తూర్పుగోదావరి

మిత్రపక్షాల అనైక్యత రాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 19: జిల్లాలో నిన్న మొన్నటి వరకు మిత్రపక్షాలుగా వెలిగిన టీడీపీ-బీజేపీల మధ్య నేడు అగాథం ఏర్పడింది. ఇరు పార్టీల నేతల మధ్య ఐక్యత పూర్తిగా లోపించినట్టు ప్రస్తుత పరిణామాలు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి తెలుగు తమ్ముళ్ళు-కమలనాథుల మధ్య జిల్లాలో కొంతకాలంగా అంతరం పెరుగుతూ వచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం ఇరు పార్టీల నేతలు నేరుగా రోడ్డెక్కారు. ఈ ఎన్నికల్లో తమను టీడీపీ నేతలు వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ నేతలు బాహాటంగా విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తున్నప్పటికీ మిత్రధర్మాన్ని విస్మరించి, తమ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులపై బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఆయిల్ మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు బయటకు పొక్కడంతో దీనిని కమలనాథులు తమకనుకూలంగా మార్చుకున్నారు. పోర్టులో కోట్ల విలువైన ఇడిబుల్ ఆయిల్‌ను సదరు టీడీపీ నేత స్థానిక ముఖ్య నేతల అండదండలతో స్మగ్లింగ్ చేశారంటూ బాహాటంగా ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య నాయకత్వంలో మాఫియా సూత్రధారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష నిర్వహించారు. మాఫియాకు సంబంధించి అసలైన దోషులను రక్షించేందుకు ఇటు పోలీసులు, అటు టీడీపీ ప్రముఖ నేతలు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టులో ఆయిల్ మాఫియా ఆగడాలపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నిఘా సంస్థలకు నేరుగా స్థానిక కమలనాథులు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంతోనే జిల్లా కేంద్రం కాకినాడలో టీడీపీ-బీజేపీ నేతల మధ్య సయోధ్య పూర్తిగా లోపించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటున్నారని, ఇది చాలా దారుణమని బీజేపీ నేతలు ఆరోపణలు సంధించారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న ఆయా పథకాలపై ప్రథాని నరేంద్రమోదీ ఫొటోలను చిత్రించాలని డిమాండ్ చేశారు. ఆ మాటకొస్తే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్రానివేనని జిల్లాకు చెందిన ముఖ్యనేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అనేకసార్లు స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఇరు పార్టీల మధ్య వివాదాగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగిందని, అటు ప్రత్యేక ప్యాకేజీ, ఇటు ప్రత్యేక హోదా రెండూ లేకుండా కేంద్రం మోసం చేసిందని ఆయా రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలు కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని ప్రకటనలు చేయడం కమలనాధుల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. రాష్ట్రానికి న్యాయం చేసే వరకూ కేంద్రంపై పోరాడుతామని టీడీపీ నేతలు చెబుతుంటే, అసలు కేంద్రం రాష్ట్రానికి చేసిన మేలును ప్రజల్లోకి తీసుకువెళ్ళకుండా అడ్డుకుంటున్నదే టీడీపీ నేతలని కమలనాథులు కనె్నర్ర చేస్తున్నారు. ఈ విధంగా మిత్రపక్షాల మధ్య ప్రస్తుతం పూర్తిగా సయోధ్య లోపించడంతో, భవిష్యత్ పరిణామాలేవిధంగా ఉంటాయోనన్న ఆసక్తికరమైన చర్చ సామాన్యుల్లో జరుగుతోంది.

మావోల కట్టడికి కఠిన శిక్షణ అవసరం
ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: మావోల కట్టడకి పోలీసు సిబ్బందికి కఠిన శిక్షణ ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో సోమవారం సిఆర్‌పిఎఫ్, ఎఎన్‌ఎస్ (కేట్) సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతనంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ విధినిర్వహణలో క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. శిక్షణ ద్వారా మెలకువలను నేర్చుకోవచ్చని, తద్వారా మావోయిస్టులను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక శిక్షణతో సిబ్బంది అందరూ సామర్ధ్యాన్ని మెరుగుపరచుకుని జిల్లాలో మావోల కదలికలను పూర్తిగా నిరోధించేందుకు సహకరించాలని కోరారు. అత్యాధునిక పద్ధతుల్లో శిక్షణ ఇస్తామని, శిక్షణకు హాజరైన వారందరూ క్రమశిక్షణతో శిక్షణ పొందాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఎఎన్‌ఎస్ రిఫ్రెషింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ కె లోవరాజుకు వెయ్యి రూపాయలు, కానిస్టేబుల్ కె విజయ్‌కుమార్‌కు ఐదువందల రూపాయల నగదు పురస్కారాలను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంజీవి ఆసుపత్రి అధినేత డాక్టర్ నెక్కంటి సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బ్రిజేష్‌నాయర్ సారధ్యంలో వైద్య సిబ్బంది శిక్షణకు హాజరైన పోలీసు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌డి వై రవిశంకర్‌రెడ్డి, ఎఆర్ ఎఎస్పీ విఎస్ ప్రభాకర్‌రావు, ఎఎన్‌ఎస్ ఆర్‌ఐ రాజ్‌కుమార్, ఎఆర్ ఆర్‌ఐ రాజా, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే పోలీస్
ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు ఉన్నారని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి సుమారు 32 మంది హాజరై తమ సమస్యలను స్వయంగా ఎస్పీకి తెలియజేశారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన ఆయన అక్కడే ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్‌ల సిఐలతో వెంటనే మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ఆర్ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్ మురళీమోహన్, పలువురు సిఐలు హాజరయ్యారు.

జిజిహెచ్ ఎన్‌ఐసియు విభాగంలో అగ్ని ప్రమాదం
పరుగులు తీసిన పసికందుల తల్లులు
ఎవరికీ ప్రమాదం లేదు సూపరింటెండెంట్
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 19: కాకినాడ ప్రభుత్వాసుపత్రి మాతాశిశు విభాగం భవనం పైభాగంలో ఉన్న ఎన్‌ఐసియు విభాగంలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పసి బిడ్డలకు ప్రాణవాయువును సరఫరాచే సే సీపేప్ మెషిన్ అగ్నికి ఆహుతయింది. దీంతో వార్డులో తల్లులు తమ పసిబిడ్డలను తీసుకుని పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుసుకున్న వారు ఊపిరి పీల్చుకుని తిరిగి వార్డులోకి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రి మాతాశిశు విభాగంలోని ఎన్‌ఐసియు విభాగంలో అనారోగ్యం, తక్కువ బరువు, ఇతరు ఆరోగ్య సమస్యలు ఉన్న పసిబిడ్డలకు సీపేప్ పరికరం ద్వారా ఆక్సిజన్‌ను వైద్యులు అందజేస్తుంటారు. ఈ విభాగంలో సుమారు 30 మందికి పైగా పసిబిడ్డలకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయం దాటిన అనంతరం పసిబిడ్డలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే సీపేప్ మెషిన్‌లో నుండి మంటలు వెలువడగా ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న వైద్యులు వెంటనే అప్రమత్తమై మెషిన్‌కు ఉన్న విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అక్కడ ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలతో మంటలు ఆర్పివేశారు. అనంతరం వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలు వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకున్నారు. వైద్యులు తక్షణం అప్రమత్తమై సీపేప్ మెషిన్ నుండి వెలువడిన మంటలను అదుపుచేయని పక్షంలో ఆ విభాగంలో ఉన్న పసిబిడ్డలకు ప్రాణహాని జరిగి ఉండేది. చిన్నపిల్లల విభాగం నుండి మంటలు వస్తున్నాయని తెలుసుకున్న ఆ విభాగం కిందనే ఉన్న మాతాశిశు విభాగంలోని తల్లులు తమ పసికందులను తీసుకుని ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఎవరికీ ప్రాణహాని జరగలేదని తెలుసుకున్న వారు కుదుటపడి తిరిగి తమ బిడ్డలను తీసుకుని వార్డులోకి చేరుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ఈ ఘటనపై మాట్లాడుతూ సీపేప్ మెషిన్ ప్రస్తుతం వారంటీలోనే ఉందని, మెషిన్ తయారీదారులకు ప్రమాద విషయాన్ని తెలియజేశామని, వారు పరిశీలించిన అనంతరం ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు. వైద్యులు సకాలంలో స్పందించడంతో పసిబిడ్డలకు ఎటువంటి ప్రాణహాని జరగలేదన్నారు. ఆస్తినష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఎన్‌ఐసియు విభాగంలో చికిత్స పొందుతున్న పసిబిడ్డలకు ఇతర పరికరాల ద్వారా ఆక్సిజన్‌ను అందజేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కాగా ఇటీవల గత రెండు నెలల కాలంలో ప్రభుత్వాసుపత్రిలో జరిగిన మూడవ అగ్ని ప్రమాదం ఘటన కావడంతో ఆసుపత్రిలో తీవ్ర అలజడి నెలకొంది. ఈ ఘటనలపై ప్రజలు ఆందోళన చెందడం కనిపించింది.

మైనింగ్ బాధితులకు న్యాయం చేయాలి
నిరవధిక దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్
కడియం, ఫిబ్రవరి 19: కడియం మండలం వేమగిరిలో అక్రమ మైనింగ్ వల్ల నష్టపోయిన బాధితులందరికీ న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎంపీ జివి హర్షకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం వేమగిరిలో మైనింగ్ జరిగిన ప్రదేశం వద్ద ఆయన నిరవధిక నిరసనకు దిగారు. వేమగిరిలో 140 అడుగుల లోతు మైనింగ్ జరిగిందని, కొండ పైభాగంలో ఉన్న దళితుల నివాసాలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణం మైనింగ్ జరిగిన ప్రదేశంలో రక్షణ గోడ నిర్మించాలని, ఇళ్లు నష్టపోయిన బాధితులకు కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాలని, మైనింగ్ జరిగిన ప్రదేశంలో గాయపడిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం దక్షిణ మండల ఇన్‌ఛార్జి డీఎస్పీ కులశేఖర్, తహసీల్దారు రాజ్యలక్ష్మి హర్షకుమార్‌తో చర్చలు జరిపారు. ఈ సంఘటనపై ఇప్పటికే మాజీ సర్పంచ్ వెలుగుబంటి వెంకటాచలంపై నాలుగు కేసులు నమోదు చేశామని, అరెస్టు చేయడానికి రెండు రోజులు సమయం కావాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, అందుకు ప్రభుత్వం తరఫున సహాయంగా 25 వేల రూపాయల చెక్కును కూడ హర్షకుమార్‌కు చూపారు. అలాగే మరో 25 వేల రూపాయల నగదును బాధ్యుల నుండి తీసుకొచ్చామని, ఈ సొమ్ములు గాయపడిన వారికి ఇస్తామని చెప్పడంతో హర్షకుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, 25వేల నగదు బాధ్యుల నుండి తీసుకురావడం సిగ్గు చేటన్నారు. కలెక్టర్ స్వయంగా వస్తేనే కాని తాను దీక్ష విరమించేది లేదని హర్షకుమార్ స్పష్టం చేశారు. దీంతో అధికారులు వెనుతిరిగారు. కాగా హర్షకుమార్ దీక్ష సోమవారం రాత్రి కూడ కొనసాగించారు. అలాగే హర్షకుమార్ దీక్షకు వైసీపీ రూరల్ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, బీసీ ఐక్యవేదిక నాయకులు కడలి వెంకటేశ్వరరావు, కాపు నాయకులు రామినీడు మురళి తదితరులు మద్దతు పలికారు. శిబిరంలో దళిత నాయకులు యాదల స్టాలిన్, విప్పర్తి ఫణికుమార్, బడుగు ప్రశాంతకుమార్, పల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్ధుల క్రమశిక్షణ అందరి బాధ్యత
వీసీ ముత్యాలనాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19: విద్యార్థులను క్రమశిక్షణతో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువుతో పాటు సమాజంలోని ప్రతీ ఒక్కరి పైనా వుంటుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. ప్రస్తుత కాలంలో విద్యావిధానంలో వస్తున్న అనేక సమస్యలపై చర్చించేందుకు సోమయవారం యూనివర్సిటీ సెమినార్ హాలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో విద్యార్థుల ప్రవర్తన, వసతుల కల్పన, విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకం కావడం వంటి పలు అంశాలపై అధ్యాపకులు చర్చించారు. వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పాశ్చాత్య సంస్కృతి అలవాటవుతున్న కాలంలో విశ్వవిద్యాలయాలు విద్యతో పాటు విలువలను కూడా అందించాలని, ఆ దిశగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అడుగులు వేయాలన్నారు. ముఖ్యంగా తరగతి గదిలో ఉన్న విద్యార్థుల మనస్తత్వాలు అధ్యాపకులు అధ్యయనం చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై, ప్రవర్తన సరిగాలేని విద్యార్థులపై తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి ఎప్పటికపుడు విద్యార్థుల పరిస్థితులను తెలియజేయాలన్నారు. విద్యార్థులకు కౌనె్సలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి అశోక్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ శ్రీరమేష్, డాక్టర్ కె సుబ్బారావు, డాక్టర్ వి పెర్సిస్, డాక్టర్ టి హైమావతి, డీన్స్ ఆచార్య ఎస్ టేకి, డాక్టర్ పి సురేష్ వర్మ, డాక్టర్ వై శ్రీనివాసరావు, డాక్టర్ ఎ మట్టారెడ్డి, డాక్టర్ పి వెంకటేశ్వరరావు, డాక్టర్ జ్యోతిర్మయి, ఈసీ మెంబర్ డాక్టర్ పి విజయనిర్మల, హాస్టల్ వార్డెన్ డాక్టర్ కెజియరాణి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

టీడీపీ సీనియర్ నేత దత్తుడు హఠాన్మరణం
