జాతీయ వార్తలు

అక్రమాలకు ‘వజ్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దగాకోరు లావాదేవీలు భిన్న కోణాల్లో వెలుగుచూస్తే గగ్గోలు పెట్టిస్తున్నాయి. వజ్రం అంటే అమూల్యం.. అమోఘం. దాని విలువ విస్మయకరమే. ఇలాంటి వజ్రానే్న ఆసరా చేసుకుని నీరవ్ మోదీ వేలకోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడ్డాడు. తాజాగా సెబి మొత్తం వజ్రాల వ్యాపారాలపై దృష్టి పెట్టింది. ఒకపక్క నీరవ్ మోదీ కంపెనీల అక్రమాలను వెలుగులోకి తెస్తూనే దేశంలో ఇతర వజ్రాల వ్యాపారులకు, ఆయన కంపెనీకి ఉన్న సంబంధాల పైనా దృష్టిపెట్టింది. దాదాపు 11,400 కోట్ల రూపాయల మేర కుంభకోణంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుదేలు కావడంతో ఈ రకమైన అక్రమాలకు నీరవ్ మోదీ, అలాగే ఇతర వజ్రాల వ్యాపార సంస్థలు ఎక్కడెక్కడ పాల్పడి ఉంటాయన్న దానిపై సెబి నిఘా వేసింది. అలాగే వజ్రాల వ్యాపారులు, స్టాక్ మార్కెట్ బ్రోకర్ల మధ్య ఉన్న సంబంధాలను కూపీ లాగుతున్నామని అధికారులు చెబుతున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ కుంభకోణంలో ప్రధానంగా దెబ్బతిన్నప్పటికీ వజ్రాలు, ఆభరణాల వర్తకం చేసే క్లైంట్లతో సంబంధాలున్న బ్యాంకుల పైనా సెబి దృష్టి పెట్టింది. ముఖ్యంగా మోదీ, చోక్సీ కంపెనీలతో సంబంధం ఉన్న డైరెక్టర్లతోపాటు అన్ని రిజిష్టర్ కంపెనీల పత్రాలపైనా సెబీ నిఘా పెట్టింది. ఈ కంపెనీల సంఖ్య డజన్లకొద్దీ ఉండవచ్చునన్న సంకేతాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 150 డొల్ల కంపెనీలను గుర్తించిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీటి ఆనుపానులను వెలికితీస్తోంది. మోదీ డైరెక్టర్‌గా ఉన్న దేశంలోని నాలుగు కంపెనీల పైనా, అలాగే మరో నాలుగు రిజిష్టర్ అయిన కంపెనీల వ్యవహారాలపైనా లోతైనా దర్యాప్తు సాగుతోంది. తానే అనేక కంపెనీలను నిర్వహిస్తున్నా చాలా వాటిలో నీరవ్ మోదీ ప్రత్యక్ష సంబంధాలు లేవు. అయితే ఫైవ్‌స్టార్ డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైవ్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, రాధాషిర్ జ్యువెలరీ కంపెనీ, జ్యువెలరీ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ సహా పలు కంపెనీలకు నీరవ్ మోదీ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే ఆయనకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న నాలుగు కంపెనీల్లో పాంచజన్ల డైమండ్స్ ఎల్.ఎల్.పి, నీషల్ ఎంటర్‌ప్రైజెల్ ఎల్.ఎల్.పి, పారగావ్ జ్యువెలరీ ఎల్.ఎల్.పి, పారగావ్ మర్కండైజ్‌డ్ ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ తీసుకోవడం ద్వారా ఈ భారీ కుంభకోణానికి నీరవ్ మోదీ పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ బ్యాంక్ ఇచ్చిన హామీ పత్రాలను ఆసరా చేసుకుని ఆయన అనేక బ్యాంకుల్లో.. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో ఆయన వేల కోట్ల రూపాయల మేర రుణాలు పొందారు. ఈ విధంగా పొందిన మొత్తాన్ని ఇతర అక్రమాలకు, బూటకపు కార్యకలాపాలకు నీరవ్ మోదీ ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన అనేక డిఫాల్ట్ కేసులపై దృష్టిపెట్టిన సెబి ఇవన్నీ కూడా వజ్రాల వ్యాపారానికి సంబంధించినవేనన్న వాస్తవాన్ని పసిగట్టింది. ఈ రంగానికి రుణాలచ్చే విషయంలో బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని సెబి ఆదేశించింది. అనేక మనీలాండరింగ్ కార్యకలాపాలకు వజ్రాల వ్యాపారం సులువైన మార్గంగా మారిందన్న విషయమూ ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో వెలుగుచూసింది. ఎందుకంటే వజ్రాలకు విలువ కట్టడం అన్నది అంత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి దీన్ని అన్ని విధాలుగా సదరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకునే సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వజ్రాల డిజైనర్‌గా, వ్యాపారికి పేరొందిన నీరవ్ మోదీ దేశవ్యాప్తంగా అనేక వజ్రాల ఆభరణాల రిటైల్ వర్తక కేంద్రాలను స్థాపించాడు. 1.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంత్యంత సంపన్నుడైన భారతీయుడుగా ఇటీవల ఫోర్బ్స్ జాబితా కూడా నీరవ్ మోదీ ఎక్కాడు. కేస్ విన్స్‌లెట్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అలియా భట్, శిల్పాశెట్టి సహా అనేక మంది సినీ తారలు నీరవ్ మోదీ తయారు చేసిన వజ్రాభరణాలు వేసుకుని మురిసిపోయారు అన్నట్టుగా ఇప్పటికే కథనాలు వచ్చాయి.