సబ్ ఫీచర్

బతుకు గతుకుల కథల మాల .. కణ్వస గ్రంథమాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథారచయిత పేరు లేకుండా ఒక కథను ప్రచురించి ఆ కథారచయిత ఎవరో కనుక్కోండి అంటే కథను బట్టి, కథనాన్నిబట్టి, కథా నిర్మితిని బట్టి, కథా విస్మృతిని బట్టి కథకుడు మునిపల్లె రాజు అని చెప్పేయగల రచయిత కథల సమాహారం మాజికల్ రియలిజం కథల సంపుటం. ఈనాడు తామర తంపరగా వస్తున్న కథల నుండి, కథకుల నుండి ఇలా చెప్పటం కష్టమేమో కానీ - కారణం స్వతంత్ర ముద్ర ఉన్న కథకులు తరిగిపోతుండటంతో - గత తరం రచయితల నుండి కొందరి పరంగానైనా చెప్పటం సాధ్యమవుతుంది.
అసలు స్వంత ముద్ర గల తెలుగు కథకులు ఈ వందేళ్లలో ఓ వందమంది ఉంటారా? పోనీ రచయిత పేరు లేని కథను చదివి ఫలానా రచయిత కథ అని పాఠకుడు పసిగట్టేయగల కథన చాతురి ఉన్న తెలుగు కథకులు నూరేళ్ల తెలుగు కథా చరిత్రలో ఏడాదికి ఒక్కరు కూడా మిగలరేమో?! శ్రీపాద, చలం, గోపీచంద్, వడ్డెర చండీదాస్, కాళీపట్నం, మధురాంతకం, పతంజలి - గత రెండు తరాల రచయితలలో మన్నిక గల కథారచన చేసినవారు. వారి సరసన చేరగల కథకుడు మునిపల్లె రాజు.
కలంలో జీవితాన్ని వొంపి కథలు పుట్టించిన కాలంనాటి రచయిత కరడు గట్టిన కలాలకు, సారీ బాల్‌పాయింట్ పెన్స్‌కు - సెన్సిటివిటీని అద్దగల రచయిత మునిపల్లె రాజు. దాదాపు ఏడు పదుల కథా జీవితంలో మహా అయితే మూడు వందల కథలు రాసి ఉంటారేమో. పారేసుకోగా మిగిలిన కథలను గుదిగుచ్చితే ఓ వంద కథలు, పుస్తకాల రూపంలోకి తర్జుమా అయి ఉంటాయి. దొరికిన కథలను ‘కణ్వస గ్రంథమాల’ రెండు సంపుటాలుగా వెలువరించటం బాగుంది. ఈ రెండు సంపుటాలలో ఒక సంపుటమే ‘మునిపల్లె రాజు మాజికల్ రియలిజం కథలు’. దివోస్వప్నాలతో ముఖాముఖి, అస్తిత్వనదం ఆవలి తీరాన అని రెండు భాగాలుగా ఈ సంపుటి ప్రచురణ జరిగింది.
కులం, మతం, రాగం, ద్వేషం.. అతన్ని అందవు. ఆధ్యాత్మిక భౌతిక కల్లోలాన్ని దార్శనికుడిగా విశే్లషించి, తన పరిసరాల్ని క్షాళితం చేయాలనే సంకల్పంతో ఉద్యమిస్తాడు. అప్పుడు వ్యక్తమయ్యేదే తొలి రచన అనిపించుకుంటుంది. తత్పూర్వం వచ్చినది రాతలు మాత్రమే. అన్ని కథల రాతల్ని వింగడించగల రచయిత మునిపల్లె రాజు. మహాభారత కదన రంగంలో భీష్ముడంతటి వాడు తెలుగు కథన రంగంలో మునిపల్లె రాజు. ‘దుఃఖం కదా దాని తత్వం’ అని తన తొలి కథలను విశే్లషించుకోగల దిట్ట మునిపల్లె. ‘ఈ లోకం, ఈ సృష్టి అంతా కలిసి ఒక అద్భుతమైన లిరిక్’ అనగల మంత్రనగరి ఈ రచయిత కాన్వాస్. పైగా ‘కలల్ని మీతో పంచుకున్నాను. దుఃఖాన్ని దాచుకుంటాను’ అంటూ స్వగతం నుండి వర్తమానంలో ఈదులాడగల రచయిత.
