సంపాదకీయం

‘కశ్మీర్ కాండ’కు కారకులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో బీటలు వారిన భద్రతా వ్యవస్థ పోలీసులను, సైనికులను బలిగొంటోంది. ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’కూ, మనకు మిగిలి ఉన్న జమ్మూ కశ్మీర్‌కు మధ్య ఏర్పడి ఉన్న ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసీ- పొడవునా ‘్భద్రతాకుడ్యం’లో కన్నాలు పెరుగుతున్నాయి! ఈ కన్నాల గుండా పాకిస్తానీ జిహాదీ బీభత్సకారులు నిరంతరం దూకి వస్తున్నారు. అంతర్గత భద్రతా సౌధం నిండా దేశవిద్రోహులు రహస్య ద్వారాలు ఏర్పాటు చేసుకోగలిగారు. ఇలాంటి రహస్య ద్వారాలు కశ్మీర్ లోయలో నిరంతరం వికృతంగా ఆవిష్కృతం అవుతుండడం కొనసాగుతున్న బీభత్సం.. నవీద్ ఝట్టీ అబూ హంఝల్లా అనే పాకిస్తానీ జిహాదీ హంతకుడు మంగళవారం ఇలాంటి రహస్య ద్వారాన్ని తెరుచుకొని సురక్షితంగా పారిపోవడం భద్రతా ఛిద్రాలకు సరికొత్త ఉదాహరణ. కడుపునొప్పి సాకుతో శ్రీనగర్‌లోని జైలు నుంచి ‘మహరాజా హరిసింగ్ వైద్యశాల’కు చేరగలిగిన నవీద్ అక్కడ నుంచి ఉడాయించడానికి వైద్యశాలలోని చికిత్సార్థులు సహకరించడం భద్రతావ్యవస్థ డొల్లతనానికి ప్రమాణం.. చికిత్సార్థులలో చేరి ఉన్న ఇద్దరు దుండగులు నవీద్ వెంట ఉండిన ఇద్దరు పోలీసులను కాల్చి చంపి, నవీద్‌తో కలసి పారిపోయారు. వైద్యశాల ప్రాంగణంలో నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ ఎక్కి ముగ్గురూ పరారీ అయ్యే వరకూ భద్రతా వ్యవస్థ ఉలిక్కిపడలేదు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ భద్రతావ్యవస్థ- పోలీసు యంత్రాంగంలో దేశవిద్రోహులు, పాకిస్తానీ జిహాదీలు, వారి సమర్ధకులు చేరిపోయి ఉన్నారన్నది దశాబ్దుల వైపరీత్యం! 1990లో అప్పటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ జగ్‌మోహన్ స్వయంగా ఈ దుస్థితిని వివరించడం చరిత్ర. జైలు నుంచి నవీద్‌ను వైద్యశాలకు తరలించిన సమయంలో అతగాడి వెంట కేవలం ఇద్దరు పోలీసు లు మాత్రమే ఉండడం భద్రతా నిర్వాహకుల ఘోరమైన వైఫల్యానికి, క్రూరమైన నిర్లక్ష్యానికి నిదర్శనం. శ్రీనగర్‌లోను, కశ్మీర్ లోయలోను మాత్రమే గాక జమ్మూ ప్రాంతంలో సైతం జిహాదీలు, పాకిస్తానీ బీభత్సకారులు పోలీసు ఠాణాల మీద, సైనిక స్థావరాల మీద, సైనిక వాహన శ్రేణుల మీద ధైర్యంగా దాడులు చేస్తున్నారు. పోలీసులను, సైనికులను పొట్టన పెట్టుకుంటున్నారు. అందువల్ల కరడుకట్టిన, పేరుమోసిన నవీద్ అనే ఉగ్రవాది వెంట కేవలం ఇద్దరు పోలీసులను పెడితే చాలని నిర్థారించిన అధికారులది క్రూరమైన నిర్లక్ష్యం. ముస్తాక్ అహమ్మద్, బాబర్ అహమ్మద్ అనే పోలీసులిద్దరూ ఈ నిర్లక్ష్యానికి బలైపోయారు. పాకిస్తాన్‌లోని ‘ముల్తాన్’కు చెందిన ఈ నవీద్ ‘లష్కర్ ఏ తొయ్యబా’ ముఠావాడు. శోపియా జిల్లాలోను, లోయ ప్రాంతంలోను అనేకమంది పోలీసులను, సైనికులను హత్యచేశాడు, గాయపరిచాడు. 2014లో పట్టుబడే నాటికే ఈ జిహాదీ ముష్కరుడు ‘నరరూప రాక్షసుడి’గా పేరు మోశాడు. ఇలాంటివాడిని ఒకచోట నుంచి మరోచోటకు తరలించే సమయంలో అతడిని విడిపించుకొని వెళ్లడానికి ’లష్కర్’లు ప్రయత్నించగలరన్న అనుమానం పోలీసు అధికారులకు కలగక పోవడం అంతుపట్టని వ్యవహారం!
