ప్రకాశం

‘దేశం’ గూటికి చేరుతున్న వైకాపా తమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 12: దర్శి నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పంచన చేరుతున్నారు. గతంలో దొనకొండ మండలానికి చెందిన వైకాపా నాయకులు భారీగా శిద్దా సమక్షంలో చేరగా, తాజాగా దర్శి, తాళ్లూరు మండలాలకు చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. దీంతో దర్శి నియోజకవర్గంలోని వైకాపాకు దెబ్బమీద దెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. అసలే దర్శి నియోజకవర్గంలో వైకాపా పరిస్ధితి కష్టాల కడలిలో ఉండగా, తాజాగా వలసలు ఆ పార్టీకి భారీ నష్టాన్ని కలిగించనున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జిల్లాలో ఈనెల 16వ తేదీనుండి ప్రారంభం కానుంది. ఆయన పర్యటన దర్శి నియోజకవర్గంలో కూడా ఉండటంతో ముందుగానే పకడ్బంధీ వ్యూహంతో వైకాపాశ్రేణులను తమవైపు భారీగా తిప్పుకునే పనిలో మంత్రి శిద్దా ఉన్నట్లు సమాచారం.
ఇదిలాఉండగా తన నివాసంలో వైకాపానుండి తెలుగుదేశంపార్టీ గూటికి చేరిన వారినుద్దేశించి మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాలలో దర్శి నియోజకవర్గ రూపురేఖలు మార్చానని అన్నారు. రాష్ట్రప్రభుత్వం అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ కార్యకమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. దర్శి నియోజకవర్గ పరిధిలో గత 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని మూడున్నర సంవత్సరాల్లో 1850కోట్లరూపాయల వెచ్చించి పలు అభివృద్ధి పనులు పూర్తిచేశామని అన్నారు. దర్శి నియోజకవర్గంలో రెండుకోట్ల రూపాయలతో పార్క్‌ను అభివృద్ధి చేశామని, దర్శిలో సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా తీర్చిదిద్దామని తెలిపారు. దర్శిలో జి-ప్లస్ 2 విధానంలో 1050 కుటుంబాలు ఒకేచోట నివాసం ఉండేలా గృహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ముండ్లమూరు మండలంలో 125కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటుచేసామని చెప్పారు. దీనిద్వారా 15వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని అన్నారు. తాళ్లూరు మండలంలో మొగిలిగుండా జలశాయాన్ని పూర్తిచేసి 14గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. చంద్రన్న బీమా పథకం ద్వారా మరణించిన వారి కుటుంబాలకు రెండులక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల పార్టీ అధ్యక్షుడు నారపశెట్టి పిచ్చయ్య, మిల్లర్ బుజ్జి, తాళ్లూరు మండల నాయకులు బడే, కొండారెడ్డి, దారం సుబ్బారెడ్డి, దర్శి సర్పంచ్ జి.చిన్నగురవయ్య తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రికి
ముస్తాబైన శివాలయాలు
* శ్రీశైలం, కోటప్పకొండలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణలతో మార్మోగనున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శివాలయాలను విద్యుత్ దీపాలతో నిర్వాహకులు ముస్తాబు చేశారు. జిల్లాలోని పలు శివాలయాల వద్ద నిర్వాహకులు అన్నదానాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రధానంగా జిల్లానుండి శ్రీశైలం, కోటప్పకొండలకు భారీగా భక్తులు తరలివెళ్లనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శైవక్షేత్రాలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులన్నీ సోమవారం రాత్రినుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరనున్నాయి. అద్దంకి డిపో నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఐదు బస్సులు, చీరాల డిపో నుండి మూడు బస్సులు, మార్కాపురం డిపో నుండి 70 బస్సులు, ఒంగోలు డిపోనుండి పది బస్సులు, పొదిలి డిపోనుండి 25 బస్సులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నడపనున్నారు. అదే విధంగా అద్దంకి డిపోనుండి కోటప్పకొండకు 22 బస్సులు, చీరాల డిపోనుండి 33 బస్సులు, ఒంగోలు డిపోనుండి 45 బస్సులను నడపుతున్నారు. అదేవిధంగా భైరవకొన, మడనూరు, మొగిలిచర్లకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసారు. మొత్తంమీద మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా జిల్లాలోని శైవక్షేత్రాలన్ని విద్యుత్‌కాంతులతో దేధీప్యమానంగా వెలుగొందనున్నాయి. ఇదిలాఉండగా మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. లింగరూపంలో శివుడు జన్మించిన రోజుకు మహాశివరాత్రిగా పేరువచ్చిందని, మాఘ బహుళ చతుర్ధశిని మహాశివరాత్రిగా దేశప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారని అన్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు జిల్లా ప్రజలు ఉపవాస, జాగరణ దీక్షలతో శివుడిని భక్తిశ్రద్ధలతో పూజింజి శుభఫలితాలు పొందాలని, సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.

అడవితల్లి ఒడిలో అద్భుత శివాలయాలు
సియస్‌పురం, ఫిబ్రవరి 12: మహాశివరాత్రికి ముస్తాబైన ప్రముఖ శైవక్షేత్రం అద్భుత శివాలయాల సమాహారం భైరవకోన. కొండపై జాలువారే సెలయేరు. కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగాలు, ఎతైనకొండలు, ఆహ్లాదకరమైన ప్రకృతి, వన్యప్రాణుల సంచారం, అపురూప శిల్పకళ నైపుణ్యానికి, ప్రకృతి రమణీయతకు భైరవకోన పెట్టింది పేరు. 7,8 శతాబ్థాల్లో నిర్మితమైన ఈ ఆలయ సమాహారం పల్లవులు శిల్పకళకు అద్దం పడుతుంది. ఇక్కడ దేవాలయాలన్ని తూర్పుముఖం. కొండపై మొత్తం కోటినొక్క శివలింగాలు చెక్కినట్లు పురాణాల్లో చెబుతుండగా, అన్ని చతురస్రాకార రాతితో 18 అంగుళాలు ఎత్తు మాత్రమే ఉండటం విశేషం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే క్షేత్రంలో ఉండటం ఇక్కడ అరుదైన ఘట్టం. శశి నాగలింగాలయం, రుద్ర లింగాలయం, విశే్వశ్వర లింగాలయం, నగిరికేశ్వర లింగాలయం, పరిమేశ్వర లింగాలయం, మల్లికార్జున లింగాలయం, యక్ష గాతక లింగాలయ పేర్లుతో 8 గృహాలయాలు, త్రిముఖ దుర్గాంభ అమ్మవారి విగ్రహం వెనుక రాతితో మలిచారు. దుర్గామాత ఆలయానికి ఎదురుగా ఉన్న రాతితో కాల భైరవుని విగ్రహాన్ని మలిచారు. పల్లవ శిల్పాకారులు అయిన శ్రీశైలముని క్షేత్రాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది. మహాశివరాత్రి సందర్భంగా అనేక హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఆర్థికేతర అర్జీలు
తప్పనిసరిగా పరిష్కరించాలి
* కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 12: డబ్బులతో ప్రమేయం లేని అర్జీలను తప్పని సరిగా ప్రతి సోమవారం సాయంత్రానికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సీపీఓ కాన్పరెన్స్ హాలులో మీకోసం అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారం, ఈ- ఆఫీసు విధానం, బయోమెట్రిక్ హాజరు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కార వేదిక, ఏపీసీఎం కనెక్ట్, కైజాలా, మీకోసం ద్వారా ప్రజల నుండి వచ్చే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అర్జీల పరిష్కారం నిరంతర ప్రక్రియ అని, ప్రతిరోజు వీటిని పరిశీలించి కోర్టుకేసులు, ఇతర ముఖ్యమైన కారణాలు ఉంటే మినహాయించి మిగిలిన ఆర్థికేతర అంశాల అర్జీలు ఏ రోజుకు ఆ రోజు పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఆర్థికేతర అర్జీలను సంబంధిత శాఖల జిల్లా అధికారులు సోమవారం సాయంత్రానికి తప్పనిసరిగా పరిష్కరించాలని చెప్పారు. జిల్లాలో మార్చి నెలాఖరునాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసు విధానం, బయోమెట్రిక్ విధానం అమలు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి తరుచూ ఈ అంశాలపై సమీక్షలు జరుపుతున్నారని చెబుతూ, ఈవిధానం క్షేత్రస్థాయి నుండి జిల్లాస్థాయి వరకు అన్ని చోట్ల తప్పనిసరిగా అమలుకావాలని స్పష్టం చేసారు. ఇప్పటికే ఈ-ఆఫీసు విధానంపై ఉద్యోగులకు పలుమార్లు శిక్షణ ఇచ్చామని, ఇంకా ఎవరికైనా శిక్షణ అవసరమైతే సంయుక్త కలెక్టర్-1ను సంప్రదించాలని చెప్పారు. ఈ-ఆఫీసు, బయోమెట్రిక్ హాజరు విధానాల అమలుపై ప్రతిరోజు సమీక్ష జరపాలని సంయుక్తకలెక్టర్‌కు సూచించారు. ఏమైనా సమస్యలుంటే సంయుక్త కలెక్టర్‌ను, ఎన్‌ఐసి డిఐఒను సంప్రదించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాపరిషత్ సీఇఓఒ కైలాష్ గిరీశ్వర్, డ్వామా, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు పోలప్ప, మురళి తదితరులు పాల్గొన్నారు.