AADIVAVRAM - Others

ది ఫోన్‌కాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ గదిలో కాంతి చాలా మంద్రంగా ఉండటంతో, చూడగానే అది ఖాళీగా ఉంది అనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత బల్ల వెనక కుషన్ కుర్చీలో కూర్చున్న ఆయన ఫోన్ రిసీవ ర్ని అందుకున్నాడు. నంబర్ చూడకుండానే ఆయన దాని బటన్స్‌ని నొక్కాడు. అవతలి వైపు రిసీవర్ ఎత్తేదాకా వేచి ఉన్నాడు.
‘హలో’ ఓ వృద్ధురాలి కంఠం వినిపించింది.
‘మిసెస్ హానా జెల్బ్‌మేన్?’ ఆయన నెమ్మదిగా, మృదువుగా అడిగాడు.
‘అవును. నేను హానా జెల్బ్‌మేన్‌ని. మీరెవరు?’
‘హానా! నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. చాలాకాలంగా నువ్వు కష్టమైన జీవితాన్ని గడుపుతున్నావు. అనేక నిరాశలు, కష్టాలను అధిగమించావు. నీ బాధలన్నీ అంతమయే సమయం నీకు ఆసన్నమైంది’
‘మీరెవరు? ఈ మూర్ఖపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ కాల్‌ని ట్రేస్ చేయమని నేను పోలీసుల్ని కోరనా?’ ఆవిడ కోపంగా అడిగింది.
‘శాంతం హానా. మీకు ఎలాంటి హానీ చేసేవాడిని కాను. మీరు శాంతిని పొందడానికి సహాయం చేసేవాడిని మాత్రమే. నిజం చెప్పండి. మీరు చాలా బాధలు అనుభవించలేదా? మీకు ఇకనైనా సుఖశాంతులు అక్కర్లేదా?’
‘మీరెవరు? ఏదైనా మత సంస్థకి చెందినవారా? చందా కోరి ఫోన్ చేశారా? ఐతే మీరు మనిద్దరి సమయాన్ని వృథా చేస్తున్నారు. నేను ఓ పెన్నీ కూడా ఏ మత సంస్థకీ ఇవ్వను’ హానా కఠినంగా చెప్పింది.
‘కాదు. నేను ఏ మత సంస్థకీ చెందినవాడిని కాను. కాని అన్ని మతాలు నా ఉనికిని అంగీకరిస్తాయి. నేను చేసే పని వెనక ఉన్న ఆధ్యాత్మిక లాజిక్‌ని అవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేసాయి’
‘ఇంతకీ మీరెవరో చెప్పరే?’ ఆవిడ అరిచింది.
ఈసారి ఆవిడ కంఠంలో కొంత ఆసక్తి ధ్వనించింది. ఆయన తన నించి ఏం కోరుకుంటున్నాడో ఆవిడకి అర్థం కాలేదు. కాని లైన్ కట్ చేయకుండా ఆయన చెప్పేది వినాలని మాత్రం నిశ్చయించుకుంది.
‘నేను మృత్యుదేవతని. ఇటీవల మీరు నన్ను మీ కష్టాల్లోంచి బయటపడేయమని పదేపదే ప్రార్థించలేదా? మీ వృద్ధాప్యం వల్ల తమకి కలిగే బాధతో మీ బంధువులు మిమ్మల్ని విస్మరించడం వల్ల మీరు విసిగిపోలేదా? మీకు అసలు ఈ రోజు తారీకైనా తెలుసా?’
‘ఓ ముసలి దాని మీద ఇంత కఠినమైన జోక్‌ని వేయడం క్రూరత్వం. నువ్వు పిచ్చివాడివి. ఈ పిచ్చితనాన్ని నేను భరించలేను. రిసీవర్ని పెట్టేస్తున్నాను’ ఆవిడ ఆక్రోశంగా చెప్పింది.
