మహబూబ్‌నగర్

లక్ష ఉద్యోగాలకు ఏకకాలంలో నోటిఫికేషన్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలకు ఏకకాలంలో నోటిఫికేషన్ వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటను విస్మరించి చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దమ్ము దైర్యం ఉంటే లక్ష ఉద్యోగాలకు ఏకకాలంలో నోటిఫికేషన్ వేసి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ చైతన్యయాత్ర సోమవారం మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణ కేంద్రంలోని పద్మవతికాలనీ నుండి క్లాక్‌టవర్ వరకు యూత్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మోటార్‌సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లాక్ దగ్గర ఏర్పాటు చేసిన రోడ్‌షోలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే వచ్చిన రాష్ట్రానికి కావలి కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్ అధికార దాహంతో దళితులను మోసం చేసి సీఎం పీఠంపై కూర్చున్నారని ఆరోపించారు. ముస్లీంలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 42నెలలు అయినప్పటికిని ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది నిరుద్యోగులు ముందుండి పోరాటం చేశారన్నారు. అలాంటి వారికి ఏకకాలంలో ఒకే నోటిఫికేషన్ ద్వారా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించి పోరాటం చేసిన వారిని మాత్రం సీఎం తన క్యాంప్ ఆఫీస్ దగ్గర అటెండర్లుగా ఉంచుకున్నారని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాల సాధనకై యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఇలాంటి యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చాక డిగ్రీ చదువుకుని నిరుద్యోగిగా ఉన్న వ్యక్తికి రూ.3000 ఆత్మగౌరవ వేతనం ఇస్తామని, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోతుందన్నారు. యూత్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి టీవీ శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌కు మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దౌర్జన్యాలకు దిగుతున్నారని వాటిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని యువజన కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ఫ్లెక్సీలు కడితే అధికారులు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టిన రోజుకు రోడ్లంతా ప్లెక్సీలు ఉంచారని అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి మరో న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో యువజన కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం, రజిత, కాంగ్రెస్ నేతలు సంజీవ్‌ముదిరాజ్, అనితారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అంజనమ్మ, జహిర్‌అక్తర్, సుస్మిత, నాగరాజు, లక్ష్మణ్‌యాదవ్, కట్ట రవికిషన్‌రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

2019లో కొడంగల్‌లో గులాబీ జెండా
జిమ్మిక్కులు మాని అభివృద్ధికి సహకరించు..
* రేవంత్‌రెడ్డికి మంత్రులు జూపల్లి, మహేందర్‌రెడ్డిల హితవు

కోస్గి, ఫిబ్రవరి 19: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడం, జిమ్మిక్కు రాజకీయాలు మాని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి కలిసిరావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిలు హితవుపలికారు. సోమవారం కోస్గి మండలంలో రూ.19 కోట్లతో మంజూరు చేసిన బీటీ రోడ్ల శంకుస్థాపనకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రులు పనులు ప్రారంభించారు. మండలంలోని చంద్రవంచ, ముంగిమళ్ల, బలవానిపల్లి, పోతిరెడ్డిపల్లి, కడంపల్లి, అమ్లికుంట, ముదిరెడ్డిపల్లి గ్రామాలకు మంజూరైన బీటీ రోడ్లకు శిలాఫలకం వేశారు. అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 లక్షలతో మంజూరైన అదనపు తరగతి గదుల భవనాన్ని వారు ప్రారంభించారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేనివిధంగా తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా విద్యార్థుల బంగారు భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ప్రతి మండలానికి ఓ గురుకుల పాఠశాలను మంజూరు చేశారన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్థానిక నాయకుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా ఎమ్మెల్యే రేంవత్‌రెడ్డి ఈ సమావేశం ముగిసిన అనంతరం వెళ్లిపోయారు. అనంతరం సంపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి కార్యక్రమాలు కొడంగల్ నియోజకవర్గానికి కేసీఆర్ అందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ ప్రజల ఎన్నో ఏళ్ల చిరకాల వాంచ బస్సు డిపోను కేసీఆర్ ప్రకటించారన్నారు. వారం రోజుల్లో డిపో నిర్మాణానికి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 97 బస్సు డిపోలు ఉన్నాయని నూతనంగా 98వ బస్సు డిపోగా కోస్గి ఏర్పడబోతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు అండగా నిలిస్తే రానున్న రోజుల్లో ఇంకెంతో అభివృద్ధిని చూడబోతారని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా కనీవినీ ఎరుగుని రీతిలో కొడంగల్ నియోజకవర్గానికి రూ.100 కోట్ల నిధులు ఇచ్చి బీటీ రోడ్లను మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి కమ్యూనిటీ భవనాలను సైతం మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని, రేవంత్‌రెడ్డి జిమ్మిక్కులను నమ్మకుండా టీఆర్‌ఎస్ పక్షాన ప్రజలు నిలవాలని కోరారు. 2019లో ఈ ప్రాంతంలో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని అలా జరిగితే నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, నాయకులు అన్న కిష్టప్ప, బాల్‌రాజ్, కృష్ణ, ప్రతాప్‌రెడ్డి, రాజేశ్వర్, వెంకటస్వామి, నగేష్, సలీం, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రి లక్ష్మారెడ్డి

