రుచి

వహ్వా.. వహ్వా.. 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాయగూరలను, చికెన్ వంటి వాటిని కూరలుగా కానీ, ఇగుర్లుగా కానీ చేస్తే పిల్లలు ముఖాన్ని పక్కకు తిప్పేసుకుంటారు. అదే వీటిని డ్రై ఐటమ్స్‌లా, స్టాటర్స్‌లా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా 65లా చేస్తే వారు ఎంత ఇష్టంగా తింటారో.. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తరువాత కానీ, సెలవురోజుల్లో కానీ పిల్లలకు ఇలాంటి ఐటమ్స్ చేసి పెడితే వారు లొట్టలు వేసుకుంటూ తింటారు. అంతేకాదు ఎంతో ఆరోగ్యం కూడా.. మరి వాటి తయారీ విధానం చూసేద్దామా!

మష్రూమ్‌తో..

కావలసిన పదార్థాలు
మష్రూమ్స్: 200 గ్రాములు
మైదా: మూడు చెంచాలు
కార్న్‌ఫ్లోర్: ఒక చెంచా
మిరియాల పొడి: పావు చెంచా
నూనె: ఒక చెంచా
ఉల్లి తరుగు: రెండు చెంచాలు
వెల్లుల్లి తరుగు: ఒక చెంచా
టొమాటో కెచప్: ఒక చెంచా
చిల్లీ గార్లిక్ సాస్: ఒక చెంచా
చైనీస్ చిల్లీ సాస్: ఒక చెంచా
సోయాసాస్: అర చెంచా
వెనిగర్: ఒక చెంచా
మిరియాల పొడి: పావు చెంచా
ఉల్లికాడలు: ఒక చెంచా
తయారుచేసే విధానం
కప్పు నీటిలో మైదా, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు వేసి చిక్కగా కలపాలి. మష్రూమ్స్‌ను శుభ్రం చేసుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి నూనె పోసి వేడిచేయాలి. శుభ్రం చేసుకున్న మష్రూమ్స్‌ను మైదా జారులో ముంచి కాగిన నూనెలో వేయాలి. ఇలా అన్నింటినీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిని తీసుకుని అందులో ఒక స్పూన్ నూనె వేసి అందులో ఉల్లి, వెల్లుల్లి తరుగు వేసి అర నిముషం పాటు వేయించి టొమాటో కెచప్, చిల్లీ గార్లిక్ సాస్, చైనీస్ సాస్, మిరియాలపొడి, ఉప్పు, వెనిగర్‌లతో పాటు కొద్దిగా నీరు పోయాలి. నిముషం పాటు వేగిన తరువాత ఇందులో వేయించి ఉంచుకున్న మష్రూమ్స్‌ను వేసి వేయించాలి. మష్రూమ్స్‌కు సాస్ బాగా పట్టిన తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని ఉల్లికాడల తరుగుతో అలంకరించాలి.

బేబీకార్న్‌తో..

కావలసిన పదార్థాలు
బేబీకార్న్: పది
కార్న్‌ఫ్లోర్: నాలుగు చెంచాలు
బియ్యప్పిండి: ఒక చెంచా
మైదా: ఒక చెంచా
వంటసోడా: చిటికెడు
ఉప్పు: తగినంత
కారం: రెండు చెంచాల
అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా
కరివేపాకు: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నను తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్, మైదా, బియ్యప్పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, వంటసోడా వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మందబాటి బాణలిని స్టవ్‌పై ఉంచి, అందులో నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తరువాత బేబీకార్న్ ముక్కలను కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చిన తరువాత తీసేయాలి. దీనిపై వేయించిన కరివేపాకు వేసి సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

కాలీఫ్లవర్‌తో..

కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్: మీడియం సైజుది
కార్న్‌ఫ్లోర్: నాలుగు చెంచాలు
గట్టి పెరుగు: రెండు చెంచాలు
వంటసోడా: చిటికెడు
ఉప్పు: తగినంత
కారం: రెండు చెంచాలు
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక చెంచా
కరివేపాకు: కొద్దిగా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
కాలీఫ్లవర్‌ను విడదీసి మరుగుతున్న నీటిలో రెండు నిముషాల పాటు ఉంచి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. గినె్నలో మొక్కజొన్న పిండి, పెరుగు, వంటసోడా, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి అందులో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మందపాటి బాణలిని స్టవ్‌పై ఉంచి నూనె పోయాలి. నూనె కాగిన తరువాత కాలీఫ్లవర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకోవాలి. ఇది వేడివేడిగా సాయంత్రం స్నాక్స్‌లా తింటే చాలా బాగుంటాయి.

బ్రెడ్‌తో..

కావలసిన పదార్థాలు
బ్రెడ్: నాలుగు స్లైసులు
ఉల్లిపాయ: ఒకటి
మిర్చి: నాలుగు
క్యారెట్ తురుము: కొంచెం
క్యాప్సికం: ఒకటి
ఉప్పు: తగినంత
కారం: తగినంత
పెరుగు: ఒక కప్పు
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు
కరివేపాకు: రెండు రెబ్బలు
నూనె: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా బ్రెడ్ స్లైసెస్‌ని నీళ్లలో వేసి వెంటనే పిండి ఒక గినె్నలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి, క్యాప్సికం, క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. తరువాత బాణలిని స్టవ్‌పై ఉంచి నూనెను పోయాలి. ఇది కాగాక చేసి పెట్టుకున్న ఉండలు వేసి వేయించాలి. ఇవి ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై అంతా ఇగిరిపోయి పొడిపొడిగా అయ్యేవరకూ వేయించాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

పనీర్‌తో..

కావలసిన పదార్థాలు
పనీర్ ముక్కలు: పది
ఉల్లిపాయలు: పావుకప్పు
పచ్చిమిర్చి తరుగు: అర చెంచా
కొత్తిమీర తరుగు: పావు కప్పు
మైదా: ఒక చెంచా
కార్న్‌ఫ్లోర్: ఒక చెంచా
అల్లం పేస్ట్: ఒక చెంచా
కారం: తగినంత
పసుపు: అర చెంచా
గరం మసాలా: అర చెంచా
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
వెడల్పాటి గినె్నలో కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో కొద్ది నీరు పోసి కలపాలి. బాణలిలో నూనె వేసి వేగాక, పనీర్ ముక్కల్ని కార్న్‌ఫ్లోర్ పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బాణలిని స్టవ్‌పై ఉంచి ఒక చెంచా నూనె వేసి కాగాక, అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్ 65 సిద్ధం. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

చికెన్‌తో..

కావలసిన పదార్థాలు
బోన్‌లెస్, స్కిన్‌లెస్ చికెన్: పావు కిలో
ఉల్లిపాయలు: అర కప్పు
పచ్చిమిర్చి తరుగు: ఒక చెంచా
కొత్తిమీర తరుగు: అర కప్పు
మైదా: రెండు చెంచాలు
కార్న్‌ఫ్లోర్: నాలుగు చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక చెంచా
కారం: తగినంత
పసుపు: ఒక చెంచా
గరం మసాలా: ఒక చెంచా
నూనె: వేయించడానికి సరిపడా
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ముందుగా చికెన్‌ను బాగా శుభ్రం చేసుకోవాలి. దీన్ని ఒక వెడల్పాటి గినె్నలోకి తీసుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకుని రెండు గంటలపాటు పక్కన ఉంచాలి. తరువాత బాణలిని స్టవ్‌పై ఉంచి నూనె పోసుకోవాలి. నూనె కాగాక కలిపి పక్కన ఉంచుకున్న చికెన్‌ను వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకుని పక్కకు తీసి ఉంచుకోవాలి. తరువాత మరో బాణలిని స్టవ్‌పై ఉంచి ఒక చెంచా నూనె వేసి పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించాలి. తరువాత ఇందులో వేయించి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసి బాగా వేయించి చివరగా కొత్తిమీర తరుగు వేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.