‘మీ పేరు హానా జెల్బ్‌మేన్. మీరు నంబర్ 421 ఫారెస్ట్ లేన్‌లో గత నలభై నాలుగేళ్లుగా నివసిస్తున్నారు. మీకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 1993లో మీ చెల్లెలు అకీ గెయిల్ ఫ్లోరిడాకి వచ్చి 2009లో తను మరణించే దాకా అక్కడే నివాసం ఉంది. మీ ఇంకో చెల్లెలు ఈస్థర్ మీ ఇంటి వెనక సందులో మోటార్‌కార్ ప్రమాదంలో మరణించే దాకా, అంటే 2007 దాకా నివసించింది. మీరు ఏషర్ జెల్బ్‌మేన్‌ని పెళ్లి చేసుకుని అరవై మూడేళ్ల పాటు ఆయనతో కలిసి జీవించారు. ఆయన 2003లో గుండె పోటుతో మరణించారు. ఇంకా చెప్పనా? నేను ఎంత చెప్తే మీరు నన్ను నమ్మగలరు’
హానా ఆ ప్రశ్నకి జవాబు చెప్పే ముందు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది.
‘నువ్వు చెప్పిన వివరాలన్నీ అనేక ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవే. బర్త్ సర్ట్ఫికెట్, మేరేజ్ సర్ట్ఫికెట్, డెత్ సర్ట్ఫికెట్, టేక్స్‌లు చెల్లించిన రికార్డులని తెలివైన మోసగాడు తేలిగ్గా సంపాదించగలడు.’
‘చాలా తెలివిగా ఆలోచించావు హానా. వృద్ధాప్యం మీనీ మెదడుని డల్ చేయలేదు. కాని నీ భర్త ప్రియురాలు షరోన్ డెల్ మాటేమిటి? అది చాలా రహస్యంగా జరిగిన ప్రణయం కదా? దాన్ని నువ్వు మీ చెల్లెళ్లకి కూడా చెప్పలేదు. పూర్తిగా కొత్తవాడైన నాకు అది ఎలా తెలుస్తుంది?’
‘ఒకవేల అలాంటిదే జరిగి ఉంటే మిస్ డెల్‌కి లంచం ఇచ్చి నువ్వా వివరాలని సంపాదించి ఉండచ్చు’
ఆయన మృదువుగా నవ్వి చెప్పాడు.
‘నన్ను అనుమానిస్తున్నందుకు మిమ్మల్ని తప్పు పట్టను. నేను ఎవరికి ఫోన్ చేసినా దాదాపు అంతా ముందుగా ఇలాగే నన్ను అనుమానిస్తారు. వారికి నేను బాధ నించి విముక్తిని శాశ్వత శాంతిని ఇవ్వబోతున్నానని గ్రహించేదాకా ఈ అనుమానం వదలదు’
‘ఇంక చాలు. నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. మృత్యుదేవత ఫోన్‌ని ఎందుకు ఉపయోగించడం? కావాలనుకుంటే ఇప్పుడు నా లివింగ్ రూంలో నా ముందు ప్రత్యక్షమై ఉండేవాడివి’
‘మృత్యుదేవత టెలీఫోన్ని ఎందుకు ఉపయోగించకూడదు? అది సమాచారం ఇచ్చిపుచ్చుకునే అత్యంత సాధారణ పరికరం. నేను అకస్మాత్తుగా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాకు స్వాగతం పలకాలంటే ముందుగా నా గురించి నమ్మకంగా మీకు తెలియాలి. గాల్లోంచి అకస్మాత్తుగా నేను ప్రత్యక్షమైతే చాలామంది భయపడతారు. మిమ్మల్ని నేను అలా భయపెట్టకూడదు కదా? నా లక్ష్యం ఎవరికైనా ఆనందాన్నివ్వడం తప్ప దుఃఖాన్ని కాదు’
‘నువ్వు పిచ్చివాడివి. ఉన్మాదివి. రిసీవర్ పెట్టేస్తున్నాను’ హానా అరిచింది.
