రంగారెడ్డి

పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 12: హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం నుంచి కాపాడే విధంగా పచ్చదనంతో నింపేసి పర్యావరణ సంరక్షణకు నడుం బిగించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం హరితహారంలో భాగంగా ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో జాయింట్ కలెక్టర్‌తో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షించడం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహించి భావితరాలకు స్ఫూర్తిగా నిలుద్దామని తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురువకపోవడానికి చెట్లు లేకపోవడమే ప్రధాన కారణమని, అడవులు విస్తరించి ఉన్న జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం, వాటి ప్రాధాన్యతపై అవగాహన పెంచుకొని భావితరాలకు ఉపయోగపడేందుకు మొక్కలను నాటాలని సూచించారు. మహానగరం కాలుష్యంతో నిండిపోయి నిత్యం విష పూరితమైన గాలిని పీల్చుకోవడం వల్ల వ్యాధుల భారీన పడుతున్నారని, రోగాల నుంచి బయట పడాలంటే చెట్లే ప్రధాన ఆధారమని వివరించారు. రాజకీయాలకు అతీతంగాప్రతి ఒక్కరూ ఈ హరితహార కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అమ్రపాలి, రాజేంద్రనగర్ ఆర్డీవో సురేష్ పొద్దార్, తహశీల్దార్ చంద్రశేఖర్, అత్తాపూర్ కార్పొరేటర్ రావుల విజయ జంగయ్య, మధుసూదన్‌రెడ్డి, యాదగిరి, స్వర్ణలతా భీమార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
పచ్చని చెట్లతోనే పర్యావరణ సమతుల్యత
కెపిహెచ్‌బి కాలనీ: పర్యావరణ సమతుల్యత పచ్చని చెట్లతోనే సాధ్యపడుతుందని, అందరూ విధిగా మొక్కలను నాటాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సూచించారు. మంగళవారం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని విజేత కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నిత్య జీవితంలో మనిషికి చెట్లతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పచ్చని చెట్లు మాత్రమే అందించగలవని, వర్షాలు కురిసేందుకు దోహదపడుతాయన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలని పిలుపునిచ్చారు. కేవలం మొక్కలను నాటడమే కాకుండా వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో హైదర్‌నగర్ డివిజన్ కార్పోరేటర్ జానకి రామరాజు, డిప్యూటి ప్లానింగ్ బోర్డ్ వైస్‌చైర్మన్ సంగమేశ్వర్‌రావు, డైరెక్టర్ రామ్మోహన్, సివి.రావు, కార్యదర్శి సుధీర్‌వర్మ, ప్రిన్సిపాల్ సుందరి, విద్యార్ధులు రాజా, రమ్య, కృష్ణ, భవాని, గంగా, టిఆర్‌ఎస్ నాయకులు సంజీవరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.
మొక్కలను నాటడం కర్తవ్యంగా భావించాలి..
మొక్కలను నాటడం కర్తవ్యంగా భావించి వాటి సంరక్షణకు కృషి చేయాలని అక్షర పాఠశాల సిఇఓ మదన్‌మోహన్‌రావు విద్యార్ధులకు సూచించారు. మంగళవారం కూకట్‌పల్లి సర్కిల్‌లోని మాధవరంనగర్ కాలనీలో గల అక్షర పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులతో కలిసి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలను నాటారు. మొక్కలను నాటాలి వాటిని సంరక్షించాలని నినాదాలు చేస్తూ విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేసి కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల అసోసియేట్ డైరెక్టర్ రఘుకుమారి, ప్రిన్సిపాల్ జానకి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
శంషాబాద్: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధి తొండుపల్లి గ్రామం- హనుమాన్ ఆలయంలో కలెక్టర్ మొక్కలు నాటారు. అందరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. వర్షాలు పడకపోవడానికి చెట్లు లేకపోవడమే కారణమన్నారు. హరితహారం విజయవంతానికి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రత్నం, ఎంపిడిఓ శ్రీకాంత్‌రెడ్డి, తహశీల్దార్ వెంకట్‌రెడ్డి, ఎంపిటిసి శ్రీ్ధర్, వార్డు సభ్యుడు ఎం.రవి, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా, తొండుపల్లిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ రత్నం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
రంగారెడ్డి జిల్లాలో పదికోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
రంగారెడ్డి జిల్లాలో పది కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హమీదుల్లానగర్ గ్రామంలో హరితహారం సందర్భంగా మొక్కలు నాటారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలలోని గ్రామాల్లో ప్రతి ఇంట్లో మొక్కలు నాటనున్నామని, దీనికి ప్రభుత్వ అధికారులు, ప్రజలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇంటి ముందు రెండు చెట్లు పెంచుకుంటే మనకు డాక్టరు వైద్యమే అవసరం లేదన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో పది కోట్ల మొక్కలు నాటాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎంపిపి చెక్కల ఎల్లయ్య, జడ్‌పిటిసి సతీష్, సర్పంచ్ దినకర్‌గౌడ్, చంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, రమేష్, ఎంపిడిఓ శ్రీకాంత్‌రెడ్డి, తహశీల్దార్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
అభినవ అశోకుడు కెసిఆర్
గచ్చిబౌలి: హరితహారం పేరుతో తెలంగాణలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అభినవ అశోకుడుగా మారాడని సినీనటుడు సూపర్‌స్టార్ కృష్ణ కొనియాడారు. నానక్‌రాంగూడ ప్రభుత్వ పాఠశాలలో సినీనటి విజయనిర్మల, నటుడు నరేష్‌తో కలిసి మొక్కలు నాటారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే కోట్లాది మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి పరిరక్షణ కూడా చూసుకోవాలని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ పచ్చదనమన్నా, చెట్లను పెంచడమన్నా తనకు చాలా ఇష్టమని, తమ ఇంటి ఆవరణలో 300 రకాల మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. నటుడు నరేష్ మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ పచ్చని చెట్లతో ఉద్యానవనంలా ఉండేదని, ప్రస్తుతం కాంక్రీట్ జంగల్‌గా మారిపోయిందని అన్నారు. పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలంటే మొక్కలను నాటాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సాయిబాబా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అనంతరాములు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలి
జీడిమెట్ల: ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి సాయిశేఖర్ అన్నారు. మంగళవారం గాగిల్లాపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. సాయిశేఖర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు చెట్లు అత్యంత కీలకమని అన్నారు. ప్రతి మనిషి మొక్కలను నాటడంతో పాటు బాధ్యతగా వాటిని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో పేట్‌బషీరాబాద్ ఏసిపి అశోక్‌కుమార్, దుందిగల్ సిఐ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ కెతావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సంజీవరెడ్డి పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్యనగర్‌లో హరిత హారం కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట సిఐ శ్రీనివాస్ మొక్కలను నాటారు. డివిజన్‌లోని షిరిఢీహిల్స్, పొలాలబస్తీ, మగ్దూమ్‌నగర్‌లో కార్పొరేటర్ జగన్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎస్సైలు గణేశ్, మురళి, నాయకులు మహంకాళి, లక్ష్మయ్య, సురేశ్ పాల్గొన్నారు.
వనోద్యమంలా హరితహారం
మర్పల్లి: మర్పల్లి మండలంలో మంగళవారం హరితహారం వనోద్యమంలా జరిగింది. మండలంలోని దామస్తాపూర్‌లో గ్రామసర్పంచ్ స్వరూప యాదవరెడ్డి, కొంశెట్‌పల్లిలో సర్పంచ్ శేఖర్, బూచన్‌పల్లిలో ఉపాధి హామీ ఎపిఓ శంకర్, కల్కొడలో సిఇఓ రమణారెడ్డి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, వాతావరణ సమతుల్యతకు, వర్షాలు కురవాలంటే చెట్లు విరివిగా వుండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం హరితహారం పథకాన్ని రెండవ దఫా జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిందని వారన్నారు. అందులో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పొలం గట్లపై, బీడు భూములు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడమేకాక వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు. చెట్లను పెంచితే పచ్చని వాతావరణం ఏర్పడి జంతు జీవాలకు నీరు, ఆహారం విరివిగా లభిస్తుందని, తద్వారా బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని వారన్నారు.
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
మహేశ్వరం: హరితహారం పథకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి వీలైన ప్రతిచోట మొక్కలు నాటి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా మండల పరిధిలోని రావిరాల పరిధిలో 220 కె.వి విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెట్టు వుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, చెట్లు ఎక్కడ ఎక్కువ వుంటాయో అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రతి గ్రామం చెట్లతో కళకళలాడాలన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రస్తుతం పర్యావరణ సమతుల్య లోపంవల్ల వస్తున్న మార్పులను అధిగమించడానికి హరితహారం దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే టి.కృష్ణారెడ్డి, విద్యుత్ శాఖ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు జి.రఘుమారెడ్డి, ప్రభాకర్‌రావు, డైరెక్టర్లు జగతిరెడ్డి, నర్సింగ్‌రావు, ఎస్‌ఇ శ్రీరాములు, కృష్ణారావు, ఎఇలు రాంరెడ్డి, చక్రపాణి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఐటి కారిడార్‌ను గ్రీన్‌గా మారుస్తాం
గచ్చిబౌలి: నగరంలోని ఐటి కారిడార్‌ను పచ్చదనంతో నింపేస్తామని ఐటి సెక్రటరీ జెఎస్ రంజన్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి ఇన్‌ఫోసిస్‌లో మొక్కలు నాటారు. ఐటి కారిడార్‌ను గ్రీన్ బెల్ట్‌గా మార్చేందుకు ఐదంచెల విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. గ్రీన్ బిల్డింగ్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్, ఇంకుడు గుంతలు, మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఐటి కారిడార్‌లో పది లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమం వారంరోజుల పాటు నిర్వహిస్తున్నామని, ప్రతి ఐటి ఉద్యోగి ఒక మొక్క నాటడంతో పాటు దాన్ని పరిరక్షించే బాధ్యతను తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిహబ్ సిఇఓ జయకృష్ణ, ఇన్‌ఫోసిస్ హెడ్ నరసింహ్మారావు, ఐటి ఉద్యోగులు పాల్గొన్నారు.