విశాఖపట్నం

కార్మిక వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ఆలిండియా ట్రేడ్ యూనియన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసేన్ సేన్ మాట్లాడుతూ కార్మికులు, సామాన్య ప్రజానీకానికి ప్రధాని మోదీ శత్రువుగా అభివర్ణించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలనేవే లేకుండా చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ రంగం సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా క్రమంగా వాటిని ప్రైవేటు సంస్థలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జాతీయ సంపదను దోచిపెట్టే పనిలో నిమగ్నమైందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలనేవే లేకుండా చేసే ఆలోచన జరుగుతోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట మోదీ చేస్తున్న ప్రయోగాలన్నీ భూటకమన్నారు. విశాఖలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని, వీటిలో ప్రస్తుతం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయించారని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 10 శాతం వాటాలను విక్రయించాలని భావించడం దారుణమన్నారు.
మరో ప్రధాన కార్యదర్శి స్వదేశీరాయ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై అన్ని కార్మిక సంఘాల నేతృత్వంలో అవిశ్రాంత పోరు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా డీసీఐ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి కార్మిక సంఘాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసానిచ్చారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12 నుంచి 17 వరకూ ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్శింగరావు, పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్మికులతో డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

క్రికెట్ ట్రోఫీ గీతం కైవసం
ఆరిలోవ, ఫిబ్రవరి 19: ఇటీవల ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం క్రికెట్ జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం మైదానంలో జరిగిన పోటీల్లో గీతం జట్టు కెప్టెన్ జీ కృష్ణ, సభ్యులు రొక్కం నవీన్, శ్రీకాంత్ రెడ్డి, డీ శ్రీరామ్, డీఎస్ నాగకల్యాణ్, ఎన్ దిలీప్‌కుమార్ రెడ్డి, పీఎస్‌వీడీ గణేష్, వీహెచ్ వర్థన్ రెడ్డి, నవీన్, పూజారి సంతోష్ కీలక పాత్ర పోషించారని స్పోర్ట్స్ బోర్డ కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు. జట్టు సభ్యులను ఆయన అభినందించారు.

గీతంలో ఛత్రపతి శివాజీ జయంతి
ఆరిలోవ, ఫిబ్రవరి 19: భారత స్వాతంత్య్ర పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ 388వ జయంతిని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో సోమవారం నిర్వహించారు. భారతీయతను చాటుకుంటూ ఆంగ్లేయులపై అలుపెరగని పోరు చేసిన శివాజీ చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ సందర్భంగా గీతం ఆవరణలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి అంతరిక్ష పోటీల్లో గీతం విద్యార్థుల ప్రతిభ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ఇటీవల ఖరగ్‌పూర్ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి అంతరిక్ష పోటీల్లో (నేషనల్ స్టూడెంట్స్ స్పేస్ ఛాలెంజ్) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. ఖరగ్‌పూర్ ఐఐటీ వింగోఫోటెక్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 16 విశ్వవిద్యాలయాల జట్లు పాల్గొన్నాయి. మూడు రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో సాలిడ్ వర్క్స్, కేటీయూ, ఫ్యూజన్-360, ఆటోక్వాడ్ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గీతం జట్టులో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు డీ భరత్, ఎ విష్ణువర్ధన్ రెడ్డి, డీవీఎస్ సాయికీర్తన, కే దుర్గాసాయి, జీ భాను భరద్వాజ్ ప్రథమ స్థానంతో పాటు రూ.11వేలు నగదు బహుమతిని, బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను గీతం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ కే లక్ష్మీప్రసాద్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎంఆర్‌ఎస్ సత్యనారాయణ తదితరులు అభినందించారు.

