విశాఖపట్నం

వైసీపీ ఎంపీల రాజీనామా నిర్ణయంతో టీడీపీలో గుబులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న ప్రకటనతో టీడీపీలో గుబులు పుట్టిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మద్దిలపాలెంలో వైసీపీ నూతన కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన ఆయన అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకాలం ఒక్క ప్రకటన చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కేంద్రాన్ని వెనకేసుకొచ్చిన టీడీపీ చివరి బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గొంతుచించుకోడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ప్రకటించిన టీడీపీ ఒక్కసారిగా కేంద్ర తీరుపై విమర్శనాస్త్రాలు సంధించడం డ్రామాగా అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ ఉద్యమిస్తోందని, ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఎంపీలు పార్లమెంట్ సమావేశాల చివరి రోజున పదవులకు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అదే జరిగితే వైసీపీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతారని భావించి కొత్త నాటకానికి చంద్రబాబు తెరతీశారన్నారు. హోదా కోసం వైసీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ స్వార్ధమే రాష్ట్రానికి శాపమన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు అవసరమైతే కోర్టుకు వెళతానంటూ ఇప్పుడు సరికొత్త నాటకానికి తెరతీస్తున్నారని, దీనిలో భాగంగానే ఎంపీలు పార్లమెంట్‌లో ఉత్తుత్తి నిరసనలు తెలిపారన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్న రాష్ట్రానికి మనం ఇచ్చేదేముందని కేంద్రం కూడా ఏపీకి నిధులు కేటాయించట్లేదన్నారు. ప్రజల బాగోగులను పక్కనపెట్టి చంద్రబాబు రాజకీయ క్రీడలు ఆడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తానే సమాధికట్టుకుంటున్నారన్నారు. జన్మభూమి కమిటీల్లో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆడగాలతో ప్రజలు విసిగిపోయారని, వారే ప్రభుత్వానికి చరమగీతం పాడుతారన్నారు. ప్రత్యేక హోదాతో వచ్చేదేమీ లేదంటూ ప్రకటించిన టీడీపీ నేతలు హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసం ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రకపంనలు ఇచ్ఛాపురం వరకూ వినిపిస్తున్నాయన్నారు. ఇదే సమయంలో కార్యాకర్తలు ఒక్కతాటిపై నిలిచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పోలింగ్ బూత్‌ల వారీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. పార్టీ మనకేమిచ్చిందని కాకుండా, పార్టీకి మనమేం చేస్తున్నామన్నది ఆలోచించాలన్నారు. అనకాపల్లి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి గంటా బ్యాంకుల్లో దొంగ పత్రాలు పెట్టి రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు ఎక్కడ, ఏ పార్టీ తరపున పోటీ చేయాలన్న అంశాన్ని తీవ్రంగా ఆలోచించుకుంటున్నారన్నారు. పార్టీ విశాఖ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ తైనాల విజయకుమార్ మాట్లాడుతూ సొంత నిధులతో, సొంత స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుని వైసీపీ తన నిజాయితీని చాటుకుందన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు చిరునామాగా వైసీపీ కార్యాలయం ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, పార్టీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో బీచ్ టూరిజం అభివృద్ధి
* జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 17: అందాల విశాఖ సాగరతీరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. రుషికొంత, ఎర్రమట్టిదిబ్బలు, తొట్లకొండ తదితర పర్యాటక ప్రాంతాలను శనివారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ విశాఖ వేదికగా ప్రతి నెలా అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అరకు, బొర్రా గుహలు, వంటి ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. జిల్లాలో నక్షత్ర హోటళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే వీటి నిర్మాణం జరుగుతుందన్నారు. ఎర్రమట్టి దిబ్బలు స్వాభావిక ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యాకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రుషికొండ వద్ద ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతగిరి, అరకు, లంబసింగి ప్రాంతాల్లో రిసార్టులు ఆగస్టు నాటికి సిద్ధం అవుతాయన్నారు. తొట్లకొండ బౌద్ధ క్షేత్రంలో కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా వుడా వీసీని సూచించారు. రుషికొండ బీచ్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పటా బ్లూఫ్లాగ్ సర్ట్ఫికేషన్ కోసం ఎంపిక చేశారన్నారు. దేశంలో 13 బీచ్‌లకు గాను రుషికొండ బీచ్‌ను కేంద్రం ఎంపిక చేసిందన్నారు. అంతకు ముందు ఆయన రుషికొండ బీచ్ ప్రాంతంలో సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై పర్యాకట శాఖ అధికారులతో చర్చించారు. రుషికొండ బీచ్ సమీపంలో దేవాదాయ శాఖకు చెందిన భూమిని లీజుకు తీసుకుని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సరైన పార్కింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. పర్యటనలో వుడా వీసీ బసంత్ కుమార్, పర్యాటక శాఖ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీనివాసన్, టూరిజం అధికారి పూర్ణిమాదేవి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.

