పశ్చిమగోదావరి

సమసిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 25 : జిల్లా విద్యాశాఖలో రేగిన కలకలం సోమవారం నాటి చర్చలతో కొలిక్కి వచ్చింది. ఈ సందర్బంగా జరిగిన చర్చలు ఫలవంతమైనట్లు చెబుతున్నారు. ఉపాధ్యాయ వర్గాన్ని ఉద్దేశించి డిఇవో మధుసూధనరావు తాడేపల్లిగూడెంలో జరిగిన శిక్షణా తరగతుల్లో అనుచితంగా వ్యాఖ్యానించారన్న అంశంపై యుటిఎఫ్ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా విమర్శలు చేయడం, ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవడం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌ఆర్ ఆధ్వర్యంలో డిఇవోతో చర్చలు జరిగిన నేపధ్యంలో వాగ్వాదాలు చెలరేగి చివరకు యుటి ఎఫ్ నేత షేక్ సాబ్జీని డిఇఒ సస్పెండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంలో జెఎసి నేతల ఆధ్వర్యంలో డిఇవోతో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ పలు అంశాలపై తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాన్ని ఉద్దేశించి తాను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ అలాంటివి ఉంటే అంతకుముందు జరిగిన సంఘటనల నేపధ్యంలోనే జరిగి వుండవచ్చునని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జెఎసి నేతలు చర్చల్లో భాగంగా ఉపాధ్యాయుల నుంచి హామీ పత్రాలు తీసుకునే అంశాన్ని ప్రస్తావించారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్ధులంతా ఉత్తీర్ణులవుతారని పేర్కొంటూ ఉపాధ్యాయులు హామీ పత్రాలను ఇవ్వాలని, అలా కాకుంటే సస్పెన్షన్లు తప్పవంటూ ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారని, ఇలాంటి నిర్ణయాలు సహేతుకం కాదని జెఎసి నేతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై డిఇవో స్పందిస్తూ హామీ పత్రాలు తప్పనిసరని చెప్పలేదని, ఇవ్వదలచుకున్న వారు ఇవ్వవచ్చునని, పత్రాలు వద్దని చెబితే దానికైనా అంగీకారమేనని, అంతకుమించి దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పడంతో ఆ అంశం కూడా పరిష్కారమైందని నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో షేక్ సాబ్జీ సస్పెన్షన్ అంశం ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. ఈ చర్చల్లో జెఎసి నేతలు ఎల్‌వి సాగర్, టి యోగానందం, చోడగిరి శ్రీనివాసరావు, షేక్ సాబ్జీ, విద్యాశాఖ తరఫున డిఇవోతోపాటు ఎడిలు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధి సోపానంకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

ఏలూరు, జనవరి 25: స్వయం ఉపాధి సోపానం ద్వారా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందినవారు ఆర్ధిక సహాయం పొందేందుకు తమ పేర్లు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ నుండి తహిసీల్దార్లు, ఎంపిడిఓలు, ఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై ఆయన సమీక్షించారు. ఈనెల 2నుండి 11వ తేదీ వరకు నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు ఇంతవరకు ఆన్‌లైన్‌లో పెట్టకపోవటం పట్ల ఆయన అగ్రహం వ్యక్తంచేశారు. త్వరితగతిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. గ్రామాల్లో పెన్షన్లు తీసుకునేందుకు రాలేకపోతున్న వృద్ధుల పేర్లు సేకరించి వారికి నేరుగా వారి ఇంటివద్దే పెన్షన్ అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పేదలకు ఇళ్లు మంజూరు చేసేందుకు అర్హతగల పేర్లు నమోదు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్వో కె ప్రభాకరరావు, వ్యవసాయశాఖ జెడి సాయిలక్ష్మిశ్వరి, గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు, డ్వామా పిడి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌బి ఎస్సై రమేష్‌బాబుకు
ఇండియన్ పోలీసు మెడల్
ఏలూరు, జనవరి 25 : జిల్లాలో స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ సూదాబత్తుల రమేష్‌బాబు ఇండియన్ పోలీసు మెడల్‌కు ఎంపికయ్యారని జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్ తెలిపారు. 1977లో పోలీసు విభాగంలో ప్రవేశించిన రమేష్‌బాబు 1989లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2005లో ఎఎస్ ఐగా, 2012లో ఎస్‌ఐగా పదోన్నతులు పొందారు. 39 సంవత్సరాల సర్వీసును పూర్తి చేశారు. ఈ సర్వీసులో 44 నగదు రివార్డులను, ఆరు ప్రశంసాపత్రాలను, 2004లో సేవా పతకాన్ని, 2010లో ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు. రమేష్‌బాబు ఏలూరు, అత్తిలి, భీమవరం, ఉండి, గోపాలపురంలో పనిచేశారు. ఆయన సేవలకు ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక ఐపిఎంకు ఎంపికయ్యారు. రమేష్‌బాబును పలువురు పోలీసు అధికార్లు, సిబ్బంది అభినందించారు.