- ళనఆ
ఎన్నికలో గెలుపే థ్యేయంగా పనిచేయాలి
ఎం.ఎల్.ఎ. కిడారి
అరకులోయ, ఫిబ్రవరి 19: రానున్న ఎన్నికల్లో దేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పెట్టుకుని కార్యకర్తలు పనిచేయాలని ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కోరారు. స్థానిక ఎం.ఎల్.ఎ. క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్నది తెలియకపోయినప్పటికీ ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. పార్టీని పటిష్టపరచడమే కాకుండా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గ్రామాలలో ప్రభుత్వ కార్యక్రమాలను గిరిజనులకు వివరించి వారికి అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. నియోజకవర్గాన్ని వచ్చే నెలాఖరు నాటికి బహిరంగ మలవిసర్జన రహిత (ఒ.డి.ఎఫ్.)గా సిద్ధం చేయడానికి అధికారులతో పాటు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. స్వచ్ఛ భారత్‌ను నినాదంగానో, ఫ్రభుత్వ కార్యక్రమంగానో భావించకుండా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా పరిగణించి స్వచ్ఛ భారత్‌ను బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి కుటుంభం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం తగదని ఆయన అన్నారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించుకోకపోతే ప్రభుత్వ రాయితీలు అందకుండా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించే అధికారుల కోసం తమకు పిర్యాదు చేయవచ్చునని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు, సమస్యలను పరిష్కరించడంలో అశ్రద్ధ కనబరిచే అధికారులతో భవిష్యత్తులో వారు గిరిజనాభివృద్ధికి తమవంతు కృషి చేసేలా చర్యలు తీసుకుంటామని సర్వేశ్వరరావు అన్నారు. అనంతరం అరకులోయ పట్టణానికి చెందిన పలువురు మహిళలు దేశం పార్టీలో చేరారు. ఈ సమావేశంలో దేశం నాయకులు ఎం.పి.పి. కె.అరుణకుమారి, వైస్ ఎం.పి.పి. పొద్దు అమ్మన్న, శెట్టి లక్ష్మణుడు, పాంగి రాజారావు, బాకూరు వెంకటరమణరాజ, శెట్టి అప్పాలు, సమర్డి రఘునాధ్, కె.సుబ్బారావు, బి.బి.లక్ష్మి, టి.సుబ్బారావులతో పాటు వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి
అరకులోయ, ఫిబ్రవరి 19: పోడు భూములను సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. మండలంలోని సుంకరమెట్ట పంచాయతీలోని పలు గ్రామాల గిరిజనులతో కలిసి తాహశీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నినాదాలు చేసారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల నాయకుడు జి.చినబాబు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ 318 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో కొందరికి పట్టాలు మంజూరు చేసి మరి కొంతమందిని విస్మరించారని అన్నారు. సుంకరమెట్ట పంచాయతీలోని 23 గ్రామాలలో సర్వే నిర్వహించిన అధికారులు దండబాడు, దవడగుడ, దుక్కగుడ, తోటవలస, కిన్నంగుడ, డాబుగుడ, సంగంవలస తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు ఇంతవరకు పట్టాలు మంజూరు చేయలేదని ఆయన చెప్పారు. భూములు లేక పోడు భూముల్లో సాగు చేసి బతుకు బండిని ఈడ్చుకువస్తున్న రైతులకు ఇప్పటికైనా ఆ భూములపై హక్కు కల్పించాలని ఆయన కోరారు. అనంతరం డిప్యూటీ తాహశీల్ధార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.
