ఎడిట్ పేజీ

అతివలకూ ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబంలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకూ ఉమ్మడి ఆస్తిలో హక్కు ఉంటుందా? ఈ ప్రశ్న అనునిత్యం ఎంతో మందిని వేధిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఎన్నో చట్టాలు, కోర్టు తీర్పులు విస్పష్టంగా ఉన్నా అపుడపుడూ అమలులో ఎదురయ్యే లోపాలతో ఈ అనుమానాలు సహజంగానే వస్తాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ మహిళలకు వారసత్వ సంపద హక్కులపై భిన్నమైన చట్టాలున్నందున ఈ గందరగోళం ఎపుడూ ఉండనే ఉంది. తాజాగా హిందూ వారసత్వ చట్టం అమలుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పెను సంచలనంగానే చెప్పవచ్చు. ఇద్దరు అమ్మాయిలు తమ సోదరులు ఆస్తిలో భాగం ఇవ్వడం లేదంటూ 2002లో పిటిషన్ (గురులింగప్ప సావడి కేసు) దాఖలు చేశారు. దాన్ని బొంబాయ హైకోర్టు 2007లో తిరస్కరించింది. హిందూ వారసత్వ చట్టాన్ని 2005లో సవరించారు కనుక దాని కంటే ముందు పుట్టిన వారికి నూతన చట్టం అమలుకాదని హైకోర్టు పేర్కొంది. దీనిపై ఆ అమ్మాయిలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జస్టిస్ ఎ కె సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను తప్పుపట్టింది. హిందూ వారసత్వ చట్ట సవరణలు 2005లో జరిగినా, అంతకంటే ముందు పుట్టిన వారికి సైతం ఈ చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. దీంతో హిందూ మహిళలందరికీ అవిభాజ్య వారసత్వ ఆస్తిలో తమ సోదరులతో సమాన హోదా దక్కుతుందని సుప్రీం ఈ ఏడాది ఫిబ్రవరి 3న తీర్పు చెప్పింది.
ఆడపిల్లలకూ సమాన ఆస్తి హక్కు కల్పిస్తూ 1985 సెప్టెంబర్ 5న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ‘ఆంధ్రప్రదేశ్ స్ర్తి ఆస్తుల వారసత్వ చట్టం సవరణ-1985’ ను తీసుకువచ్చారు. దీంతో హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 29ఎ, 29 బి, 29 సి చేరుస్తూ సవరణ చేశారు. అప్పటికే వివాహం కాని కుమార్తెలకు మాత్రమే వర్తించేలా దీనిని రూపొందించారు. ఈ చట్టం పరిపూర్ణంగా అమలులోకి వచ్చేలోగానే కేంద్ర ప్రభుత్వం హిందూ వారసత్వ చట్టంలోనూ, హిందూ వివాహ చట్టంలోనూ, ఇతర చట్టాల్లో కొన్ని మార్పులు చేయడంతో భిన్నమైన సాంకేతిక అంశాలు ఎదురై, ఈ చట్టం అమలులో కూడా కొన్ని లోపాలు తలెత్తాయి. ఫలితంగా ఈ చట్టం నూరు శాతం ఫలితాలను సాధించలేకపోయింది. ఇటీవలి సుప్రీం కోర్టు ఆదేశాలతో మహిళలు తమ సంక్రమిత వారసత్వ ఆస్తి హక్కును చట్టపరంగా వినియోగించుకునే వీలుకలిగింది.