ఈ కథల హారంలోని లాకెట్ ‘వీరకుంకుమ’ కథ. దాదాపు అరవై సంవత్సరాల క్రితం 1953లో రాసిన కథ ఇది. రాయలసీమలో కరవు కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యం ఈ కథే వృత్తం. ‘ఈ (హంపీ) దిబ్బల మీద జీవం కురుస్తుంది మళ్లీ’ అన్న ఆశావహ దృక్పథంతో సాగిన రచన. ‘ఆకలి నుండి, అన్యాయం నుండి మానవజాతికి విముక్తి లేదు’ అన్న గాఢాభిప్రాయానికి వచ్చి నీడ వలె కన్పించింది జీవితం.. తెల్లనీడ ఈ పగలు, కనబడని నల్ల నీడ రేయి’ అంటాడీ కథకుడు. ‘మృత్యువుకు కూడా మృత్యువున్నది’ అని తెలియజెప్పే కథ ఇది. ‘ఈ లోకపు ఆత్మ తన ఆత్మకు అగ్ని’ అన్న విషయ సాంద్రతగల కథ ఇది. ఇక ఈ కథ ముగింపు ఒక్క మునిపల్లె రాజుకే స్వంతం. కథకుడి బలమైన ముద్ర అన్ని విధాల కనిపించే కథ ఈ ‘వీరకుంకుమ’.
‘పాముకాటు’ కథ ‘వేలాది సంవత్సరాల వేదాంతం, నాగరికత ఎక్కడ దాగున్నది?’ అని ప్రశ్నిస్తుంది. నిష్కృతిలేని విద్వేష కార్పణ్య జ్వాలలను కళ్ల ముందు నిలుపుతుంది. ఒకానొక మలుపులో ‘గాంధీజీ ఈ వ్యవస్థకు రెలెవెంట్ కాదు’ అన్న ఆలోచనలో పడేస్తుంది. ‘ఉద్యోగ విరమణం’ కథ ద్వారా ‘పాశ్చాత్య వేదాంతం మన సంస్కృతిలో ఇమడదు’ అని స్పష్టం చేస్తాడీ రచయిత.
‘తిరుగు ప్రయాణం’ కథలో మన పురాణ పాత్ర అయిన భరతుడి ప్రస్తావన వస్తుంది. ఆ సందర్భంలో ‘గాంధీగారి కంటే ముందు సత్యాగ్రహం చేసినవాడు భరతుడు’ అంటాడీ కథకుడు. ఈ కథలోని ఒక ముఖ్యపాత్ర దుర్గ. మృత్యువాత పడ్డ దుర్గను ‘నిద్రబుచ్చుతున్న శిశువును పండబెట్టినట్లు’ ఆమె శవాన్ని గోతిలోకి చేర్చి శవనిద్రకు ఒక వినిర్మలత్వాన్ని కలగజేస్తారు మునిపల్లె రాజు.
‘మానవుల మీద ఆకలికున్న విస్తృతాధికారాన్ని తలచుకుంటే హైందవ వేదాంతమే కాదు, జ్ఞానులు, విజ్ఞానులు, రాగులు, విరాగులు బోధించిన సకల ధర్మాలకు అర్థం గోచరిస్తుంది. విప్లవ జ్వాలల్నీ, విటుకత్తెల్నీ, ధర్మజ్యోతినీ, అధర్మ యుద్ధాల్నీ, దానవులను, మానవులను అంత సులువుగా ఇంకే శక్తి సృష్టించగలదు?’ అని ప్రశ్నించే కథ ‘ఒక లవ్‌స్టోరీ రాసిపెట్టండి సార్’.
‘నెత్తురుకన్నా చిక్కని వేరే విలువల వలయంలో తన భర్త చిక్కుకుని వున్నాడని ఆమె ఎప్పటికీ తెలుసుకోలేదు.. సత్తెకాలంనాటి మనిషి’ అన్న రసానుభూతితో నెత్తురుకన్నా చిక్కనిది’ అన్న కథ సాగుతుంది. ‘ఆమె లలాటాన్ని ముద్దిడుకుని నొసటి కుంకుమ తన లలాటానికి పూసుకున్నాడు’ అన్న అందమైన భావచిత్రంతోపాటు ‘మృత్యువుకు కూడా కొత్త నాగరికత నేర్పిన’ కథ ‘దంపతులు’. ‘అంతా విషాదాంతం కాదు’ అన్న కథలో తాను ఇష్టపడ్డ సరోజిని మరొకరి భార్య అవుతుంది. ఆ భర్త అకాల మరణంతో మళ్లీ ఆమెను వివాహం చేసుకోవటం అనే ఇతివృత్తం ఈనాడు కొత్త కాకపోవచ్చు కాదు కానీ ఈ కథకు ముగింపు మాత్రం ఎప్పటికీ నవనవోనే్మషమే. చూడండి ‘స్కూల్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన విశ్వనాథం కలలోకి అనంతరామయ్య గారొచ్చి ‘వితంతు వివాహంపైన నమ్మకం ఉందా?’ అంటే కలలోనే జవాబు ‘ఉంది’ అని. ‘సరోజినిని విశ్వనాథం వివాహమాడాడు’ అని ఇలా అదృశ్యంగా చెప్పటం గొప్ప ముగింపే కదా!
మునిపల్లె రాజు ‘కల్లోల గౌతమి చిట్టి ఆభరణం’ కథ ఓ చిరుప్రబంధ కథలా సాగిపోతుంది. అఖండ గోదావరి పెళ్లినాటి ముక్కుపుడక’ కనిపించకపోవడంతో గోదావరి అనే్వషణ ప్రారంభమై, గోదావరి పారే ప్రాంతాలన్నిటినీ కథేవివృత్తం చుట్టి రావటం చాల గొప్పగా ఉంటుంది.
‘దివోస్వప్నాలతో ముఖాముఖి’ కథ, మునిపల్లె రాజుగారు ‘తెలుగు కథకులందరికీ నివాళి’గా రాసిన కథ. ‘అక్షరం పలకటం లేదంటే ఆత్మదీపం వెలగలేదన్నమాట’ అన్న మాటలు ఏ పాత్రవైనా - పలికించిన వారు మునిపల్లెవారే! ఇంకా ఈ సంపుటిలో - నిశ్శబ్దం ఒక పదం కాదు, అదృష్టదేవత, వేరేలోకపు స్వగతాల్లో, నైమిశారణ్యంలో సత్రయాగం, నిష్క్రమణ ద్వారం, సప్తతి మహోత్సవం, నా ఇంటర్వ్యూ పోయింది, చేనేత చిత్రం, ధర్మఛత్రం, అస్తిత్వ నదం ఆవలి తీరాన - మొదలైన కథలు ఎనిమిదిన్నర దశకాల జీవితాన్ని చవిచూసిన మునిపల్లె రాజుగారి అనుభవ పరంపరల జీవన చిత్రాలు.
అందుకే - ‘ఎన్నటికీ తరగని భారతీయ గ్రామీణ పేదరికానికి, విజ్ఞాన శాస్త్రం ఏ వ్యూహ నిర్మాణంలో - అడ్డుకట్ట వేయమన్నది? నరహంతకులైన మతఛాందసవాదుల్ని - ఈ సైన్స్ అదుపులో పెట్టి వసుధైక మానవుణ్ణి తిరిగి ఉద్భవింప చేయగలదా? ఎన్నో నిగూఢ జీవన రహస్యాల్ని పరిశోధించగలిగిన భారతీయ సాహిత్యం - ఈనాటి క్రూరత్వం ముందు తన శాంతి పాఠాన్ని వల్లించలేక పోతున్న దెందువల్ల? ఈ ప్రశ్నలన్నీ నా మెదడును కలచివేస్తుంటాయి. అన్నింటికీ మించిన విషాదం పర్యావరణం కాలుష్యం వుండనే ఉన్నది’ అన్నవి మునిపల్లె వారి స్వగతాలే కాదు... మంత్రనగరిలో మునిపల్లె వారిని కట్టిపడేసిన వాస్తవ నేపథ్యాలు కూడా. అందుకే మునిపల్లె వారివి బతుకు గతుకుల కథన రీతులే అయినా మాజికల్ రియలిజమ్ కథలనిపించుకున్నాయి.

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946