దళిత వాడల అభివృద్ధికి చర్యలు
గాజువాక, ఫిబ్రవరి 17: దళిత వాడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవిఎంసి గాజువాక జోనల్ పరిధి 53వ వార్డులో శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు దళిత తేశం- తెలుగు దేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వెంకునాయుడు, సన్యాసిరావు, నాగేశ్వరరావు తదితరులు వార్డులోని ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. వార్డులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శంకు స్ధాపన చేశారు. దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితులతో కాలనీలో పర్యటించిన అనంతరం నేను దళితుల్లో ఒక్కడినేనని పేర్కొంటు వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దళితులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజసేవయే పరమావధిగా బావించి రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ కాలనీల సమస్యలను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే ఉక్కు నిర్వాసితుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పేదల, దళితుల ప్రభుత్వమని, తమ సమస్యలను ఎప్పటికపుడు తన దృష్టికి తీసుకు రావాలని ఆయన స్ధానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ పెద్దలు పాల్గొన్నారు.

చింతపండుకు మద్దతు ధర ప్రకటించాలి
పాడేరు, ఫిబ్రవరి 17: గిరిజన ప్రాంతంలో ప్రధాన పంటగా ఉన్న చింతపండుకు కిలో 50 రూపాయల మద్దతు ధరను ప్రకటించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్ చేసారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్య దోరణి కారణంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోవలసి వస్తోందని ఆయన అన్నారు. చింతపండుపై గుత్యాదిపత్యం గిరిజన సహకార సంస్థకు ఉండేదని, అయితే కేంద్రంలో బి.జె.పి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాతీయ స్థాయిలో చింతపండుకు మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి ఆచరణలో అమలు చేయలేదని ఆయన చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో చింతపండుకు కిలో 70 రూపాయల ధర పలుకుతుండగా జి.సి.సి. కేవలం 30 నుంచి 40 రూపాయలకే గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తూ అధిక ధరలకు విక్రయించుకుంటుందని ఆయన అన్నారు. జి.ఒ.నెం.68 ప్రకారం అటవీ ఉత్పత్తులకు మద్దతు ధరను ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను కేటాయించాల్సి ఉన్నా దీనిని అమలు చేయడం లేదని ఆయన చెప్పారు. చింతపండుకు మద్దతు ధర చెల్లించడం ద్వారా గిరిజనులకు ఆహార భద్రత కల్పించవచ్చునని అనేక కమిషన్‌లు ప్రభుత్వానికి సూచించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో చింతపండు ప్రధానమైన అటవీ ఉత్పత్తిగా ఉందని, దీనికి మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. గిరిజన ఉత్పత్తులకు మద్తతు ధర ప్రకటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరిసిస్తూ ఈ నెల 24వ తేదిన తమ సంఘం అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ ధర్నాకు గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అప్పలనర్స కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, ఎం.ఎం.శ్రీను, చిట్టిబాబు, పాలికి లక్కు, త్రినాధ్, రామారావు, శరభన్న, ధర్మన్నపడాల్, దనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ఎం.పి. ఏజెన్సీ పర్యటన
అరకులోయ, ఫిబ్రవరి 17: అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత ఈ నెల 19, 20వ తేదీలలో విశాఖ ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఈ నెల 19న అనంతగిరి, అరకులోయ మండలాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆమె సమావేశమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. ఏజెన్సీలో పి.ఎం.జి.ఎస్.వై పథకం కింద చేపట్టిన రోడ్లను ఆమె పరిశీలిస్తారు. ఈ నెల 20వ తేదిన పాడేరు యువజన శిక్షణ కేంద్రంలో వికలాంగులకు పలు పరికరాలను పంపిణీ చేసి, కొయ్యూరు మండలంలోని దోడ్డవరం నుంచి ముకుడుపల్లి గ్రామం వరకు పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద నిర్మించిన రహదారిని ఆమె ప్రారంభిస్తారు.