సకాలంలో నిధులు వెచ్చించాలి
అరకు ఎం.పి. గీత
అరకులోయ, ఫిబ్రవరి 19: ప్రభుత్వ నిధులు సకాలంలో వెచ్చించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలని అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత కోరారు. స్థానిక పర్యాటక శాఖ ఇష్టాగోష్టి మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం నిర్వహంచిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గడువులోగా అభివృద్ధి పనులు చేపట్టకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉందని అన్నారు. గిరిజనాభివృద్ధిని కాంక్షించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులను సకాలంలో సక్రమంగా ఖర్చు చేయకపోతే ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని ఆమె చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పాఠశాలల భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండడం వలన విద్యనభ్యసించే గిరిజన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. వసతి సమస్యతో సతమతమయ్యే విద్యార్థులు ఏ విధంగా విద్యనభ్యసిస్తారని ఆమె ప్రశ్నించారు. నిరక్షరాస్యతను నిర్మూలించి గిరిజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగంగా అత్యాధునిక పాఠశాల భవన నిర్మాణాలకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ గడువులోగా పూర్తికాకపోవడంతో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో తన కోటా నిధులను వెచ్చించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టని శాఖలను గుర్తించి ఆ నిధులను వెనక్కి తీసుకుని ఇతరత్రా అభివృద్ధి పనులకు వెచ్చించేలా చర్యలు తీసుకోనున్నట్టు గీత చెప్పారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఎం.పి.డి.ఒ. మల్లిఖార్జునరావు, డిప్యూటీ తాహశీల్ధార్ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థులకు కరాటేలో శిక్షణ
అరకులోయ, ఫిబ్రవరి 19: మండలంలోని కొత్తబల్లుగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాల, అరకులోయ గిరిజన సంక్షేమ కేంద్రీకృత బాలుర ఆశ్రమోన్నత పాఠశాలల్లో కరాటే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వడోకాయ్ కటాటే సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులను అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు గిరిజన విద్యార్థులు కరాటేలో కూడా రాణించాలని కోరారు. గిరిజన బాలికలు, యువతులకు ఈ విద్య ఎంతో అవసరమని, ఇందులో శిక్షణ పొందితే తమకు తాము రక్షించుకోవచ్చునని ఆయన చెప్పారు. పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ ఆదేశాల మేరకు వంద మంది గిరిజన బాల బాలికలకు కరాటేలో శిక్షణ ఇవ్వనున్నట్టు కరాటే సంఘం ప్రతినిధి పాంగి చిట్టిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, దేశం నాయకులు పాల్గొన్నారు.

డైట్‌లో ఎంబిఎ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు
అనకాపల్లి, ఫిబ్రవరి 19: స్థానిక డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబిఎ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు న్యూ ఆర్క్ డిజైన్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రాంగణ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా కంపెనీ హెడ్, బిఐఎం ప్రదీప్ విద్యార్థులకు తమ కంపెనీ గూర్చి, ఎంబీఎ ప్రాముఖ్యత, విద్యార్థులకు ఉద్యోగావకాశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఎంబిఎ విద్యార్థులు ప్రతీ కంపెనీకి అవసరమని ఇటువంటి నియామకాలలో ఉత్సాహంగా పాల్గొని తమ కెరీర్ గురించి ఆలోచించుకుని భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు కాలేజీకి తీసుకువస్తామని తెలిపారు. ఎంబిఎ విభాగాధిపతి డాక్టర్ పిబి రామ్‌కుమార్ మాట్లాడుతూ ఎంబిఎ విద్యార్థులకు మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ వంటి ఈ మూడు రంగాల్లో అనేక ఉద్యోగావకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతీ కంపెనీకీ ఈ మూడు విభాగాలు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఈ నియామకాలలో ఎంబిఎకి సంబంధించి మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ సంబందించిన విద్యార్థులకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ రౌండ్స్ నిర్వహించారు. ఈ నియామకాలలో 85మంది విద్యార్థులు పాల్గొన్నారు. 62మంది అర్హత సాధించారు.

కూలి రేట్ల పెంపుకై కొనసాగుతున్న క్వారీ కార్మికుల సమ్మె
లారీలు స్తంభింపజేసి నిరసన
చర్చలకు దిగివచ్చిన యాజమాన్యాలు
అనకాపల్లి, ఫిబ్రవరి 19: కూలిరేట్లు పెంపుదలపై యాజమాన్యం కుదుర్చుకున్న 9వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో విశాఖజిల్లా క్వారీ క్రషర్స్ జిల్లా కార్మిక సంఘం నేతృత్వంలో తలపెట్టిన బంద్ సోమవారం నాటికి 5వ రోజుకు చేరుకుంది. ఆందోళన ఉద్ధృతంలో భాగంగా మండలంలోని మార్టూరు, మామిడిపాలెం గ్రామాల్లో నిరసన దీక్షలు ఏర్పాటుచేసి క్వారీల నుండి లారీల్లో తీసుకువస్తున్న పిక్కను నిరసనకారులు అడ్డగించారు. క్వారీలు, స్టోన్‌క్రషర్ల నుండి పిక్క వెళ్లకుండా స్తంభింపజేసారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రూరల్ ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి రంగప్రవేశం చేసారు. క్వారీ యజమానుల సంఘం అధ్యక్షులు మల్లిఖార్జునరావు, ఇతర సంఘాల ప్రతినిధులు క్వారీ కార్మికులతో చర్చలకు అంగీకరించారు. మంగళవారం క్వారీ కార్మికులతో వేతనాలు పెంపుదలపై చర్చలు జరిపి న్యాయం చేస్తామని ఎస్‌ఐ సమక్షంలో హామీ ఇచ్చారు. దీంతో క్వారీ కార్మికులు లారీల నిలుపుదల నిరసన తాత్కాలికంగా విరమించుకున్నారు. ఎఐఎఫ్‌టియు అధ్యక్షులు కోన మోహన్, క్వారీ కార్మిక సంఘం అధ్యక్షులు శనివాడ చిలుకు, డ్రిల్లర్స్ కార్మిక సంఘం అధ్యక్షులు దొరపల్లి రమణ, నాయుడు సీతాలు తదితరులు ఈ ఆందోళనా కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఆందోళనలో భాగంగా నిరసన దీక్షా శిబిరాల వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని క్వారీ కార్మికులు చేపట్టి తమ నిరసనను తెలియజేసారు.

నిధుల కేటాయింపులో దళితవాడలకు సముచిత స్థానం
అనకాపల్లి, ఫిబ్రవరి 19: అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో దళితవాడ ప్రాంతాలకు సముచిత స్థానం కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భరోసా ఇచ్చారు. దళిత తేజం కార్యక్రమంలో భాగంగా స్థానిక గవరపాలెంలోని అంబేద్కర్ నగర్‌లో ఎమ్మెల్యే పీలా సోమవారం విస్తృతంగా పర్యటించి ఆయా ప్రాంతాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరవుపెట్టారు. డ్రైనేజీ కాలువలను పరిశీలించి శుభ్రం చేసే కార్యక్రమాన్ని తమ సన్నిహిత నేతలతోపాటుగా నిర్వహించారు. తొలుత అరుందతినగర్‌లో బాబూజగజ్జీవనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎస్‌సి, ఎస్టీల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. దళితవాడలు నగరాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గంలో పెద్దమొత్తంలో నిధులు ఖర్చుచేసామన్నారు. జిల్లా దేశం ఫ్రధాన కార్యదర్శి బుద్ద నాగజగదీశ్వరరావు, డాక్టర్ కెకెవిఎ నారాయణరావు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకట్రావు, అర్బన్ దేశం ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర, జిల్లా తెలుగుమహిళా కార్యదర్శి కొణతాల రత్నకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రాంతంలో వైసీపీ బలోపేతం కావాలి