‘2005-హిందూ వారసత్వ సవరణ చట్టం’ గురించి ఉన్న తీర్పులకు భిన్నంగా గత ఏడాది అక్టోబర్ 16వతేదీన పూలవతి కేసులో కొత్త తీర్పు వెలువడింది. గత తీర్పులేవీ ‘సవరణ చట్టం అమలుకు ముందా? ఆ తర్వాతా?’ అన్న విషయాన్ని నిర్ణయించలేదని సుప్రీం అభిప్రాయపడింది. ఈ తీర్పుతో అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నివృత్తి చేసింది. అమ్మాయిలకు పసుపు-కుంకుమ కింద ఇచ్చిన బహుమతికి రిజిస్టర్డు దస్తావేజులు అక్కర్లేదనే వాదనను చాలా కాలం న్యాయస్థానాలు అంగీకరించినా, రాజ్యాంగ ధర్మాసనం మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చింది. అలాంటి సమయాల్లో రిజిస్టర్డు దస్తావేజు ఉండాలనే న్యాయస్థానం చెబుతోంది. కుమార్తె వివాహాది శుభకార్యాలు, భరణాలు ఉమ్మడి కుటుంబం భరించాలన్నది ఒక సంప్రదాయం. కొడుకుల విభజన హక్కులు ఇలాంటి బాధ్యతలకు లోబడే ఉంటాయి. అయితే కూతుళ్లకు ఉమ్మడి ఆస్తిలో సమాన వాటా కల్పించి , భాగస్వామ్యులను చేసిన శాసనాల సంస్కరణల ప్రభావం ఈ సనాతన హిందూ ధర్మం, ఆచారాలపై తీవ్రంగానే చూపుతుందనేది నిస్సందేహం. ఇక్కడ ఇంకో ప్రధాన విషయం తండ్రికి సంబంధించిన వారసత్వ లేదా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూడా సమాన హక్కులు ఉంటాయి. 2005లో కేంద్ర చట్టం వచ్చేసరికి 1985 నాటి రాష్ట్ర చట్టం (ఎన్‌టిఆర్ రూపొందించిన చట్టం) ప్రకారం ఉమ్మడి ఆస్తిలో ఆడపడుచులకు కొడుకులతో సమాన వాటా సంక్రమించింది. ఇక తండ్రి స్వార్జితంలో వారసులుగా కూతుళ్లకు కూడా సమాన హక్కు 1956 చట్ట ప్రకారం ఉంది.
ఆస్తితో సంబంధం లేకుండా భార్యకు, మైనర్ లేదా పెళ్లికాని కుమార్తెకు కొన్ని సందర్భాల్లో వితంతువైన కుమార్తెకు కుటుంబ సామాజిక, ఆర్థిక స్థాయి ప్రకారం తండ్రి నుండి భరణం పొందే హక్కు ఉంటుంది. అతని సొంత ఆస్తిపై చార్జి (అంటే జామీను) కూడా కోర్టు ద్వారా పొందవచ్చు. అయితే హిందూ అవిభక్త కుటంబ ఆస్తి (పూర్వార్జితం) విషయంలో కుమార్తెకు తండ్రితో సమాన హక్కులు ఉంటాయి. అలాంటి హక్కు అక్రమ సంతానానికి కాని, చెల్లుబాటుకాని పెళ్లి వల్ల గాని పుట్టిన సంతానానికి ఉండదు. అంటే తాతల నుండి సంక్రమించిన ఆస్తి గానీ దాని ద్వారా సంపాదించిన ఆస్తి కానీ ఉంటే దానిలో కేవలం తండ్రి, మొదటి భార్య సంతానానికి మాత్రమే సమాన హక్కులు ఉంటాయి. అలాంటి ఆస్తులు లేకపోతే అతని సొంత ఆదాయం, ఆస్తులను పరిగణనలోకి తీసుకుని భార్య,కుమార్తెలకు భరణాన్ని నిర్ణయించాలి. విల్లు రాయకుండా తండ్రి మరణిస్తే వారసులుగా వాటా లభిస్తుంది.
