పశ్చిమగోదావరి

మూడేళ్లయనా టెండర్లేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 17: తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మూడేళ్లు గడుస్తున్నా ఇంకా టెండర్ల ప్రక్రియలోనే ఉందని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేయటంతో జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లైనా టెండర్ ప్రక్రియలోనే వ్యవహారం ఉందంటే పనిచేయాల్సిన సమయంలో నిద్రపోతున్నారా అంటూ వ్యాఖ్యానించారు. అవిధంగా చెప్పడానికి సిగ్గు లేదా అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అసలు పనిచేసే ఉద్దేశ్యం ఉందా, లేదా అని నిలదీశారు. ఇలాంటి నాటకాలు కట్టిపెట్టి పనులు ముందుకు తీసుకువెళ్లకపోతే కొంతమంది అధికారుల సస్పెన్షన్ కూడా ఖాయమని ఆయన స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనుల ప్రగతి, రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టరు అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా తాడిపూడి ఎత్తిపోతల పధకం ప్రగతి తీరు పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మూడువారాల నుంచి చెపుతున్నా ఇంకా టెండర్లు అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పడానికి సిగ్గుగా లేదా అంటూ ప్రశ్నించారు. గత మూడేళ్లలో కాంట్రాక్టర్‌తో పనిచేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అదనంగా ఖర్చు చేశారని, విలువైన సమయం కూడా వృధా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేసవికాలంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, కానీ ఆసీజన్‌లో నిద్రపోయి వర్షాకాలంలో కళ్లు తెరిస్తే లాభం ఏమిటని ప్రశ్నించారు. ప్రమోషన్ల కోసం ఢిల్లీలోని సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లడానికి ఉన్న శ్రద్ధ పనులు చేయటంలో ఒక్కశాతం కూడా ఎందుకు చూపించలేకపోతున్నారని నిలదీశారు. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలోనే ఇరిగేషన్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక సాధారణ ప్రాజెక్టుల గతి ఏమిటని కలెక్టరు పేర్కొన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు తరహాలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడానికి ఇకనుంచి ఇరిగేషన్ ఇంజనీర్లు, నిర్మాణసంస్ధల కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తానని కలెక్టరు భాస్కర్ చెప్పారు. ఇకపై తానూ ఈపనులను స్వయంగా పరిశీలిస్తానన్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేస్తూ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుల పనుల విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈప్రాజెక్టుకు సంబంధించి ఒక ఎస్‌ఇ శెలవులో వెళ్లగా ఎఫ్‌ఎసి హోదాలో ఉన్న మరో ఎస్‌ఇ రెండువారాలుగా సమావేశానికి రాకపోవటం వారికి ఈప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధను తెలుపుతోందన్నారు. సీజన్‌ను వినియోగించుకోకుండా వర్షాకాలంలో పనులు చేస్తారా అని ప్రశ్నించారు. చింతలపూడి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయినందున పట్టిసీమ ప్రాజెక్టు రీతిలోనే ఈపనులు కూడా పరుగులు పెట్టించాలన్నారు. ఎక్కడైనా ఈపనులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పోలవరం, జాతీయరహదారులు, ఆర్‌అండ్‌ఆర్ గృహనిర్మాణాలకు భూసేకరణలో ఎటువంటి కోర్టు అభ్యంతరాలు ఎదురుకానప్పుడు చింతలపూడి విషయంలో ఎందుకు వస్తున్నాయని భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భానుప్రసాద్‌ను ప్రశ్నించారు. ఈపనులు వేగంగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్దేశించిన గృహనిర్మాణాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి పనులు చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని సంబంధిత శాఖల ఇంజనీర్లను కలెక్టరు ఆదేశించారు. పట్టణ గృహనిర్మాణం విషయంలో కొవ్వూరులో టిడ్కో ద్వారా ఇళ్లనిర్మాణాలకు ఎటువంటి అటంకాలు లేకుండా భూమిని అప్పగించాలని, ఈవిషయంలో కోర్టు స్టేను 15రోజుల్లో ఎత్తివేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవోను ఆదేశించారు. అలాగే తణుకు పట్టణంలో కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టేనాటికి స్ధలం అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెదపాడు మండలం వట్లూరు వద్ద 2009లో నిర్మాణం ప్రారంభించిన రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు పూర్తి చేయడానికి ఇంకెంత సమయం కావాలని అధికారులను ప్రశ్నించారు. ఈవిషయంలో ప్రజల ఓపికను పరిక్షించవద్దని చెప్పారు. జిల్లాలో గ్యాస్ పైపులైన్ల కోసం అవసరమైన భూమిని సేకరించి ఇస్తే ఇంకా సక్రమంగా పనులు చేపట్టకుండా కోర్టుల్లో ఉన్న అభ్యంతరాలను తొలగించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.

భీమవరం టీడీపీలో
‘ప్రత్యేక లేఖ’ దుమారం
ఆగ్రహంతో ఊగిపోతున్న బీజేపీ నేతలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 17: క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అదే దారి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వీరవాసరం మండలంలోని నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజుకు ఆ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ లేఖతో తెలుగు ప్రజలను మోసం చేశారన్న లేఖ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పులను తీసుకువచ్చాయి. అసలు ఏం జరిగిందంటూ ఇప్పుడు ఈ లేఖ అంశం పార్టీలో చాలా తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలిసింది. పైగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మండల పార్టీకి తెలియకుండా తన వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకు బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు పట్ల లేఖాస్త్రాన్ని ఉపయోగించిన వీరవల్లి చంద్రశేఖర్‌పై క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ చర్యలు ఎందుకు తీసుకోకూడదని బీజేపీలోని కొందరు నేతలు స్వరాన్ని పెంచి మరీ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని వాటిని అమలు చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేశారని ఎంపీకి ఇచ్చిన లేఖ పార్టీలో పెద్ద దుమారానే్న కాదు మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా పరిణమించింది. ఇదే విషయంలో పార్టీ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇటీవల భీమవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు శాంతియుతంగా ప్లకార్డులతో ఆందోళన చేశారని, దానికి మంచి స్పందన వచ్చిందని, మరి వీరవాసరం మండలంలో ఎందుకు ఈ విధంగా జరిగిందని పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇక మరో పక్క ఈ నెల 16వ తేదీన జరిగిన మండల కమిటీ సమావేశంలో కూడా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్‌ల మధ్య ఇంచుమించుగా ఘర్షణ వాతావరణమే చోటుచేసుకుందని జిల్లా పార్టీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పార్టీ అసలు ఏం జరిగిందో ఆరా తీసే పనిలో పడింది. మొన్న సమన్వయ కమిటీ, నిన్న ప్రత్యేక లేఖ, నేడు మండల పార్టీలో ఘర్షణ వాతావరణం వెరశి అటు జిల్లా పార్టీకి ఇటు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు తలనొప్పిగా పరిణమించాయి.

సైన్సు పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలి
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని
ఏలూరు, ఫిబ్రవరి 17: ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర,సాంకేతికరంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్ధులు సైన్సు పట్ల ఆసక్తి పెంపొందించుకుని శాస్తవ్రేత్తలుగా తయారుకావాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జిల్లాస్ధాయి ఇన్‌స్పైర్-మనక్ అవార్డుల విద్యావైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పితాని మాట్లాడుతూ స్వర్గీయ డాక్టరు అబ్దుల్ కలాం ఎక్కడకు వెళ్లినా విద్యార్ధులతో ముచ్చటిస్తూ యువత తమ కలలను సాకారం చేసుకునేదిశంగా ముందుకు వెళ్లమనేవారని, అదేస్ఫూర్తితో బాల్యం నుండే సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని శాస్తవ్రేత్తలుగా విద్యార్ధులు ఎదగాలన్నారు. ప్రతిభ, తెలివితేటలు ప్రదర్శించడానికి ఇన్‌స్పైర్ లాంటి వైజ్ఞానిక సదస్సులు విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దేశంలో శాస్తవ్రేత్తలకు కొదవ లేదని వారందర్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు దేశఖ్యాతిని మరింత విస్తరింపచేసేందుకు మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవసరమైన సహకారాన్ని అందిస్తాయన్నారు. ఈప్రదర్శనలో ప్రతిభ చూపిన