రుచి

బ్రెడ్‌తో స్నాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూలు నుంచి వచ్చిన పిల్లలకు క్షణాల్లో ఆకలి తీర్చే మంత్రం ఏదైనా ఉందా? అని ప్రతి తల్లీ ఆలోచిస్తుంటుంది. అలాగే ఆఫీసు నుంచి వచ్చిన భర్తకు వేడివేడిగా, త్వరగా అయిపోయే వంటకం ఏదైనా ఉంటే బాగుండుననిపిస్తోంది కదూ.. అయితే కాస్త కొత్తగా, ఆరోగ్యంగా తిందా అనుకునేవారు బ్రెడ్‌తో చేసే వంటకాలను ట్రై చేయండి..

బ్రెడ్ పిజ్జా

కావలసిన పదార్థాలు

హోల్‌వీట్ బ్రెడ్ స్లైసులు: మూడు
చిన్న టొమాటోలు: రెండు
ఉల్లిపాయ ముక్కలు: మూడు చెంచాలు
కాప్సికమ్ తరుగు: రెండు చెంచాలు
స్వీట్‌కార్న్: నాలుగు చెంచాలు
మొజరెల్లా చీజ్: ఒకటిన్నర చెంచా
టొమాటో సాస్: మూడు చెంచాలు
పాస్తా సాస్: మూడు చెంచాలు
చాట్‌మసాలా: పావు చెంచా
బటర్: పావు చెంచా
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

బ్రెడ్ స్లైసెస్‌కి కొద్దిగా బటర్ రాసి పెనంపై రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. కాప్సికమ్ తరుగు, ఉల్లిపాయ తరుగు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్‌ను ఒక బౌల్లో తీసుకుని అందులో పాస్తా సాస్ వేసి బాగా కలపాలి.
బ్రెడ్ స్లైసెస్‌కి ఒకవైపు టొమాటో సాస్ రాసి దానిపై పాస్తా సాస్ కలిపిన కాయగూరముక్కలని పరచుకోవాలి. వీటిపై చీజ్ తురుము, ఉప్పు, చాట్‌మసాలా చల్లి ఒవెన్‌లో ఉంచాలి. చీజ్ కరిగిన తరువాత పైన మిరియాలపొడి చల్లుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ పిజ్జా రెడీ..

బ్రెడ్ పాకెట్స్

కావలసిన పదార్థాలు
ఇన్‌స్టెంట్ న్యూడుల్స్ పాకెట్: ఒకటి
బ్రెడ్ స్లైసులు: ఆరు
చీజ్: కప్పు
నూనె: వేయించడానికి సరిపడా
క్యారెట్ తురుము: చెంచా
బఠాణీలు: చెంచా
మైదాపిండి: కొద్దిగా

తయారుచేసే విధానం

ముందుగా బఠాణీలు, క్యారెట్ తురుమును వేసుకుని ఇన్‌స్టెంట్ న్యూడుల్స్‌ని మసాలాతో ఉడికించుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అంచులను తీసేసి అప్పడాల కర్రతో బ్రెడ్ స్లైస్‌లను ఒత్తుకోవాలి.
పలుచగా ఉంటే వంటకానికి వీలుగా ఉంటాయి. ఒత్తుకున్న బ్రెడ్స్‌పైన చల్లార్చుకున్న న్యూడుల్స్‌ను కొద్దిగా ఉంచి పైన చీజ్ తురుమును ఉంచాలి. తరువాత మైదాపిండిలో కొద్దిగా నీళ్లను పోసి పేస్టులా కలుపుకోవాలి. బ్రెడ్ అంచులను ఈ పేస్ట్‌తో అన్నివైపులా అంటించుకోవాలి. వీటిని నూనెలో వేయించుకుంటే చీజ్ బ్రెడ్ పాకెట్స్ రెడీ..