ఆలమూరు, ఫిబ్రవరి 19: టీడీపీ సీనియర్ నేత, మండల అభివృద్ధి ప్రదాత బొబ్బా సత్యనారాయణమూర్తి (దత్తుడు) సోమవారం హఠాన్మరణం చెందారు. ఈయన వయస్సు 85 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన సతీమణి జయశ్రీ ప్రఖ్యాత వైద్యురాలు. దత్తుడి ఇద్దరు కుమార్తెలలో ఒకరు ఇటీవల మృతిచెందగా, రెండవ కుమార్తె ఇందిరా లావణ్య ప్రముఖ వైద్యురాలు. ఆలమూరులోని శ్రీబొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాల, సొసైటీ బ్యాంకు, బస్ స్టాండ్ ఏర్పాటు, జొన్నాడలో హైస్కూల్ భవన నిర్మాణం, సొసైటీ బ్యాంకు స్థాపన, బస్ స్టాండ్లు, జొన్నాడ నుంచి మండపేట వరకూ ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా పండ్ల జాతి మొక్కలు ఏర్పాటు వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేబట్టిన దత్తుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన పార్థివ దేహాన్ని దర్శించి ఘన నివాళులర్పించారు. ఈయన మృతికి సంతాప సూచకంగా ఆలమూరు, జొన్నాడ ప్రభుత్వ పాఠశాలలు, జొన్నాడ ఇసుక ర్యాంపును స్వచ్ఛందంగా మూసివేశారు. దత్తుడు అంత్యక్రియలను జొన్నాడ గౌతమీ గోదావరి తీరంలో గల కైలాస భూమిలో ఆయన కుమార్తె ఇందిరా లావణ్య నిర్వహించారు. దత్తుడు మృతికి శాసనమండలి డిఫ్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ ఛైర్మన్ ఈదల సత్యనారాయణ చౌదరి, పీఏసీఎస్ ఛైర్మన్ వంటిపల్లి సతీష్, ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు, జొన్నాడ ఉప సర్పంచ్ తాడి శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు, ఆ పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు.

అనారోగ్యంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి
కూనవరం, ఫిబ్రవరి 19: కూనవరం మండలం రేపాక ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సోడే లక్ష్మణరావు(15) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణరావుకు శనివారం ఉదయం కాళ్లవాపు రావడంతో వార్డెన్ రవికుమార్‌కు తెలిపాడు. దాంతో వార్డెను అతడిని కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా వైద్యాధికారి పరీక్షించి చింతూరు ఏరియా ఆసుపత్రికి పంపించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధ వ్యాధి ఉందని గ్రహించి రాజమహేంద్రవరం తీసుకెళ్లాలని సూచించారు. రాజమహేంద్రవరంలో పరీక్షించిన వైద్యులు కాకినాడ తీసుకెళ్లాలని చెప్పడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని సోమవారం రేపాకకు తరలించగా ఏటిడబ్ల్యువో శంకరయ్య మృతుని బంధువులను పరామర్శించి తక్షణ సాయంగా అయిదువేల రూపాయలు అందించారు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత చదువులు చదువుతాడని ఆశించగా మృతదేహంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని ఎంపీపీ కొమరం పెంటయ్య, మాజీ ఎంపీపీ పాయం వెంకయ్య సందర్శించారు. కాగా చింతూరు ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
- మరొకరికి తీవ్ర గాయాలు
రావులపాలెం, ఫిబ్రవరి 19: రావులపాలెంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం పాలవగా మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావులపాలెం మండలం పొడగట్లపల్లికి చెందిన నడింపల్లి శ్రీశివ శ్రీహరి రాజాఫణేంద్రవర్మ (20) స్థానిక సనిహిత కళాశాలలో బికాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం పొడగట్లపల్లికి వెళ్లేందుకు మోటారు సైకిలుపై రావులపాలెం వచ్చాడు. రావులపాలెంలో తన స్నేహితుడైన ఐ పోలవరం మండలం టి కొత్తపల్లికి చెందిన భూపతిరాజు మనోజ్‌ను మోటారు సైకిలుపై ఎక్కించుకొని కొత్తపేట వైపు బయలుదేరాడు. కొత్తపేట రోడ్డులో బిఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ఛేంజి సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వారిని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఫణేంద్రవర్మ అక్కడికక్కడే మృతిచెందాడు. మనోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మనోజ్‌ను ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫణేంద్రవర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. స్థానిక సనిహిత కళాశాల యాజమాన్యం, విద్యార్థులు అతని మృతి పట్ల సంతాపం తెలిపి సెలవు ప్రకటించారు.

ఏపీ వెనుకబాటుతనానికి కాంగ్రెస్, టీడీపీలదే బాధ్యత
- బీజేపీ రాష్ట్ర శిక్షణా తరగతుల కన్వీనర్ వేటుకూరి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, ఫిబ్రవరి 19: రాష్ట్రం వెనుక బడి ఉండటానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదే ప్రధాన బాధ్యతని బీజేపీ రాష్ట్ర శిక్షణా తరగతుల కన్వీనర్ వేటుకూరి సూర్యనారాయణరాజు ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా సీమాంధ్రా వారే అయినప్పటికీ అభివృద్ధి నిధులన్నింటినీ హైదరాబాద్‌లోనే ఖర్చుచేశారని, అందుకే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు. సోమవారం స్థానిక కాటన్ అతిధి గృహంలో ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారంతా సీమాంధ్రలోని 13 జిల్లాలను కనీసం పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇప్పుడు నీతివాక్యాలు వల్లిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని 1995 ప్రాంతంలోనే అప్పటి ప్రధాని ఏబీ వాజ్‌పేరుూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అప్పటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కనీసం స్పందించలేదన్నారు. కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులను హైదరాబాద్‌లోనే వెచ్చించి మిగిలిన సీమాంధ్ర జిల్లాలకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎంపీలు సమైక్య గళానే్న వినిపించారు గానీ విభజన వల్ల కలిగే నష్టాలను ఏ విధంగా పూడ్చుకోవాలనే అంశంపై దృష్టి సారించలేదన్నారు. కేవలం బీజేపీ ఎంపీలు మాత్రమే విభజన నష్టాలపై పార్లమెంటులో మాట్లాడి కొన్ని స్పష్టమైన హామీలను సాధించారని గుర్తుచేశారు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాలకు మాత్రమే 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే దానిలో ఏపీ ఒకటన్నారు. లక్ష కోట్లతో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కోనసీమ రైల్వే లైనుకు సుమారు వెయ్యికోట్లకు పైగా నిధులు ఇచ్చామని, ఇంతవరకూ రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా విడుదల చేయలేదన్నారు. అయితే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాత్రం రైల్వే నిధులు సాధించింది తన ఘనతగా ఇక్కడ గొప్పలు చెప్పుకుంటూ పార్లమెంటులో నిరసన చేయడం పట్ల వేటుకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వె లైను నిర్మాణానికి నిధులు కేటాయింపు జరిగిందంటే అది కోనసీమవాసి రామ్‌మాధవ్ కృషేనని ఆయన స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తూ డ్రామాలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. విభజన రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న నిధులకు సరైన లెక్కలు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎదురు దాడి చేయం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను గురించి గణాంకాలతో సహా వేటుకూరి వివరించారు. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తులు గురించి మాట్లాడతామని, అంతవరకూ అభివృద్ధిపైనే బీజేపీ దృష్టి సారిస్తుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీకీ ఎందుకు చట్టబద్ధత కల్పించలేదన్న విలేఖరుల ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లా పవన్‌కుమార్, బత్తుల లక్ష్మీకుమారీ, మజ్దూర్ మోర్చా నాయకులు ఆకుల వీరబాబు, నాయకులు దేవాదుల సూర్యనారాయణమూర్తి, కాటా బాలయ్య, ఈతకోట బాలస్వామి, దేశినీడి కిరణ్, సలాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గోడకు ఫిర్యాదు అంటించిన ఎమ్మెల్యే
పోలీసుల తీరుపై ఆగ్రహం
కొత్తపేట, ఫిబ్రవరి 19: బాధితులు ఫిర్యాదు చేసేందుకు వస్తే ఫిర్యాదు తీసుకోకపోవడంతో కొత్తపేట పోలీస్ స్టేషన్ గోడకు ఫిర్యాదు అంటించి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిరసన తెలియజేసారు. ఈ విషయాన్ని డిజిపి దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్యే హెచ్చరించారు. వివరాల ప్రకారం మండల పరిధిలోని వాడపాలెంకు చెందిన బండారు నాగమణి సరిహద్దులో నిర్మించిన గోడను కూల్చారనే ఫిర్యాదు చేసేందుకు వస్తే దానిని తీసుకోలేదంటూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి బాధితులు ఫిర్యాదు చేయటంతో దీనిపై స్పందించిన ఎమ్మెల్యే చిర్ల స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దానిపై ఆరా తీసి ఎస్సై డి విజయ్‌కుమార్‌తో వాగ్వివాదానికి దిగారు. పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెవిన్యూ అధికారికి గోడ నిర్మాణం విషయమై సర్వే చేయాలని కోరగా ఆమేరకు తహసీల్దారు చెప్పిన మేరకు వారు గోడను నిర్మిస్తే తిరిగి అదే తహసీల్దారు దగ్గరుండి గోడను కూల్చివేసారని, దీనిపై బాధితులు న్యాయం కోసం ఫిర్యాదు చేయాలని చూస్తే అసలు పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో పోలీస్ స్టేషన్ గోడకు బాధితుల తరఫున ఫిర్యాదు అంటించినట్లు తెలిపారు. పోలీసులు కొత్తపేటలో బాణాసంచా వ్యాపారుల నుంచి ఎఎస్‌పి పేరుచెప్పి భారీగా వసూలు చేసారని ఆరోపించారు.

పన్నుల వసూళ్లలో అలసత్వం వద్దు
మున్సిపల్ ఆర్డీ నాగరాజు
పిఠాపురం, ఫిబ్రవరి 19: పట్టణాల్లో పన్నులు వసూలు చేయడంలో మున్సిపల్ సిబ్బంది అలసత్వం ప్రదర్శించవద్దని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ జి నాగరాజు అన్నారు. సోమవారం పిఠాపురం వచ్చిన ఆయన మున్సిపల్ కార్యాలయంలో పిఠాపురం, గొల్లప్రోలు, మున్సిపాల్టీల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నూరుశాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలన్నారు. రెడ్ నోటీసులు జారీ చేసిన తరువాత వాటిపై తీసుకున్న చర్యలపైనా మున్సిపల్ రెవిన్యూ అధికారులను ఆర్డీ ప్రశ్నించారు. నోటీసులు అందుకున్న వారిపై తదుపరి చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జీఐఎస్ సిస్టమ్ ద్వారా పన్నుల పరిధిలోకి వచ్చే నిర్మాణాలను గుర్తించాలన్నారు. డబుల్ ఎంట్రీ సమస్య కూడా ఈ సమస్య ద్వారా తీరుతుందన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేయాలని సూచించారు. రీజియన్ పరిధిలో 61 శాతం పన్నుల వసూళ్లు జరిగినట్లు ఆర్డీ తెలిపారు. సామర్లకోట మున్సిపాల్టీ, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీలు పన్నుల వసూళ్లలో వెనుకంజలో ఉన్నాయని వివరించారు. సమావేశంలో పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ కరణం చిన్నారావు, కమిషనర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

నరసన్న ఉత్సవాలపై సమీక్ష
కోరుకొండ, ఫిబ్రవరి 19: కోరుకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 25 నుండి వచ్చే నెల 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి మారిశెట్టి జితేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై సోమవారం స్వామివారి కల్యాణ మండపంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. అనంతరము ఏర్పాట్లను ఇవో జితేంద్ర పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్‌పి రంగరాజభట్టార్, రాజమహేంద్రవరం మార్కెట్ యార్డు చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, కోరుకొండ సొసైటీ అధ్యక్షులు నాగా రమేష్, అన్నవరం అధికారులు తులా రాము, సూపరిండెంట్ రమణ, కోరుకొండ ఆలయ ఇన్‌చార్జి తాటిపాక రాంజీ తదితరులు పాల్గొన్నారు.