ఓటుహక్కును సద్వినియోగపర్చుకోవాలి:కలెక్టర్
ఏలూరు, జనవరి 25: ప్రజాస్వామ్య మనుగడకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం స్ధానిక ఇండోర్ స్టేడియం నుండి 2కె రన్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వేయాలన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావటంతోపాటు ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటరుగా నమోదు కావటం నిరంతర ప్రక్రియ అని ఆన్‌లైన్‌లో కూడా ఓటరుగా నమోదు చేసుకునే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. కళాశాలల్లో విద్యార్ధులకు ఓటు విలువపై అవగాహన కల్పించి చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు మూడువేల మంది పాల్గొన్న ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి ప్రారంభమై ఆర్‌అండ్‌బి కార్యాలయం, ఫైర్‌స్టేషన్ సెంటరు, కోర్టు సెంటరు మీదుగా స్దానిక అశోక్‌నగర్‌లోని కెపిడిటి పాఠశాలకు చేరుకుంది. వివిధ వాకర్స్ అసోసియేషన్స్ సభ్యులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్ధినీవిద్యార్ధులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆర్ సూర్యారావు, జెసి పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, ఆర్డీవో ఎన్ తేజ్‌భరత్, తహసిల్దార్ రామాంజనేయులు, డిఎస్‌డిఓ శ్రీనివాస్, డిప్యూటీ డిఇఓ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గూడెం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జనవరి 25: రిపబ్లిక్ డేను పురస్కరించుకుని సోమవారం తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిఆర్పీ ఎస్సై ఆర్‌ఎస్ శ్రీనివాస్, సిబ్బంది, రైల్వే రక్షకదళం సంయుక్తంగా తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్, ఫ్లాట్‌ఫారాలు, పార్శిల్ కార్యాలయం, రైలు బోగీల్లో విస్తృత తనిఖీలు జరిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తులుగానీ, వస్తువులుగానీ కనపడితే దగ్గరలో ఉన్న రైల్వే పోలీసులు, ఆర్‌పిఎఫ్ సిబ్బందికి తెలపాలని ఎస్సై శ్రీనివాస్ కోరారు.
ఆద్దెకు ఆర్టీసీ స్థలాలు!
ఏలూరు, జనవరి 25: ఎపిఎస్‌ఆర్టీసీకి ఏలూరులో గల 14,818 చదరపు గజాల స్థలాన్ని వివిధ స్కీముల ద్వారా లీజుకు ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ప్రచార కటౌట్లను కూడా పలుచోట్ల ఏర్పాటు చేశారు. బిఓటి స్కీము ప్రాతిపదికన 49 సంవత్సరాలకు స్థలాలను అద్దెకు ఇవ్వనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.

కార్టింగ్ విజేత తెలంగాణ

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 25: జాతీయ స్థాయి విష్ణు కార్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల టీమ్ మెకనైజర్స్ 12.0 విజయం సాధించింది. ఇక రన్నర్స్‌గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన ఆక్రోరేజర్స్ ద్వితీయ బహుమతి సాధించింది. విజేతలకు రూ.80 వేలు చెక్కును, రన్నర్స్‌కు రూ.45 వేలు చెక్కు, ట్రోఫీని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కెవి విష్ణురాజు, ఖతార్ పెట్రోలియం లాజిస్టిక్ ఫార్మర్ హెడ్ వివిఎస్‌ఎన్ రాజు అందచేశారు. ఈ నెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు జాతీయ స్థాయి విష్ణు కార్టింగ్ ఛాంపియన్‌షిప్ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవరణలో నిర్వహించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో డైనమిక్ రౌండ్ లాప్‌టైమ్ తదితర పోటీలు జరిగాయి. టీమ్ ఎక్సిమ్‌లో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన ఎంవిజె ఇంజనీరింగ్ కళాశాల, వాహన రూపకల్పన తయారీ, తనిఖీలు, వాహన బరువు పరీక్షల్లో హైదరాబాద్‌కు చెందిన మెకనైజర్స్, సృజనాత్మకత తనిఖీల్లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన లలీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ విజయం సాధించింది. అలాగే యాక్సలరేషన్, బ్రేక్ టెస్ట్‌లలో ఇండోర్‌కు చెందిన ఆక్రోపోలీస్ టెక్నికల్ క్యాంపస్ రూ.10 వేల నగదు బహుమతి అందుకుంది. స్కీడ్‌ప్యాడ్‌లో ఆక్రోపోలీస్, ఆటోక్రాస్‌లో ఆక్రోపోలీస్, ఎడ్యుంరెన్స్‌లో హైదరాబాద్, మూడవ స్థానంలో విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల, స్టాటిక్ రౌండ్, బిజినెస్ ప్లాన్‌లో భీమవరం విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాల బహుమతి సాధించింది. మొత్తం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 