‘నాకు కోపం తెప్పించకండి హానా. మీరు రిసీవర్ పెట్టేస్తే నేను మళ్లీ మీకు కనీసం పదేళ్లపాటు ఫోన్ చేయను. మీ జీవితాన్ని మీరు అంతకాలం భరించగలరా? వృద్ధాప్యంలో తప్పనిసరిగా రాబోయే బాధల గురించి ఆలోచించండి. ఇప్పటికే మీరు అనుభవించే బాధల మాటేమిటి? భౌతికమైనవే కాదు, మానసికమైనవి. మేథోపరమైనవి కూడా చాలా పొంచి ఉన్నాయి. ఇంకా మీ జీవితాన్ని కొనసాగించడంలో అర్థం ఏమిటి? మీకు అవసరం అనుకున్న అన్నిటినీ ఇప్పటికే మీరు అనుభవించి పూర్తి చేయలేదా?’
‘ననే్నం చేయమంటావు?’ కొద్ది క్షణాలు ఆలోచించి హానా మృదువుగా అడిగింది.
‘ఇప్పుడు మీరు సౌకర్యవంతమైన మీ ఆకుపచ్చ రంగు కుషన్ కుర్చీలోనే కూర్చుని ఉన్నారు కదా?’
‘అవును’ ఆవిడ ఆశ్చర్యంగా చెప్పింది.
‘ఐతే రిలాక్స్ అవుతూ నా కంఠానే్న వింటూండండి. నేను మిమ్మల్ని పరిపూర్ణ శాంతి, బ్రహ్మానందం గల ప్రదేశానికి తీసుకెళ్లడానికి మార్గదర్శకత్వాన్ని ఇస్తాను. కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్లు మూసుకోండి. మీ శరీరం మొత్తం రిలాక్స్ కానీండి. మీకు విశ్రాంతి చాలా అవసరం. మీ జీవితం మొత్తం మీరు ఇతరుల కోసం చాలా చేసారు. మీ కోసం మీరు ఆలోచించుకునే హక్కుని, ప్రశాంతతని పొందే హక్కుని మీరు పొందారు’
‘నాకు భయంగా ఉంది. నాకు ఏం అవబోతోంది?’ హానా భయంగా అడిగింది.
‘శాంతపడండి. అంతా బాగా జరుగుతుంది. ఈ క్షణం నించి కొన్ని నిమిషాల్లో మీరు మీ భర్తని, మీ ఇద్దరు చెల్లెళ్లని ఇంకాస్త మంచి లోకంలో కలుసుకుంటారు. వాళ్లు మీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ, మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నా కంఠానే్న వింటూ మీ మనసుని ఓ చల్లటి, మృదువైన గాలి తెరలో ఎగరనీండి. ఆ పని చేయగలరా హానా?’ ఆ కంఠం ఎంతో ఆర్ద్రంగా అడిగింది.
‘చేయగలను అనుకుంటాను’
‘మంచిది. కొద్ది క్షణాల్లో మీ ఎడమ చేయి మొద్దుబారడం మీరు గమనిస్తారు. భయపడకండి. దీన్ని ఎంత బాధారహితంగా వీలైతే అంత బాధారహితంగా చేస్తాను. రిలాక్సై, జరిగేది చూస్తూండండి’
‘నా చెయ్యి నిజంగానే తిమ్మిరెక్కింది. ఇప్పుడు నేనేం చేయాలి?’
‘శాంతంగా ఉండండి హానా. ఆ తిమ్మిరి మీ కొత్త ప్రదేశ ప్రయాణానికి ఆరంభం అనుకోండి. ఆ భావనతో మీ చేతి తిమ్మిరి ఇప్పుడు భుజం దాకా పాకడం గమనించండి. వయసు పైబడి, శిథిలమైన ఈ దేహం ఇక మీకు అనవసరం అని, దాంతో పని లేదని భావించండి.’
