హైదరాబాద్

సంక్షేమం, అభివృద్ధిలో కాంగ్రెస్‌కు ఎవరూ లేరు పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరూర్‌నర్, జనవరి 24:గ్రేటర్ హైదరాబాద్‌గా నగరాన్ని ఏర్పాటు చేసి, విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్‌నగర్ డివిజన్‌లో ఆదివారం ఆమె మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థి లోకసాని నీరజ కొండల్‌రెడ్డితో కలసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ విశ్వనగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఔటర్ రింగ్‌రోడ్, అంతర్జాతీయ విమనాశ్రయం, పరిశ్రమల ఏర్పాటుకు ల్యాండ్ బ్యాంక్, మంచి నీటి వసతే కారణం అని అన్నారు. ఇవన్నీ చేయడంతో పెద్దపెద్ద కంపెనీలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి టిఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదని ఆమె తెలిపారు. తెలంగాణలో మొత్తం నాల్గుకోట్ల మంది ఉంటే, హైదరాబాద్‌లో నగరశివారు ప్రాంతాలతో కలిపి దాదాపు 1.50 కోట్ల జనాభా ఉందన్నారు. ప్రజల భవిష్యత్తు అవసరాలను, నగరం చుట్టూ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని కృష్ణా వాటర్ ఫేజ్ 1, ఫేజ్ 2తో పాటు అసాధ్యం అనుకున్న గోదావరి జలాలను నగరానికి తీసుకువచ్చామని ఆమె గుర్తుచేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు, రెండువేల కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఆమె తెలిపారు.
అరవై వై సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం 18 నెలల్లో ఏమి చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీ టిఆర్‌ఎస్‌కు అభ్యర్థులు లేకపోవడంతో సగంమంది కాంగ్రెస్ వారినే నిలబెట్టారని విమర్శించారు. మూడు నెలల్లో ఎన్‌టిఆర్ నగర్‌ను రెగ్యులరేషన్ చేస్తానన్న ముఖ్య మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వాగ్దానం ఏమైందని ఆమె ప్రశ్నించారు. లంకలో పుట్టిన ప్రతి ఒక్కరూ రాక్షసులే, ఆంధ్రలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలంగాణ ద్రోహులు అన్న టిఆర్‌ఎస్ సీమాంధ్రులను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని విమర్శించారు. మహిళలకు మంత్రి మండలిలో స్థానం కల్పించని టిఆర్‌ఎస్ మహిళలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ మాయమాటలను నమ్మకుండా, నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెల్పించాలని ఆమె కోరారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని అంటున్న మంత్రులు, గ్రేటర్ నిధులను కాజేయటానికే అని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి విమర్శించారు. ఇప్పటికే గ్రేటర్ నిధులు దుర్వినియోగం భారీ ఎత్తున జరుతుందనడానికి మెట్రోపిల్లర్లకు ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులే నిదర్శనం అని మల్‌రెడ్డి అన్నారు. సీమాంధ్రులను విపరీతంగా తిట్టిన టిఆర్‌ఎస్ సిగ్గు లేకుండా ఓట్లు ఎలా అడుగుతుందని ఆయన విమర్శించారు. నగరం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఆయన కోరారు.
సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయి
ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడి టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం, హెచ్‌యూజె సంయుక్త ఆధ్వర్యంలో మీట్ ది మీడియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో తమకు పోటీ ఎవరూ లేరని, రెండు, మూడవ స్థానాలు ఎవరికి దక్కుతాయో టిడిపి, కాంగ్రెస్‌లు తేల్చుకోవాలని అన్నారు. ఏళ్ల పోరాటం అనంతరం ఏర్పడ్డ తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా దూసుకుపోతున్నామని అన్నారు. పేదింటి యువతుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, మిషన్ భగీరధ, ఉద్యోగుల వేతనాల పెంపువంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఉద్యమ సమయంలో ఆవేశంతో మాట్లాడి ఉండవచ్చుకాని రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని ప్రాంతాల వారికి భధ్రత కల్పించడంలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. నగరాన్ని గ్రీన్, క్లీన్, స్మార్ట్, సేవ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రజలంతా తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. గ్రేటర్‌లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని చేజిక్కించుకొని నగరాన్ని విశ్వనగరంగా మార్చుతామని చెప్పారు.
