదాయం వస్తున్నా అభివృద్ధి మాత్రం చేయలేదని వాపోయారు. గ్రామ పంచాయతీల్లో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు, వీధిదీపాలు కనిపిస్తుండగా పట్టణంలో మాత్రం అవి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక సంఘంలో ఆదాయానికి మించి బడ్జెట్ పెడితే ఎక్కడ నుండి నిధులు తెస్తారని, పన్నులు పెంచాలని ఆలోచిస్తే ఊరుకునేది లేదని అన్నారు. పట్టణ వాసులకు పురపాలక సంఘం సేవలందించకుండా పన్నులు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసినపుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్‌రెడ్డి మంజూరు చేయించిన శాటిలైట్ టౌన్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు.
కొత్తగా ఏర్పాటు చేసిన
జిల్లాలను అభివృద్ధి చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంక్ కోసమే సిఎం కేసిఆర్.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి హడావుడిని ప్రదర్శించారని విమర్శించారు. జిల్లాలు ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, గ్రామజ్యోతితో పాటు ఇతర హామీలు అమలు కాలేదని ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని దుయ్యబట్టారు.
కందులను కొనుగోలు
చేయకపోతే ఆందోళన
ప్రభుత్వం రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. రైతులు పండించిన పూర్తి పంటను కొనుగోలు చేయకుండా నిలిపివేయడం ఎతంవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులను నాశనం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు జరిగిన మేలు శూన్యమని స్పష్టం చేశారు. గతంలో కంటే రైతులు తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై సిఎంకు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గారడీ విద్యను ప్రదర్శిస్తున్న కేసిఆర్ ఇటు రుణమాఫీ చేయకపోగా అటు వడ్డీ మాఫీ చేయలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు, ఫిట్‌మెంట్‌లు పెంచుతున్న కెసిఆర్.. పొట్టనిండా అన్నం పెట్టే రైతన్నను గాలికొదిలేశారని దుమ్మెత్తిపోశాడు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం ఏర్పాటైనా ఎక్కడా భూసార పరీక్షలు చేసిన పాపానపోలేదని, నకిలీ విత్తనాలు, మందులు అమ్ముతున్నా చర్యలేవని నిలదీశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. సింగల్‌ఫేజ్ కరంటుకే పరిమితం చేయడంతో పంటలకు నీరు అందించలేకపోతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

స్వరాష్ట్రంలోనే తెలంగాణ దేవాలయాల అభివృద్ధి
హయత్‌నగర్, మార్చి 30: ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ రాష్ట్ర దేవాలయాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలోనే సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ దేవాలయాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇంజాపూర్ గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీవెంకటేశ్వర దేవాలయం అభివృద్ధికి నోచుకోలేదని, వెంటనే ఆలయ అభివృద్ధిని చేపట్టాలని మంత్రి, ఎమ్మెల్యేలను గ్రామస్థులు కోరారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణలో పేరుప్రఖ్యాతలు ఉన్న దేవాలయాలో ఎన్నో ఉన్నాయని, ఆంధ్రా పాలకుల హయాంలో తెలంగాణ ప్రాంతంలోని ఏ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహ్మస్వామి, భద్రాద్రి శ్రీరామాలయం, బాసర సరస్వతి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి తదితర ఆలయాలు ఇప్పటికే అభివృద్ధిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో జడ్‌పిటిసి తావుల నర్సింహ్మ, ఎంపిపి గుండ్లపల్లి హరితాధన్‌రాజ్‌గౌడ్, సర్పంచ్‌లు నోముల దయానంద్‌గౌడ్, మేతరి అంజయ్య, నాయకుల జక్క రాంరెడ్డి, ధనుంజయ్యగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, నోముల కృష్ణగౌడ్, కందాడ లక్ష్మారెడ్డి, చెవుల దశరథ, కొత్తకుర్మ సత్తయ్య, కుంట్లూరు వెంకటేశ్‌గౌడ్, కందాడ బల్‌దేవ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి ఉన్నారు.