తెలంగాణ

సందిగ్ధంలో ఎన్టీఆర్‌నగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ ప్రభుత్వం పేదలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కార్యక్రమం ఒకటి. దీనికి ప్రభుత్వం 2014 డిసెంబర్ 30న ప్రత్యేకంగా జివో నెం.58, 59లు జారీ చేశారు. కేవలం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికే అయితే తమ మాట ఏమిటని ఆందోళన చెందుతున్న నగర శివారు ఎన్టీఆర్‌నగర్ వాసులకు ముఖ్యమంత్రి స్వయంగా ఆక్రమిత ఇంటి స్థలాలను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇవ్వటంతో ఎన్టీనగర్ వాసుల్లో 30 ఏళ్లుగా అనుభవించిన బాధలనుండి విముక్తి పొందామన్న ఆనందం వెల్లివిరిసింది.
ఈ హామీ 3 నెలల్లో నెరవేర్చాలని, మూడు రోజుల్లో సర్వే పనులు ప్రారంభించాలని, సదరు స్థల యజమానులతో చర్చించి వారికి పరిహారం, ప్రత్యామ్నాయం చూపిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా 2015 మే 20న స్వయంగా ఎన్టీఆర్‌నగర్ పర్యటనలో ప్రకటించిన విషయం తెలసిందే. స్వయంగా గుడిసెలోకి వెళ్లి నివాసితులతో చర్చించిన ముఖ్యమంత్రి ఇకముందు ఎటువంటి కష్టము ఎదురుకానివ్వనని హామీ ఇస్తూ పక్కా ఇళ్ల నిర్మాణాలకు సంబందించిన స్థలాలను క్రమబద్ధీకరించడంతోపాటు ఖాళీ స్థలాన్ని భూసేకరణ చట్టంద్వారా సేకరించి సదరు స్థలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఒక్క గుడిసెకూడా లేకుండా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నెల రోజుల్లోగా సుమారు 2900 పైచిలుకు ధరఖాస్తులను స్వీకరించిన రెవెన్యూ యంత్రాంగం వారి ఇంటిస్థలాలను క్రమబద్ధీకరించకపోగా కనీసం విచారణ ప్రక్రియకూడా ప్రారంభించలేదని అధికార యంత్రాంగంపై స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. సర్వే నెం. 9/1లోని 45 ఎకరాల స్థలానికి సంబందించి ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరిగిన అనంతరం సదరు స్థలం ప్రైవేట్ యజమానులదని కోర్టు నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం సదరు భూమిని ఉన్నది ఉన్నట్లుగా (సింబాలిక్ పొజిషన్) ప్రైవేట్ యజమానులకు అప్పగించింది.
యజమానుల్లో చోటు చేసుకున్న అంతర్గత వివాదాల కారణంగా సదరు భూమిని తిరిగి ప్రభుత్వ కస్టడీకి అప్పగించినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు యజమానులతో చర్చించాల్సిన ప్రభుత్వం ఓ రాజకీయ నాయకుడి మధ్యవర్తిత్వంగా చర్చించి అధికార, అనధికార నిధుల మళ్లింపులపై వచ్చిన తగాదాల కారణంగానే ఈ ప్రక్రియకు బ్రేక్ పడిందన్న విషయం గుప్పుమనడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీనుండి పోటీచేసి విజయం సాధించిన శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి తాను తెరాసలో చేరిన సందర్భంలోనే ముఖ్యమంత్రితో ఎన్టీఆర్ నగర్‌లో సమావేశం ఏర్పాటు చేయించి పేదలకు హామీలు ఇప్పించి దాని ప్రక్రియ విషయాన్ని మర్చిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జివో నెం. 58 ద్వారా ఉచిత ఇంటి స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిఅయ్యిందని ఇప్పటివరకు ఇచ్చిన పట్టాలే తప్ప కొత్తవారికి క్రమబద్దీకరణ చేయరని, అర్హత ఉన్న సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన పట్టాలనుకూడా పునఃపరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సమ్మతంగా లేదని తెలిసిందని, ఈ సమయంలో తమకు ఎలా ఇంటి స్థలాలను క్రమబద్ధీకరిస్తారని ఎన్టీఆర్ నగర్ వాసులు కార్పోరేటర్ అభ్యర్థులను నిలదీస్తున్నారు. స్థల యజమనులతో చర్చలు జరిపిన నాయకులు వాస్తవాలను ప్రభుత్వానికి ఎందుకు నివేదించడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. దీంట్లో ఉన్న మర్మాన్ని వెలికితీసి ముఖ్యమంత్రి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఎన్టీఆర్ నగర్ వాసులకు ఎవరూ అండగా ఉంటారో ఎదురు చూడాల్సిందే.