బాలానగర్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం రాజాపూర్ మండల కేంద్రంలో రూ.2.73 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కస్తూరిబా గాంధీ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎమ్మార్సీ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ25 లక్షల ఖర్చుతో నిర్మించే అధనపు తరగతి గదులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడే రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రతి ఎకరాకు నాలుగు వేలు ఏప్రిల్ మాసం నుండే రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. విద్యాభివృద్ధి కోసం నూతన పథకాలను ప్రవేశపెట్టి నూతనంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వైద్య విదానంలో అనేక మార్పులు, పద్ధతులతో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింద న్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలకు ప్రతి సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేస్తూ జిల్లాలో వలసల నివారణ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీపీ బాగ్యమ్మ, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ నర్సింగరావు, ఎంపిడిఓ ప్రవిణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సిములు, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, బసిరెడ్డి, కిషన్‌జీ పాల్గొన్నారు.

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19: మహరాజ్ ఛత్రపతి శివాజీ 391వ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా సోమవారం జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలోని శివాజీ కాంస్య విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఇందులో భాగంగా జిల్లా ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం నాయకులు నివాళ్లు అర్పించారు. అదేవిధంగా బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నేతలు పద్మజారెడ్డి తదితరులు నివాళ్లు అర్పించారు. పట్టణ శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో పలువురు యువకులు సైతం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. మరాఠ యువజన సంఘం ఆధ్వర్యంలో క్లాక్‌టవర్‌లో ఏర్పాటు చేసిన శివాజీ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆరెకటిక సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు స్వామిజీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆరెకటికల ఆరాధ్యదైవమన్నారు. మరాఠ సామ్రాజ్యాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించి శివాజీ మహరాజ్ తనదైన శైలిని చాటుకున్నారని అన్నారు. తల్లి జిజియబాయి నూరిపోసిన ఉగ్గుపాలతో పెరిగిన శివాజీ మహారాజ్ తన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని విజయపతాకాలు ఎగురవేస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ యావత్తు ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచారని ఆయన కొనియాడారు. నేటికి దేశంలో హిందుత్వం పటిష్టంగా ఉందంటే శివాజీ మహారాజ్ చేసిన కృషి వల్లేనని పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగ్గ రాజులలో శివాజీ మహారాజ్ ప్రథముడన్నారు. శివాజీ జ్ఞాపకాలుగా నేటికి హైదరాబాద్, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో ఆయన స్మృతి చిహ్నాలు ఉన్నాయని అన్నారు. శ్రీశైలంలో శివాజీ ద్వారం, హైదరాబాద్‌లోని పురానపుల్‌లో మరో ద్వారం నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి మహానీయుడి ఆశయాల సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్వామిజీ కోరారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు విజయ్, నరేందర్, బాబుజీ, నరహరి తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ మున్సిపల్..
2018-19 వార్షిక బడ్జెట్ రూ.133.74కోట్లు
* ప్రభుత్వాల సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
* మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధ

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19: మహబూబ్‌నగర్ మున్సిపల్ 2018-19 వార్షిక బడ్జెట్ రూ.133.74 కోట్లు అంచనాలతో బడ్జెట్‌ను కేటాయించడం జరిగిందని మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధ వెల్లడించారు. సోమవారం మహబూబ్‌నగర్ పురపాలక సంఘం 2018-19 వార్షిక బడ్జెట్‌ను చైర్ పర్సన్ రాధ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ కౌన్సిలర్లు ఆమోదముద్ర వేశారు. కాగా ప్రతిపక్ష కౌన్సిలర్లు మాత్రం ఇది అంకెల గారడి, ఊహల పల్లకి బడ్జెట్‌గానే ఉందంటూనే బడ్జెట్‌కు మద్దతు పలికారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ మాట్లాడుతూ తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని గతంలో సమర్పించిన బడ్జెట్‌ల కంటే ఇది ఎంతో మెరుగైన బడ్జెట్ అని తెలిపారు. సంవత్సరానికి వచ్చే ఆదాయ వ్యయాలను గణాంకాల ఆధారంగా అంచనాలు రూపొందించి తీర్చిదిద్దిన ఈ బడ్జెట్‌ను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగిందని కౌన్సిలర్లు అంతా ఆమోద ముద్ర వేశారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. రూ.133.74కోట్ల అంచనాలతో కూడిన బడ్జెట్‌లో ఇంటిపన్నులు, ఇతర పన్నుల రూపంలో రూ.32.46కోట్లు నాన్‌ట్యాక్స్ కింద రూ.31.15కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్‌ల కింద రూ.43.4కోట్లు, ప్లానింగ్, నాన్ ప్లానింగ్ గ్రాంట్ల కింద రూ.65.75కోట్లు అంచనాలతో కూడిన బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు. అభివృద్ధి, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి, మురుగుకాలువల నిర్మాణం, రోడ్లు, కల్వర్టులు, మరమ్మతులు, విద్యుత్ సరఫరా, విద్యుత్ దీపాలు, పేద బడుగుబలహీన వర్గాల ప్రజలతో పాటు మహిళా, యువజన సంక్షేమం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మున్సిపాలిటీకి రావడం వీటిద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను, బడ్జెట్‌తో సంబంధం ఉన్నవి, సంబంధం లేనివి అయినప్పటికిని అన్ని వివరాలను సమావేశంలో బహిరంగపర్చడం జరిగిందన్నారు. అభివృద్ధిలో భాగంగా హరిజన, గిరిజన ప్రాంతాల్లో ఉండే వారికి ప్రత్యేకంగా అత్యధికంగా దృష్టి సారించామన్నారు. స్ర్తి, శిశు, వికలాంగుల సంక్షేమం అభివృద్ధి పనులకు గాను పెద్దపీట వేయడం జరిగిందన్నారు. నూతనంగా మున్సిపాలిటీలో విలీనమైన 10 గ్రామాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగులకు బయోయెట్రిక్ విధానం, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత, వెహికిల్ ట్రాకింగ్, ఫ్రీజోన్, స్వచ్ఛ్ మొబైల్‌యాప్, సిటిజన్ మొబైల్ యాప్, డిజిటల్ ఇండియా కార్యక్రమం, ఆన్‌లైన్ విధానాలతో కూడిన ఆస్తిమార్పిడి, భవన నిర్మాణ అనుమతులు, సిటిజన్ సర్వీస్ సెంటర్, డంపింగ్ యార్డుల అభివృద్ధి, తెలంగాణకు హరితహారం, అమృత్‌సిటీ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, కమిషనర్ రాంచందర్, కౌన్సిలర్లు లక్ష్మణ్‌యాదవ్, కృష్ణమోహన్, కట్టరవికిషన్‌రెడ్డి, షౌకత్‌అలీ, కల్పన, పద్మజా, వనజ, అనిత, ప్రసన్న, విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కంప్యూటర్ అవగాహన కలిగి ఉండాలి
* ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 19: పోలీస్ శాఖాలో ఉన్న ప్రతి ఒక్కరు కంప్యూటర్ అవగాహన కలిగి వుండాలని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాబోయే కాలంలో పోలీస్ వ్యవస్థ అంతా కంప్యూటర్‌పైనే ఆధారపడి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కంప్యూటర్ వినియోగంపై నిపుణులచే ప్రత్యేకంగా శిక్షణ తరగతులను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వారందరికి కూడా ఈ శిక్షణ ఇప్పిస్తామన్నారు.
ఫిర్యాదులను తక్షణమే పరిష్కారిస్తాం: ఎస్పీ
సోమవారం ఎస్పీ ఛాంబర్‌లో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజావాణి సందర్భంగా వచ్చిన ఫిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా 12 ఫిర్యాదులు రాగా వాటిని ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు, డీఎస్పీలకు తగు పరిష్కారం కోసం సిఫారసు చేశారు.

