మెయన్ ఫీచర్

చట్టాలతో చెత్త నిర్మూలన సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయమై కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు- ‘మేం చెత్త ఏరుకునే వాళ్లమేం కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తే న్యాయమూర్తుల ఆవేదన, బాధ ఇట్టే అర్థమైపోతుంది. గణాంకాలు చూస్తే సామాన్యులు సైతం గుండెలు బాదుకునే పరిస్థితే. నిజమైన గణాంకాలను బయటకు రానివ్వడం లేదని కూడా ఇటీవల ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ సైతం మనసులోమాట వెల్లడించింది. ఈ సంస్థ గణాంకాల ప్రకారం దేశంలో రోజుకు ఏడు లక్షల టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. అంటే ఏటా 2,555 లక్షల టన్నుల పైచిలుకే. ఇందులో ఘన, ద్రవ, వాయు వ్యర్థపదార్ధాలున్నాయి. ఈ చెత్త మిగిలిన కాలుష్య కారకాలకు అదనం. ఇంత చెత్తలోనూ దాదాపు 50 శాతానికి పైగా అసలు సేకరణే జరగడం లేదు. సగం చెత్తను సేకరిస్తున్నా దానిని సైతం సక్రమంగా నిర్వహించడం లేదని నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికే స్పష్టం చేస్తోంది. ఇందులో తడి, పొడి చెత్తలను వేరుగా చేస్తే వచ్చే ఘన వ్యర్థాల పరిస్థితి మరీ ఘోరం. చాలా వరకూ నేరుగా భూమిలో వాటిని పడేస్తుండటంతో నేల కలుషితమవుతోంది. ఫలితంగా జల కాలుష్యంతో పాటు ప్రజల మానసిక స్థితిపైనా, శారీరక ఎదుగుదలపైనా, సామాజిక అంశాలపై చెత్త ప్రభావం పడుతోంది. మరో పక్క పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
వాతావరణంలో అనూహ్య మార్పుల ప్రభావంతో కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చి జనంపై పెను ఆర్థిక భారం పడుతోంది. ఇది ప్రభుత్వ పాలనపైనా, ఆర్థికాభివృద్ధిపైనా ప్రభావం చూపుతోంది. ఇంటింటి చెత్తను ఏరివేసే కార్యక్రమం పట్టణాల్లో ఇపుడిపుడే ప్రారంభమైనా, పరిశ్రమలు, ఆస్పత్రులు, వ్యాపార సంస్థలు, హోటళ్లు ఉత్పత్తి చేసే చెత్త సంగతి దారుణం. పర్యావరణ పరిరక్షణకు దేశంలో కొదవలేని చట్టాలున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం-1996, జలకాలుష్య నివారణ, నియంత్రణ చట్టం -1974, జాతీయ పర్యావరణ పరిరక్షణ ట్రిబ్యునల్ యాక్ట్ 1995, పట్టణ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ-యాజమాన్య నిబంధనలు-2017 వంటి చట్టాలున్నా వాటి అమలులో లోపంతో భారత్ ఒక చెత్తదేశంగా మారిపోతోందనే ఆందోళనను ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేసింది. స్టాక్‌హోం డిక్లరేషన్ -1972, రియో సమ్మిట్ -1992, యుఎన్‌ఇపి, ఓజోన్ డిక్లరేషన్ వంటి అంతర్జాతీయ వేదికల్లో సైతం చెత్త ప్రస్తావన వచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలో వ్యర్థాల నియంత్రణ చర్యలను సూచించినా అందుకు తగ్గ ప్రయత్నం క్షేత్ర స్థాయిలో జరగలేదన్నది నిర్వివాదాంశం. అమెరికా, చైనా, జపాన్, సింగపూర్, స్పెయిన్ మరికొన్ని ఐరోపా దేశాలు వ్యర్థపదార్థాల యాజమాన్యంలో అగ్రస్థానంలో ఉన్నాయి. వౌలిక సదుపాయాలతో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఆస్ట్రియా వంటి దేశాలు కూడా సరికొత్త ఒరవడిని దిద్దుతున్నాయి. ఎప్పటికపుడు చెత్తను సేకరించడం, శాస్ర్తియ పద్ధతిలో వ్యర్థాన్ని అర్ధంగా మార్చడంలో ఈ దేశాలు ముందున్నాయి. పెద్ద ఎత్తున చెత్తను ఉత్పత్తి చేసే కేంద్రాల వద్దనే కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. స్థానిక అవసరాల కోసం చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, మరికొన్ని చోట్ల మోటార్లకు వినియోగించే ఇంధన తైలాన్ని తయారు చేస్తున్నారు. చెత్తను మార్చే క్రమంలో వాయు కాలుష్యం, దుర్వాసనలు రా కుండా ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి.