విద్యార్ధులను జపాన్ దేశానికి పంపేందుకు కూడా కేంద్ర శాస్తస్రాంకేతిక శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. భారతప్రభుత్వం విద్యార్ధులో దాగిఉన్న వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని వెలికితీసేవిధంగా జిల్లాలో 499 మందిని ఎంపిక చేయటం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయంగా వినియోగించేలా మన విద్యార్ధుల ఆలోచన ఉండాలన్నారు. సైన్స్ పట్ల ఎటువంటి బెదురు లేకుండా బాల్యదశ నుండే విద్యార్ధులకు అ సబ్జెక్టుపై ఆసక్తి పెంచేరీతిలో బోధన జరగాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సర్వశిక్షా అభియాన్ ద్వారా అన్ని పాఠశాలల్లో అవసరమైన వౌలిక సదుపాయాలు కూడా కల్పించటం జరిగిందన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో భారతదేశ విద్యార్ధులు నూతన ఆవిష్కరణలు జరిపే విధంగా విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. జపాన్, జర్మనీ, చైనా లాంటి దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులు పెంచేలా కృషి జరగాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ విజ్ఞానం మరింత పెంపొందేలా విజ్ఞానసదస్సులు నిర్వహించాలన్నారు. మూఢనమ్మకాలను పారద్రోలి ప్రజలను చైతన్యవంతులను చేయటమే సదస్సుల లక్ష్యంగా ఉండాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక మాట్లాడుతూ ప్రభుత్వం ఆశిస్తున్నవిధంగా విద్యార్ధులు చిన్నతనం నుండే సైన్సుపట్ల ఆసక్తి కలిగి ఉండి భవిష్యత్‌లో శాస్తవ్రేత్తలుగా ఎదగాలన్నారు. విద్యార్ధులో శాస్ర్తియ దృక్ఫధం పెంపొందించేందుకు ప్రభుత్వం ఇన్‌స్పైర్ విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తోందన్నారు. మూడురోజులపాటు నిర్వహించే ఈప్రదర్శనలో ఏలూరు, కొయ్యలగూడెం విద్యా డివిజన్‌లు, కృష్ణాజిల్లా నుండి 276 ప్రదర్శనలు రావటం జరిగిందన్నారు. తొలుత మంత్రి పితాని సత్యనారాయణ జ్యోతిప్రజ్వలన చేసి ఇన్‌స్పైర్ లోగోను ఆవిష్కరించారు.

జిల్లాలో రూ.1400 కోట్లతో 80వేల గృహాల నిర్మాణం
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆర్థిక విభాగం జీఎం భాస్కరరావు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, ఫిబ్రవరి 17: జిల్లాలో 1400 కోట్ల రూపాయలతో 80వేల గృహాలను నిర్మిస్తున్నందున క్షేత్రస్ధాయిలో యుద్ధప్రాతిపదికపై చెల్లింపులు జరిగేలా అధికారాలను వికేంద్రీకరించినట్లు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆర్థిక విభాగం జనరల్ మేనేజరు వైయు భాస్కరరావు తెలిపారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో శనివారం జిల్లాలోని గృహనిర్మాణసంస్ధ ఎఇ,డిఇలకు బిల్లుల చెల్లింపుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేనివిధంగా గృహనిర్మాణసంస్ధ పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టినందున లబ్దిదారులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు చెల్లింపువిధానాన్ని ఎఇ స్ధాయిలో బిల్లులు పొందుపరిచేలా అధికారాన్ని వికేంద్రీకరించటం జరిగిందన్నారు. ఎఇలు బాధ్యతాయుతంగా గృహనిర్మాణ స్టేజీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ సకాలంలో లబ్దిదారులకు సొమ్ము చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. గతంలో పేమెంట్ కోసం బిల్లులు ప్రతిపాదించే అధికారం డిఇలకు మాత్రమే ఉండేదని, కొత్త ఆదేశాల మేరకు ఎఇ స్ధాయిలో కూడా బిల్లుల ప్రతిపాదన చేసే అధికారం ఇచ్చిన దృష్ట్యా త్వరితగతిన లబ్దిదారులకు న్యాయం చేకూర్చాలన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం కింద 2016-17 నుండి 2018-19 ఆర్దిక సంవత్సరం వరకు 58307 ఇళ్ల నిర్మాణానికి 875 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. జిల్లా గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి అవాస్‌యోజనా పధకం కింద 15వేల గృహాలను 300 కోట్ల రూపాయలతో చేపట్టామన్నారు. ఈపధకం కింద రెండులక్షల రూపాయల నిర్మాణవ్యయంలో 18740 రూపాయల లోను లబ్దిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పధకం కింద చేపట్టే ప్రతి ఇంటికి లక్షా 50వేల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తుందని, లబ్దిదారులు ఈపధకం కింద పూర్తి సబ్సిడీ పొందవచ్చునన్నారు. పట్టణ గృహనిర్మాణ పధకం కింద 6790 గృహాలను 237కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతుందని, దీనిలో ఒక్కొక్క ఇంటికి 3.50లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని, 75వేల రూపాయలు బ్యాంకు రుణంగాను, 25వేలు లబ్దిదారుడు భరిస్తే 2.50లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా అందజేస్తుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎఇలు మంచి అవగాహన పెంచుకుని క్షేత్రస్ధాయిలో గృహనిర్మాణాన్ని బట్టి ఎప్పటికప్పుడు బిల్లుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతిది ఆన్‌లైన్ చేయటం వల్ల ఎక్కడా కూడా పొరపాట్లకు తావులేకుండా ఉంటుందని పిడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఆచంటలో టీడీపీ నుంచి సహకారం లేదు

* సర్పంచ్‌లు, అధికారులను కూడా సమావేశాలకు వెళ్లొద్దంటున్నారు* కేంద్ర పథకాలను కూడా హైజాక్ చేస్తున్నారు:ఎంపీ గోకరాజు
ఆచంట, ఫిబ్రవరి 17: నర్సాపురం పార్లమెంట్ పరిధిలో కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టిన వివిధ పనులు ప్రారంభించడానికి వస్తే ఆచంట నియోజకవర్గంలో మిత్రపక్షమైన తెలుగుదేశం వర్గీయుల నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని, కనీసం సర్పంచ్‌లు, అధికారులను కూడా రానివ్వడంలేదని నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు టీడీపీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆచంట మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం పెదమల్లంలోని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ముచ్చర్ల వెంకట సుబ్బారావు ఇంటివద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ వర్గీయులు తమకు సహకరించినా సహకరించకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఏనాడు బీజేపీ ఆపలేదన్నారు. కలసి పోరాడాం..గెలుపుకోసం వారికన్నా ఎక్కువగా కృషిచేశాం..పెద్దమనస్సు ఉండాలి..మొత్తం అభివృద్ధి చూసుకోవాలి తప్ప స్వార్థరాజకీయాలు చూసుకుంటే అవి ఎక్కువ కాలం ఉండవన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు రావడంలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో రూ.10 లక్షలు తగ్గకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా సుమారు 160 పథకాలు ప్రవేశపెట్టగా ఈ పథకాలు కిందిస్థాయి వారికి చేరడంలేదని, అందుకే బీజేపీ కార్యకర్తల ప్రచార బృందాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీలు కష్టపడి దేశం, రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నారన్నారు. నరేంద్రమోదీకి ఆయన చేపట్టిన పథకాలు, పనులు వలన ప్రపంచవ్యాప్తంగా కీర్తి లభిస్తోందన్నారు. కానీ ఇక్కడ కేంద్ర నిధులు, ఎంపీ నిధులతో పనులు చేస్తున్నప్పటికీ వాటికి కూడా పసుపు రంగులు వేయడం, పక్కన చంద్రన్న బాట అని బోర్డులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర పథకాలను కూడా హైజాక్ చేస్తున్నారని ఆరోపించారు. దీనివలన ప్రధానంగా వారికే నష్టం తప్ప ప్రజలు ఈ విషయాలను పూర్తిగా తెలుసుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్షమందికి సొంత నిధులతో బీమా సౌకర్యం కల్పించామని, దీనివలన 25 మందికి లబ్ధిచేకూరిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలావాటిని రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఎంపీ గంగరాజు ఎద్దేవా చేశారు. రాజకీయాలు వద్దు..అభివృద్ధి విషయంలో అందరూ కలిసి ముందుకు వెళ్లాలే తప్ప ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఇద్దరూ కలిసికట్టుగా వెళితే ఇద్దరికీ మేలు..ఇప్పటికీ ఇద్దరం కలిసే పోటీచేస్తే మంచిదని తన అభిప్రాయమన్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు చేయాలని ఉన్నప్పటికీ ఇప్పటికే చాలా నిధులు ఇచ్చామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం లాభదాయకమని మెకంజీ సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. విశాఖపట్టణంలో స్టీల్ ప్లాంట్ విస్తరణకు రూ.10వేల కోట్లు అడగకపోయినా కేటాయించినట్టు వివరించారు. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి గట్కరీ రూ. లక్ష కోట్లు కేటాయించారని అన్నారు. కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైను మంజూరు చేసినట్టు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఎటువంటి అన్యాయం చేయలేదన్నారు. బీజేపీ చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు అందజేస్తోందన్నారు. 24 గంటల విద్యుత్తుకు, విద్యుత్తు పొదుపునకు ఎల్‌ఈడీ బల్బులు అందజేశామన్నారు. ఎవరైనా సహాయం చేస్తే విశ్వాసం ఉండాలని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి నిధుల కోసం తాముకూడా పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకవిధానం మంచిదైనప్పటికీ దీని నిర్వహణలో ఎంతో స్కాం జరుగుతోందని ఎంపీ గంగరాజు ఆరోపించారు. దీనిలో రౌడీ రాజకీయం నడుస్తోందన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి చట్ట ప్రకారం నిధులు ఇస్తున్నామన్నారు. రాష్ట్రానికి రూ.5 లక్షలు కోట్లు కేటాయించారని, వీటిలో రహదారులకు రూ.లక్ష కోట్లు ఇచ్చారని అన్నారు. ఇంత చేస్తున్నప్పటికీ కేంద్రం ఏమీ చేయడంలేదన్న వాదన సరికాదని ఎంపీ గంగరాజు అన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లు పరిశీలన
పోలవరం, ఫిబ్రవరి 17: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19న పర్యటించనున్న సందర్భంగా ఆయా ప్రాంతాలను కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం రవిప్రకాష్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ముందుగా హెలిపాడ్ వద్దకు చేరుకున్న వారు అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అక్కడ నుండి స్పిల్‌వే నిర్మాణ ప్రాంతం, ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతాలతో పాటు డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం గోదావరి నదికి అడ్డుకట్ట వేసే ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఏర్పాట్ల విషయమై ఎస్‌ఇ విఎస్ రమేష్, ఆర్డీవో కె మోహనకుమార్‌తో కలెక్టర్ చర్చించారు. బందోబస్తు విషయమై డీఎస్పీ ఏటివి రవికుమార్‌కు ఎస్పీ రవిప్రకాష్ సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలవరం తహసీల్దారు సిహెచ్ రవికుమార్, ఎస్సై కె శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

19న పోగొండ ప్రాజెక్టు ప్రారంభం
ఐటీడీఏ పీవో హరీంద్రప్రసాద్
బుట్టాయగూడెం, ఫిబ్రవరి 17: అడవి తల్లి కంఠానికి మణిహారంగా అమరి బీడువారిన గిరి పుత్రుల పొలాలను సస్యశ్యామలం చేయనున్న పోగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైనట్టు ఐటీడీఏ పీఓ హరీంద్రప్రసాద్ తెలిపారు. మండలంలోని చింతలగూడెం వద్ద కొండవాగుపై నిర్మించిన పోగొండ ప్రాజెక్టును ఈ నెల 19వ తేదీ ఉదయం 10గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేయనున్నట్టు శనివారం పీఓ తెలిపారు. ప్రాజెక్టు వద్ద శనివారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. 