అలాంటి అనుమానం కలిగి ఉండినట్టయితే మరికొందరు పోలీసులను, సైనికులను నవీద్ వెంట పంపి ఉండేవారు. వైద్యశాలలోని ‘చికిత్సార్థుల నమోదు గవాక్షం’ వద్ద నవీద్ నిలుచుండిన సమయంలో అప్పటికే అక్కడ వేచి ఉండిన దుండగులు కాల్పులు జరిపారు. గుర్తు తెలియని ఇద్దరు ‘సాయుధులు’ చికిత్సార్థులలో కలసిపోయి అక్కడ నిలబడ్డారు. నవీద్‌ను వైద్యశాలకు తరలించిన సమయంలో వైద్యశాల అధికారులకు పోలీసులు ముందుగానే సమాచారం అందజేసి ఉండాలి. వైద్యశాల ప్రాంగణంలో ‘నిఘా’ నయనాలు పర్యవేక్షణ జరిపి ఉండాలి. అలా ‘నిఘా’ నిద్దుర లేచి ఉండినట్టయితే నవీద్ వైద్యశాలకు చేరకముందే తుపాకులు మోసుకొని మోటార్ సైకిల్‌పై వచ్చి ఉండిన ముష్కరులు పట్టుబడి ఉండేవారు. వైద్యశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న ‘రక్షకుడు’- సెక్యూరిటీ గార్డు-కాని, ‘నమోదు గవాక్షం’ వద్ద ఉండిన సిబ్బంది కాని ఈ సాయుధ ముష్కరులను గమనించక పోవడం, పట్టించుకొనక పోవడం అజాగ్రత్తకు మాత్రమే తార్కాణమా? లేక విద్రోహ వ్యూహ విస్తరణకు సాక్ష్యమా! ‘నవీద్‌కు కడుపునొప్పి వచ్చినట్టు, తరచూ అతగాడు కడుపునొప్పితో బాధ పడినట్టు’ అతడిని మంగళవారం వైద్యశాలకు తీసుకువస్తుండినట్టు వేచి ఉండిన జిహాదీ సాయుధులకు ఎలా తెలిసింది? ఎవరు ఉప్పందించారు? నవీద్‌ను బయట తిప్పినట్టయితే అతగాడు పారిపోయే ప్రయత్నం చేస్తాడని జైలు అధికారులు గుర్తించి ఉండాలి. జైలుకే వైద్యులను, చికిత్సా పరికరాలను రప్పించి ఉండాలి. అదేమీ జరగలేదు..