ప్రత్యేక హోదా కోసం ఉద్యమిద్దాం
అరకులోయ, ఫిబ్రవరి 17: ప్రత్యేక హోదా సాధన కోసం అందరూ కలిసికట్టుగా అలుపెరుగని పోరాటం చేద్దామని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు చెట్టి వినయ్ కోరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దండకారణ్య వృత్తి విద్యా కోర్సు కళాశాల విద్యార్థులకు ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే అంశంపై శనివారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఐక్యమత్యంతో పోరాటాలు చేసేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రత్యేక హోదాతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, దీనిని సాధించేందుకు అందరూ కంకణం కట్టాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా వస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పడి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. తమ పార్టీ అధినేత జగన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహించి ప్రత్యేక హోదాపై ప్రజలను చైతన్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాను అటకెక్కించారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రకు న్యాయం చేసేవరకు నిరంతరం తమ పార్టీ పోరాటం చేస్తుందని, ఈ పోరాటంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉందని వినయ్ చెప్పారు. అనంతరం ప్రత్యేక హోదా ఆవశ్యకతపై పలువురు విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకలు కమిడి అశోక్, దురియా ఆనంద్, కొర్రా గాసి, పాపారావు, గెన్ను తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు అదనంగా వేసవి అలవెన్స్
కోటవురట్ల , ఫిబ్రవరి 16: ఉపాధి కూలీలకు ప్రభుత్వం అదనంగా వేసవి అలవెన్స్‌ను మంజూరు చేసినట్లు ఎడీవో కళ్యాణి తెలిపారు. శనివారం మండలంలో యండపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెరువు మరమ్మతు పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి నెలకు 20 శాతం, మార్చికి 25 శాతం, ఏప్రిల్‌కు 30 , మే నెలకు 30 శాతం, జూన్‌కు 20 శాతం అదనపు అలవెన్స్‌లు కూలీలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధి పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి అవకతవకలకు అవకాశలం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

టెక్నికల్ విద్యపై అవగాహన సదస్సు
కశింకోట, ఫిబ్రవరి 17: స్థానిక రాజీవ్‌గాంధీ ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం మండలంలో తేగాడ, కొత్తపల్లి బుచ్చెయ్యపేట మోడల్ స్కూల్, కస్తురిబా పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు టెక్నికల్ విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో హెచ్‌ఓడి శరగడం గణేష్ విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పాటించాల్సిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే పాలిసెట్‌లో ర్యాంకు సాధించేందుకు ఏ విధంగా ప్రిపేర్ కావాలనే అంశాలపై కూడా ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో లెక్చరర్ జగదీష్, శర్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రతుకు చిత్రం నాటికకు ఉత్తమ ప్రదర్శన అవార్డు
ఉత్తమ నటులకు పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే
చోడవరం, ఫిబ్రవరి 17: రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటిక పోటీలలో గుంటూరు (కట్రపాడు) ఉషోదయా కళానికేతన్ వారు ప్రదర్సించిన బ్రతుకు చిత్రం నాటిక అత్యంత ప్రతిభాపాటవాలను ప్రదర్సించి ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. స్థానిక స్వయంభూ గౌరీశ్వర స్వామి కల్యాణ మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉత్సవ కమిటీ రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటిక పోటీలను ఏర్పాటు చేసారు. ఈ పోటీలలో నాటికలు ప్రదర్శించగా బ్రతుకుచిత్రం నాటిక దర్శకుడు చెరుకూరి సాంబశివరావుకు ఉత్తమ దర్శకత్వ అవార్డు, ఇదే నాటికలోని లచ్చమ్మ పాత్రదారి జి. లహరికి ఉత్తమ నటన అవార్డు లభించగా ప్రధమ బహుమతిని దక్కించుకుంది. అలాగే ద్వితీయ స్థానంలో కాకినాడ ది యంగ్‌మెన్స్ హాఫీ క్లబ్ వారి అందరి ప్రస్థానం నాటిక రచన చేసిన పిఎన్ మూర్తికి అవార్డును అందజేసి ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గుర్తింపు పొందింది. తృతీయ ఉత్తమ ప్రదర్శన నాటికగా గుంటూరు సాయి రాఘవ మూవీ మేకర్స్ వారు ప్రదర్సించిన కొత్తనీరు దక్కించుకుంది. ఈ నాటికలో విశ్వనాథం పాత్రధారి వి. మోహనరావు ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. అలాగే నెల్లూరు క్రాంతి ఆర్ట్ థియేటర్స్ వారి కొడుకు నాటికలో జానకిరామయ్య పాత్రదారి చిల్లర సుబ్బారావుకు కాకినాడ శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్స్ వారి మదుర స్వరం నాటికలో వీరభద్రయ్య పాత్రదారి రాధాకృష్ణకు విశాఖ కెవి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రదర్సించిన బోయవానివేటలో రామారావు పాత్రదారి పి. శివప్రసాద్‌కు ఉత్తమ నటన అవార్డులు లభించాయి. అలాగే జ్యూరీ ప్రదర్శన అవార్డును కూడా ఈ నాటిక దక్కించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు ఆయా నటీనటులను ఘనంగా సత్కరించి బహుమతులు అందజేసారు. అలాగే సాంస్క్రతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బుల్లితెర జబర్దస్త్ నటుడు శాంతికుమార్, జయసింహ సినీ ఫేమ్ నిత్య తదితరులు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు.
నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ
చోవడరం, ఫిబ్రవరి 17: నిరుద్యోగ యువతకో ఉద్యోగం సాధించాలన్న తపన ప్రభుత్వ ఉద్యోగంతోనే పరిపూర్ణ జీవనోపాది అన్న విశ్వాసాన్ని సొమ్ము చేసుకుని సుమారు 26లక్షల రూపాయల వరకు తస్కరించిన ఘరానా మోసగాడి ఉదంతం శనివారం మండలంలోని గోవాడ గ్రామంలో వెలుగు చూసింది. అంభేరుపురం గ్రామానికి చెందిన ఏడువాక రాజునాయుడు తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని నిరుద్యోగ యువతలో ఆశలు కల్పించి లక్షలాది రూపాయలు వారినుండి తస్కరించారు. ఒక్క గోవాడ గ్రామంలో నలుగురు యువకులు వై. గంగరాజు, బి. భూలోకనాయుడు, ఎం. జగన్నాథరావు, జి. అప్పలనాయుడుల నుండి సుమారు 26లక్షల రూపాయలు వరకు గుంజుకుని వారికి ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ పెట్టి సుమారు పదినెలలు కావస్తున్నా సొమ్ము కాజేసిన రాజునాయుడు నుండి ఎటువంటి సమాచారం తెలియజేయకపోవడంతో వారంతా రాజునాయుడును నిలదీసారు. దీంతో ప్రముఖ ప్రభుత్వ శాఖలకు చెందిన ఐడెంటీ కార్డులను తలపించే రీతిలో భోగస్ కార్డులను సృష్టించి వారికి అందజేసాడు. ఇలా మరికొన్నిరోజులు గడిచింది. ఇటీవల హరిపాలెంకు చెందిన కొందరు నిరుద్యోగులు తాము మొసగాడు రాజునాయుడు వలలో చిక్కుకుని మోసపోయినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సమాచారం తెలుసుకున్న గోవాడ గ్రామ నిరుద్యోగులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి ఎస్‌ఐ మల్లేశ్వరరావు అందుబాటులో లేకపోవడంతో కేసునమోదు కానట్లు తెలిసింది.

ముదిరాజ్‌లకు తగిన గుర్తింపు కల్పించాలి
చోడవరం, ఫిబ్రవరి 17: ముదిరాజ్ (తెనుగోళ్లు) సామాజిక వర్గానికి రాష్ట్రంలో తగిన గుర్తింపును కలుగజేసి నామినేటెడ్ పదవులలో తమకు అవకాశం కల్పించాలని జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ముడుసు సీతారామ్ గోవింద ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజును కలిసి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజ్‌లు సుమారు 29లక్షల మంది వరకు ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన మూలంగా ముదిరాజ్‌లకు అన్యాయం జరిగిందన్నారు. ప్రధానంగా అధికశాతం ముదిరాజ్‌లు తెలుగుదేశం పార్టీ అభిమానులైనప్పటికీ అటు పార్టీ పరంగా కానీ ఇటు నామినేటెడ్ పదవుల నియామకాలలో గాని ప్రాధాన్యత కల్పించడం లేదన్నారు. అందుచే తామంతా సంఘటితంగా ఏర్పడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు నిర్ణయించామన్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజును కలిసి వినితిపత్రం సమర్పించి తమకు న్యాయం చేయాలని కోరామన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఈనెల 22వ తేదీన అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ముదిరాజ్ సంఘ సభ్యులతో కలిసి వెళ్లేందుకు హామీ ఇచ్చారని ఆయన అన్నారు.