ఈ నిర్ణయం వెనుక చాలా నేపథ్యం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని వైవిధ్యమైనది హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇది శాశ్వతమైన వ్యవస్థ. వేదకాలం, ఆ తర్వాత స్మృతుల కాలం, ధర్మసూత్రాల కాలంగా హిందూ ధర్మ శాస్త్రాన్ని విభజించారు. ఇందులోముఖ్యంగా మను ధర్మశాస్త్రం, మితాక్షరా, దయాభాగా ముఖ్యమైనవి. అన్ని శాఖల్లోనూ ధర్మసూత్రాలను చెప్పడం జరిగింది. చాలావరకూ అవి కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే హిందూ సమష్టి కుటుంబం , హిందువుల వివాహం, దత్తత, మైనర్ల సంరక్షణకు సంబంధించిన ధర్మసూత్రాలు మాత్రం కొన్ని మార్పులతో ఇప్పటికీ అమలులో ఉన్నాయి. హిందువుల్లో వ్యక్తి కంటే సమష్టి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగు తరాల వరకూ మగవారంతా కలిస్తే దానిని కో-పర్సనరీ అని వ్యవహరిస్తారు. స్ర్తిలు కూడా కలిస్తే అది ఉమ్మడి కుటుంబం అవుతుంది. ఈ కుటుంబానికి కర్త ఉంటారు. మరణించిన వారు కుటుంబాన్ని వీడిపోతూంటే, జన్మించిన వారు సభ్యులు అవుతుంటారు. పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను తప్పించేవాడు కనుక పుత్రుడు అవుతాడు. ఈ ప్రకారమే ‘అపుత్రస్య గతిర్నాస్తి’ అనే సూత్రం ఏర్పడింది. తల్లిదండ్రులు, పూర్వీకులకు పుత్రుడు శ్రాద్ధకర్మలు నిర్వహించి, వారికి పున్నామనరకం లేకుండా చేస్తాడు కనుక అతడికి పుట్టుకతోనే ఆస్తిలో హక్కు కల్పించడం జరిగింది. అయితే ఈ హక్కు కేవలం ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మాత్రమే ఉంటుంది. ఈ ఆస్తులు ఎవరిపేర ఉన్నా మగపిల్లలందరికీ హక్కు ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలోని ఒక సభ్యుడు తాను సొంతంగా సంపాదించిన ఆస్తిని గానీ లేదా తనకు వేరే విధంగా వచ్చిన ఆస్తిని కాని ఉమ్మడిలో కలిపేయడంతో అది ఉమ్మడి ఆస్తి అవుతుంది. కుటుంబంలో ఒక సభ్యుడు సొంతంగా ఆర్జించిన ఆస్తిని స్వార్జితపు ఆస్తి అంటారు. ఇతరుల నుండి వారసత్వరీత్యా గానీ, విల్లుద్వారా గానీ , దానపట్టాల ద్వారా లేదా సొంత తెలివితేటలతో పొందిన ఆస్తిని ప్రత్యేక ఆస్తి అంటారు. ఈ స్వార్జితపుఆస్తి ఉమ్మడి ఆస్తి కిందకు రాదు. ఏది పిత్రార్జిత ఆస్తి, ఏది కాదో, ఎవరు రుజువు చేసుకోవాలో అనే విషయంపై న్యాయస్థానాలు ఇప్పటికే చాలా స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. ఒక కుటుంబానికి కొంత స్థిరాస్తి ఉంటే దానిని అమ్మి వేరే చోట కొంటే అది కూడా పిత్రార్జితం కిందకే వస్తుంది. పిత్రార్జిత ఆస్తిపై వచ్చిన ఆదాయంతో కొన్న ఆస్తి కూడా పిత్రార్జితం కిందకే వస్తుంది, అయితే కొన్న వారు అది తమ సొంత సొమ్ముతో కొన్నామని రుజువు చేసుకుంటే మాత్రం అది పిత్రార్జితం కిందకు రాదు. పంచుకోవడానికి వీలులేని లేదా వీలుకాని ఆస్తులను ఉమ్మడిగానే ఉంచుకోవాలి. ఉమ్మడి కుటుంబంలో ఇల్లు పంచుకునేటపుడు దాని మార్గాలు, మంచినీటి బావులు, మరుగుదొడ్లు, పశువుల కొట్టం వంటివి పైకి వెళ్లేందుకు మెట్లు మొదలైనవి ఉమ్మడిగానే