రుచి

నోరూరించే రంజాన్ వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజాన్ అంటేనే వీధుల్లో సందడి నెలకొంటుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన షాపుల్లో నోరూరించే వంటకాలు కనువిందు చేస్తుంటాయి. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు పవిత్రమైంది. రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటారు.

పనీర్ పుదీనాకి చీక్

కావలిసిన పదార్థాలు
ఒక కప్పు పనీర్ ముక్కలు
ఒక కట్ట పుదీన
పావు చిన్న చెంచా షాజీర
ఉడికించిన క్యారట్ ముక్కలు
పెద్ద చెంచా బీన్స్ ముక్కలు
ఒక కప్పు ఉడికించిన బంగాళా దుంప ముక్కలు
ఒక పెద్ద చెంచా సన్నగా తరిగిన పచ్చి మిరపకాయ ముక్కలు
రుచికి తగినంత ఉప్పు
ఒక కప్పు పెరుగు
సరిపడా నూనె
ముందుగా పన్నీర్‌ని సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద కళాయిని పెట్టి అందులో సరిపడా వంట నూనె పోసి బాగా కాగాక అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కాయగూర ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అందులోనే పన్నీర్ తురుము, సరిపడా ఉప్పు, షాజీరాని వేసి బాగా కలుపుకొని దించుకోవాలి. ఇది చల్లారాక దీన్ని గరిటెతో మెత్తగా చేసుకొని తందూరి ఊచ (చీక్)కి చుట్టి పెట్టాలి. చికెన్ తందూరిని వేయించినట్టు దీన్ని కూడా వేయించాలి. బాగా వేగిన తరువాత పైన పెరుగు రాయాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సాస్‌తో కానీ పుదీనా పచ్చడితోగాని తింటే చాలా రుచిగా ఉంటుంది.
**

నల్ల మిరియాల కోడి కూర

ఎముకలు లేని చికెన్ ముక్కలు 250 గ్రాములు
కరివేపాకు ఒక గుప్పెడు
నూనె రెండు టేబుల్ స్పూన్
బ్లాక్ ఆవాలు చిన్నచెంచా
పావు టీస్పూన్ సోంపు
రెండు వెల్లుల్లి ముక్కలు
ఒక స్పూన్ తురిమిన అల్లం లేదా చిన్న ముక్కలుగా కత్తిరించి
కప్పు ఉల్లిపాయ ముక్కలు
ఒక స్పూన్ టమోటా పేస్ట్
మసాలా దినుసులు
చిన్న చెంచా జీలకర్ర
చిన్న చెంచా ధనియాలు
ఒకటి లేదా రెండు ఎండు మిర్చి
నల్ల మిరియాలు ఒక టీ స్పూన్
దాల్చిన చెక్కముక్కలు
ఆకుపచ్చ ఏలకులు
ముందుగా మసాలా దినుసులను ఒక పాన్‌లో వేసి వేయించుకొని దించి చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తరువాత మిక్సిలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద పెద్ద పాన్ పెట్టి అందులో నూనె వేసి సన్నని మంట మీద వేడి చేసి అందులో ఆవాలు సొంపు వేసి కలిపిన తరువాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న గరం మసాలాను వేసి పది నిమిషాల పాటు వేయించుకోవాలి. అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్దను వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోధుమ రంగు వచ్చాక అందులో టమాట పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా అందులో చికెన్ ముక్కలు వేసి కాసేపు వేయించిన తరవాత అందులో ఒక కప్పు నీళ్లు వేసి సన్నని మంట మీద పెట్టి 20 నిమిషాల సేపు అంటే కోడికూర ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ సందర్భంగా ప్రతి 3 నుంచి 4 నిమిషాల లోపు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి.
**
ఇంట్లోనే నోరూరించే హలీం

కావలసినవి
2 కేజీల మాంసం
3 కప్పులు పలుకుల్లా చేసుకున్న గోధుమలు
4 పెద్ద చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద
1/2 కప్పు మినపప్పు
1/2 కప్పు సెనగపప్పు
1 1/2 కప్పు పెరుగు
1 కప్పు వేయించిన ఉల్లిపాయలు
1/2 కప్పు జీడిపప్పు
చెంచా సాజీర
2 యాలకులు
50 గ్రాముల గులాబీ రేకలు
2 లవంగాలు
ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క (లవంగాలు, దాల్చిన చెక్కలను పొడి చేసుకోవాలి)
1 చెంచా మిరియాలు
2 అంగుళాల దాల్చిన చెక్క
3 లవంగాలు
2 యాలకులు
1/2 కప్పు కొత్తిమీర తరుగు
1/4 కప్పు పుదీనా ఆకులు
6 పచ్చిమిర్చి
రుచికి తగినంత ఉప్పు
1/2 కప్పు నూనె
పోట్లీ మసాలా కొద్దిగా (వేడి నీళ్ళలో వేసుకోవాలి. బయట దొరుకుతుంది)
ముందుగా గోధుమల్ని అరగంటసేపు నీటిలో నానపెట్టుకోవాలి. తరువాత మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, చెంచా ఉప్పు వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఒక పాత్రను తీసుకొని అందులో గోధుమలు, పప్పులు, నాలుగు పచ్చిమిర్చి, అర చెంచా మిరియాలు, 8 నుంచి 10 కప్పుల నీళ్ళను పోసుకుని అరగంట సేపు ఉడకపెట్టుకోవాలి. మాంసాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసుకొని అది వేడి అయిన తరువాత అందులో మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, గులాబీ రేకలు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న మాంసం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని వేయించాలి. 5 నిమిషాలు అయ్యాక పెరుగును వేసి 15 నిమిషాలపాటు వేయించుకోవాలి. తరువాత ఇందులో 3 కప్పుల పోట్లీ మసాలా మరియు నీళ్లను పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గోధుమ మిశ్రమంలో నెయ్యి , ఉప్పు వేసి అరగంటపాటు దమ్ చేసుకుంటే హలీమ్ సిద్ధమైనట్లే.
**

షీర్ కుర్మా

ఒక చిన్న సన్నని సేమియా ప్యాకెట్
ఒక లీటరు వెన్న తీయని పాలు
ఒక కప్పు పంచదార
20 యాలకులు
ఒక కప్పు బాదం, పిస్తా, జీడిపప్పు
ఒక కప్పు మిల్క్‌మెయిడ్
అర చెంచా కుంకుమ పువ్వు
1/2 కప్పు ఎండుద్రాక్ష
10 గ్రాములు తరిగిన ఖర్జూరం పలుకులు
ఒక పెద్ద చెంచా నెయ్యి
కొంచెమంత వెన్న
బాణలిలో వెన్న తీసుకొని అందులో సేమియాని 2 నుంచి 3 నిమిషాలపాటు వేయించుకొని అందులో పావు కప్పు పంచదారను వేసి నిమిషం పాటు వేయించి పాలను ఒక్కో కప్పు చొప్పున వేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఎండుద్రాక్ష, 2 యాలకులు, సగం బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులు మరియు మిగిలిన పంచదార వేసుకోవాలి. సేమియా ఉడికి పాలు సగం అయ్యేవరకు సన్నని సెగపై పెట్టుకొని కలుపుతూ వుండాలి. సేమియాలో చిరౌంజీ, మిల్క్‌మెయిడ్ కలిపి 10 నిమిషాలు అయ్యాక కుంకుమ పువ్వు రేకలు, ఖర్జూరాలు, మిగిలిన యాలకుల పొడి మరియు డ్రైఫ్రూట్స్ వేసి పొయ్యిమీద నుంచి దింపుకోవాలి.