నిజామాబాద్

రూరల్ సెగ్మెంట్‌లో మళ్లీ రాజుకుంటున్న విభేదాల వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 17: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అధికార తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.్భపతిరెడ్డిల మధ్య విభేదాల వేడి మళ్లీ రాజుకుంటోంది. ఇరువురు నేతల్లోనూ ఏ ఒక్కరూ వెనక్కి తగ్గకుండా తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు విమర్శలు, ప్రతివిమర్శలతో రూరల్ సెగ్మెంట్ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ పరిణామంతో పార్టీలోని సామాన్య కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురి కావాల్సి వస్తోంది. నిజానికి గత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల నాటి నుండే వారిరువురి నడుమ విభేదాలు నెలకొని అవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికివారు పై చేయిని చాటుకునే తాపత్రయంలో నిమగ్నమవుతూ, తమ అనుయాయుల్లో ఉత్సాహం నింపేందుకు పోటాపోటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పరిణామం కాస్తా పార్టీ శ్రేణుల్లో విభేదాలను పెంచిపోషిస్తూ, గ్రూపు రాజకీయాలకు మరింత ఆజ్యం పోస్తోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమం సందర్భంగా ఇరువురు నేతలు బాహాటంగానే పరస్పర ఘర్షణకు దిగడం, ఈ వ్యవహారం కాస్తా పోలీసు కేసుల నమోదు వరకు దారితీసింది. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఉద్రిక్తతను తాత్కాలికంగా తగ్గించగలిగినప్పటికీ, నేతల నడుమ నెలకొన్న విభేదాలు మాత్రం దూరం కాలేకపోయాయి. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఆధిపత్యం చాటుకునే యత్నాలకు పదును పెట్టారు. కార్యకర్తల సమావేశాల్లోనూ ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. సోషల్ మీడియాను సైతం వేదికగా మల్చుకుని తమ నడుమ నెలకొని ఉన్న విభేదాల తీవ్రతను చాటుకునే ప్రయత్నాలు చేశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం సందర్భంగా అందరి సమక్షంలోనే ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుతిమెత్తగా మందలించడంతో, బాజిరెడ్డిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఆయన వాపస్ తీసుకున్నారు. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజులకే గత రెండు మాసాల క్రితం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్య నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమై ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎంపీలు కవిత, బీబీ.పాటిల్, ఇతర ఎమ్మెల్యేలంతా ఈ భేటీలో పాల్గొని తీర్మానం చేస్తూ, జిల్లా పార్టీ ఇన్‌చార్జి తుల ఉమ ద్వారా ఆ లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. దీంతో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అధినేత కేసీఆర్ ఇక సస్పెన్షన్ వేటు వేయడమే తరువాయి అని అంతా భావించినప్పటికీ, గత రెండు నెలల నుండి ఈ వ్యవహారంపై సీఎం స్తబ్ధంగానే ఉంటూ వస్తున్నారు.