19 టీమ్‌లు ఫైనల్స్‌లో పాల్గొన్నాయి. ప్రిన్సిపల్ జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పోరాట కమిటీ నిర్ణయానికి మద్దతు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 25: ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నిర్ణయానికే తాము మద్దతునిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం ప్రకటించారు. ప్రజల కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుందుర్రు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆక్వా ఫుడ్ పార్కు స్థానంలో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుచేయాలన్నారు. యాజమాన్యం మొండి వైఖరిని విడనాడాలన్నారు. తుందుర్రులో జరిగిన లాఠీ చార్జీలో తీవ్రంగా గాయపడిన వారి పట్ల యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. లాఠీ చార్జీని బలరాం ఖండించారు. విపరీతమైన, కఠినమైన సెక్షన్‌లతో పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, ప్రజలు ఆందోళన, ఆగ్రహాన్ని చూసి కఠినమైన సెక్షన్‌లు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ కేసు విషయంపై పోలీసులు పునరాలోచన చేయాలన్నారు. సాగు, తాగునీరు, భూగర్భ జలాలు ఖచ్చితంగా కలుషితమవుతాయన్నారు. యాజమాన్యం ఇటు రైతుల్ని, ప్రభుత్వాన్ని మోసం చేసిందని విమర్శించారు. జిల్లా సెక్రటేరియట్ సభ్యులు జెఎన్‌వి గోపాలన్ మాట్లాడుతూ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణానికి అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య కాకుండా కావాలంటే తీరప్రాంతంలో నిర్మించుకోవాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో డివిజన్ కార్యదర్శి బి. సత్యనారాయణ పాల్గొన్నారు.
ఉపాధి హామీలో ఇంకుడు గుంతలు
-ట్రైనీ కలెక్టర్ నిషాంత్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జనవరి 25: మండలంలోని వ్యవసాయ భూముల్లో ఇంకుడుగుంటలు తవ్వేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనులు చేపట్టాలని ట్రైనీ కలెక్టర్, ఇన్‌చార్జి ఎంపిడివో నిషాంత్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఎంపిపి సమావేశ మందిరంలో ఎంపిటిసిలు, కార్యదర్శులు, ఎపివోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయన్నారు. ప్రతి రైతు వ్యవసాయ భూముల్లో నీటి గుంటలు తవ్వుకోవాలన్నారు. మండలానికి సంబంధించిన డంపింగ్ యార్డు జగన్నాధపురంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. జగన్నాధపురం డంపింగ్‌యార్డుకు రూ.7.72 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. ముందుగా ఇవోపిఆర్‌డి కె వెంకట్రావు మండలంలో జరుగుతున్న పనులపై సమీక్ష జరిపారు. సమావేశంలో వైస్ ఎంపిపి కొండపల్లి రాయుడు, కొమ్ముగూడెం సర్పంచ్ సూర్పన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
పూడిక పనులకు భూమిపూజ
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జనవరి 25: భీమవరం పట్టణ శివారులో పేదల కోసం సేకరించిన 82 ఎకరాలకు సోమవారం రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ తాను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఉండగా ఈ భూమిని సేకరించానని, ముఖ్యమంత్రి స్పందించి అభివృద్ధి బీజం వేశారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ 82 ఎకరాల భూమి ఉన్న ఏకైక పాంత్రం భీమవరమని, దీని పూడిక పనులకు ముఖ్యమంత్రి ఏడు కోట్ల రూపాయలు కేటాయించారని, మార్చిలోగా పనులు పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే తర్వాత బడ్జెట్‌లో నిధులు కేటాయించి పూడికకు సహకరిస్తామని తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. నరసాపురం ఎంపి గంగరాజు మాట్లాడుతూ అమరావతి తర్వాత అంతటి ప్రతిష్ఠాత్మకమైన 82 ఎకరాలకు సిఎం చంద్రబాబు నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ భాస్కర్‌ను ఘనంగా సత్కరించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, టిడిపి నాయకులు మెంటే పార్థసారథి, పట్టణ అధ్యక్షులు గనిరెడ్డి త్రినాథ్, కౌన్సిలర్ యర్రంశెట్టి చందు, తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి తోట భోగయ్య, చెల్లబోయిన వెంకట సుబ్బారావు, మావుళ్ళమ్మ దేవస్థానం ఛైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, విజ్ఞానవేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు.

