జాతీయ వార్తలు

కాళేశ్వరానికి రూట్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న కొద్దిపాటి అడ్డంకులూ తొలగిపోయాయి. ముంపుగ్రామాల్లో పునరావాస చర్యలు చేపట్టకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూట్ క్లియరైంది. పునరావాసం చూపించకుండా ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని, వెంటనే పనులు నిలిపివేయాలంటూ హయతుద్దీన్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేయటం తెలిసిందే. జస్టిస్ రోహింగ్టన్ పాలి నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం హయతుద్దీన్ పిటీషన్‌ను కొట్టివేసింది. పిటీషన్‌దారుడి ఆలోచన సక్రమంగా లేదని, దురుద్దేశం కనిపిస్తోందంటూ ద్విసభ్య ధర్మాసనం చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయటంలో ఆలస్యమైందని, ఇది విచారణకు అనర్హమని ప్రకటించింది. చెన్నై బెంచి నుంచి ఢిల్లీ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఎందుకు వచ్చారంటూ న్యాయమూర్తులు పిటీషనర్‌ను నిలదీశారు. ఫోరం హంటింగ్ చేస్తున్నారా? అంటూ హయతుద్దీన్‌ను కోర్టు మందలించటం గమనార్హం. ఒకచోట కాకపోతే మరోచోటికి వస్తారా? అంటూ పిటీషనర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత ఆరేడు నెలల్లో కోర్టుకు రావాలితప్ప, ఇంత ఆలస్యంగానా? అంటూ ప్రశ్నలు సంధించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులూ వచ్చిన అంశాన్ని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచారని తెలంగాణ తరఫున వాదించిన ముఖుల్ రొహత్గీ కోర్టుకు వివరించారు. పటీషనర్ చెన్నై ట్రిబ్యునల్‌కు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారని రొహిత్గీ సూచించగా, ఇలా ఎందుకు చేశారని న్యాయమూర్తులు పిటీషనర్‌ను ప్రశ్నించారు. పిటీషన్‌ను కొట్టివేయటంతోపాటు కేసు ఖర్చులు కూడా ఇప్పించాలని ముఖుల్ రోహిత్గీ వాదించారు. రోహిత్గీకి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, సీనియర్ న్యాయవాది రవీందర్‌రావు

సహకరించారు. పిటీషనర్ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదనలు వినిపించారు.
ప్రతిపక్షం బుద్ది తెచ్చుకోవాలి
సుప్రీం తీర్పుతో న్యాయం, ధర్మం, రైతే గెలిచాడని రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీకి వచ్చిన హరీశ్‌రావు శుక్రవారం ఉదయమే సుప్రీంకోర్టుకు చేరుకుని కేసులో వాదనలను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ నేతలు దాదాపు వంద పిటీషన్లు దాఖలు చేసినా, ప్రాజెక్టును ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మాణాన్ని ఆపాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాళేశ్వరంపై కేసులు వేయించిన కాంగ్రెస్ నేతల వివరాలు సర్కారు వద్ద ఉన్నాయని, సరైన సమయంలో వీటిని శాసనసభలో వెళ్లడిస్తామని హరీశ్‌రావు ప్రకటించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకోవాలన్న దురుద్దేశంతో గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విషయంలో సుప్రీంకోర్టు పెట్టిన చివాట్లతోనైనా వారు బుద్ది తెచ్చుకోవాలని హరీశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటిపారుదల వ్యవహారం మద్రాస్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుందని, అయితే వీరుమాత్రం ఢిల్లీకి వచ్చారని విమర్శించారు. పిటీషన్ వేసినవారు కోర్టుకు పూర్తి వివరాలు వెల్లడించకపోవడం కూడా కాంగ్రెస్ నైజానికి అద్దం పడుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన విషయాన్ని పిటీషనర్ తమ పిటీషన్‌లో వెల్లడించకుండా, కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు తెలంగాణ గెలిచింది. రైతులు గెలిచారు. న్యాయం గెలించిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగినందున, నిర్మాణ పనులు మరింత వేగవంతం చేస్తామన్నారు. రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ, ఈ తీర్పుతోనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేకిగా మారిందన్నారు. రైతుకు నీటి లభ్యత పెంచేందుకే తెరాస సర్కారు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టులను వేగవంతం చేయాలని డిమాండ్ చేయాల్సిన ప్రతిపక్షం, వాటిని అడ్డుకోవటం క్షమించరానిదన్నారు. 2018 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితాన్ని రైతాంగానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.