‘నా ఛాతీలో ఏదో గట్టిపడ్డ భావన కలుగుతోంది. అది బాధని కలిగించదన్నారు?.. దయచేసి ఆపండి. బాధగా ఉంది’ హానా అర్థించింది.
‘అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది హానా. దాన్ని పట్టించుకోకండి. మీ ఆత్మకి దాని దారి ఇప్పటికే తెలిసింది. కాబట్టి దాంతో పోరాడి ఆపే వృధా ప్రయత్నం చేయకుండా దానికి సహకరించండి. మీ అదృష్టం. ఇలా మృత్యుదేవత మార్గదర్శకత్వం అందరికీ లభించ...’
‘ఆపు. నేను.. నేను ఊపిరి తీసుకోలేక పోతున్నాను. బయటకి వెళ్లిన నా శ్వాస తిరిగి రావడం లేదు. దయచేసి ఆపు.. ఆ...పు’
ఆయన ఏదో కింద పడ్డ చప్పుడు విన్నాడు. తర్వాత అంతా నిశ్శబ్దం. కొన్ని నిమిషాల సేపు ఆయన ఆ నిశ్శబ్దాన్ని సహనంగా విన్నాడు. మళ్లీ హానా కంఠం కాని, కదలికలు కాని ఆయనకి వినపడలేదు. ఇంకే శబ్దాలు కూడా.
ఆయన నెమ్మదిగా బల్ల మీద తెరచి ఉన్న నోట్‌బుక్‌లో రాసిన ఓ కొత్త నెంబర్ బటన్స్ నొక్కాడు.
‘హలో’ ఓ యువకుడి కంఠం వినిపించింది.
‘మిస్టర్ ఫ్రెన్. మీ అత్త హానా ఇప్పుడే హార్ట్ అటాక్‌తో మరణించింది.’
‘ఆవిడకి హృద్రోగం ఉందని మీకు ఎలా తెలుసు?’
‘నా క్లైంట్స్ గురించి సర్వం తెలుసుకుంటూంటాను మిస్టర్ ఫ్రెన్. రేపు మధ్యాహ్నానికల్లా మీరు మళ్లీ అదే ప్రదేశంలో మిగిలిన సగం ఫీజ్‌ని ఉంచాలి.’
‘అది అసాధ్యం. ఎవరికీ అనుమానం రాకుండా నేను అంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తాన్ని ఎలా సంపాదించగలను? అందుకు నాకస కనీసం వారం పడుతుంది.’
‘మన మధ్య ముందు జరిగిన ఒప్పందం ప్రకారం మీరా డబ్బుని ఇరవై నాలుగు గంటల్లో చెల్లిస్తున్నారు. లేదా ఈ వారాంతంలో మీ వారసులు మీ అత్త ద్వారా మీకు లభించిన ఆస్థికి వారసులు కాబోతున్నారు అని గుర్తుంచుకోండి.’
ఆయనకి అవతల నించి చిన్నగా నవ్వు వినపడింది.
‘నన్ను బెదిరించలేరు. నేను అనారోగ్యపు, అమాయక వృద్ధురాలిని కాను. నాకు మీరు హార్ట్ అటాక్‌ని కలిగించలేరు.’
‘లేదు మిస్టర్ ఫ్రెన్. మీ విషయంలో హార్ట్ ఎటాక్ కాదు. మీ చావు సహజ మరణంగా కనిపించాల్సిన అవసరం లేదు. నేను నా ఊహాశక్తిని మీ చావు విషయంలో మరింత విస్తారంగా, మీ వయసుకి తగ్గట్టుగా ఉపయోగించగలము.’
ఆయన తన ఫీజ్ ముడుతుందా అన్న సంగతి ఆలోచించలేదు. తనకి తప్పనిసరిగా చెల్లింపు జరుగుతుందని గతానుభవాలని బట్టి ఆయనకి తెలుసు.
ఓ విధంగా లేదా మరో విధంగా ఆయనకి బేలన్స్ చెల్లింపు జరుగుతూంటుంది.

(రోమన్ ఏ రనైరీ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి