అంతర్జాతీయం

సిరియాపై క్షిపణి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 7: సిరియాలో మూడు రోజుల క్రితం అమాయక పౌరులపై జరిగిన రసాయనిక దాడికి ప్రతీకారంగా అమెరికా శుక్రవారం తెల్లవారుజామున అక్కడి వైమానిక స్థావరంపై భారీ ఎత్తున క్షిపణులతో దాడి చేసింది. సిరియాలోని బషర్ అల్-అసద్ ప్రభుత్వమే ఈ రసాయనిక దాడికి పాల్పడిందని బలంగా నమ్ముతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ నరమేధాన్ని ఆపడం కోసం ఈ పరిమిత సైనిక చర్యకు ఆదేశించినట్లు అమెరికా అధికారులు చెప్పారు. ట్రంప్ ఆదేశాలపై తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న రెండు అమెరికా యుద్ధ నౌకలపైనుంచి 50-60 టామ్‌హాక్ క్రూయిజ్ క్షిపణులను సెంట్రల్ సిరియాలోని షేరత్ ఎయిర్‌బేస్‌పై ప్రయోగించారు. ఈ దాడిలో కనీసం 9 మంది చనిపోగా, వైమానిక స్థావరానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మూడు రోజులక్రితం రసాయనిక దాడి జరిపిన సిరియా యుద్ధ విమానాలు ఈ ఎయిర్‌బేస్‌లోనే ఉన్నట్లు చెబుతున్నారు. వైమానిక స్థావరంలోని రన్‌వేలు, హ్యాంగర్లు, కంట్రోల్ టవర్లు, మందుగుండు నిల్వ ఉంచిన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో ఈ క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో వైమానిక స్థావరంలోని 9 విమానాలు ధ్వంసం అయ్యాయని, అయితే రన్‌వేమాత్రం చెక్కు చెదరలేదని అక్కడినుంచి రష్యా అధికారిక టీవీ ప్రతినిధి తెలియజేశారు. కాగా, ఈ క్షిపణి దాడిలో వైమానిక స్థావరానికి భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగిందని సిరియా సైన్యం ప్రకటించింది.
సిరియాపై అమెరికా నేరుగా దాడి చేయడం ఇదే మొదటిసారి కాగా, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకున్న కీలక మిలిటరీ నిర్ణయం కూడా ఇదే కావడం గమనార్హం. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అమెరికా ఈ క్షిపణి దాడికి పాల్పడ్డం విశేషం. కాగా సిరియా వైమానిక స్థావరాన్ని టార్గెట్‌గా చేసుకుని దాడులు జరపాలని తానే ఆదేశించినట్లు ఫ్లోరిడాలో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ చెప్పారు. మూడు రోజుల క్రితం అమాయక పౌరులపై జరిగిన రసాయనిక దాడిని అమానుషమైనదిగా అభివర్ణించిన ఆయన అధ్యక్షుడు అసద్ మహిళలు, ముక్కుపచ్చలారని చిన్నారులు సహా అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు. ప్రాణాంతకమైన రసాయనిక దాడులను ఆపడం దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా అమెరికాకు ఎంతో ముఖ్యమని కూడా ఆయన అన్నారు. పశ్చిమ సిరియాలోని తిరుగుబాటుదారుల అధీనంలోని ఖాన్ షేకున్ పట్టణంపై గత మంగళవారం జరిగిన రసాయనిక దాడిలో 27 మంది చిన్నారులు సహా 86 మంది చనిపోగా, వందలాది మంది అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకంగా సిరియా రసాయనిక ఆయుధాన్ని ఉపయోగించిందనడంలో ఎలాంటి వివాదమూ లేదని ట్రంప్ అంటూ, సిరియాలో ఈ మారణకాండను, రక్తపాతాన్ని అలాగే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అమెరికాతో చేతులు కలపాల్సిందిగా ప్రపంచ దేశాలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, అసద్ తన ధోరణిని మార్చుకునేలా చేసే బాధ్యతను నెరవేర్చడంలో రష్యా విఫలమైనందునే అమెరికా ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ వ్యాఖ్యానించారు. వైమానిక స్థావరంలో ఉన్న రష్యా, సిరియా బలగాలకు వీలయినంత తక్కువ ప్రాణనష్టం జరిగేలా చూడడం కోసం అమెరికా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని కూడా ఆయన చెప్పారు. టిల్లర్‌సన్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన ఈ దాడి ఇరుదేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో వేచి చూడాల్సి ఉంది.