టిఆర్‌ఎస్‌కు కార్మికుల అండదండలు మెండు
రాజేంద్రనగర్: గత ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోకపోవడంతో నేటికీ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని టిఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబాబు అన్నారు. ఆదివారం కాటేదాన్ పారిశ్రామికవాడలో కార్మికులు, పరిశ్రమల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కేసిఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. కార్మికుల సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. నేడు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గత పాలకులైన టిడిపి, కాంగ్రెస్‌లు తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం చర్యలు చేపడుతుంటే వాటిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక చొరవతో ఎనిమిది గంటల పనిదినాలు, కార్మిక చట్టాల అమలు, పరిశ్రమల అభివృద్ధి, కోతలు లేని విద్యుత్ సరఫరా అమలు జరుగుతోందన్నారు. అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా విద్యుత్ నిరంతరాయంగా అందిస్తూ పరిశ్రమలలో పనిచేసే కార్మికులపాలిట దైవంగా మారారన్నారు. కార్మికులకు యజమానులు సైతం బాసటగా నిలిచి సహకరించాలన్నారు. ఈనెల 27న పారిశ్రామికవాడలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు మంత్రి కేటిఆర్ హాజరుకానున్నారన్నారు. ఈ సభలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. టిఆర్‌ఎస్ కార్మిక విభాగం డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి బాసటగా నిలిచి ఆయన గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ డివిజన్ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కార్మిక విభాగం అధ్యక్షుడు పి.నారాయణ, రాజేంద్రనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు పానుగంటి ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌడెల్లి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి, రాములు యాదవ్, కాటేదాన్ కార్మిక విభాగం అధ్యక్షుడు దేవులపల్లి స్వామి, మంచర్ల చిరంజీవి, సూర్యం తదితరులు పాల్గొన్నారు.
గుడిమల్కాపూర్‌లో బిజెపి విజయం ఖాయం
నార్సింగి: టిఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే ఈ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తాయని గుడిమల్కాపూర్ డివిజన్ అభ్యర్ధి దేవర కరుణాకర్ అన్నారు. అదివారం ఉదయం మార్కండేయనగర్, శారదానగర్, ఎస్‌బిఐ కాలనీ, ఉషోదయ కాలనీలో సాయంత్రం మహేష్‌నగర్, గాయత్రినగర్‌లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తాను డివిజన్‌లో కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ అభివృద్ధే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుడిమల్కాపూర్‌లో మురికివాడలు లేకుండా నెంబర్‌వన్ డివిజన్‌గా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కాగా డివిజన్‌లో నాల్గవ సారి బిజెపి అభ్యర్థిగా గెలుపొందుతానని తెలిపారు. అశోక్‌యాదవ్, దేవర శ్రీనివాస్, కరణ్‌కుమార్ క్లామేకర్, డిజ్వర్‌సింగ్, చంద్రకళతో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
లంగర్‌హౌస్‌లో...
రెండవసారి బిజెపి అభ్యర్ధి గెలవడం ఖాయం అని లంగర్‌హౌస్ మాజీ కార్పొరేటర్ సి.ఉదయ్‌కుమార్ అన్నారు. లంగర్‌హౌస్ బిజెపి అభ్యర్ధి సగంధ పుష్పా అదివారం ఉదయం ఇబ్రహీంబాగ్‌లో, సాయంత్రం రాందేవ్‌గూడలో ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లంగర్‌హౌస్‌లో చేసిన అభివృద్ధే మళ్లీ బిజెపి అభ్యర్థిని గెలిపిస్తుందని పేర్కొన్నారు.
లంగర్‌హౌస్ ప్రజలు బిజెపి వైపే ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా కేసిఆర్ ప్రభుత్వం నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. అనంతరం బిజెపి అభ్యర్ధి సుగంధ పుష్పా మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో తన గెలుపు ఖాయం అని అన్నారు. డివిజన్‌లో బిజెపి తప్ప ఏ పార్టీ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. డివిజన్‌లో గెలుపు ఖాయం అని తెలిపారు.