రంగారెడ్డి

వరద బాధితులకు ఆహార పొట్లాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 24: కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం జలదిగ్భందంలో చిక్కుకుని అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షం నీరు ఇళ్లలోకి చేరి జనజీవనం స్తంభించింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. నగరంలోని ఉప్పల్ సర్కిల్‌లోని చిల్కానగర్, ఉప్పల్, హబ్సిగూడ డివిజన్లలో లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షం నీటికి భయపడి బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వరద నీటి ఉద్ధృతితో మురికి కాలువలు పొంగిపొర్లుతూ చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయి. ఇరుకైన కాలువల కల్వర్టుపై నుంచి నీరు ఏరులై రహదార్లలో పారుతూ సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నాయి. దీంతో ఇక్కడ గుడిసెల్లో నివసిస్తున్న పేదలు నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పర్యవేక్షణలో డిప్యూటి కమిషనర్ విజయకృష్ణ, ఇతర అధికారులు బాధితులను సమీపంలోని కమ్యూనిటీ హాల్ వంటి సురక్ష ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఇళ్లు కూలి వీధిన పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు నెంబర్ 4లో బాధిత కుటుంబాలను హబ్సిగూడ రవీంద్రనగర్, గిరిజనబస్తీ కమ్యూనిటీ హాళ్లకు తరలించిన విషయం తెలిసిందే. బాధితులకు ఆహారం, నీళ్లు అందించి వౌలిక సదుపాయాలను కల్పించారు. శనివారం ఉప్పల్ పెద్దచెరువు-నల్లచెరువు మధ్యలో ఉన్న మూసీ పిల్ల కాలువ పొడవునా ఉన్న బాలాజి ఎన్‌క్లేవ్, ఈస్ట్ కళ్యాణపురి, సాయిరాంనగర్, కళ్యాణపురి, అన్నపూర్ణకాలనీ, రాఘవేంద్రనగర్, సాయిరాంనగర్, గణేష్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, భరత్‌నగర్‌లో వరద బాధితులను సురక్ష ప్రాంతాలకు తరలించి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. వరద నీటితో నిండిన మురికి కాలువలు, చెరువుల అలుగుల వద్ద ముళ్ల చెట్లు, వ్యర్థపదార్థాలు, గుర్రపుడెక్కను జెసిబి సహాయంతో తొలగించారు.
నల్లచెరువు, రామంతాపూర్ పెద్దచెరువు వద్ద స్వయంగా ఎమ్మెల్యే ప్రభాకర్ దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాలలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొని చేయూతనిస్తున్నారు. మున్ముందు వర్షాలు బాగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జాతీయ విపత్తుల బృందం రంగంలోకి దిగింది. ఎల్‌బినగర్ ఈస్ట్‌జోన్‌లోని ఉప్పల్, కాప్రా సర్కిల్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా బృందం సభ్యులు సిద్ధంగా ఉన్నారు.
కన్పించని కార్పొరేటర్లు..ప్రజల ఆందోళన
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న ఉప్పల్ సర్కిల్ లోతట్టు ప్రాంతాల ప్రజలను పలకరించే నాధుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కార్పొరేటర్లు వరద బాదితులను కనీసం పరామర్శించడమే కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్, బిజెపి నేతలు మరీ దగ్గరుండి సహాయక చర్యలు చేస్తుండగా అధికార పార్టీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు.