రుచి

భల్లే.. భల్లే.. టేస్టీ.. టేస్టీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబమంతా కలిసి లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా పంజాబీ దాబా కనిపిస్తే చాలు.. నోట్లో లాలాజలం ఊరుతుంది.. మనసు లాగేస్తుంది.. కారుకు వెంటనే బ్రేకులు పడిపోతాయి.. అంతలా నోరూరించే రుచులే.. పంజాబీ వంటలు.. మరి అలాంటి వాటిలో కొన్ని వంటలను ఇంట్లో తయారుచేసి పిల్లలకు పెడితే.. ఇక వారు భల్లే.. భల్లే.. అంటూ డాన్సులు చేయరూ.. మరి అలాంటి వంటలేంటో చూద్దామా..
*
బీర చికెన్
*
కావలసిన పదార్థాలు
చికెన్: అరకిలో
పెరుగు: ఒక కప్పు
ఉల్లిపాయ: ఒకటి
నిమ్మరసం: రెండు చెంచాలు
అల్లం-వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు
రెడ్ ఫుడ్ కలర్: కొన్ని చుక్కలు
పచ్చిమిర్చి: రెండు
గరం మసాలా: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: మూడు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం గా కడిగి తడి ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, గరం మసాలాను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనికి ఫుడ్ కలర్ కూడా కలపాలి. చికెన్ ముక్కలకు గాట్లు పెట్టి నిమ్మరసం, ఉప్పు, మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. ఈ చికెన్‌ను రెండు గంటలు నాననివ్వాలి. లేదా ఒక గంట పాటు ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత చికెన్ ముక్కలను వేసి చిన్న మంటపై వేయించాలి. పది నిముషాలకొకసారి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించాలి. బాగా వేగిన తరువాత చికెన్ ముక్కలను తీసి వేరే ప్లేట్‌లో పెట్టి నిమ్మచెక్క, ఉల్లిపాయ, కొత్తిమీరలతో గార్నిష్ చేసి సాస్‌తో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమమైన బీర చికెన్ రెడీ..
*
ఫిష్ అమృత్‌సరీ
*
కావలసిన పదార్థాలు
ముళ్లు లేని చేప: అర కిలో
కారం: చెంచా
పసుపు: తగినంత
అల్లం తరుగు: ఒకటిన్నర చెంచా
వెల్లుల్లి తరుగు: ఒకటిన్నర చెంచా
పచ్చిమిర్చి: మూడు
వాము: పావు చెంచా
నిమ్మకాయ: అర చెక్క
ఉప్పు: తగినంత
బియ్యప్పిండి: రెండు చెంచాలు
శనగపిండి: రెండున్నర చెంచాలు
గుడ్డు: ఒకటి
నూనె: వేయించడానికి సరిపడా..
చాట్ మసాలా: చిటికెడు
తయారుచేసే విధానం
ఒక పాత్రలో చేపముక్కలు, నూనె తప్పించి మిగిలిన వాటన్నింటినీ వేసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి. చివరిగా చేపముక్కలు వేసి కలిపి నాలుగు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ చేప ముక్కలని నూనెలో దోరగా వేయించుకుని కొత్తిమీరతో అలంకరించుకుంటే ఫిష్ అమృత్‌సరీ తయారు.
*
సర్‌సన్ కా సాగ్
*
కావలసిన పదార్థాలు
ఆవాల ఆకులు: రెండు కట్టలు
పాలకూర: ఒక కట్ట
ఉల్లిపాయ: ఒకటి
అల్లం ముద్ద: అర చెంచా
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
పచ్చిమిర్చి: మూడు
ఎండుమిర్చి: రెండు
నెయ్యి: నాలుగు చెంచాలు
గరం మసాలా పొడి: అర చెంచా
నిమ్మరసం: అర చెంచా
నీళ్లు: అర కప్పు
జొన్నపిండి: ఒక చెంచా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. ఒక గినె్నలో ఈ ఆకుకూరలను తగినంత నీరు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు కలిసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను సన్నగా ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి వేడిచేసి ఎండుమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి పాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం ముద్ద, గరం మసాలా, జొన్నపిండి, నిమ్మరసం వేసి ఉండలు కట్టకుండా కలిపి మరి కొద్దిసేపు వేయించాలి. దీనికి ఆకుకూరల ముద్దను కలిపి నీరంతా ఇంకే వరకూ కలుపుతూ మీడియం మంటపై ఉడికించాలి. కూరంతా దగ్గరగా వచ్చాక బౌల్లోకి తీసి బటర్‌తో గార్నిష్ చేసుకోవాలి. అంతే వేడివేడి సర్‌సన్ కా సాగ్ రెడీ.