నవీద్‌తో పాటు పట్టుబడిన ఆరుగురు పాకిస్తానీ బీభత్సకారులను డిసెంబర్‌లో శ్రీనగర్ కేంద్ర కారాగృహం- సెంట్రల్ జైలు- నుంచి జమ్మూ నగరంలోని కారాగృహానికి తరలించారట! కానీ నవీద్‌ను మాత్రం తరలించలేదు. నవీద్‌ను శ్రీనగర్‌లోనే నిర్బంధించి ఉంచాలని ఒక స్థానిక న్యాయస్థానం ఆదేశించడం ఇందుకు కారణం. ఆ న్యాయస్థానం అలాంటి ఆదేశం జారీ చేయడమే విస్మయకరం. ‘లోయ’ ప్రాంతంలో పాకిస్తానీ ఉగ్రవాదులు, స్థానిక బీభత్సకారులు వికృత తాండవం చేస్తున్నారు. సైనికులపై నిరంతరం రాళ్లు రువ్వుతున్నారు. అందువల్ల కరడుగట్టిన నేరస్థులను, పేరుమోసిన పాకిస్తానీ బీభత్సకారులను శ్రీనగర్‌లో గాక జమ్మూలో నిర్బంధించాలన్నది భద్రతా వ్యూహం! కానీ నవీద్ తరఫున స్థానిక న్యాయస్థానంలో ‘న్యాయ యాచిక’ దాఖలు కావడం, న్యాయమూర్తి అతగాడికి అనుకూలమైన ఆదేశం జారీ చేయడం ‘కశ్మీర్ కాండ’కు ఒక కొలమానం! ప్రభుత్వం నిర్ధారించిన చోట నేరస్థులను నిర్బంధించాలా? నేరస్థుడు కోరిన చోటనే అతగాడిని కొనసాగించాలా? అనేక దేశాలలో దేశద్రోహులు, శత్రుదేశాల మద్దతుదారులు, బీభత్సకారులు, శత్రుదేశాల గూఢచారులు పట్టుబడుతున్నారు. ఒకటి రెండు సంవత్సరాలలో వారి నేరాలను విచారించి దోషులుగానో, నిర్దోషులుగానో నిగ్గు తేల్చే న్యాయ ప్రక్రియ ఆయా దేశాల్లో జరిగిపోతుంది. కానీ మన దేశంలో మాత్రం ఇలాంటి బీభత్స హంతకులను విచారించి శిక్షించే ప్రక్రియ మూడు నాలుగు ఏళ్లలో పూర్తి కావడం లేదు. కొందరి విషయంలో దశాబ్దుల తరబడి అభియోగాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఫలితంగా జిహాదీ దుండగులు ఏళ్ల తరబడి నిర్బంధ గృహాలలో సుఖంగా జీవించగలుగుతున్నారు. ఇలాంటి పాకిస్తానీలు, పాకిస్తాన్‌కు కొమ్ము కాస్తున్న మన దేశంలోని ముష్కరులు తప్పించుకొని పారిపోవడం ఇది మొదటిసారి కాదు. 2010 అక్టోబర్‌లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా కారాగృహం నుంచి ఆరుగురు ఉగ్రవాదులు ఎత్తయిన గోడను దూకి పారిపోయారు. ఇద్దరు రక్షకులను తీవ్రంగా గాయపరచి ఉడాయించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! జైలు నుంచి బయటకు సొరంగ మార్గాలను తవ్విన ఘటనలు కూడా వెలుగు చూశాయి. సిరియా వారి సహాయంతో తాను జైలు నుంచి పారిపోగలనని యసీన్ భక్తల్ అనే జిహాదీ ఉగ్రవాది 2015 జూలైలో తన భార్యకు ఫోన్ చేసి చెప్పడం మన భద్రతా వైఫల్యం పట్ల బీభత్సకారులకున్న ‘విశ్వాసానికి’ మరో నిదర్శనం..
జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న బీభత్సకాండకు వౌలిక కారణం 1947 నుంచి కొంత కశ్మీర్ పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఉండడం. స్వాతంత్య్రం వచ్చాక సర్దార్ వల్లభ భాయి పటేల్ ప్రధానమంత్రి అయి ఉండినట్టయితే పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్- పీవోకే- సమస్య ఏర్పడి ఉండేది కాదని ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం లోక్‌సభలో చెప్పారు. ‘పీవోకే’ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వైఫల్యానికి ఫలితం! కానీ ఇప్పుడు సైనికులపై నిరంతరం రాళ్లు వేయిస్తున్నవారు ‘పీవోకే’ నుంచి రాలేదు. ‘లోయ’ ప్రాంతంలోనే వీరందరూ పుట్టి పెరిగారు. ఈ జిహాదీ దుండగులను ప్రభుత్వాలు ఎందుకు శిక్షించడం లేదు? పట్టుబడిన వారిని ఎందుకు నిర్బంధం నుంచి విడుదల చేస్తున్నాయి?