మత రిజర్వేషన్లకు హిందువాహిని వ్యతిరేకం
* వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 19: చిన్నప్పటి నుంచే మంచి ఆశయాలతో, ఆదర్శాలతో ముందుకు సాగిన ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లుదామని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతిని సోమవారం హిందువాహిని ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రగడ్డలోని సరస్వతీ శిశుమందీర్ నుంచి శివాజీ చిత్ర పటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంతో ప్రధాన రహదారి గుండా బస్టాండ్ సమీపం వరకు కాషాయ జెండాలను చేతపట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శివాజీని స్మరించుకుంటూ నినాదాలు చేశారు. బస్టాంట్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో దొడ్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ తల్లి చెప్పిన కథలతో చిన్నప్పటి నుంచే మంచి విలువలతో పెరిగిన ఛత్రపతి శివాజీ హిందూరాజ్యం స్థాపనకు చేసిన కృషిని వినిపించారు. శివాజీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి వివరించారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్‌ను ఇవ్వడాన్ని హిందూవాహిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి వార్తకు స్పందన
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు సాగునీరు విడుదల
* నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

ధన్వాడ, ఫిబ్రవరి 19: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయని సాగునీరు విడుదల చేయాలంటూ ఆంధ్రభూమిలో వచ్చిన వార్తకు ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి స్పందించారు. ఎండిపోతున్న వరి పంటలు అనే శిర్షికకు స్పందించిన ఆయన పంటల సోమవారం పొలాలకు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ పంటపొలాలకు సాగునీరును అందిస్తామని వెల్లడించారు. మరికల్ మండలంలోని తీలేర్-పుసల్‌పహాడ్ గ్రామాల మధ్య ఉన్న కోయిల్‌సాగర్ 16వ డ్రిస్టీబ్యూటర్ కాల్వ ద్వారా సాగునీరును విడుదల చేశారు. అనంతరం రైతులు సాగుచేసిన పంటపొలాలను పరిశీలించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కాల్వల మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో నారాయణ పేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జోగురామస్వామి, నేతలు వెంకటేశ్వర్‌రెడ్డి, బుచ్చప్ప, అశోక్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, పెంటయ్యగౌడ్, గోపి, పాపిరెడ్డి, ముకుందారెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నీటి సంపులో పడి బాలుడు మృతి
ఆత్మకూర్, ఫిబ్రవరి 19: నీటి సంపులో పడి 10 ఏళ్ళ బాలుడు వెంకటసాయి మృతిచెందిన విషాధ సంఘటన సోమవారం ఆత్మకూర్ పట్టణంలోని పీజేపీ క్యాంప్‌లో చోటు చేసుకుంది. బాలుడి తండ్రి మల్లికార్జున్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఆత్మకూర్ ఎస్‌ఐ సిహెచ్ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుట్టుకతోనే కల్లు చేతులు పడి పోయి వికలాంగుడైన వెంకటసాయిని తల్లి సరోజమ్మ 11 గంటల సమయంలో స్నానం చేయించేందుకు నీళ్ళు తోడి బాత్‌రూంలో ఉంచగా అక్కడే ఉన్న బట్టలు ఆరబెట్టేందుకు మేడపైకి వెళ్లగా ఆ పక్కనే కూర్చోబెట్టిన వెంకటసాయి నీటి సంపులో పడి మృతి చెందాడని తండ్రి మల్లికార్జున్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలి
రైతుల రాస్తారోకో

అచ్చంపేట, ఫిబ్రవరి 19: వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తు సోమవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. తము అప్పులు చేసి పంటలను పండించామని వేరుశనగ విత్తనాలు రూ.10 వేల నుండి 12 వేల ఖరీదు చేశామని సరైన నీరు పంటకు అందక దిగుబడి తక్కువ వచ్చిందని అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో అమ్మకానికి పంటను తీసుకవస్తే వ్యాపారులు, మార్కెట్ అధికారులు కుమ్మకై వేరుశనగ క్వింటాల్‌కు రూ .3వేలు, రూ.3,300 వందలు మాత్రమే రేటు పెడుతున్నారని రైతులు ఆగ్రహించి అరగంట అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు ఆందోళనకు పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.