రుచి

తోటకూర వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరల్లో ‘రాణి’ వంటిదని తోటకూరను అభివర్ణిస్తుంటారు. దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. ఐరన్‌తో పాటు పలు పోషక విలువలున్న తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ కనీసం 200 గ్రాముల తోటకూరను తినాలని ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తుంటారు. దీన్ని తరచూ వంటల్లో వాడితే మొలల వ్యాధి, కడుపులో పురుగులు తగ్గుతాయి. రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి కోలుకున్నవారికి పైత్యానికి దీన్ని వాడతారు. దీన్ని సోయాబీన్స్‌తో కలిపి వడలు, టమాటాతో కలిపి ముద్దకూర, కాడలతో పిండి-బెల్లం కూర వంటి వంటకాలే కాకుండా పులుసు, పప్పు, పచ్చడి వంటివి మంచి రుచికరంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మామిడికాయతో దీన్ని కలిపి వండుతారు.

తెలకపిండితో
తెలకపిండి - 1 కప్పు
తరిగిన తోటకూర - 4 కప్పులు
పచ్చిమిర్చి - 5
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మినప్పప్పు, శెనగపప్పు - 2 చెంచాలు
ఎండుమిర్చి - 2
నూనె - 5 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
మెంతులు - 2 చెంచాలు
కరివేపాకు - కొంచెం
ముందుగా శుభ్రం చేసిన తెలకపిండిలో మెంతులు వేసి నీరు పోసి ఉడకనిచ్చి పక్కన పెట్టాలి. బాణలిలో పోపులు వేయించి తోటకూర, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇది మెత్తగా అయ్యాక తెలకపిండి వేసి కలపాలి. ఇది పొడి పొడిగా వచ్చేవరకు కలుపుతూ ఆ తర్వాత కిందకు దింపాలి. చల్లారాక వాసన కోసం కరివేపాకు వేయాలి.

మజ్జిగ పులుసు

తోటకూర - 4 కప్పులు
మెత్తని కాడలు - 12
పచ్చిమిర్చి - 2
మజ్జిగ - 1/2 లీ.
పెసరపప్పు - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
అల్లం - చిన్నముక్క
జీలకఱ్ఱ - 1 చెంచా
మెంతులు - 1 చెంచా
ఎండుమిర్చి - 2
నెయ్యి - 2 చెంచాలు
పసుపు - 1/2 చెంచా
కొత్తిమీర - కొంచెం

పోపులు వేయించాక తోటకూర ఆకులు, కాడలు వేసి
నీరు కలిపి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెసరపప్పు,
అల్లం, కొబ్బరి కోరు, మిర్చి, మజ్జిగ, పసుపు, ఉప్పు
కలపాలి. పొంగు వచ్చాక కిందకు దింపాలి.

మీల్‌మేకర్‌తో

మీల్‌మేకర్ ఉండలు - 24
తరిగిన తోటకూర - 5 కప్పులు
కొబ్బరి కోరు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
ఉప్పు - 1 చెంచా
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మినప్పప్పు, శెనగపప్పు - 4 చెంచాలు
ఎండుమిర్చి - 2
నూనె - 1/2 కప్పు
పసుపు - 1 చెంచా
పోపు వేయించి అందులో కొబ్బరి కోరు కలిపి విడిగా పెట్టాలి. బాణలిలో తోటకూర, ఉప్పు, పసుపు వేసి నీళ్ళు చిలకరించి మగ్గనివ్వాలి. ఇది కమ్మని వాసన వస్తుండగా నీళ్ళలో నానిన మీల్ మేకర్‌ను తోటకూరలో వేసి పోపు కలపాలి. ఇది కమ్మటి వాసన వస్తుండగా దింపాలి.

హల్వా
లేత తోటకూర ఆకులు - 4 కప్పులు
క్యారెట్ కోరు - 1 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
పంచదార - 2 కప్పులు
యాలకులు - 5
జీడిపప్పు- 24
శెనగపిండి - 1/2 కప్పు
ముందుగా తరిగిన తోటకూర ఆకులను నేతిలో వేయించాలి. ఆ తరువాత కొబ్బరి, క్యారెట్ వేపాలి. తర్వాత ఇందులో పంచదార వేసి పాకం వచ్చాక నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పువేసి బాగా కలపాలి. దీనిపై నేతిలో దోరగా వేయించిన శెనగపిండి జల్లి కలిపి దింపాలి. ఈ మిశ్రమంతో నచ్చిన ఆకృతిలో స్వీట్లు చేసుకోవచ్చు.

వేపుడు కూర

కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు
శెనగపిండి - 1 కప్పు
వేరుశెనగ పప్పు - 1 కప్పు
పచ్చిమిర్చి - 6
నూనె - 250 గ్రా.
కరివేపాకు - కొంచెం
ఉప్పు - 2 చెంచాలు
తోటకూర - 4 కప్పులు
సోయా సాస్ - 2 చెంచాలు
టమాటా సాస్,
చిల్లీ సాస్ - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
కొబ్బరి కోరు
- 5 చెంచాలు

తోటకూర ఆకులపై శెనగపిండి, సోయాపిండి, కొబ్బరి కోరు, ఉప్పు, జీలకఱ్ఱ చేర్చి నీరు కలిపి ముద్దలా చేసుకుని కాగిన నూనెలో పకోడీల మాదిరి దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత బాణలిలో మరికొంత నూనె వేసి మిర్చి, కరివేపాకు, వేరుశెనగ పప్పువేపి ముందుగా చేసుకున్న పకోడీల్లో కలపాలి. చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ కలిపాక కిందకు దింపాలి. ఈ వంటకం స్నాక్స్‌గాను, అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పులుసు
తరిగిన తోటకూర - 6 కప్పులు
ఇంగువ - కొంచెం
మెంతులు - 1/2 చెంచా
ఎండుమిర్చి - 2
నూనె - 2 చెంచాలు
వెల్లుల్లి - 12 రెబ్బలు
చింతపండు రసం - 4 కప్పులు
బెల్లం - 1/2 కప్పు
శెనగపిండి - 5 చెంచాలు
కొబ్బరి కోరు - 5 చెంచాలు
పోపులతో పాటు వెల్లుల్లి వేయించి అందులో తోటకూర, ఉప్పు వేసి మగ్గించి ఆ తర్వాత చింతపండు పులుసు కలిపి బాగా మరగనివ్వాలి. తోటకూర మెత్తగా అయ్యాక బెల్లం, పోపు కలపాలి.

-నారుమంచి వాణి