రుచి

రకరకాల ఇడ్డెనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి ఓటు ‘ ఇడ్లీ’కే. ఇడ్లీకి ఉండే ప్రత్యేతే వేరు. ఇండియన్స్‌కి ఇంత మక్కువ పెంచిన ఇడ్లీ ఇండియాది కాదట. వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎందుకంటే ఇండియన్స్ అల్పాహారంతో ఇడ్లీ అంతగా పెనవేసుకుపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఈజీగా లభిస్తుంది ఇడ్లీ. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అనుకుంటాం. కానీ ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందట. ఒకప్పుడు ఇండోనేషియాను పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలను కనుగొన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారుచేయడం మొదలుపెట్టారట. ఈ క్రమంలో 800-1200 సంవత్సరంలో ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టిందట. ఇండియాలో తొలిసారిగా కర్నాటకలో ఇడ్లీలను తయారుచేశారని, వాటిని ‘ఇడ్డలిగే’ అని పిలిచేవారనీ.. వీటిని సంస్కృతంలో ‘ఇడ్డరికా’ అంటారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇడ్లీ గురించి ఎన్ని కథనాలున్నా ఇడ్లీ ఇండియాదేనని బలంగా నమ్ముతున్నారు భారతీయులు. అంతేకాదు ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. తేలిగ్గా అరిగిపోతాయని ప్లెయిన్ ఇడ్లీలనే రోజూ తింటే బోరు కొట్టేస్తుంది. అందుకని అప్పుడప్పుడూ వెరైటీ ఇడ్లీలను కూడా ట్రై చేయాలి. అప్పుడే పిల్లలు బోరు కొట్టకుండా ఇష్టంగా తింటారు. నేడు ఇడ్లీలలో బోలెడు రకాలు వచ్చేశాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

కాంచీపురం ఇడ్లీ

కావలసిన పదార్థాలు
మినపప్పు: అరకప్పు
బియ్యం: అరకప్పు
అటుకులు: అరకప్పు
ఉప్పుడు బియ్యం: అరకప్పు
మెంతులు: పావు చెంచా
నెయ్యి: రెండు చెంచాలు
కరివేపాకు తరుగు: రెండు చెంచాలు
ఇంగువ: పావు చెంచా
శొంఠి పొడి: చెంచా
జీలకర్ర: ఒకటిన్నర చెంచా
మిరియాలు: ఒకటిన్నర చెంచా
ఉప్పు: తగినంత
తాలింపు దినుసులు: చెంచా
తయారుచేసే విధానం
మినపప్పు, బియ్యం, ఉప్పుడు బియ్యాన్ని విడివిడిగా కడిగి, మెంతులు వేసి నీళ్లలో ఎనిమిది గంటలు నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి గరకుగా రుబ్బుకోవాలి. పది నిముషాలు నీళ్లలో నానబెట్టిన అటుకులను మెత్తగా రుబ్బుకుని మినప్పిండిలో కలపాలి. మిరియాలు, జీలకర్రను మిక్సీలో బరుకుగా పొడిలా చేసుకోవాలి. స్టవ్‌పై బాణలిని ఉంచి నెయ్యి వేయాలి. ఇది కరిగాక తాలింపు దినుసులను వేసి వేయించాలి. ఇందులోనే జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు తరుగు వేసి దింపేయాలి. ఇందులోనే ఇంగువ, శొంఠిపొడి వేసి కలపాలి. ఈ తాలింపు, సరిపడా ఉప్పు మినప్పిండిలో వేసి బాగా కలపాలి. ఈ పిండిని పదిగంటల పాటు నాననివ్వాలి. తరువాత సాధారణంగా ఇడ్లీ రేకుల్లో పెట్టినట్టుగా పెట్టి ఇరవై నిముషాలు ఆవిరిపై ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీలు కారప్పొడితో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, అల్లం పచ్చడితో కానీ బాగుంటాయి.

రైస్ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
బియ్యపురవ్వ: ఒకటిన్నర కప్పులు
పలుచని అటుకులు: కప్పు
పుల్లని పెరుగు: కప్పు
బేకింగ్ సోడా: చిటికెడు
నీళ్లు: తగినన్ని
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
అటుకుల్ని పెరుగులో వేసి ఐదు నిముషాలు నానబెట్టి గరిటతో మెత్తగా చేయాలి. ఇందులోనే బియ్యపురవ్వ వేసి కొద్దిగా సోడా, ఉప్పు వేసి బాగా కలిపి పది నిముషాలు ఉంచాలి. అటుకులు, బియ్యపు రవ్వ నీటిశాతాన్ని పీల్చేసుకోవడంతో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ రేకుల్లో పెట్టి కుక్కర్‌లో పెట్టి సుమారు పదిహేను నిముషాలు ఉడికించి దించాలి. దించేముందు ఇడ్లీలు ఉడికాయో లేదో ఓసారి వేలితో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. మృదువుగా ఉండే ఈ ఇన్‌స్టెంట్ ఇడ్లీలు అప్పటికప్పుడు పిల్లలకు చేసిపెట్టడానికి చాలా బాగుంటాయి.

