రాష్ట్రీయం

డిసెంబర్‌లోగా పరిహారాలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ప్రభుత్వం చేపట్టే వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన రైతులు లేదా ఇతరులు తమకు నష్టపరిహారం ఎప్పుడు వస్తుందా అని ఏళ్లతరబడి ఎదురు చూశారు. కాని అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ జోక్యంవల్ల భూములు కోల్పోయిన వారికి వీలైనంత త్వరలో నష్టపరిహారం అందేందుకు ఇటీవల వెలువడిన తీర్పు దోహదపడింది. ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు భూసేకరణ వల్ల భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రెండు రాష్ట్రాల రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి జి వెంకట కృష్ణయ్య భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యమవుతోందని, పెద్దసంఖ్యలో ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు విచారణ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గత ఏడాది జూన్ 24వ తేదీన లేఖ రాశారు. దీంతో హైకోర్టు ఈ కేసును విచారించి రైతులకు ఆమోదయోగ్యంగా, ఉపశమనం కలిగించే విధంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ప్రకారం రెండు రాష్ట్రాల్లో 3032 భూసేకరణ నష్టపరిహారం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం 1669 కేసులు, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన లేఖ ప్రకారం 918 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారని, 300-ఏ అదికరణ కింద రైతుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ కోర్టు జడ్జి హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను హైకోర్టు పిల్ కమిటీ జడ్జీల ముందు ఉంచింది. పిల్ కమిటీ సభ్యుడు జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ లేఖను పిల్ స్వీకరించేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని సిఫార్సు చేశారు. రెండు రాష్ట్రాల్లో ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు ఎన్ని ఉన్నాయో సమాచారం తెప్పించుకోవాలని పిల్ కమిటీ నిర్ణయించింది. ఈ సిఫార్సు మేరకు హైకోర్టు రిజిస్ట్రీ రెండు రాష్ట్రాల్లో వివిధ కోర్టుల్లో ఉన్న ఈ కేసుల వివరాలను సేకరించింది. నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కేసులు 3032 ఉన్నట్లు రిజిస్ట్రీకి సమాచారం వచ్చింది.
అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఆధ్వర్యంలో ధర్మాసనం పిల్‌ను విచారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ తమ ఆదేశాలను పాటించని పక్షంలో భూసేకరణ ప్రక్రియను నిలుపుదల చేయాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశం వల్ల ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది డిసెంబర్ లోగా రూ.457.79 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. వచ్చే బడ్జెట్‌లో ఈ మేరకు నిధులను కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. ఆంధ్ర ప్రభుత్వం కూడా రూ.84.32 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు హామీ ఇచ్చింది.