ఉంచుకోవల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఇచ్చిన ఈనాం- ఒక ఆచారపు హక్కు పంచుకోవడానికి వీలు లేదు. ఆస్తి విషయంలో మైనర్లతో సహా ఏ సభ్యుడైనా పంపకం కోరవచ్చు. మైనర్ తరఫున తండ్రిపై దావా వేయడానికి ఎవరైనా సంరక్షణ వహించవచ్చు. మైనర్లు నష్టపోయే ప్రమాదం ఉన్నపుడు కోర్టు అతనికి వాటా పంచుతుంది. ఉమ్మడి కుటుంబంలోని సభ్యుల భార్యల కడుపులో పడి ఇంకా పుట్టని పుత్రులకు సైతం ఆస్తిలో వాటా హక్కు ఉంటుంది. కడుపులో ఉన్నవారికి కూడా వాటా కేటాయించాలి. ఒక వేళ ఆ శిశువులకు వాటా ఇవ్వకుండా పంచుకుంటే పుట్టిన తర్వాత ఆ పంపకాన్ని తిరగదోడి వాటా తీసుకోవచ్చు. ఇంట్లో పవిత్ర బాధ్యత (పియస్ ఆబ్లిగేషన్) నిర్వహించడానికి ఖర్చులుచేస్తే దానికి అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. తండ్రి తదనంతరం కూడా పుత్రులు తీర్చవలసి ఉంటుంది. అయితే తండ్రి అవ్యవహారిక రుణాలకు మాత్రం ఈ బాధ్యత ఉండదు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో హిందూ ధర్మశాస్త్రం, లేదా ముస్లిం న్యాయశాస్త్రం జోలికి పోలేదు. సొంత శాస్త్రాలనే అమలుపరిచారు. స్వాతంత్య్రోద్యమకాలంలో 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం రావడంతో స్థానిక స్వపరిపాలనలో కొన్ని విషయాల్లో అధికారాలు భారతీయులకు ఇచ్చారు. అందులో భాగంగానే హిందూ ధర్మశాస్త్రానికి మార్పులు తెస్తూ మొదటిసారి ఒక చట్టాన్ని రూపొందించారు. అది హిందూ స్ర్తిల ఆస్తి హక్కుల చట్టం -1937. పూర్వపు హిందూ స్ర్తికి తన భర్త కటుంబంలో వారసత్వ రీత్యా ఆస్తి హక్కు ఉండేది కాదు. కేవలం ఆమెకు మనోవర్తి హక్కు మాత్రమే ఉండేది. భర్త చనిపోతే ఆమె కుమారులు, ఒక వేళ కుమారులు లేకపోతే భర్త సోదరుల వద్ద వారి ఉమ్మడి కుటుంబ బాధ్యతగా మనోవర్తి పొందే హక్కు మాత్రమే ఉండేది. ఇందుకు కొంత ఉమ్మడి కుటుంబ ఆస్తిపై వారసత్వం లేదు. 1937 చట్టంలో కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పడంతో నామమాత్రం అయిపోయింది. 1946లో మరో చట్టంలో మొత్తం అన్ని రకాల ఆస్తులకు పంటభూములకు వర్తింపచేశారు. హిందూ వారసత్వ చట్టం -1956 అమలులోకి రావడంతో అది రద్దయింది. స్ర్తిలకు పూర్తి హక్కులు ఇవ్వడం కోసం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అంతకుముందు అలిఖతంగా, ఏ చట్టాలు లేకుండా ఉన్న హిందూ ధర్మ శాస్త్రాన్ని విప్లవాత్మక మార్పులతో క్రోడీకరించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. దానిని వ్యతిరేకించడంతో చివరకు హిందూ వారసత్వం, హిందూ వివాహం, హిందూ దత్తత స్వీకారం, మనోవర్తి, హిందూ పిల్లల సంరక్షణ సూత్రాలకు సంబంధించి 1955, 1956లో నాలుగు చట్టాలు రూపొందాయి. హిందూ వారసత్వ చట్టం బౌద్ధులు, జైనులు, సిక్కులకు కూడా వర్తిస్తుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో మిగిలిన రాష్ట్రాల్లోని హిందూ వారసులైన ఆడపడుచుల హక్కులకు కొత్త దిశానిర్దేశం చేస్తుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

బి.వి. ప్రసాద్