రాగి ఇడ్లీ
కావలసిన పదార్థాలు
రాగిపిండి: రెండు కప్పులు
ఇడ్లీ రవ్వ: ఒక కప్పు
మినపప్పు: అర కప్పు
మెంతులు: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
మినపప్పును ఐదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఇడ్లీ రవ్వ, రాగిపిండిలను కలిపి ఒక రాత్రంతా పులియబెట్టాలి. తరువాత దీనికి ఉప్పు కలిపి ఇడ్లీల్లా పెట్టుకోవాలి. పదిహేను నిముషాలు ఉడికిన తరువాత తీసి పెరుగు చట్నీతో వడ్డించాలి.

మసాలా మినీ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
చిన్న బటన్ ఇడ్లీలు: ఇరవై
ఇడ్లీ కారం: చెంచా
కరివేపాకు కారం: చెంచా
నిమ్మరసం: రెండు చెంచాలు
నెయ్యి: మూడు చెంచాలు
పసుపు: అరచెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
స్టవ్‌పై బాణలి పెట్టి ఒక చెంచా నెయ్యి వేయాలి. ఇది కరిగాక ఇడ్లీ కారం వేయాలి. రెండు నిముషాల తరువాత పది ఇడ్లీలను ఇందులో వేసి వేయించి కొద్దిగా ఉప్పు, సగం నిమ్మరసం, కొద్దిగా పసుపు వేసి ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి కరివేపాకు కారం వేయాలి. ఇందులో మరో పది ఇడ్లీలు వేసి వేయించి మిగిలిన ఉప్పు, నిమ్మరసం, పసుపు వేయాలి. రెండు నిముషాల తర్వాత దింపేయాలి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

మేతీ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
ముడి బియ్యం: ఒక కప్పు
కొబ్బరి తురుము: ఒక కప్పు
మెంతులు: ఒక చెంచా
పెరుగు: నాలుగు చెంచాలు
బెల్లం: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా బియ్యాన్ని ఆరుగంటలపాటు నాననివ్వాలి. మరో గినె్నలో నాలుగు చెంచాల పెరుగు వేసి అందులో ఒక చెంచా మెంతులు వేసి నానబెట్టాలి. ముందుగా మెంతులను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తరువాత నానబెట్టిన బియ్యాన్ని, కొబ్బరి తురుమును మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే బెల్లం కూడా వేసి బాగా కలిపి ఆరు గంటలపాటు అలాగే ఉంచాలి. తరువాత ఇందులో మెంతి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ఇడ్లీల్లా పెట్టుకుని పదిహేను నిముషాల పాటు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన మేతీ ఇడ్లీ రెడీ. ఇవి గార్లిక్ చట్నీతో కానీ, నెయ్యి-కారప్పొడితో చాలా బాగుంటాయి.

ఓట్స్ ఇడ్లీ

కావలసిన పదార్థాలు
ముడిబియ్యం: అరకప్పు
ఓట్స్: కప్పు
ఉప్పుడు బియ్యం: కప్పు
మినపప్పు: కప్పు
మిరియాలపొడి: రెండు చెంచాలు
జీలకర్రపొడి: చెంచా
శొంఠిపొడి: చెంచా
నువ్వులనూనె: చెంచా
తాలింపుగింజలు: చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
జీడిపప్పు: పది
ఇంగువ: పావు చెంచా
తయారుచేసే విధానం
ముందుగా రెండు రకాల బియ్యం, మినపప్పు, ఓట్స్‌లను విడివిడిగా కడిగి సుమారు రెండు గంటల పాటు నానబెట్టాలి. ముందు మినపప్పును రుబ్బి, తరువాత బియ్యం, ఓట్స్ కూడా మెత్తగా రుబ్బి రెండూ కలపాలి. ఉప్పు వేసి కలిపి ఆరుగంటలపాటు పులియనివ్వాలి. మర్నాడు ఉదయం పిండిలో శొంఠిపొడి, మిరియాలపొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి దాంట్లో నువ్వులనూనె వేసి తాలింపుగింజలు, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ వేసి వేగనివ్వాలి. వేగిన తరువాత ఈ తాలింపును పిండిలో వేసి కలపాలి. ఇడ్లీ రేకులపై అరటి ఆకులను కానీ, పనస ఆకులను కానీ పెట్టి దానికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఇడ్లీల్లా వేసి ఉడికించాలి. ఆకులు లేకపోతే నేరుగా రేకులపై నెయ్యి రాసి అయినా పెట్టవచ్చు. వీటిని సుమారు పదిహేను నిముషాలు ఆవిరిపై ఉడికించి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయి.