Others

అలిశెట్టి బొమ్మల కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలిశెట్టి ప్రభాకర్
‘అక్షర క్షిపణులు’
పేజీలు: 70
వెల: రూ.150
సంపాదకులు: ఎస్.వి.ఎల్. నరసింహారావు
ప్రతులకు: నవోదయ
పుస్తక కేంద్రం
హైదరాబాద్
9247471362

తెలుగు వచన కవిత్వంలో అలిశెట్టి ప్రభాకర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ పాఠకుడి నుండి సాహితీవేత్తల దాకా అందరూ ఆయన కవిత్వాన్ని ఇష్టపడతారు. 1973 నుండి 1993 మధ్యకాలంలో ఆయన రాసిన కవితలు ఇప్పటికీ చదువరుల ఆదరణ పొందుతున్నాయి. 2013లో ఆయన కవిత్వం సమగ్ర సంపుటిగా వచ్చిన్నుండి ప్రభాకర్ ప్రస్తావన సాహితీ లోకంలో పెరిగింది. పాఠ్యపుస్తకాల్లో, ‘ప్రపంచ’ సభల్లో ఆయనకు సముచిత స్థానం లభించింది.
అలిశెట్టి కవియే కాకుండా మంచి చిత్రకారుడని తెలిసిందే. 1983 నుండి తెలుగు నేల నుండి ఢిల్లీ పెద్ద బడి దాకా ఆయన కవితా చిత్రాల ప్రదర్శనలు సాగాయి. తెలుగు కవిత్వంలో ఆయన కవితా చిత్రాలు ఓ కొత్త ప్రక్రియ.
ఈ మధ్య హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో విడుదలైన ‘అక్షర క్షిపణులు’ ప్రభాకర్ కవితా చిత్రాలతో వచ్చిన రెండో ముద్రణ. అయితే 2014లో వచ్చిన ‘అక్షర నక్షత్రమీద...’కు దీనికి కొంత వైవిధ్యం ఉంది. ముద్రణ ఎ4 సైజులో ఉన్నందువల్ల చిత్రం స్పష్టత పెరిగింది. ఒక్కో చిత్రం పక్కన రెండు మినీ కవితలను ప్రచురించారు.
ఈ పుస్తకాన్ని రెండు విభాగాలుగా విభజించవచ్చు. ముందు మాటగా బి.నర్సన్ రాసిన ‘తూర్పు అతని చిరునామా’ ఒక భాగమైతే కవితా చిత్రాలు ఒక భాగంగా కనపడతాయి.
ముందు మాట పుస్తకానికి అంతగా సంబంధం లేకుండా ప్రభాకర్ జీవిత విశేషాలతో మోనోగ్రాఫ్ రూపంలో ఉంది. ఇందులో అలిశెట్టి వివరణాత్మక జీవన పరిచయం ఉంది. ఆయన కవిగా ఎదిగిన క్రమం, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుభవించిన కష్టాలు, వాటిని ధీటుగా ఎదుర్కొన్న నిబద్ధతలో రాజీపడని తత్వం ఇలా అన్ని దశలపై సుదీర్ఘ కథనం ఉంది. రచనా క్రమంతోపాటు ఇందులో చర్చించిన అంశాలు అలిశెట్టిని అభిమానించే వారికి ఆసక్తికరంగా ఉంటాయి.
ప్రభాకర్ తన కవితలకు వేసుకున్న ఈ చిత్రాల్లో లోతైన అర్థం ఉంది. కవితను చదివినంత సులభంగా బొమ్మను గ్రహించలేము. ఆయన బొమ్మలను పరీక్షించి చూస్తే గీత గీతకో అర్థముంది. బొమ్మ అంతర్గతంలో మరో నిగూఢ బొమ్మ దాగ ఉంటుంది.
వేశ్య కవితకు వేసిన చిత్రంలో గదవ కింద చేయిలా భ్రమింపజేసే స్ర్తి శరీరం ఉంటుంది. చేతిలో కలంలా కనపడే చిత్రంలో మానవ అస్థిపంజరం దాగి ఉంది.
అనంతం కవిత కోసం కన్నీటిని చెమట బిందువును కలగలిపి వేసిన చిత్రంలో ‘ప్రతిఫలించే కళాఖండాలు, పరిధి దొరకని బాధలు’ గోచరిస్తాయి. పోరాటం కవితలోని ‘తల్లడిల్లిన రమణీయ ద్వీపం’ అద్భుతమైన చిత్రరూపాన్ని పొందింది.
అగ్ని సముద్రం కవితకు వేసిన బొమ్మ ‘కన్నీళ్ల నిచ్చెనతో కర్కశ పాదాల్ని మోస్తున్న కఠోర తపస్విని దర్శనమిస్తుంది. ఏకాగ్రతతో అవలోకిస్తే తప్ప ప్రభాకర్ గీతల్లోని వృథారూపం అంతుపట్టదు.
‘చీకట్లో జడుసుకుంటే ఒక చెట్టే అరణ్యమై భయపెడుతుందన్నట్లు చిత్రంలోని చెట్టు భయపెడుతుంది.
‘అశ్రుకావ్యం’కు వేసిన బొమ్మ కళాఖండాన్ని తలపిస్తుంది. ‘పత్రహరితమే హరించిన బతుకు చెట్టు’ నీడలో రాలుతున్న అశ్రు కణం చివర బాకును గమనించాలి.
‘నాగరికతా సౌధం నువ్వే’ కవితను అలిశెట్టి చిత్రాన్ని తీరిగ్గా పరీక్షించవలసిందే. ‘వొణిక దీపపు సెమ్మ, నాజూకు పూలరెమ్మపై గ్రద్ధ చూపు’ గగుర్పాటు కలిగిస్తుంది.
ప్రభాకర్ కవిత్వంతోపాటు ఆయన బొమ్మలూ ఇష్టపడేవారికి కాఫీ టేబుల్ బుక్‌గా పుస్తకం అలరిస్తుంది.
ముఖ చిత్రం యాధారీతిలో ఉన్నా చివరి పేజీ అట్టకు రెండువైపులా వేసిన బొమ్మలు బాగున్నాయి. లోపలి వైపు దాసరి నాగభూషణం వేసిన చిత్రం ఉంది. అందులో ప్రభాకర్‌కు కలం, కుంచె, కెమెరాతో ఉన్న అనుబంధం చిత్రించబడింది. అట్ట చివర ప్రభాకర్ శిల్పం ఫొటో ఉంది. జగిత్యాల అంగడి బజార్‌లో ఆయన్ను అభిమానించిన యువత ప్రతిష్టించుకున్న విగ్రహం ఈ విధంగా ప్రాచుర్యం పొందింది.
ఎనిమిది పదులు దాటిన వయసులో అలిశెట్టిపై అత్యంత ప్రేమతో ఈ పుస్తక ముద్రణకు పూనుకున్న ఎస్.వి.ఎల్. నరసింహారావుగారిని అభినందించక తప్పదు.

-పద్మజ