*
దాల్ మఖనీ
*
కావలసిన పదార్థాలు
రాజ్మా: పావు కప్పు
మినపప్పు: పావు కప్పు
పెసరపప్పు: అర కప్పు
ఉప్పు: రుచికి తగినంత
కారం: అర చెంచా
గరం మసాలా: పావు చెంచా
పసుపు: చిటికెడు
క్రీమ్: రెండు చెంచాలు
బటర్: మూడు చెంచాలు
టొమాటోలు: మూడు
ఉల్లిపాయ: ఒకటి
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక చెంచా
జీలకర్ర: ఒక చెంచా
ఎండుమిర్చి: మూడు
పచ్చిమిర్చి: మూడు
కొత్తిమీర: ఒక కట్ట
తయారుచేసే విధానం
ముందుగా పప్పులన్నింటినీ కలిపి శుభ్రంగా కడిగి మూడు, నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను తరిగి పెట్టుకోవాలి. టొమాటోలను శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నానిన పప్పులకు తగినంత నీరు చేర్చి ప్రెషర్ కుక్కర్‌లో ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత కుక్కర్ మూత తీసి పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి టొమాటో పేస్ట్, క్రీమ్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కలిపి మళ్లీ ఉడికించుకోవాలి. క్రీమంతా పైకి తేలే వరకు ఉడికించి వేరే గినె్నలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి వేడిచేసి అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర వేసి వేయించాలి. పచ్చిమిర్చి మధ్యలోకి నిలువుగా కట్‌చేసి నూనెలో వేయాలి. తరువాత ఎండుమిర్చి కూడా వేసి రెండు నిముషాలు వేయించాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు కూడా కలపాలి. అన్నీ వేగిన తర్వాత ఈ పోపును ముందే ఉడికించుకున్న పప్పులో కలిపి కొత్తిమీర, బటర్‌తో అలంకరించుకుంటే పంజాబ్ దాల్‌మఖనీ తయారైనట్లే.. ఇది చపాతీల్లోకి కానీ, అన్నంతో కానీ రుచిగా ఉంటుంది.
*
దాల్ ఫ్రై తడకా
*
కావలసిన పదార్థాలు
కందిపప్పు: కప్పు
పెసలు: అర కప్పు
సెనగపప్పు: మూడు చెంచాలు
టొమాటోలు: రెండు
ఉల్లిపాయలు: రెండు
పచ్చిమిర్చి: రెండు
అల్లం ముక్క: చిన్నది
నూనె: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
ధనియాలపొడి: చెంచా
కారం: చెంచా
తాలింపుకోసం
నెయ్యి: రెండు చెంచాలు
ఆవాలు: పావు చెంచా
జీలకర్ర: పావు చెంచా
ఇంగువ: కొద్దిగా
కరివేపాకు: రెండు రెబ్బలు
ఎండుమిర్చి: మూడు
కొబ్బరి చిప్ప: ఒకటి
తయారుచేసే విధానం
కందిపప్పు, పెసలు, సెనగపప్పుని గంటపాటు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, అల్లం వెల్లుల్లిలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కుక్కర్‌లో చెంచా నూనె వేసి అల్లం వెల్లుల్లి తరుగుని వేసి వేయించుకోవాలి. అవి కమ్మని వాసన వచ్చాక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇందులో నానబెట్టిన పప్పులు, సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి అందులో మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేయించి పప్పులో వేయాలి. తరువాత ధనియాలపొడి, కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలపాలి. దీన్ని స్టవ్‌పై ఉంచి మంట తగ్గించాలి. ఇప్పుడు కొబ్బరి చిప్పని గ్యాస్ స్టవ్‌పై కాల్చి ఒక చిన్న స్టీల్ గినె్నలోకి తీసుకోవాలి. ఈ గినె్నని కుక్కర్‌లో ఉంచి దానిపై చెంచా నెయ్యి వేసి ఒక నిముషం మూత పెట్టి తీసేస్తే చాలు. అంతే దాల్ ఫ్రై తడకా తయారు.