గాజువాక, ఫిబ్రవరి 19: పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని వైసిపి పరిశీలకులు ఫరూక్ అన్నారు. కొత్తగాజువాక బిసి రోడ్డు 63వ వార్డులో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ వైసిపిదేనని అన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేశి, దోపిడి వ్యవస్ధలుగా మారాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకే పరిమిత మయ్యాయని ద్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ రాకుండా అడ్డుపుల్లగా తయారైందని చంద్రబాబేనని విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేశారని, ఖజాణాను ఖాళీచేసి రాష్ట్రాన్ని అపుల ఊభిలోకి నెట్టేశారన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను ప్రజలు పారదోలేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వైసిపి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు షౌకత్ అలీ, అప్పారావు, కుమార్, మదీనాభాషా, సలీమా, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు విద్యార్థుల పాద పూజలు
పాయకరావుపేట, ఫిబ్రవరి 19 : పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థులు తమ తల్లిదంఢ్రులకు పాత పూజ చేసి శాలువాలతో సత్కరించారు. ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులకు పండ్లు, పూలను బహుమతిగా ఇచ్చి వారి పట్ల గౌరవం, విధేయతతో నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేసారు. ఈసందర్భంగా పాఠశాల పిన్సిపల్ ఎ.మహేష్ మాట్లాడుతూ చదువుతో పాటుగా సామాజిక బాధ్యతను మానవ సంబంధాలను మెరుగుపరచడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్మార్ట్ లీవింగ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల ఫ్యామిలీ బ్లీస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మొబైల్, ఇంటర్నెట్, టెలివిజన్ మోజుతో పడి మానవ సంబంధాలను బలహీన పరచడం జరుగుతుందని, ఈ విలువలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎ.జి. ఎం.సురేష్, రీజనల్ ఇన్‌చార్జ్ బి.గోపీనాధ్, డి. ఎన్.కనకారావు, లావణ్య, ఎ. ఓ. విజయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దారాలమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
సీలేరు, ఫిబ్రవరి 19: విశాఖ మన్యం ఆరాధ్యదైవమైన దారాలమ్మ అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మెన్ మాడుగుల పాపారావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దారలమ్మ అమ్మవారి ఉత్సవాలను ప్రతీ ఏటా కొత్త అమావాస్యను పురష్కరించుకుని ఆనవాయితీగా ఈపండుగలను నిర్వహిస్తామని, ఉత్సవాలకు సందర్భంగా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్సవాలకు ముహూర్తం పెట్టించామన్నారు. పనులను ప్రారంభించేందుకు ఆలయ కమిటీతో పాటు పర్యవేక్షకుల ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తామని, మార్చి 8 తేదీన పందిరి రాట వేయడం జరుగుతుందన్నారు. అదే రోజు గరగల ముహూరం నిర్ణయించడం జరిగిందన్నారు.

లక్షన్నర విలువైన గంజాయి పట్టివేత
రోలుగుంట, ఫిబ్రవరి 19: మండలంలోని వడ్డిప జంక్షన్ వద్ద లక్షన్నర రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. ఈకేసులో కారు, ఆటో సీజ్ చేసి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను సోమవారం అరెస్ట్ చేసారు. ఒక వ్యక్తి పరారైనట్లు ఎస్సై హరికృష్ణ వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జనదగిరి గ్రామానికి చెందిన చిన్ని చంద్రరావు, ఇదే జిల్లా శంకవరం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జీశెట్టి శ్రీనివాసరావులు కారులో 30 కిలోల గంజాయిని వేసుకుని ప్రయాణిస్తున్నారు. తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తెల్లవారు జామున వడ్డిప జంక్షన్‌లో వీరిని అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. స్వాధీన పరుచుకున్న గంజాయి 30 కిలోలు ఉందని, దీని విలువ లక్షన్నర ఉంటుందని అంచనా వేసారు. వీరు ప్రయాణిస్తున్న కారు, ఆటోను సీజ్ చేసారు. ఈసంఘటనలో మరో వ్యక్తి పరారైనట్లు ఎస్సై హరికృష్ణ వివరించారు.

