రుచి

తాజా ఆహారంతో ఆరోగ్యం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికప్పుడు తయారుచేసిన ఆహారాన్ని భుజించడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు కలుగుతుంది. తాజా ఆహారం రుచిగానే గాక, విలువైన పోషకాలు ఉన్నందున సులభంగా జీర్ణమవుతుంది. మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. నిల్వ ఉంచిన ఆహారం రుచిగా ఉండదు సరికదా పోషక విలువలు చాలావరకూ తగ్గిపోతాయి. నిల్వ చేసిన ఆహారం కొన్నిసార్లు పాడైనట్లు కనిపించకపోయినా ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపడానికి అవకాశముంది.
ఆహారం అప్పటికప్పుడు తయారుచేసుకోవడం శ్రమతో కూడిన పని అని కొంతమంది భావిస్తారు. ఈ కోవకు చెందినవారు కూరలు, చారు మొదలైనవి మూడు, నాలుగు రోజులకు సరిపడా తయారుచేసి ఫ్రిజ్‌లో నిల్వ పెట్టుకుని వాడుతూ ఉంటారు. ఇందువల్ల ఏరికోరి అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. సాధ్యమైనంతవరకు తాజా ఆహారం భుజించడం అలవరచుకోవాలి.
అప్పటికప్పుడు వండిన కూరలో ఉప్పు, కారం, నూనె తక్కువగా వాడినప్పటికీ రుచికరంగా ఉంటుందన్న విషయం నూటికి నూరుపాళ్ళు నిజం. ఎలాంటి మసాలాలు వాడకుండా తయారుచేసిన తాజా సాత్వికాహారం నోటికి రుచిగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొద్ది సమయం కేటాయించి ఏ పూటకాపూట వంటకాలు తయారుచేసుకునేందుకు కొన్ని పద్ధతులు పాటిస్తే ఎలాంటి హైరానా పడాల్సిన పనిలేదు.
దోస, బీర మొదలైన కూరగాయలను త్వరగా ముక్కలు చేసి కొద్దిసేపట్లో వండవచ్చు. పెసరపప్పు లేదా కందిపప్పులో ఏదైనా ఆకు కూర జోడించి ప్రెషర్ కుక్కర్‌లో త్వరగా రుచికరమైన పప్పు తయారుచేయవచ్చు. సన్నగా తరిగిన కీరాదోస ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి పెరుగులో కలిపితే క్షణాల్లో చక్కటి సలాడ్ తయారవుతుంది. అన్నంలో లేదా చపాతీలతో తినడానికి ఈ సలాడ్ ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను నూనెలో దోరగా వేయించి, ఉప్పు, చింతపండు జోడించి రుచికరమైన పచ్చడి కేవలం పది నిమిషాల్లో తయారుచేయవచ్చు. అలాగే, టమాటా, వంకాయ, బంగాళాదుంపలతో త్వరితంగా వంటకాలు తయారుచేయవచ్చు. మరిగిన నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాస్త వేరుశెనగ పప్పు వేసి బాగా వేగాక క్యారెట్ తురుము, పసుపు, ఉప్పు, మిరియాల పొడి కలిపి సన్నటి సెగమీద నాలుగైదు నిమిషాలు ఉడికించి దింపవచ్చు. ఈ కూర అన్నం, పూరీ, పుల్కాలకు బాగుంటుంది.
త్వరగా, రుచిగా వంట చేయడంలో కొద్దిపాటి మెళకువలు తెలుసుకుంటే మనకు నచ్చిన వాటిని కొద్ది నిమిషాల్లోనే వండుకోవచ్చు.
పాలను తోడువేసిన ఐదారు గంటలకు పెరుగు సిద్ధమవుతుంది. తాజా పెరుగు ఎంతో రుచిగా ఉంటూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగును చిలికి తయారుచేసిన పల్చటి మజ్జిగలో కొద్దిగా మెంతిపొడి కలుపుకుని తాగితే పొట్టలో హాయిగా ఉంటుంది.
పండ్లను తినాలనుకున్న సమయంలోనే వాటిని కట్ చేసుకోవాలి. కోసిన పండ్ల ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచితే అవి పోషక విలువలు కోల్పోవడమే గాక, కొన్ని సందర్భాల్లో ఆహారం విషపూరితమయ్యే అవకాశం ఉంది. నేటి ఆధునిక యుగంలో పనిఒత్తిడి కారణంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని భుజించేవారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఉద్యోగినులైనా, గృహిణులైనా కొద్దిపాటి శ్రద్ధ తీసుకుని తాజాగా వంటకాలను సిద్ధం చేసుకుంటే తమతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చు. వీలైనంతవరకు కుటుంబ సభ్యులందరూ కలిసి భుజించడం అలవరచుకోవాలి.
వంట చేయడానికి సమయం లేదన్న సాకుతో నేడు కొందరు గృహిణులు సైతం కర్రీ పాయింట్లమీద ఆధారపడుతున్నారు. కూరల తయారీలో మనం పాటించే శుభ్రతను కర్రీ పాయింట్లలో పాటించడం సాధ్యం కాదు. అక్కడ వినియోగించే వంట నూనె నాణ్యమైనది అవునో కాదో సందేహాస్పదంగానే వుంటుంది. కర్రీ పాయింట్లపైన, నిల్వ ఉంచిన పదార్థాలపైన ఆధార పడకుండా కాస్త ఓపిక చేసుకుని ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆ తృప్తి మాటలకు అందదు. ఉప్పు, కారం, మసాలాలు తగ్గించుకుని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇంటివంటకు మించిన సంతృప్తి ఎక్కడా లభించదు గనుక మనకు నచ్చినట్లు సొంతంగా వండుకుని తాజా ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎంతో ఉత్తమం.

-జి.అరుణ