ఆరుగురు ఎస్సైల బదిలీ
ఏలూరు, జనవరి 25 : జిల్లాలోని ఆరుగురు ఎస్ ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్‌పి భాస్కర్‌భూషణ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏలూరు వన్‌టౌన్‌లో పనిచేస్తున్న కె నాగేంద్ర వరప్రసాద్‌ను టి నర్సాపురానికి, ఉండ్రాజవరం ఎస్‌ఐగా పనిచేస్తున్న వి శ్రీనివాస్‌ను పాలకొల్లు రూరల్ స్టేషన్‌కు, చాగల్లు ఎస్‌ఐగా పనిచేస్తున్న జి లక్ష్మణ్‌ను ఏలూరు ట్రాఫిక్ స్టేషన్‌కుకు, పాలకొల్లు రూరల్ ఎస్‌ఐ కె మోహన్ వంశీని టి నర్సాపురంలో పనిచేస్తున్న పివి సురేష్‌లను వేకెన్సీ రిజర్వుకు పంపించారు.డిఎస్‌బిలో ఎస్‌ఐగా వున్న కె గంగాధర్‌ను ఉండ్రాజవరం ఎస్సైగా బదిలీ చేశారు.
ఆదిశేషు భూములపై ఆరా!
భీమడోలు, జనవరి 25 : ఎసిబిదాడుల్లో అక్రమ ఆస్తులు కలిగి వున్న ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం ఆదిశేషు స్వగ్రామమైన గుండుగొలను గ్రామంలో సోమవారం ఎసిబి అధికారులు రెవిన్యూ రికార్డులను పరిశీలించారు. హైదరాబాద్ ఎసిబి కార్యాలయం నుంచి వచ్చిన ఇన్‌స్పెక్టర్ ఎస్‌కె గఫూర్ భీమడోలు ఆర్‌ఐ ఎస్‌కె మల్లికా ఝరీనా, సర్వేయర్ పి సాంబశివరావు, వి ఆర్‌వో రామలక్ష్మి, ఎంపి జగన్నాధం సమక్షంలో రికార్డులను పరిశీలించారు. సింగవరం రెవిన్యూ పరిధిలో మూడు ప్రాంతాల్లో అయిదు ఎకరాల భూమి ఆదిశేషు పేర వున్నట్లుగా గుర్తించారు. గుండుగొలను గ్రామంలో 20 సెంట్ల భూమి, కోరుకొల్లు గ్రామ పరిధిలో 13 ఎకరాల విస్తీర్ణంలో వున్న చేపల చెరువులో ఆయనకు 4.91 ఎకరాల వాటా వున్నట్లు ధృవీకరించారు. మరెక్కడైనా భూములు వున్నదీ? లేనిదీ? తెలుసుకునేందుకై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తరువాత రికార్డులు పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
వేలేరుపాడు బంద్ సంపూర్ణం
వేలేరుపాడు, జనవరి 25 : విలీన మండలాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వేలేరుపాడులో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా అఖిల పక్షం నాయకులు కొల్లూరి సత్తిపండు మాట్లాడుతూ విలీన మండలాల నిరుద్యోగులను స్థానికులుగా గుర్తించకుండా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి విలీన మండలాల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపులోగల వేలేరుపాడు, కుకునూరు మండలాలను ప్రభుత్వపరిధిలో లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, పంచాయితీల పనితీరు అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే నాధుడే లేరని, దీనితో ప్రజలు మంచినీటికి, వీధి లైట్లకు పారిశుద్ధ్యం వంటి పనులకు నోచుకోకుండా దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. ఇదే విధంగా ప్రభుత్వ కళాశాలలకు ఉపాధ్యాయుల నియామకంలోనూ సమస్యల పరిష్కారంలోనూ కనీసం పట్టించుకోకపోవడంతో విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఖమ్మంజిల్లాలో వున్న ఈ మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుకున్న ప్రభుత్వానికి ఈ రెండు మండలాలను స్థానికులుగా గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు పోలవరం ప్యాకేజీపై స్పష్టమైన ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పై డిమాండ్లలో ఏ ఒక్కటీ నెరవేర్చకున్నా నిరవధిక పోరాటాలకి అఖిలపక్షం సిద్ధంగా వుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, సిపి ఐ, సిపిఎం, వైసిపి, టిడిపి, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నాయకులు ఉన్నారు.
