కుటుంబ కథలకే పట్టం! సక్సెస్ మంత్రం ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకు ఎన్ని కొత్త కథలతో, నటులతో చలనచిత్రాలు వచ్చినా కుటుంబ కథా చిత్రాలకు మోజు ఎప్పటికీ తగ్గదు. పిల్లలు, పెద్దలు, యుక్త వయస్కులు ఎవరినైనా రెండున్నర గంటలు కూర్చోబెట్టి ప్రశాంతంగా చూసేలా చేస్తాయి. కుటుంబ కథాచిత్రాలకు ఎక్కువ మధ్యతరగతి ప్రజలే అభిమానులు. 2,3 దశాబ్దాల క్రితం కుటుంబ కథా చిత్రాల్లో నటించాలంటే శోభన్‌బాబు, రామారావు, ఎఎన్‌ఆర్, కృష్ణంరాజు, కృష్ణ, సుమన్, భానుచందర్, కమల్‌హసన్ లాంటి హీరోలు నటించిన సినిమాలంటే ప్రేక్షకులు పడిచచ్చేవారు. ఇందులో మహిళా ప్రేక్షకులకు శోభన్‌బాబు చిత్రాలంటే చెప్పలేనంత ఇష్టం వుండేది. కుటుంబ కథా చిత్రాల్లోని కథ మధ్య తరగతి కుటుంబాల చుట్టూనే తిరిగినట్లుండేది. ఇక వారికి జంటగా హీరోయిన్లు ఊర్వశి శారద, వాణిశ్రీ, జయసుధ, భానుప్రియ, విజయశాంతి, రాధ, రాధిక, శ్రీదేవి, వాణీవిశ్వనాథ్ తదితరుల నటన అద్భుతంగా వుండేది.
ఆ తరువాత వచ్చినవారు హీరోయిన్లుగా కాకుండా తల్లి క్యారెక్టర్లు, వదిన, అత్త, పక్క పాత్రల్లో నటించి జీవం పోస్తున్నారు. ఎందుకంటే వారి వయసుకు తగినట్లు పాత్రలు చేయాలని తీసుకున్న నిర్ణయమే కొంతమందిని తెలుగు చిత్రపరిశ్రమ అవకాశాలిస్తూ వస్తుందని చెప్పవచ్చు. ఇక శోభన్‌బాబు- శారద, వాణిశ్రీతో నటించడమే కాకుండా తల్లిదండ్రుల పాత్రలు కూడా చేసారు. కుటుంబ కథా చిత్రాలలో నటించిన అశేష ప్రేక్షకాదరణ పొందిన నటులు శోభన్‌బాబు తర్వాత మురళీమోహన్‌దేనని చెప్పవచ్చు. వారాలబ్బాయి చిత్రంలో అమాయక పాత్ర పోషించారు.
ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా ప్రతి చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుండేవారు. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య నలుగుతూ కథను నడిపించడం ఒక ఎత్తు. ఇటు మధ్య తరగతి కుటుంబాన్ని నడిపించాలి, అటు చదువుకునేటపుడో లేదా అకస్మాత్తుగా పరిచయమై పెళ్లి చేసుకునేంతవరకు వెళ్లి తప్పనిసరి అవసరం, పరిస్థితులు ఎదురు కావడంవల్ల ఒకరిని పెండ్లి చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయడం అనేది అప్పట్లో ట్విస్ట్. పెద్ద కుటుంబం అమ్మానాన్నలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, భార్యాపిల్లలు ఇదంతా ఒక దశకంలో జరిగిన కథలు. ఈమధ్య కాలంలో కృష్ణంరాజు, కృష్ణ, హరికృష్ణ, రావు రమేష్ లాంటి వాళ్లు తమ నటనా కౌశలంతో కుటుం బ కథా చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న కుటుంబ కథా చిత్రాలలో ప్రేక్షకుల మదిని దోచుకున్నవి ‘అఆ’ ‘్ఫదా’ ‘శతమానంభవతి’. కథలో అంశం ఏదైనా మధ్యతరగతి వారందరినీ గతంలో మాదిరి సినిమా చూస్తున్నంతసేపు కదలకుండా మంత్రముగ్ధుల్ని చేసినవి ఎన్నో వున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి పలు కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. అపద్భాంధవుడులో అమాయకునిగా, స్వయంకృషిలో చెప్పులు కుట్టేవాడిగా, యముడికి మొగుడు, గ్యాంగ్‌లీడర్ వంటి సినిమాల్లో మధ్యతరగతి వాళ్ల జీవితాలు ఎలా వుంటాయో అంత మమేకమై జీవించారు. వెంకటేష్ ధర్మక్షేత్రం, చంటిలో, రాజేంద్రప్రసాద్ నూటికి నూరుశాతం కుటుంబ కథా చిత్రాలే వున్నాయని చెప్పవచ్చు. సౌందర్య, వెంకటేష్ - ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు చిత్రంలో అద్భుతంగా నటించారు. కుటుంబ కథా చిత్రాలంటే మొదట సెంటిమెంట్, పేదవారి జీవితాలకు సరిపోయే చిత్రాలుగా చెప్పవచ్చు. ఈ చిత్రాల్లో ఎస్.వి.రంగారావు నుంచి ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, కృష్ణ, జగపతిబాబు, నవీన్ వడ్డే, సుమంత్, జూ. ఎన్టీఆర్ తమ ఒరవడిని కొనసాగిస్తూనే వున్నారు. గొల్లపూడి, రావుగోపాలరావు, సత్యనారాయణ అల్లు రామలింగయ్య నుంచి రావు రమేష్ వరకు అలాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మధుబాల, దివ్యభారతి, మీనా, సుహాసిని, రాశి కుటుంబ కథా చిత్రాల్లోనే కాకుండా ఇతర చిత్రాల్లోను నటించారు. ఇక హాస్యం విషయానికి వస్తే బ్రహ్మానందం- మంచి ఇమేజ్ వున్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అలనాటి అల్లు రామలింగయ్య, చలం, పద్మనాభం, సుత్తివేలు, రాజబాబు, బాబుమోహన్, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, ఏవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్‌యం, కొండవలస, ఎల్.బి.శ్రీరామ్ కుటుంబ కథాచిత్రాల్లో హీరోకు దగ్గరగా ఎప్పటికీ అంటిపెట్టుకుని వుండే పాత్రలు చేస్తూ కుటుంబంలోని వ్యక్తుల మధ్య హాస్యాన్ని తనదైన రీతిలో పండించారు. ఏదేమైనా కుటుంబ కథా చిత్రాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రేక్షకుల గుండెల్లో తమ స్థానాన్ని పదిలంగా వుంచుకుంటాయి. వాటికి ప్రేక్షకాదరణ ఎల్లప్పుడూ వుంటుంది.

-శ్రీనివాస్ పర్వతాల