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ 2015లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఏటా ఆరు కోట్ల 20 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. అందులో ప్లాస్టిక్ వ్యర్థాల వాటా 56 లక్షల టన్నులు, 79 లక్షల టన్నుల వరకూ హానికర వ్యర్థాలున్నాయి. 15 లక్షల టన్నుల వరకూ ఈ- వ్యర్థాలున్నాయి. ఇవన్నీ భారీ ఎత్తున జీవ వ్యర్థాలుగా పోగుపడుతున్నాయి. పురపాలక సంస్థలు సేకరిస్తున్న నాలుగు కోట్ల 30 లక్షల టన్నుల చెత్తలో పరిశుద్ధీకరణ, పునర్ వినియోగం ప్రక్రియలకు నోచుకుంటున్నది కేవలం 25 శాతం మాత్రమే. ‘అసోచామ్’ నివేదిక ప్రకారం 2020 నాటికి ఈ-వ్యర్థాలు 260 మెట్రిక్ టన్నులకు పెరుగుతాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా వందల రెట్ల చెత్త ప్రతి ఏటా పెరుగుతోంది. 2015 లెక్కల ప్రకారం రోజూ ఢిల్లీలో 8700 టన్నులు, బెంగళూరులో 3700 టన్నులు, ముంబయిలో 11వేల టన్నులు, అహ్మదాబాద్‌లో 2500 టన్నులు, హైదరాబాద్‌లో 4000 టన్నులు, చెన్నైలో 5వేల టన్నులు, కోల్‌కతలో 4వేల టన్నుల చెత్త పోగవుతోంది. కాన్పూర్ ఐఐటీ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో ఘన, ద్రవ, వాయుస్థితిలోని రెండు లక్షల టన్నుల చెత్త రోజూ ఉత్పత్తి అవుతుండగా కనీసం 15 శాతం చెత్తను కూడామనం పట్టించుకోలేకపోతున్నామన్నది తేలింది. ఊరవతల పారేస్తున్న చెత్త పట్టణాలకే కాదు, గ్రామాలకు సైతం గుదిబండగా తయారైంది. ఆ చెత్తను ఎక్కడికి తరలించాలనేది పెనుసవాల్‌గా మారింది. దీనిని ఎక్కడ వేద్దామన్నా, ఆ పరిసర ప్రాంతాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త వేయడానికి అనువైన ప్రదేశాలు దొరకడం లేదు. ఫలితంగా డంపర్ బిన్లు నిండిపోయి వ్యర్థపదార్థాలు పేరుకుపోతూ జనావాసాల మధ్య దుర్వాసన హడలెత్తిస్తోంది. చెత్త వేయడానికి వెసులుబాటు లేక పారిశుద్ధ్య సిబ్బంది డంపర్ బిన్లు తీసుకువెళ్లడం లేదు. ఇపుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్‌లో మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. చెత్తను తొలగించడానికి ప్రభుత్వాలకు కోట్లాది రూపాయిలు ఖర్చవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019 నాటికి దేశంలో నాలుగు వేలకు పైగా నగరాల్లో ఘన వ్యర్థాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. స్వచ్ఛ భారత్ నినాదంతో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా చెత్త నుండి విద్యుత్, ఎరువుల తయారీకి ప్రాజెక్టులను సిద్ధం చేసింది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను శాస్ర్తియ పద్ధతిలో నిర్వహించడంలో కొన్ని పట్టణాలు ముందంజలో ఉన్నాయి. హైదరాబాద్‌లో వ్యర్థపదార్థాల నుండి వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనివల్ల మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండువిధాలా లాభం ఉంది. చెత్త వేయడానికి ఉన్న స్థలం ఎక్కువకాలం ఉపయోగంలో ఉండటం, తయారైన వర్మీ కంపోస్టును విక్రయించడం ద్వారా ఆదాయం, ఇలా రెండు విధాలా లబ్ది చేకూరుతోంది. ఇతర కార్పొరేషన్లు చెత్తను ఒక పద్ధతి ప్రకారం భూమిలో పాతిపేట్టే పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక పొర వ్యర్థ పదార్ధాలు వేసిన తర్వాత గ్రావెల్ చేయడంతో భూమిలో త్వరగా కలిసిపోతున్నాయి. రెండు మూడు రోజులకోమారు బ్లీచింగ్ చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో చెత్తను అక్కడే తగుల బెడుతున్నారు. దీనివల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. పనికి రాని చెత్త నుండి ఉపయోగపడే వాటిని విడదీసి ఆదాయం ఆర్జించే వినూత్న పథకానికి విశాఖలో ఇండియన్ టొబాకో కంపెనీ శ్రీకారం చుట్టింది. 