సేంద్రీయ వ్యవసాయానికి కేంద్రం సాయం
ద్వారకాతిరుమల, జనవరి 25: రైతులు గ్రూపులుగా ఏర్పడి మూడేళ్లపాటు 50 ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం ద్వారా సాగుచేపట్టేలా పరంపర వికాస యోజన ద్వారా రూ.15 లక్షలు సబ్సిడీని ప్రభుత్వాలు అందిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రాణీకుముదిని తెలిపారు. ద్వారకాతిరుమల చిన వెంకన్నను సోమవారం ఆమె దర్శించిన అనంతరం మండలంలోని వెంకటకృష్ణాపురం, పావులూరివారి గూడెం గ్రామాలలో సేంద్రీయ విధానం ద్వారా సాగవుతున్న పంటలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణాపురంలో సహకార సంఘ అధ్యక్షుడు, రైతు తూముపాటి సత్యనారాయణ నివాసం వద్ద ఏర్పాటుచేసిన రైతు సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పదివేల రైతుగ్రూపుల ఏర్పాటుతో భూసారవంత కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చునన్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధుల కేటాయింపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రైతులు పరస్పర అవగాహనతో విలువైన భూములను సాగులోకి తెచ్చుకోవాలని రాణికుముదిని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ఎం లక్ష్మీరమణి, భీమడోలు ఎడిఇ కెజెడి రాజన్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
విస్సాకోడేరు సమితి మాజీ అధ్యక్షుడు మైనరు కన్నుమూత
వీరవాసరం, జనవరి 25: విస్సాకోడేరు పంచాయతీ సమితి మాజీ అధ్యక్షుడు యరకరాజు వెంకట రామరాజు (మైనర్) (86) సోమవారం మృతి చెందారు. గత మూడురోజులుగా భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న భీమవరం, ఉండి, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొణితివాడలోని ఆయన స్వగృహానికి మృతదేహాన్ని తరలించారు.
కొణితివాడ గ్రామానికి చెందిన వెంకట రామరాజు 1964లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1967లో విస్సాకోడేరు పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1970లో తిరిగి మరల కొణితివాడ సర్పంచ్‌గా ఎన్నికై, పరోక్ష పద్ధతిలో విస్సాకోడేరు పంచాయతీ సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1980 వరకు జిల్లా రాజకీయాల్లో నాటి జడ్పీ ఛైర్మన్ చేగొండి హరిరామజోగయ్య, అల్లూరి బాపినీడు ప్రోత్సాహంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎందరో నిరుద్యోగులకు పంచాయతీ సమితిలోనూ, ఉపాధ్యాయ వృత్తిలో అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి ఆయన. తిరిగి 1997లో అండలూరు రూరల్ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేసి, రైతులకు ఎంతో మేలు చేశారు. వెంకట రామరాజుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు యరకరాజు వెంకట సుబ్రహ్మణ్యంరాజు (చినబాబు) ప్రస్తుతం కొణితివాడ సర్పంచ్, మండల సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షులుగా ఉన్నారు. పెద్దకుమారుడు వైవిఎల్ నరసింహరాజు (పెదబాబు) నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ప్రముఖ సినీ డైరెక్టర్ సుధీర్‌వర్మ ఈయన మనవడు. వెంకట రామరాజు మరణవార్త తెలిసిన వెంటనే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మంత్రి పీతల సుజాత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల టిడిపి నాయకులు పోలిశెట్టి దాస్, అండలూరు బ్యాంకు మాజీ అధ్యక్షుడు మేకా ఆనందరావు, వీరవల్లి చంద్రశేఖర్, పంజా నాగేశ్వరరావు, పంజా రామచంద్రయ్య, దంపనబోయిన అప్పారావు, చింతపల్లి మాణిక్యాలరావు, పంజా వెంకన్న, గన్నమనీడి జయప్రసాద్, ఆకుల బాలరాజు, దాడి కాశీనాయుడు, మేడిచర్ల శ్రీనివాస్, పీతల సుబ్రహ్మణ్యం, బోడపాటి పన్నగ వేణి, మోపిదేవి విశే్వశ్వరరావు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.