వివాహిత దారుణ హత్య

తల, మొండెం వేరుచేసిన హంతకులు * రెండు గ్రామాల్లో విషాదం

గూడూరు, ఫిబ్రవరి 17: గూడూరు మండలంలోని పొనుగోడు గ్రామశివారు టేకులతండాలో ఒ వివాహిత మహిళను అతి దారుణంగా శనివారం హత్యచేశారు. కిరాతకంగా మొండెం నుండి తలను వేరుచేశారు. ఈ దారుణ సంఘటన గూడూరు మండలంలో విషాదాన్ని నిపింది. హత్య సంఘటన తాలుకు వివరాల్లోకి వెళితే పొనుగొడు శివారు టేకుల తండాకు చెందిన భూక్య వినోద(26) ఈ దారుణ హత్యకు గురైంది. వారి ఇంటి పక్కనే ప్రధాన రహదారికి అవతల ప్రక్కగల చేనులో పనిచేస్తుండగా హత్యకు గురైందని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన గుగులోతు ఈర్య కూతురును గూడూరు మండలం పొనుగోడు శివారు టేకుల తండాకు చెందిన భూక్య హట్య రెండవ కుమారుడు రమేష్‌కు ఇచ్చి 12సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చరణ్ 8సంవత్సరాలు, చిన్నవాడు సాయిచరణ్‌కు 4సంవత్సరాలు ఉన్నాయి. మృతురాలి భర్త హైద్రాబాద్‌లో కూలిపనిచేస్తుండగా వినోద భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంది. గత రెండు రోజుల క్రితం వీరి భూమి ప్రక్కనే కౌలు చేస్తున్న మరో వ్యక్తితో సల్ప వివాదం జరిగింది. మృతురాలి బావిమీద ఉన్న రూ.2వేల విలువ చేసే స్టాటర్‌పెట్టే లేకపోవడంతో నీవే దొంగిలించావని పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టడంతో వారిరువురి మద్య వివాదం చొటుచేసుకుంది. ఆ సందర్భంగా అభియోగం ఎదుర్కొన్న బొందాలు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యాడని చంపుతానంటూ వినోదను బేదిరించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే శనివారం ఉదయం మొక్కజోన్న చేనుకు నీరు పెట్టడానికి వెళ్లిందని అంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందని కుటుంబ సబ్యులు రోదిస్తూ చెబుతున్నారు. మృతురాలి చిన్నకుమారుడు అమ్మ ఇంకా రాలేదని రోదిస్తుండడంతో ఆమె మేనకోడలు గుగులోతు స్వప్న చేనువద్దకు వెళ్లి చూడడంతో ఈ దారుణ సంఘటన బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. డాగ్‌స్వ్కాడ్ సంఘటన స్థల నుండి స్థానిక పెట్రోల్ బంక్ వరకు వెళ్లి వెనుదిరిగాయి. పోలీసులు శవ పంచనామ నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురిలో ఉంచారు. సంఘటన స్థలానికి మహబూబాబాద్ డిఎస్పీ నరేష్‌కుమార్, గూడూరు సీఐ రమేష్‌నాయక్, ఎస్సైలు యాసిన్, రామారావు, బాలకృష్ణ, సతీష్ తదితరులు చేరుకొని వివరాలు సేకరించారు. రెండురోజుల్లో నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ నరేష్‌కుమార్ తెలిపారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం
* మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి
వేల్పూర్, ఫిబ్రవరి 17: ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. శనివారం వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు రోడ్లపైకి వస్తున్నారని సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో రైతులు శాంతియుతంగా ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలని చేపట్టిన దీక్షను అడ్డుకోవడం, 144 సెక్షన్ విధించడం శోచనీయమని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని తుపాకులు ఎక్కు పెట్టినా రైతులు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం దిగిరావాల్సిందేనని అన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ మనుగడ సాధించలేదని ఆయన దెప్పిపొడిచారు. బంగారు తెలంగాణ, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిరుద్యోగులు నమ్మి టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయని అన్నారు. అనంతరం ఆర్మూర్‌లో ఆమరణ దీక్ష చేసిన అనే్వష్‌రెడ్డిని పరామర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అర్కెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్, కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్‌రెడ్డి, బద్ధం హరికిషన్, సంజీవ్‌రెడ్డి, గడ్డం నర్సారెడ్డి, నవీన్‌రెడ్డి, లింబారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గురువు చెంతకు శిష్యుడు
* పోచారం పంచన చేరుతున్న కాంగీ నేతలు
నస్రుల్లాబాద్, పిబ్రవరి 17: గురుశిష్యుల అనుబందానికి దూరమై కొనే్నళ్ల పాటు నాటి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపిపి విజయ ప్రకాశ్ తిరిగి గురువు పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీర్కూర్ ప్రాంతంలో అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయ ప్రకాశ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సన్నహాలు చేస్తున్నట్లు శనివారం బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం నచ్చి జనం మెచ్చే నేత పంచన చేరుతున్నానని ఆయన సంతోషాన్ని వెల్లబుచ్చారు. పోచారం తన గురువుతో సమానమని, ఆయనకు మాపై ఎంతో ఆదరణాభిమానాలు నేటి వరకు అలాగే ఉన్నాయని చెప్పారు. రాజకీయంలో మార్పులు చేర్పులు సర్వసాధారణమేనని, కొన్ని రోజులు దూరంగా ఉన్నానని చెప్పారు. చాలా రోజుల తరువాత తిరిగి శీనన్న సమక్షంలో టీ ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.నాతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాహెబ్ రావ్, లక్ష్మన్ రావ్, సంబురాజ్ పటేల్, గంగాధర్, అశోకప్పాలు కూడా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు.

విద్యార్థులకు వసతులను కల్పిస్తాం
* జిల్లా కలెక్టర్ సత్యనారాయణ
నిజాంసాగర్, ఫిబ్రవరి 17: కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు కావల్సిన వసతులను కల్పించాలని, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ జేఎన్‌వి ప్రిన్స్‌పాల్ శేఖర్‌బాబును ఆదేశించారు. శనివారం నిజాంసాగర్ జేఎన్‌విలో విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యాలయంలో గల సమస్యలను కలెక్టర్ ప్రిన్స్‌పాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయం ఆవరణంలో విద్యుత్ లైట్లు లేవని గ్రంథాలయ అధికారి బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఇంకా ఎవర్ని నియమించలేదని, విద్యార్థులకు బోధించేందుకు మ్యాథ్స్ ఉపాధ్యాయలు లేరనే విషయాన్ని కలెక్టర్ దృష్టికి విద్యార్థులు తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ మ్యాథ్స్ ఉపాధ్యాయలు, గ్రంథాలయంలో సిబ్బందిని నియమించాలని ప్రిన్స్‌పాల్‌కు సూచించారు. విద్యాలయం ఆవరణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. సమావేశంలో డీఈఓ మదన్‌మోహన్, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాథికారి చంద్రశేఖర్, డీపీఆర్‌ఓ పద్మ, తహశీల్దార్ నాగరాజ్ గౌడ్, ఎంఈఓ బలిరాం నాయక్, వైద్యాధికారిణి డాక్టర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ జన్మదిన వేడుకల్లో డిఎస్
కంఠేశ్వర్, ఫిబ్రవరి 17: సిఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నగరంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా కేక్ కట్‌చేయడం, హెల్త్‌క్యాంప్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు డిఎస్ తన నివాసంలో కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 35వ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ అనసూయ(60)చే కేక్‌ను కట్ చేయించారు. ఈ సందర్భం గా డీఎస్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగారు రాష్ట్ర సాధన కోసం ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చేపడుతున్న ప్రతి పథకం విజయవంతం అవుతోందన్నారు. కార్యక్రమంలో తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు, డిఎస్ అనుచరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన
ఇదిలాఉండగా, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని బస్టాండ్ ప్రక్కన నిర్వహించిన పుట్టిన రోజు వేడుకల్లో మేయర్ ఆకుల సుజాత కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాంకిషన్‌రావు, ఏఎస్.పోశెట్టి, నెడ్‌క్యాప్ చైర్మన్ అలీం, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో
కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాగృతి ఆధ్వర్యంలో నగర మేయర్ ఆకుల సుజాత, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో నెడ్‌క్యాప్ చైర్మన్ అలీం, కార్పొరేటర్లు, తెరాస నాయకులు, జాగృతి నాయకులు లక్ష్మినారాయణ భరద్వాజ్, అవంతిరావు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌క్యాంప్ ఏర్పాటు
నగరంలోని 41వ డివిజన్ పరిధి దుబ్బా ప్రాంతంలోని వ్యాస్ భవన్‌లో కార్పోరేటర్ శ్రీవాణి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హెల్త్‌క్యాంప్‌ను నిర్వహించారు. హెల్త్ క్యాంప్‌లో వైద్య పరీక్షలు జరిపి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బాపురెడ్డి, డాక్టర్ సుజాత, మల్లేశం, ప్రవీణ్, శ్యామ్‌సుందర్, పార్వతి, తెరాస నాయకులు రాంకిషన్‌రావు, ఈగ గంగారెడ్డి, గడ్డం సుమనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టెన్త్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చర్యలు
* డీఈవో మదన్‌మోహన్
నిజాంసాగర్, ఫిబ్రవరి 17: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ మోడల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మార్చి 15నుంచి ప్రారం భంకానున్న టెన్త్ వార్షిక పరీక్షలకుగాను జిల్లావ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరుగుతోందన్నారు. వీటిలో 65 రెగ్యులర్, 4ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో 12,868 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. 192 ప్రభుత్వ పాఠశాలల్లో 8,835 మంది విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరైయ్యేందుకు ఉదయం పూట బస్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హాల్‌టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో ఎంఈఓ బలిరాం నాయక్, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభిప్రాయం మేరకు ఎర్రజొన్న, పసుపుకు ధర నిర్ణయించాలి
* అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలి
* మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి
ఆర్మూర్, ఫిబ్రవరి 16: రైతుల అభిప్రాయం తీసుకొని ఎర్రజొన్న, పసుపు పంటలకు ధర నిర్ణయించకుండా కేవలం ఎర్రజొన్నలకు ఏకపక్షంగా రూ.2300 ధర ప్రకటించడం సరికాదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఆయన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే అర్కెల నర్సారెడ్డిలతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత 15 రోజులుగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పాత జిల్లాల రైతులు ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఉద్యమిస్తుంటే ప్రభుత్వం మాత్రం కేవలం ఎర్రజొన్నలకు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని అన్నారు. ప్రభుత్వం రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ధర నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పక్షాన ఏం మాట్లాడినా గతంలో ఏం చేశారంటూ విమర్శలు చేయడం మానుకోవాలని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని అన్నారు. గతంలో ఎర్రజొన్న ఉద్యమం జరిగిన సందర్భంలో రైతుల అభిప్రాయం మేరకు ధర నిర్ణయించి కొనుగోలు చేశామని, రైతుల్లో విశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం తరపున జీవో విడుదల చేశామని ఆయన తెలిపారు. నేడు ప్రభుత్వమే రైతులను రోడ్డెక్కే పరిస్థితి కల్పిస్తోందని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పసుపు పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తే క్వింటాల్‌కు 16 వేల ధర పలికిందని ఆయన గుర్తు చేశారు. నేడు మన తెలంగాణ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రైతులు రోడ్డెక్కడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉండి ఉద్యమిస్తుందని ఆయన చెప్పరు. రైతులు ప్రశాంతంగా ఉద్యమిస్తే 144 సెక్షన్ విధించడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం మొండి పోకడకు పోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలూర్ డిక్లరేషన్‌లో ఎర్రజొన్నలకు 3 వేలు, పసుపు క్వింటాల్‌కు 10 వేల ధర ఇస్తామని ప్రకటించినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ మేరకు ధర ప్రకటించకపోవడం నియంత పోకడలకు నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవమల్లయ్య, మార చంద్రమోహన్, కంచెట్టి గంగాధర్, పీసీ బోజన్న, మానాల మోహన్‌రెడ్డి, యాల్ల సాయిరెడ్డి, ఇ.గంగాధర్, గంగామోహన్ చకృ, జీవన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.