30 శాతం వరకూ ఉండే పొడిచెత్త, కాగితాలు, ప్లాస్టిక్, ఇనుము, ఇతర లోహ వస్తువులను ప్రత్యేక సంచుల్లో నిల్వ ఉంచితే వాటి బరువు ప్రకారం డబ్బు చెల్లించి, నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని తీసుకువెళ్తుంటారు. ఈ పథకం వల్ల 30 శాతం చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండానే ఆదా చేసినట్టే. ఇలాంటి వినూత్న ప్రయోగాలను మిగిలిన పట్టణాలు కూడా అనుసరిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల ముప్పు ముంచుకొస్తున్నా ప్రభుత్వాలు మాత్రం నిద్రాణావస్థలోనే ఉండటంతో సుప్రీంకోర్టు పదునైన మాటలతో నిద్రలేపాల్సి వచ్చింది. ఘన వ్యర్థాల నిర్వహణలో వైఫల్యం కారణంగా దోమల సంతతి విస్తరించి ప్రబలిన డెంగ్యూ వ్యాధి కారణంగా ఏడేళ్ల బాలుడు మరణించిన ఘటనపై తనంతట తానుగా సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబర్‌లో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలను సంధించినపుడు రాష్ట్రాల నుండి, కేంద్రం నుండి తగిన సమాధానం రాలేదు. ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలాంటి చర్యలు చేపడుతున్నాయో తెలపాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అవి రాష్ట్ర స్థాయి సలహా బోర్డులను ఏర్పాటు చేశాయా? ఎపుడు చేశాయి? సభ్యులు ఎవరున్నారు? అనే సమాచారాన్ని అందించాలని సూచించింది. న్యాయస్థానం సూటిగా ఆక్షేపించడంతో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మొదటివారంలో 845 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం కొన్ని ప్రశ్నలు అడగ్గా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన కౌన్సిల్ సరిగా సరైన సమాధానం ఇవ్వకపోయారు. దీంతో కేంద్రంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ చెత్తను మా మీద పడేయాలని చూస్తున్నారా? అఫిడవిట్‌లో ఏముందో మీరు పూర్తిగా చూడలేదు, కానీ మేం చూడాలని అనుకుంటున్నారా? ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయకండి , మేం చెత్తను ఏరుకునే వాళ్లం కాదు, మీరు సమర్పించిన దాని గురించి స్పష్టంగా తెలుసుకుని రండి, ఈ అఫిడవిట్‌ను మేం తీసుకునేది లేదు..’ అంటూ ధర్మాసనం చివాట్లు పెట్టింది. ఘనవ్యర్థాల నిర్వహణపై పూర్తి వివరాలను చార్టు రూపంలో మూడు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది.
ఘనవ్యర్థాలపై దేశంలో 18 ఏళ్ల క్రితమే స్పష్టమైన నిబంధనలున్నాయి. 2000 సెప్టెంబర్‌లో విధాన పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. 1999లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఘనవ్యర్థాల యాజమాన్యంపై నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ప్రభుత్వం ఈ విధాన పత్రాన్ని రూపొందించింది. తర్వాత పట్టణాల్లో ఘన వ్యర్థాల యాజమాన్యంపై నిబంధనలను రూపొందించింది. ఆ నిబంధనల్లో చెత్త సేకరణ, నిర్వహణ, అనంతర చర్యలపై సూచనలున్నాయి. ఘన వ్యర్థపదార్థాల యాజమాన్య నిబంధనలు -2017 సమగ్ర స్వరూపాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కాగితాలకే పరిమితం కావడం గమనార్హం. 2016లో క్రోడీకరించిన విధి విధానాలు నేటికీ మన్ననకు నోచుకోలేదు. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలాంటి స్పందన చూపలేదు. 2016, ఏప్రిల్ 8న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా రాష్ట్రాల్లో చైతన్యం లేకపోవడం చూస్తుంటే ఆచరణీయ నిబంధనల విషయంలోనూ వాటి సాచివేత ధోరణి అర్థమవుతోంది. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న వ్యర్థాన్ని అర్థంగా మార్చుకోవడమే మనముందున్న తెలివైన పరిష్కారం. హైదరాబాద్‌లో జరిగిన ‘కాప్’ సదస్సులోనూ అంతర్జాతీయ నిపుణులు చెప్పింది ఇదే. 2020 నాటికి ప్రతి దేశం సగానికి పైగా చెత్తను పునర్వినియోగించుకునే స్థాయికి ఎదగాలి. ఇదంతా ప్రభుత్వమే చేస్తుందని, చేసి తీరాలని పౌరులు భావిస్తే- అది వారు తమ విద్యుక్త ధర్మాన్ని విస్మరించడమే.

-బి.వి. ప్రసాద్