దహీచాట్

కావలసిన పదార్థాలు

బ్రెడ్ స్లైసులు: నాలుగు, సెనగపిండి: ఆరు చెంచాలు
నూనె: వేయించడానికి సరిపడా
పెరుగు: ఆరు చెంచాలు, చింతపండు గుజ్జు: పావు కప్పు
సన్నకారప్పూస: రెండు చెంచాలు, జీలకర్రపొడి: అరచెంచా
ఉప్పు: తగినంత, పంచదార: తగినంత
కారం: పావుచెంచా కంటే తక్కువ
నల్ల ఉప్పు: కొద్దిగా , కొత్తిమీర: ఒక కట్ట

తయారుచేసే విధానం

కడాయిలో చింతపండు గుజ్జు వేసుకుని అందులో తగినంత పంచదార, ఉప్పు వేసుకుని చిక్కగా తయారయ్యేంతవరకు ఉడికించుకోవాలి. దించేసే ముందు దీనిలో జీలకర్ర పొడి వేసుకోవాలి. తరువాత బ్రెడ్ స్లైసుల చుట్టూ అంచులను తీసేసుకోవాలి. మధ్యలోకి త్రికోణాకృతిలోకి వచ్చేట్టుగా చాకుతో కత్తిరించుకోవాలి. ఒక పాత్రలోకి సెనగపిండిని తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలి పెట్టి అందులో నూనె పోసుకుని వేడి చేయాలి. సెనగపిండి మిశ్రమంలో కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను ముంచి కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. ఇవి బంగారు రంగు వచ్చాక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తరువాత ఒక పాత్రలో పెరుగు పోసుకుని అందులో ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. వెడల్పాటి పళ్లెంలో వేయించిన బ్రెడ్ పకోడీలను పరచాలి. వీటిపై పెరుగు పోసి, పైన చింతపండు గుజ్జుని వేయాలి. ఆపై కొత్తిమీర తురుము, సన్నని కారప్పూస చల్లుకుంటే పిల్లలకు ఎంతో నచ్చే బ్రెడ్ దహీచాట్ సిద్ధం.

బ్రెడ్ క్రంబ్స్ చికెన్

కావలసిన పదార్థాలు

బోన్‌లెస్ చికెన్: పావు కిలో
బ్రెడ్ క్రంబ్స్: కప్పు
మిరియాలపొడి: చెంచా
గుడ్లు: రెండు
వెన్న: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
వెల్లుల్లి పొడి: చెంచా

తయారుచేసే విధానం

బ్రెడ్ క్రంబ్స్ మార్కెట్‌లో దొరుకుతాయి. లేదంటే మనం ఇంట్లోనే బ్రెడ్‌ను ఎండబెట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవచ్చు. బ్రెడ్ క్రంబ్స్‌లో ఉప్పు, మిరియాలపొడి, వెల్లుల్లి పొడి వేసి కలుపుకోవాలి. ఒక పాత్రలో గుడ్ల సొనను తీసుకోవాలి. ఇందులోనే వెన్నను కూడా వేసుకుని బాగా గిలక్కొట్టాలి. చికెన్‌ను కుక్కర్‌లో ఉడికించుకుని పక్కకు తీసిపెట్టాలి. కడాయిలో నూనెపోసి వేడిచేయాలి. చికెన్ ముక్కలని ముందుగా గుడ్డుసొనలో ముంచి, తర్వాత బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని బంగారు రంగు వచ్చేంతవరకు ఉంచి తీసేయాలి. నూనెలో వద్దు అనుకునేవాళ్లు గ్రిల్‌పై కూడా కాల్చుకోవచ్చు.

బ్రెడ్ బుర్జీ

కావలసిన పదార్థాలు

బ్రెడ్ స్లైసులు: పది
గుడ్లు: మూడు
ఉల్లిపాయ: ఒకటి
టొమాటో: ఒకటి
పచ్చిమిర్చి: ఐదు
కారం: చెంచా
కొత్తిమీర: కట్ట
ఉప్పు: తగినంత
నూనె: తగినంత

తయారుచేసే విధానం

బ్రెడ్ స్లైసుల చుట్టూ ఉన్న అంచులను తీసేసి వాటిని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి ఉంచి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇష్టముంటే కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. తరువాత ఇందులో ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇందులో ముక్కలుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. ఈ ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత వీటిని కడాయిలో ఓ పక్కకు ఉంచి గుడ్లను కొట్టి వేసుకుని మూడు నిముషాలు ఆగి తర్వాత బ్రెడ్‌తో కలిపి వేయించుకుని, చివరగా కొత్తిమీర చల్లుకుంటే బ్రెడ్ బుర్జీ సిద్ధం. దీన్ని వేడివేడిగా కప్పులో వేసిస్తే.. పిల్లలు ఆనందంగా తినేస్తారు.