2007లో ఈ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజు, పోగొండ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గిరిజన భూములకు కలిగే ప్రయోజనాన్ని అప్పటి సీఎం వైఎస్సార్‌కు వివరించి, ఎన్నో దశాబ్ధాలుగా ఈ ప్రాంత గిరిజనుల కలను సాకారం చేయడంలో కృతకృత్యులయ్యారు. ప్రాజెక్టు మంజూరైన 2007లోనే కరాటం రాంబాబు, తెల్లం బాలరాజు చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులు ప్రారంభించారు. మొదట ప్రాజెక్టు వ్యయం రూ.22కోట్ల అంచనాతో ప్రారంభమై, పనులు ప్రారంభించాక నిర్మాణ వ్యయం రూ.56కోట్లకు పెంచారు. ఆ తర్వాత డిజైన్‌లో మార్పులుచేసి ప్రాజెక్టును మరింత ప్రయోజనకారిగా రూపొందించేందుకు నిర్మాణ వ్యయం రూ.82కోట్లకు, మళ్లీ రూ.85కోట్లకు చేరింది. దశాబ్ధా కాలంగా చేస్తున్న పనులు పూర్తయి ప్రాజెక్టుకు ఒక రూపం వచ్చింది. మొదటిగా నిర్మాణ పనులు చేబట్టిన మైటా కంపెనీ పనులు వేగవంతంగా చేయకపోవడంతో ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సరళా కనస్ట్రక్షన్స్ ఏజీఎం హరికృష్ణ నేతృత్వంలో కాలువ నిర్మాణాలతో సహా ప్రాజెక్టు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.85కోట్లు కాగా, ముంపు భూముల పరిహారం రూ.44.48 కోట్లతో కలిపి రూ.129.48 కోట్లకు చేరింది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 4,500 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. అదే విధంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరగడంతో ఈ ప్రాంత సాగు, తాగునీటి లభ్యత పెరుగుతుంది. అదే విధంగా అటవీ ప్రాంతంలో చుట్టూ కొండల మధ్యన ఈ ప్రాజెక్టు ఉండడంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిచెందే అవకాశం కూడా ఉంది. ప్రాజెక్టులో మత్స్య సంపద గిరిజనులకు చక్కని ఆదాయ వనరుగా మారనుంది.
అన్నదాత శ్రేయస్సే మోదీ లక్ష్యం
రైతు రథాలను అందించిన ఎంపీ గంగరాజు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 17: అన్నదాత శ్రేయస్సే ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యమని నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు అన్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్‌లో కూడా గ్రామీణ భారతావనిలోని ముఖ్యంగా రైతులకు ఎక్కువ నిధులను కేటాయించడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. శనివారం నరసాపురం ఎంపీ డాక్టర్ గోకరాజు గంగరాజు తన కార్యాలయం వద్ద రైతులకు ట్రాక్టర్లను (సబ్సిడీ)తో అందజేశారు. నరసాపురం పార్లమెంట్‌లోని 24 మంది రైతులకు ఈ ట్రాక్టర్లను ఆయన అందజేశారు. వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులతో ఎంపీ ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా రైతుల నుంచి పలు వివరాలను ఎంపీ తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ఫసల్‌బీమా, యూరియా తదితర వాటి గురించి రైతులకు ఎంపీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలను రైతులు సద్వినియోగపర్చుకోవాలన్నారు.
ప్రసాదాల విక్రయ సొమ్ము సొంతానికి వాడుకుంటున్న ఉద్యోగి సస్పెన్షన్
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 17: చిన వెంకన్న ప్రసాదాల విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును సొంతానికి వాడుకుంటున్న ఒక ఉద్యోగిపై ఆలయ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక టీటీడీ కాంప్లెక్స్‌లోని సమాచార కేంద్రంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రసాదాలను విక్రయిస్తోంది. అయితే అక్కడ గుమాస్తాగా పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్ ఎన్‌ఎం రాంబాబు గత నెల 30న ప్రసాదాల విక్రయాలకు సంబంధించి రూ.2,450లను సొంతానికి వాడుకున్నాడు. దీనిపై అధికారులు విచారణ చేబట్టారు. ఇదిలా ఉంటే..ఈ నెల 15న మరోసారి రూ.1100లు రాంబాబు వాడుకున్నట్టు గుర్తించిన అధికారులు విచారించగా అక్కడే గుమాస్తాలుగా విధులు నిర్వర్తిస్తున్న కిశోర్, కుంకుళ్లులు సైతం గుమాస్తా రాంబాబు తరచూ ఇలాగే సొమ్ములు వాడుకుంటున్నట్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు విధించారు.