రుచి

టేస్టీ.. టేస్టీ.. కేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలంటే తల్లులకు కత్తిమీద సామే. ఎందుకంటే వారికి పెట్టిన డబ్బా ఒక్కరోజు కూడా ఖాళీగా రాదు. మరికొంతమంది పిల్లలైతే డబ్బాలో పెట్టింది పెట్టినట్లు ఇంటికి తీసుకువస్తారు. కారణం రోజూ అదే టిఫినా.. బోర్ కొడుతోంది అంటారు. అలాంటి పిల్లల కోసమే ఈ కేకులు. ఇంట్లో రకరకాల పండ్లతో తయారుచేసే ఈ కేకులతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. పిల్లలకు ఎంతో సరదా. ఇవి లంచ్ బాక్స్‌లో పెడితే ఇంటికి ఖాళీ డబ్బాలు రావలసిందే.. పిల్లలు భలేగా ఇష్టపడే అలాంటి కేకులను తయారుచేయాలంటే తయారీ విధానాన్ని చూడాలి కదూ.. మరి ఆ కేకులను ఒకసారి చూసేద్దామా..

కొబ్బరి రైస్ కేక్

కావలసిన పదార్థాలు
బియ్యం: రెండు కప్పులు
మంచినీళ్లు: రెండున్నర కప్పులు
కొబ్బరిపాలు: పావు లీటరు
పంచదార: ఒకటిన్నర కప్పులు
కొబ్బరి తురుము: కప్పు
తయారుచేసే విధానం
ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి బియ్యంలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికించిన అన్నంపై మూతపెట్టి ఉంచాలి. తరువాత ఒక పాన్‌లో కొబ్బరిపాలు, పావు కప్పు పంచదార వేసి కలుపుతూ సుమారు ఐదు నిముషాల పాటు ఉడికించాలి. పంచదార కరిగిన తరువాత దించి ఉడికించిన అన్నంలో వేసి బాగా కలపాలి. ఇందులోనే అరకప్పు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు కేకు టిన్నులో వెన్న లేదా నెయ్యి రాసి దానిపై ఒక చెంచా కొబ్బరిపొడి, ఒక చెంచా పంచదార చల్లాలి. దానిపై కేకు మిశ్రమాన్ని వేసి 180 సెంటిగ్రేడు డిగ్రీల దగ్గర సుమారు 45 నిముషాల పాటు బేక్ చేసి తీయాలి. ఈలోగా విడిగా ఒక పాన్‌లో మిగిలిన కొబ్బరి, పంచదార వేసి సిమ్‌లో వేయించాలి. కొబ్బరి మంచి వాసన వస్తుండగా దించి దీన్ని వేడి కేకుపై చల్లాలి. దీన్ని ఓ అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లగా అయ్యాక కేకుల్లా కోసం సర్వ్ చేయాలి.

కివీ కేక్

కావలసిన పదార్థాలు
మైదా: కప్పు
కివీ ముక్కలు: కప్పు
వెన్న: కప్పు
బేకింగ్ పొడి: ఒకచెంచా
బేకింగ్ సోడా: ఒకచెంచా
కోడిగుడ్లు: రెండు
వెనిల్లా ఎసెన్స్: ఒకచెంచా
ఐసింగ్ షుగర్: కప్పు
బ్రౌన్ షుగర్: రెండు చెంచాలు
చెర్రీస్: అరకప్పు
తయారుచేసే విధానం
ఒక గినె్నలో వెన్న, ఐసింగ్ షుగర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదే మిశ్రమంలో గుడ్ల సొన, మైదా, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా వేసి ఉండలు లేకుండా మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు కేకు పాత్రను తీసుకుని అందులో బ్రౌన్ షుగర్‌ను చల్లి కివీ ముక్కలను అమర్చుకోవాలి. అనంతరం ముందుగా తయారుచేసి పెట్టుకున్న కేకు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ పాత్రను ఒవెన్‌లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నలభై నిముషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై చెర్రీస్‌తో అలంకరించుకుంటే ఎంతో రుచికరమైన కివీ కేక్ రెడీ.
కేక్ బాల్స్

కావలసిన పదార్థాలు
కేకు పొడి: అరకిలో
మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్: 200 గ్రాములు
కకోవా పొడి: 50 గ్రాములు
కొబ్బరిపొడి: పావు కిలో
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదాం, కిస్‌మిస్..
తయారీ విధానం
ముందుగా ఓ గినె్నలో ఫ్రూట్ జామ్‌ను తీసుకుని గరిటతో గిలకొట్టినట్లు బాగా కలపాలి. అప్పుడు అది క్రీములా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో గినె్నలో కేకుపొడిని తీసుకోవాలి. దీనిలో కకోవా పొడి, కొబ్బరిపొడి వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో క్రీములా తయారైన జామ్ కూడా వేసి ముద్దలా కలపాలి. అవసరమైతే ముద్ద కట్టడానికి కొద్దిగా పాలను కూడా కలపచ్చు. దీన్ని ఓ అరగంటసేపు నాననిచ్చి తరువాత డ్రైఫ్రూట్స్ వేసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని చివరగా కొబ్బరిపొడిలో దొర్లిస్తే కేక్‌బాల్స్ రెడీ.
రెడ్ వెల్వెట్ కేక్

కావలసిన పదార్థాలు
మైదా: అరకప్పు
మొక్కజొన్న పిండి: పావుకప్పు
చాక్లెట్ పొడి: పావుకప్పు
పంచదార: అరకప్పు
కోడిగుడ్డు: ఒకటి
మజ్జిగ: పావుకప్పు
వెన్న: రెండు టేబుల్ స్పూన్లు
వెనిగర్: అరచెంచా
వంటసోడా: పావుచెంచా
ఎరుపు రంగు: చిటికెడు
వెనీలా ఎసెన్స్: అరచెంచా
తయారీ విధానం
ముందుగా ఒక గినె్నలో కోడిగుడ్డు, మైదా, మొక్కజొన్న పిండి, పంచదార, ఎరుపురంగు, చాక్లెట్ పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. తరువాత ఇందులో వెనె్న, వెనీలా ఎసెన్స్, మజ్జిగ, వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న పూసిన కేకు పాత్రలో వేసి 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇరవై నిముషాల పాటు బేక్ చేసుకుంటే చాలు పిల్లలు ఎంతో ఇష్టపడే రెడ్ వెల్వెట్ కేక్ రెడీ.

నట్టీ ఫ్లోరెంటైన్

కావలసిన పదార్థాలు
ఉప్పు కలిపిన వెన్న: రెండున్నర కప్పులు
పంచదార: ముప్పావుకప్పు
బాదం ముద్ద: చెంచా
మైదా: కప్పు
బియ్యప్పిండి: అరకప్పు
వేయించిన బాదం పలుకులు: రెండు చెంచాలు
వాల్‌నట్ పలుకులు: పావుకప్పు
ఎండు చెర్రీలు: పావుకప్పు
తయారుచేసే విధానం
ముందుగా బేస్ తయారుచేసుకోవాలి. ముప్పావు వంతు వెన్న, సగం పంచదార ఒక గినె్నలోకి తీసుకుని రెండింటినీ కలపాలి. అందులో బాదం ముద్ద, మైదా, బియ్యప్పిండి వేసి ముద్దలా అయ్యేవరకు కలిపి అరగంట ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాత్రలో తీసుకుని ఒవెన్‌లో ఇరవై అయిదు నిముషాల వరకూ బేక్ చేయాలి. ఇప్పుడు అది కేక్‌లా తయారవుతుంది. ఇంతలో మిగిలిన వెన్న, పంచదార, విడిగా పెట్టుకున్న చెంచా మైదాను తీసుకుని కలపాలి. ఇందులో బాదం పలుకులు, వాల్‌నట్ పలుకులు, ఎండు చెర్రీలు వేసుకుని కలపాలి. కేక్‌పై ఈ మిశ్రమాన్ని పూతలా వేసి మరో పదిహేను నిముషాలపాటు బేక్ చేసుకోవాలి. దీన్ని అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి ముక్కల్లా కోస్తే సరిపోతుంది.

చాక్లెట్ కేక్

కావలసిన పదార్థాలు
మైదా: ముప్పావుకప్పు
బేకింగ్ పౌడర్: అరచెంచా
ఉప్పు: అరచెంచా
గుడ్లు: ఐదు
పంచదార: కప్పు
తీపిలేని చాక్లెట్: రెండు పెద్ద ముక్కలు
నీళ్లు: రెండు చెంచాలు
ఐసింగ్ పంచదార: అరకప్పు
డార్క్ చాక్లెట్: నాలుగు పెద్ద ముక్కలు
క్రీం చీజ్: ఒక చిన్న ప్యాకెట్
వెనిల్లా ఎసెన్స్: అరచెంచా
తయారుచేసే విధానం
ముందుగా ఒవెన్‌ని 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి పెట్టుకోవాలి. ఒక గినె్నలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లించి పెట్టుకోవాలి. మరో గినె్నలో గుడ్ల సొన తీసుకుని క్రీములా తయారయ్యేవరకు గిలక్కొట్టాలి. అందులో ముప్పావుకప్పు పంచదార వేసి అది కరిగేవరకూ కలపాలి. తరువాత మైదా వేయాలి. ఇప్పుడు చాక్లెట్‌ను కరిగించుకోవాలి. అంటే ఒక గినె్నలో సగం వరకూ నీళ్లు తీసుకుని స్టవ్‌పై పొయ్యిపై పెట్టాలి. అందులో చాక్లెట్ ముక్కలున్న గినె్నను ఉంచాలి. అది కరిగాక నీళ్లు, మిగిలిన పంచదార వేసి కలిపి దింపేయాలి. దీన్ని మైదా మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదా చల్లిన కేక్ పాన్‌లో తీసుకుని ఒవెన్‌లో ఉంచాలి. పద్దెనిమిది నుంచి ఇరవై నిముషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. ఇది చల్లారేలోగా దీనిపై పూత తయారుచేసుకోవాలి. డార్క్ చాక్లెట్‌ను ఒక గినె్నలో తీసుకుని స్టవ్‌పై ఉంచాలి. అది కరిగాక దింపేసి క్రీం చీజ్, వెనిల్లా ఎసెన్స్, ఐసింగ్ షుగర్ వేసి క్రీములా తయారయ్యేవరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ అంతా పట్టిస్తే సరిపోతుంది. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ పలుకులు వేసుకోవచ్చు.