*
మసాలా ఆలూ కుల్చా
*
కావలసిన పదార్థాలు
గోధుమపిండి లేదా
మైదా: నాలుగు కప్పులు
ఆలు: నాలుగు
పెరుగు: ఒక కప్పు
బేకింగ్ సోడా: అర చెంచా
పచ్చిమిర్చి: నాలుగు
జీలకర్రపొడి: ఒక చెంచా
ఉప్పు: తగినంత
కొత్తిమీర: కట్ట
గరం మసాలా: ఒక చెంచా
నెయ్యి: అర కప్పు.. నూనె: రెండు చెంచాలు
తయారుచేసే విధానం
ముందుగా వెడల్పాటి గినె్నలో గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ సోడా కలపాలి. దీనిలో పాలు, పెరుగు వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి చపాతీపిండిలా కలిపి తడిబట్ట కప్పి పక్కన పెట్టుకోవాలి. ఆలూను ఉడికించి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె వేసి వేడి కాగానే పచ్చిమిర్చి, జీలకర్రపొడి, గరం మసాలా వేసి వేయించాలి. దీనికి ఆలూ ముద్ద, ఉప్పు, కొత్తిమీర వేసి ఐదు నిముషాలు వేయించి దించాలి. కూర చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఉండలుగా చేసుకుని చిన్న చిన్న పూరీల్లా వత్తాలి. దీంట్లో ఆలూ మిశ్రమాన్ని పెట్టి అంచులను మూసేసి జాగ్రత్తగా చపాతీలా వత్తాలి. దీన్ని పెనంపై వేసి నెయ్యితో ఎర్రగా కాల్చుకుంటే.. వేడి వేడి మసాలా ఆలూ కుల్చా రెడీ.. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
*
దాబా ఎగ్‌బుర్జి
*
కావలసిన పదార్థాలు
గుడ్లు: ఆరు
పావ్‌బాజీ మసాలా: చెంచా
ఉల్లిపాయలు: మూడు
టొమాటోలు: రెండు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం ముక్క: చిన్నది
వెన్న: రెండు చెంచాలు
నూనె: రెండు చెంచాలు
ఉప్పు: తగినంత
కారం: చెంచా
పసుపు: పావు చెంచా
కొత్తిమీర: ఒక కట్ట
తయారుచేసే విధానం
వెడల్పాటి పాన్‌లో నూనె పోసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కాసింత వెన్న వేసి వేయించుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, పావ్‌బాజీ మసాలా వేసుకోవాలి. అన్నీ బాగా వేగి పచ్చి వాసన పోయిన తరువాత చివరిగా గుడ్లు కొట్టి వేసుకుని బాగా వేయించుకుంటే దాబా బుర్జీ రెడీ.. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
*
టిండా
*
కావలసిన పదార్థాలు
పెసరపప్పు: ఒక కప్పు
సొరకాయ: 300 గ్రాములు
పసుపు: అర చెంచా
కారం: తగినంత
జీలకర్ర: అర చెంచా
ఉప్పు: తగినంత
నూనె: తగినంత
కరివేపాకు: గుప్పెడు
పోపు గింజలు: ఒక చెంచా
తయారుచేసే విధానం
పెసరపప్పును పది నిముషాలపాటు నీళ్లలో నానబెట్టాలి. ఈ లోపల సొరకాయ చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత పప్పును వాడ్చి నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడిచేసి పెసరపప్పును వేయించాలి. దీనికి సొరకాయ ముక్కలు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి వేయించాలి. దీనికి కొద్దిగా నీళ్లు కలిపి ప్రెషర్ కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇది చల్లారిన తరువాత పోపు పెట్టి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే పంజాబీ టిండా రెడీ.