జాతీయ వార్తలు

స్పందించడానికి ఐదు రోజులా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆత్మహత్యపై సంతాపం తెలిపేందుకు ఐదు రోజుల సమయం ఎందుకు పట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ఆనంద్ శర్మ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రోహిత్ తల్లికి కలిగిన బాధను అర్థం చేసుకునేందుకు ఇంత సమయం పట్టిందా? అని నిలదీశారు. నరేంద్ర మోదీ భావోద్రేకంతో సంతాపం వ్యక్తం చేసినంత మాత్రాన రోహిత్ తల్లికి ఉపశమనం కలుగుతుందా? అని ఆయన అడిగారు. బిజెపి దురాగతాలను నరేంద్ర మోదీ ఎందుకు ఖండించలేదని నిలదీశారు.
రోహిత్ ఆత్మహత్య విషయంలో బిజెపి చేసిన అవమానకరమైన ప్రకటనలను మోదీ ఖండించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ వ్యవహరించిన తీరు, చేసిన ప్రకటనలు గర్హనీయమని ఆనంద్ శర్మ తెలిపారు. రోహిత్‌ను దేశద్రోహిగా చిత్రీకరించిన స్మృతి ఇరానీ, దత్తాత్రేయపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది మోదీ వివరించాలని ఆనంద్ శర్మ నిలదీశారు. వైస్ చాన్సలర్‌పై చర్య తీసుకునేందుకు నిరాకరించటం అంటే అర్థం ఏమిటని ఆయన అడిగారు.
రాజస్తాన్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా దళితుల పట్ల వివక్షతో వ్యవహరించినట్లు ఈరోజు వార్తలు వచ్చాయన్నారు. విశ్వవిద్యాలయాల్లో దళితుల పట్ల వివక్షతో వ్యవహరించటం పట్ల విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందని ఆనంద్ శర్మ చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పలు సంఘటనలు జరుగుతున్నా స్మృతి ఇరానీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇలాంటి దురదృష్టకర సంఘటనల పట్ల విచారం, బాధను వ్యక్తం చేసే బదులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని ఆనంద్ శర్మ సూచించారు.
అన్ని పత్రాలను బహిర్గతం చేయాలి
ఎన్‌డిఏ ప్రభుత్వం నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పత్రాలను బహిర్గతం చేయటంపై ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేతాజీకి సంబంధించిన అన్ని పత్రాలను బహిర్గతం చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆనంద్ శర్మ ప్రకటించారు. నేతాజీ పత్రాలను బహిర్గతం చేయటాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదంటూ బిజెపి ప్రభుత్వం మాత్రం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నేతాజీ పత్రాలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందంటూ ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల గురించి అడుగగా ఈ ఆరోపణలు సత్యదూరమని ఆయన బదులిచ్చారు.