క్వారీల వలన ప్రజలకు ఇబ్బందులు కలుగరాదు
* ఆర్డీవో సూర్యారావు
నర్సీపట్నం(టౌన్), ఫిబ్రవరి 19: క్వారీల మూలంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కె.సూర్యారావు తహశీల్దార్‌ను ఆదేశించారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఆర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో ఉన్న క్వారీ పేలుళ్ళు కారణంగా ఇళ్ళు, గోడలు, పునాధులు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేసారు. దీనిపై తక్షణ విచారణ చేయాలని తహశీల్దార్ అప్పలనాయుడిని ఆర్డీవో ఆదేశించారు. అదే గ్రామానికి చెందిన బైపూడి కుమారి తన వాటా భూమి తనకు అప్పగించకుండా తన అన్న ఆక్రమించాడని ఫిర్యాదు చేసింది. తాను వితంతువు ఫించన్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫించన్ మంజూరు కాలేదని ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చింది. ఈవిషయమై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా తహశీల్దార్‌ను ఆదేశించారు. ఇంకా భూ తగాదాలు, సరిహద్దు తగాదాలు,పిత్రార్జిత పంపకాలు, మొదలైన వాటిపై దరఖాస్తులు వచ్చాయి. ఈకార్యక్రమంలో పరిపాలనాధికారి ప్రకాశరావు,నర్సీపట్నం తహశీల్దార్ వి.వి.రమణ , రోలుగుంట పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

విజిలెన్స్ అధికారులమంటూ
దారి కాచి ఏడు లక్షలు అపహరణ
నర్సీపట్నం, ఫిబ్రవరి 19: విజిలెన్స్ అదికారులమంటూ ఒడిషా నుండి తవుడు లోడుతో నర్సీపట్నం వస్తున్న వ్యాన్‌ను లంబసింగి చెక్‌పోస్టు వద్ద ఆపి దుండగులు వ్యాన్‌లో ఉన్న ఏడు లక్షల రూపాయలను అపహరించారు. వ్యాన్ డ్రైవర్ కందరి అర్జున్, క్లీనర్ రంజిత్‌బాద్ , ఏజన్సీ వ్యాపారి రత్నబాయిలు సోమవారం ఉదయం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. వారందించిన ఫిర్యాదు మేరకు తవుడు లోడుతో ఒడిషా నుండి వస్తున్న వ్యాన్ తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో లంబసింగి చెక్‌పోస్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్‌ను ఆపి తాము విజిలెన్స్ అధికారులమని , రికార్డులు చూపించాలని డిమాండ్ చేసారు. దీంతో డ్రైవర్, క్లీనర్‌లు భయపడి వారి జేబులో ఉన్న రెండువేలరూపాయలు ఇచ్చేసారు. రికార్డులు చూపించేందుకు చెక్‌పోస్టు లోపలకు డ్రైవర్, క్లీనర్ వెళ్ళారు. తిరిగి వచ్చి చూడగా వ్యాన్ సీటు చెల్లాచెదురుగా పడి ఉంది. సీటు కింద పెట్టిన సుమారు ఏడు లక్షల రూపాయల నగదు మాయం కావడంతో వారు లబోదిబోమన్నారు. నర్సీపట్నంకు చెందిన రత్నాభాయ్ ఒడిషా రాష్ట్రానికి కొబ్బరికాయలు , కోడి గుడ్లు తీసుకువెళ్తుండగా , తిరిగి వచ్చేటప్పుడు తవుడు బస్తాలు వ్యాన్‌లో తీసుకువస్తుంటారు. ఇదే రీతిన ఒడిషా కొబ్బరికాయలు తీసుకువెళ్ళిన డ్రైవర్ వ్యాన్‌లో తవుడు బస్తాలు తీసుకువస్తుండగా లంబసింగి చెక్‌పోస్టు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బాధితులు నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా సంఘటన జరిగిన ప్రాంతం చింతపల్లి పరిధిలో ఉండడంతో అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో రత్నాభాయి, వ్యాన్ డ్రైవర్, కీనర్‌లు చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వ్యాన్‌ను ఆపి వ్యాన్‌లో ఉన్న ఏడు లక్షల రూపాయలు అపహరించుకుపోయిన వారు నర్సీపట్నంకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.